Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

మూడవ భాగం

Third Part

"వాళ్ళు సిటీల్లో కాలేజి కబుర్లు చెప్తుంటే వింటున్నాను."

"విన్నది చాలు, వాళ్ళని చూస్తుంటే ఎక్కడో ఫారిన్లో  పుట్టాల్సినోళ్ళు పొరపాటున ఇక్కడ పుట్టారనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ మూలంగానే మన సంప్రదాయాలు మట్టికొట్టుకుపోతున్నాయి. కబుర్లు చెప్పుకోవడం కాదు. పని చేఅయాలి. ఇది దేవుడి కళ్యాణం. మనం చేసే సేవలు వృధా పోవు. పందిట్లోకి వెళ్ళి అక్కడ అయ్యవార్లకు ఇంకా సరంజామా ఏమన్నా అవసరమేమో  అడిగి ఆ ఏర్పాట్లు చూడు, వెళ్ళు"


మారు మాట్లాడకుండా కళ్యాణ మండపం వైపు వెళ్ళిపోయింది మహేశ్వరి. ఇంతలో మనవడు నవీన్ ఆవిడను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. అతను మహేశ్వరి అన్న. భ్రమరాంబకు కొడుకు. అమ్మమ్మ అంటే పంచ ప్రాణాలు నవీన్ కి.

"ఏమిట్రా.. ఏమైంది? నాన్న పందిట్లో కంపించడం లేదు. పొలాన్నుంచి ఇంకా రాలేదా?" అనడిగింది మనవడ్ని.


"డాడీ రావడం లేటవుతుంది అమ్మమ్మా..."

"డాడీ ఏమిట్రా ...ఎన్ని సార్లు చెప్పాలి? మనం తెలుగువాళ్ళం. లక్షణంగా  నాన్న అని పిలవలేవా?"

"సరిసరి.. నీకు ఇంగ్లీషంటే ఎంత కోపమో తెలిసి కూడా అప్పుడప్పుడూ మర్చిపోతుంటాను. క్షమించెయ్. నన్నడిగితే ఇంగ్లీషు వాళ్ళను దేశం నుండి తరిమికొట్టడానికి మహత్మాగాంధీ  ఉద్యమాలు నడిపినట్టు ఇంగ్లీషు భాషను ఈ దేశం నుండి తరిమికొట్టడానికి నువ్వేదన్నా ఉద్యమం ఆరంభిస్తే బాగుంటుంది అమ్మమ్మా" అన్నాడు నవ్వేస్తూ.

"నోర్ముయ్యరా భడవా..!" నవ్వేసిందావిడ. "నువ్వనుకుంటున్నట్టు నేను భాషలకు వ్యతిరేకం కానురా. నాలుగు భాషలు నేర్చుకుంటేనే లోకజ్ఞానం పెరుగుతుంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా బ్రతగ్గలడు. నా బాధ ఇతర భాషల మోజులో పడి మాతృభాషను అలక్ష్యం చేయడం, ఫ్యాషన్ల పేరుతో సాంప్రదాయాల్ని కాలరాయడం ఇవి నాకు నచ్చదు. మనం తెలుగు వాళ్ళం. తెలుగు వాళ్ళలానే ఉండాలి. అదే సమయం లో ఇతర భాషల్ని లోకజ్ఞానాన్ని కూడ పెంచుకుందాం. ప్రపంచం లో ఎక్కడ వున్నా తెలుగు వాడు తెలుగు వాడిగానే గుర్తింపబడాలి గానీ తెలుగును మర్చిపోయి అక్కడి స్థానికుల్లొ ఒకడిగా కలసిపోకూడదు. అర్థమయిందా?"

"అమ్మో.. నీ ఆశయం మంచిదే గాని అమ్మమ్మా.. ఇప్పుడు ఎక్కువగా విదేశాలకు పోతోంది నీ వయసు వాళ్ళు కాదు.  మా యూత్ అదే యువతరం. నువ్వు చెప్పినవన్నీ గుర్తు పెట్టుకుని పోటీ ప్రపంచం లో ముందుకు దూసుకు పోవాలంటే కష్టమే. అయినా ఇవన్నీ నాకెందుకు గానీ అక్కడ పానకం తయారు చేస్తున్న వాళ్ళు ఇంకో పది కిలోల బెల్లం అవసరం పడుతుందంటున్నారు.  ఉన్న దాంతో సరిపుచ్చమంటే వినడం లేదు. ఓసారి అటు వెళ్ళి చూడు. అరిటాకుల బండి ఇంతవరకు ఊళ్ళోకి రాలేదు. నేనోసారి బైక్ మీద అలా తోట వరకు వెళ్ళి చూసొస్తాను."అంటూ వెళ్ళిపోయాడు నవీన్.

