Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Third Part

ఈ సంచికలో >> సీరియల్స్

అక్కడి రాళ్ళు ఆకలితో ఉన్నాయి - రవీంద్రనాథ్‌ టాగూర్

akkadi rallu aakalitho unnayi

స్వేచ్ఛానువాదం:  వంశీ
ఆ నది ఒడ్డునున్న ఎత్తైన మెట్ట మీద వుందా పాలరాతి భవనం.
ఇంచుమించు రెండువందల యాభయ్యేళ్ళ క్రితం - రెండవ షా మహమ్మద్‌ తన విలాసాల కోసం కట్టించాడంట ఆ భవనాన్ని. అక్కడి స్నానశాలల్లో జలయంత్రాల్లోంచి ఘుమఘుమలాడే పన్నీరు చిమ్ముతూండేదంట. ఆ జలయంత్రాల చుట్టూ సన్నని అరుగులున్నాయి. ఒంటిమీద బట్టల్లేకుండా వున్న ఆడపిల్లలు వెన్నెల్లో ఆ అరుగుల మీద కూర్చుంటే పన్నీటి తుంపర్లు వాళ్ళ మీద పడ్తుండేవంట. చీకటిరంగులో వుండే వాళ్ళ శిరోజాలు పాలరాతి మీద పరిచి ఒళ్ళో సితార్‌లు పెట్టుకుని ద్రాక్షతోటల గజల్స్‌ పాడుతుండేవారంట.

 ఇప్పుడా జలయంత్రాలు ఆడటం లేదు. ఆ పన్నీరు పరిమళాల్లేవు, ఆటలు లేవు, పాటలు లేవు. ఆనాటి ఆనవాళ్ళు తప్ప ఇప్పుడక్కడేం లేవు.

కంటిరెప్పలు ఆర్పకుండా ఆ భవనంలో ప్రతి మూలా చూస్తున్న నా వెనకాలే వస్తున్నాడు ముసలి గుమాస్తా కరీంఖాన్‌. అలా చూస్తూ చూస్తూ వివరించలేని అనుభూతులు నిండిపోయిన నా ముఖాన్ని చూసిన ఆ ముసలి గుమాస్తా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భవనంలో వుండొద్దన్నాడు. "పగలుంటే వుండండి గానీ చీకటిపడ్డాక మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడుండొద్దు." అని బతిమాల్తున్నాడు.

అంతలో వచ్చిన నౌకర్లు, "దొంగలు కూడా రాత్రుళ్ళు ఈ భవనంలో అడుగెట్టడానికి జంకుతారు అబ్బాయిగారూ," అన్నారు.

"విన్నారుగదా వీళ్ళ మాటలు... చూడండి బాబూ మీరు మాకు అధికారి కానీ వయసులో మాకంటే చాలా చిన్నోరు కాబట్టి మా మాట వినండి," అన్నాడు కరీంఖాన్.

అంతలో ఆ భవనం చుట్టూ తిరుగుతూ, "అంతా అబద్ధం తప్పుకో... తప్పుకో," అంటున్న ఒక మనిషి కనిపించాడు.

"వాడు ఈ బంగళాలో వుండి పిచ్చోడైపోయిన మొహరాలీ అండి," అన్నాడు నౌకరు.

ఇంతమంది ఇన్ని చెప్తున్నా వినకుండా మంకుపట్టుతో నా మకాం ఆ భవనంలోనే పెట్టాను.

బరీచ్‌లో పండించే ప్రతి పంటలకి శిస్తు వసూళ్ళు చేసి ఆ కలెక్షన్‌ హైదరాబాద్‌ నిజాం ప్రభుత్వానికి పంపించే పనుల్లో పగలంతా ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా పని చేయడంతో చాలా అలిసిపోయేవాడ్ని. దాంతో చీకటిపడగానే నిద్ర ఊపేసేది.

ఒక పది రోజులు గడిచాయి. ఆరోజు సాయంత్రం కొంచెం ఖాళీ దొరికింది. దాంతో ఆ సుప్తానది రేవులో ఒక వాలుకుర్చీ వేసుక్కూర్చుని అడవి మధ్యలో ప్రవహిస్తున్న ఆ సన్నటి నదిని చూస్తున్నాను. ఆరితేరిన నర్తకి నృత్యంలాగ వడివడిగా పరుగెడుతూ ప్రతి పది అడుగులకీ తమాషాగా మెలికలు తిరుగుతున్న ఆ నది అందమైన కన్నెపిల్లలాగుంది. తిరిగిన గాలితో పాటు నది అవతలి ఒడ్డు మీద కనిపించే కొండ మీద పెరుగుతున్న వనతులసి, పుదీనా, మరువం వనాల సువాసనలు కలగలిశాయి.

అక్కడి సూర్యుడు పడమటి కొండచాటుకి దిగిపోతుంటే ఇక్కడి గాలి బాగా పెరిగింది. ఒక లేడిపిల్ల నా పక్కనుంచి పరుగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. సంపెంగల సువాసన ముక్కుకి తగిలింది. రెండు పక్షుల జంటలు ఆకాశంలోంచి కీరకీరమంటూ అరుచుకుంటూ వెళ్ళాయి. కొండల్లోపలెక్కడ్నుంచో ఎవరో పాడుతున్న జానపదగీతం ఇటుపక్కకి వినిపిస్తోంది. ఇదంతా చూస్తున్న నాలో కొత్త హుషారేదో పుట్టింది. గుర్రమెక్కి ఒకసారలా షికారు కెళ్ళొద్దామని లేస్తుంటే మెట్ల దగ్గర ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. ఎవ్వరూ లేరు.