అలా హడావుడిగా మరో గంట గడిచింది. మండపం లో సీతారాముల కళ్యాణ వేడుకలు ఆరంభం కాగానే ఆలయం ముందున్న పందిళ్ళలో కిటకిటలాడే జనం. ఉద్దండులైన వేద పండితుల సారధ్యంలో రంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. తర్వాత భోజన కార్యక్రమాలు ముగించి అంతా సర్దుకునేసరికి సాయంకాలం మూడుగంటలయింది.

సాయంత్రం నాలుగు గంటలకు... రామశాస్త్రులు, శంకుశాస్త్రి కోసం గుడి వద్దకు కబురుపంపి ఇంట్లో తీరికగా కూర్చుంది అన్నపూర్ణేశ్వరి. పాత సామాను పెట్టెలోంచి తీసిన పిల్లల జాతక చక్రాల కట్ట ఆవిడ ముందు వుంది.

"అమ్మా! మరొక్క కాఫీ!" చూస్తున్న జాతక చక్రాల్ని పక్కన వుంచి తలెత్తి చూస్తూ అడిగాడు రామశాస్త్రులు.

రామాలయం వద్ద కళ్యాణ మహోత్సవాలు ముగిసిన తర్వాత మూడు గంటల ప్రాంతం లో అన్నపూర్ణేశ్వరి ఇంటికి చేరుకున్నాడాయన. అప్పటి నుండి అరడజను కాఫీలయ్యాయి. రిజల్టు మాత్రం ఇంకా రాలేదు.

"ఒక్కటి కాకపోతే పది కాఫీలు తాగండి శాస్త్రులు గారూ.! అమ్మాయ్, మహాలక్ష్మీ! శాస్త్రులు గారికి కాఫీ తీసుకురా" అంటూ పెద్దకోడలు మహలక్ష్మికి చెప్పి ఆయనవంక చూసింది అన్నపూర్ణేశ్వరి. రెండు గంటలుగా వీటిని మీరు పరిశీలిస్తున్నారు. అందరి జాతకాలూ భేషుగ్గా వున్నాయన్నారు. ఇది అంతా చెప్తున్న మాటే. కాని, ఈ చక్రాలు మీకు అర్థం కావడం లేదో, లేక వాటికి మీరు అర్థం కావడం లేదో, నాకు మాత్రం అర్థం కావడం లేదు. నా ప్రశ్న అలాగే ఉండిపోయింది. అంది.

"అమ్మా! ఒక్క నిముషం" అంటూ ఆవిడ మాటలకు అడ్డువస్తూ మహాలక్ష్మి అందించిన కాఫీ కప్పు అందుకున్నాడు రామశాస్త్రులు.

శంకు శాస్త్రికి అన్నపూర్ణేశ్వరి గురించి బాగా తెలుసు. ఆవిడ యక్ష ప్రశ్నలకు బదులు చెప్పడం సామాన్యుల వల్ల కాదు. అందుకే వూళ్ళో కొంచెం పనుంది, ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళినవాడు ఇంతవరకు పత్తా లేడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మూడు కుటుంబాలు వెరసి పన్నెండు జాతకాలు.

"ఈ కాఫీ కోసమైనా మీ ఇంటికి అప్పుడప్పుడూ రావలనిపిస్తోంది తల్లీ. ఇంత అధ్బుతమైన కాఫీ తాగడం ఇదే మొదటి సారి." అంటూ కాఫీ కప్పు పక్కన పెట్టి సాలోచనగా ఆవిడ వంక చూశాడు రామశాస్త్రులు.

"అమ్మా ! తూర్పు, పడమర కలిసిపోతాయని ఎవరన్నా జోస్యం చెప్పగలరా? ఉత్తరం, దక్షిణం దగ్గరవుతాయని జాతకం చెప్పిన వాళ్ళున్నారా? మీరడిగిన ప్రశ్న కూడా అలాంటిదే." అన్నాడు.

"అంటే... నాకోరిక తీరదా, శాస్త్రులుగారూ?" అనుమానంగా అడిగిందావిడ.

"మీరలా అధైర్యపడకూడదు. నా మాటలకు అర్థం కష్టసాధ్యమనే కానీ, అసాధ్యమని కాదు. అమెరికాలో ఉంటున్న మీ రెండో కొడుకు గోపాల్ నిమ్మగడ్డ వారి పిల్లలిద్దరికీ, ఇటు మీ కుమార్తె భ్రమరాంబ గారి పిల్లలిద్దర్నీ ఇచ్చి కుండమార్పిడి పద్ధతిలో పెళ్ళిళ్ళు జరిపించాలని అలా ఆ అన్నా చెల్లెళ్ళ బంధుత్వం శాశ్వతం కావాలని మీ మనోవాంఛ. జాతకాలైతే కలుస్తున్నాయి. కానీ ఆ పిల్లల అభిరుచులు కలుస్తాయా అనేదే సంశయం. ముందే చెప్పాకదా..తూర్పు పడమర అని, వారి పిల్లలేమో అమెరికాలో అక్కడి నాగరికతకు అలవాటు పడినవాళ్ళు. ఈకాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకర్నొకరు ఇష్టపడితే తప్ప పెళ్ళిళ్ళు  చేయలేం కదా. జాతకాలు కలిసినా వారి మనసులు కలుస్తాయా? అన్నదే నా అనుమానం."  అంటూ మనసులోని సందిగ్దాన్ని బయటపెట్టారు శాస్త్రులు గారు.

ఆ మాటాలు వినగానే అన్నపూర్ణేశ్వరి మొహంలో తిరిగి ఎప్పటి కళ వచ్చేసింది. ఉత్సాహంగా చూస్తూ "అయితే జాతకాలు కలిసాయంటారు. కరెక్ట్ కదా?"  అడిగింది.

"అందులో సందేహించాల్సిన అవసరం లేదు."

"ఇద్దరు ముగ్గురు పండితులు చూసి జాతకాల్లో దోషం లేదుకానీ కలవ్వు అని చెప్పారు.అందుకే  అడుగుతున్నాను."

"అలా చెప్పి ఉండొచ్చు. . వారి లెక్కలు తప్పని నేను చెప్పనుగానీ జాతక ఫలాలు వివరించేటప్పుడు పరిగణనలోకి తీసుకొని లెక్కించాల్సిన విషయాలు కొన్ని వున్నాయి. చాలా మంది వాటిని అశ్రద్ధ చేస్తుంటారు. అందుకే ఖచ్చితమైన ఫలితాలను చెప్పలేకపోతుంటారు.. జాతకాలు అధ్బుతంగా కలిసాయి. సందేహం అక్కర్లేదు . కానీ ఇందాక నేను చెప్పినట్లు వారి అభిరుచులు, అలవాట్లు కలవనందున పెళ్ళిళ్ళకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి."

"నాకు అర్థమయ్యింది శాస్త్రులు గారూ! నా కొడుకు పిల్లలు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళని ఇష్టపడకపోవచ్చు అని మీ సందేహం. అయితే ఇక్కడ మీకు తెలీని విషయం ఒకటుంది.అదేమంటారా ? వాళ్ళు అమెరికాలో ఉన్నా, మన సాంప్రదాయం వదులుకోలేదు. ఇక్కడ నా కూతురి బిడ్డలు ఏ క్రమశిక్షణలో పెరిగారో అదే తరహాలో వాళ్ళూ అక్కడ పెరిగారు. కాబట్టి అభిరుచులు, అలవాట్లు కలవవనే సందేహమే అక్కర్లేదు. జాతకం కలిస్తే చాలు. నా కోరిక మేరకు వాళ్ళ పెళ్ళిళ్ళు వైభవంగా జరిపించగలను. " అంటూ ధీమా వ్యక్తం చేసిందావిడ.

ఆ మాటలకు శాస్త్రి గారు చిన్నగా నవ్వారు.

"లేదమ్మా, నేను ముందే చెప్పినట్టు కష్ట సాధ్యం కానీ అసాధ్యం కాదు. అలాగని మీరనుకున్నంత సులువు కాదు.ఆ రెండు జంటల్ని కలపడం, మనం చూస్తూనే ఉంటాం ఒక్కోసారి సులువుగా అయిపోతుందనుకున్న విషయం జటిలమై కూర్చుంటుంది. ఎంతో కష్టమనుకున్న పని సులువుగా అయిపోతూ వుంటుంది. కాబట్టి సమయాసమయాల్ని బట్టి ఆయా ఫలితాలు ఉంటాయి. వారి వివాహాలు జరుగుతాయి. కానీ మీరనుకున్నట్టు సులువుగా కాదు. చాలా సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరించి వారిని ఒకటి చేయడానికి ఇబ్బందులు తప్పవు" అన్నాడు స్థిరంగా.

ఆ మాటలకు అన్నపూర్ణేశ్వరి ముఖం లో కొంత ఆందోళన చోటుచేసుకుంది.

"మీరింతగా చెప్తున్నారంటే నాకేదో అనుమానంగా ఉంది. పోనీ దోషాలు, అరిష్టాలవంటివి ఏమన్నా ఉంటే చెప్పండి. ఎంత ఖర్చైనా పరవాలేదు. దోషనివారణకు శాంతులు, హోమాలు అవసరమైతే జరిపిద్దాం." అనిడిగింది.

తల అడ్డంగా ఊపాడు రామశాస్త్రులు.

"అలాంటివి వుంటే నేను ముందే చెప్పేవాడిని. ఎవరన్నా చెప్పినా నమ్మి డబ్బు వృధా చేయకండి. జాతక దోషాలంటూ ఏమీ లేవు. కొన్ని ఇబ్బందుల తర్వాత ఈ పెళ్ళిళ్ళు జరుగుతాయి. మీరు నిశ్చింతంగా ఉండండి." అంటూ తన బిచాణం సర్దుకోనారంభించాడాయన.

"సరి సరి శాస్త్రులు గారూ!మీరింతంగా చెప్తున్నారు కాబట్టి నమ్ముతాను" అందామె.

"నమ్మాలి, ఎన్నో జాతకాలు చూసి ఫలితాలు చెప్పినవాడిని. నా వాక్కు ఎన్నడూ వృధా పోలేదమ్మా! చెప్పింది జరుగుతుంది. మీరే చూస్తారుగా!"

"చూడ్డం కాదు, మీరు చెప్పినట్టు జరగాలి గానీ, ఆ శుభకార్యాలు కాస్తా మీ చేతుల మీదుగానే జరిపించాలి. ఈ రోజున సీతారాముల కళ్యాణం జరిపించినంత వైభవంగా మీరు దగ్గరుండి నా మనవలు, మనవరాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. " అంటూ పదివేల నూటపదహార్లు కానుకగా యిచ్చుకుందావిడ.

ఇంతలో శంకుశాస్త్రి కూడా రావడంతో అన్నపూర్ణేశ్వరి వద్ద సెలవు తీసుకుని మేనల్లుడుతో అమరావతికి బయలుదేరాడు రామశాస్త్రులు.

మరునాడు ఉదయం ఆ రోజు ఆదివారం కావడంతో పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. సుమారు తొమ్మిది గంటల సమయంలో "ఒరే పెద్దోడా, ఏం చేస్తున్నవురా? అంటూ తల్లి పిలుపు విని హాల్లోకొచ్చాడు పెద్దకొడుకు రామలింగేశ్వరరావు. అతడి వెనకే తనూ వచ్చి ఎడంగా నిలబడింది భార్య మహాలక్ష్మి.

"అమ్మా ఏం కావాలి? "అనడిగాడు వస్తూనే.

ఆవిడ కొడుకు,కోడల్ని మురిపెంగా చూస్తూ దగ్గరకొచ్చింది.

"కావలసింది నాక్కాదురా, మీకు. రేపటిరోజుకో విశేషం ఉంది. గుర్తు లేదా?" అనడిగింది.

అర్థం కానట్టుగా భార్య ముఖం లోకి చూశాడు రామలింగేశ్వరరావు.

అత్తగారి ఉద్దేశం మహాలక్ష్మికి తెలుసు.అయినా తానుగా చెప్పకుండా ముసిముసిగా నవ్వి ఊరుకుంది.

"ఏమిట్రా అటు చూస్తావ్? రేపు మీ పెళ్ళిరోజు. ప్రతి సంవత్సరం నేనే మీకు గుర్తు చేయాలి. వెళ్ళండి కారు తీసుకొని మహలక్ష్మితో బెజవాడ వెళ్ళిరా..."

"అది కాదమ్మా, ఇవాళ చాలా పనులున్నాయి...!"

"ఉంటాయిరా, సంవత్సరం పొడుగునా పనులుంటూనే ఉంటాయి. మనకన్నా పనులెక్కువ కాదు. చెప్పింది చెయ్యి.మీరిద్దరూ కొత్తబట్టలు తెచ్చుకోండి. దానికి బహుమతిగా ఏం కొనిస్తావో నీ ఇష్టం. అమ్మాయ్ మహాలక్ష్మీ! వీడు పిసినారోడు కానీ, ఖర్చు గురించి ఆలోచించక, నీకు ఇష్టం వచ్చింది కొనిపించుకో. వెళ్ళిరండి."

"అత్తయ్యా!మీరే మాకు పెద్ద బహుమతి. మాకు వేరే బహుమతులు కావాలా? కొండంత అండగా మీరు మాకున్నారు.దేవుడి దయ వలన ఏ లోటూ లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నాం. ఇది చాలదా?" అంది మహాలక్ష్మి.

"అదేకదా... నాకూ వయసు యాభై దాటింది. అదీ యాభైకి దగ్గర పడింది. పిల్లలు లేటుగా పుట్టినంత మాత్రాన మేమూ చిన్నపిల్లలం అనుకుంటే ఎలా? పెళ్ళిరోజని చెప్పి అనవసర ఖర్చులు అక్కర్లేదు." దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ భార్యను సమర్ధించాడు రామలింగేశ్వరరావు.

మీకు అక్కర్లేదు.నాకు అవసరం. పెళ్ళిరోజు పండగలా చేసుకొని కొడుకు, కోడలు కళ్ళముందు తిరగాలి. చూసి నేను ఆనందించాలి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరమూనూ. పిచ్చివేషాలేయక చెప్పింది చేయండి. బయలుదేరండి." అంటూ కోప్పడింది అన్నపూర్ణేశ్వరి.
ఇక ఎంత చెప్పినా ఆవిడ వినదని వాళ్ళకి తెలుసు.

అప్పటికప్పుడు రామలింగేశ్వరరవు, మహాలక్ష్మిలు ప్రయాణమై, కొడుకులు రమేష్, సతీష్ లను వెంట బెట్టుకుని కార్లో వెళ్ళిపోయారు.
ఇంతలో మనవరాలు మహేశ్వరి లేడిపిల్లలా లోనకు పరిగెత్తుకువచ్చింది. ఆమెను తరుముకుంటూ వచ్చిన అన్న నవీన్ హాల్లోనే వున్న అమ్మమ్మను చూసి కంగారుగా డోర్ లోనే ఆగిపోయాడు.

"ఏవిటే, ఏమైంది? ఆ పరుగులేమిటి? వాడు మళ్ళీ నిన్ను కొడుతున్నాడా? కోపంగా అడిగిందావిడ.

మొదట కాదన్నట్టు తల అడ్డంగా ఊపింది మహేశ్వరి. తర్వాత అవునన్నట్టు తలాడించింది. కళ్ళు విశాలం చేసి చూస్తూ , ఆయాసపడుతున్నట్టున్న ఆమెను చూస్తుంటే చిన్నప్పటి తన ప్రతిబింబమే తన ముందున్నట్టు భావిస్తోంది అన్నపూర్ణేశ్వరి.

"ఏయ్ మహీ.." అంటూ చెప్పొద్దన్నట్టుగా డోర్ లోంచే కళ్ళతో సైగ చేశాడు నవీన్.

"ఏరా, అది నీ తోడబుట్టిన చెల్లెలేగా? ఎవరన్నా చెల్లెల్ని కొడతారా?" కోపంగా అడిగింది మనవడిని.

"అది చెల్లెలా...రాక్షసి" అక్కసుగా అరిచాడు నవీన్.

"పళ్ళు రాలగొడతాను వెధవా, బంగారం లాంటి పిల్లని రాక్షసి అంటావా?"

నిన్ననలేదుగా, దాన్నే అంటున్నాను. రాను రాను దీని అల్లరితో చచ్చిపోతున్నాను.

"అందుకని కొడతావా?"

"మాకు వేరే పనిలేదండీ.చెల్లెల్ని పట్టుకుని కొట్టడం తప్ప. ఇదేమన్నా సాధారణ ఆడపిల్లా.అన్నపూర్ణేశ్వరిగారి మనవరాలు... రెక్కలగుర్రం. మాటకు దొరకదు, దెబ్బకు అందదు. ఓరి దేవుడా!నాకిలాంటి చెల్లెల్నిచ్చావేంట్రా?" అంటూ అకాశం వంక చూసి దండం పెట్టిఉకున్నాడు నవీన్.

అది చూసి ఫక్కున నవ్వింది మహేశ్వరి. మరింతగా ఉడుక్కున్నాడు నవీన్.

"ఆ వెక్కిరింపేమిటి? ఆగాగు. బయటకు రాకపోతావా? అప్పుడు చెప్తా" అంటూ పోబోయాడు,

"అదేమిట్రా అన్నయ్యా వెళ్ళిపోతున్నావ్? సిగరెట్ల గురించి నేనింకా అమ్మమకు చెప్పందే" అంది గడుసుగా.

అంతే...ఉన్నవాడున్నచోటే  నిలబడి అరచేత్తో నుదురు కొట్టుకున్నాడు నవీన్.

మరిన్ని సీరియల్స్
akkadi rallu aakalitho unnayi