అటూ ఇటూ చూశాను. ఏ జాడా నీడా కనబడలేదు. తిరిగి గుర్రమెక్కి కూర్చుని కళ్ళెం లాగబోతుండగా ఒక పెద్ద గుంపు నీళ్ళలో దూకి ఒడ్డున పరుగెడ్తున్న చప్పుళ్ళు వినిపించాయి.

గిరుక్కున తిరిగాను. ఏం కనిపించలేదు. చుట్టూ కల తిరిగాను. చప్పుళ్ళు తప్ప మనుషులు కనపడ్డం లేదు. నా నరాల్లో ఏదో గగుర్పాటు.

కాస్సేపయ్యిందో లేదో అమ్మాయిల గుంపు కిలకిల నవ్వులు ఎక్కువ మోతాదులో వినిపించాయి. ఆ చుట్టుపక్కలంతా కల తిరిగాను. ఎవ్వరూ కనపడ్డంలేదు. ఆ అమ్మాయిలంతా నీళ్ళలోకి దిగి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు జల్లుకుంటూ నీళ్ళలో చిందులాడుతున్న చప్పుళ్ళు వినిపిస్తున్నాయి.

నా గుండెల్లో ఏదో దడ. ఆనందంవల్లో, ఆతృతవల్లో సరిగా చెప్పలేనుగానీ, వాళ్ళని చూడాలని తహతహ. భవనంలోకి వెళ్ళాను.

రెండువందల ఏభయ్యేళ్ళనాటి పల్చటి లేసుతెర నా ముందు వేలాడుతున్నట్టనిపించింది. భయం భయంగా ఆ తెర ఒక మూల పట్టుకుని పైకెత్తి చూశాను.

అక్కడ పెద్ద సభ తీరి వుంది కానీ, కారుచీకట్లో ఏమీ కనిపించడం లేదు.

ఉన్నట్టుండి ఇటుపక్క కొచ్చిన ఒక గాలి కెరటం నా శరీరాన్ని తాకి వెళ్ళిపోయింది. ఆ గాలితో పాటు ఆడ పిల్లలు చేస్తున్న అల్లర్లు కూడా వెళ్ళిపోయాయి. బాగా నీరసం రావడంతో బయటికొచ్చి వాలుకుర్చీలో వాలి కాస్సేపు నిద్రపోయి లేచాను.

ఎందుకోగానీ ఆకలి బాగా వేసిందావేళ. వంటవాడ్ని పిల్చి మసాలావాసనల్తో ఘుమఘుమలాడిపోయే మొగలాయీ బిర్యానీ పురమాయించాను.

"చిత్తం బాబయ్యా," అంటూ వెళ్తున్న వాడ్ని వెనక్కి పిల్చి వంటలో తాజానెయ్యి బాగా తగిలించమన్నాను.

******      ******      ******

తెల్లవారింది. నది గలగలల చప్పుళ్ళకీ, అడవిలో పక్షుల అరుపులకీ మెలకువొచ్చింది. రాత్రి జరిగినవన్నీ తల్చుకుంటూ తెలీని తన్మయత్వానికి లోనవుతూ దొరలాగ తయారయ్యి కాకీగుడ్డ టోపీ పెట్టుకుని చెట్టుకి కట్టేసున్న గుర్రమెక్కి ప్రత్తి శిస్తు వసూలుకి బయల్దేరాను.

మూడు నెలల రిపోర్టు రాయడం వల్ల రోజూ కంటే కాస్త ఆలస్యంగా బయల్దేరిన నాకు విడిది చేస్తున్న గుల్‌బాగ్ దగ్గరకి ఎంత తొందరగా వెళ్దామా అని ఒకటే యావ. సంధ్య పొగలలో చిక్కని చెట్లనీడలని ఆవరించుకుని ఉన్న జనంలేని ఆ చిక్కటి అడవిమార్గంలో నేనెక్కిన గుర్రం మీద గుల్‌బాగ్‌ భవనం దగ్గరకొచ్చేసరికి బాగా చీకటి పదింది.

తలుపులు తోసుకుని లోపలి హాలులో కొచ్చేసరికి అప్పుడే సభ చాలించడంతో నాలుగు ద్వారాలున్న ఆ హాలులోంచి బయటికెళ్ళిపోతున్న జనం మాటలూ, చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. నిన్నట్లానే మనుషులు కనిపించడం లేదు. నేను నిలబడ్డ ద్వారంలోంచి వెళ్తున్న జనం జుట్టులకి రాసుకున్న నూనె వాసనలు, బట్టలకి పూసుకున్న పునుగు పరిమళాలు నా ముక్కుకి తగుల్తున్నాయి. నాకేం పాలుపోవడం లేదు.

లోపలికొచ్చి ఎడంపక్కకి తిరిగిన నాకు జలయంత్రాల్లోంచి జలజల చప్పుళ్ళు చేస్తూ అత్తరు వాసనల్తో నీళ్ళు, కిన్నెరల కిలకిలలు, సితారాల మీద వాయిస్తున్న మేఘమల్హర్‌ రాగస్వరాలు వింటూ తెలీని తన్మయత్వానికి లోనైపోతున్నాను. కాస్త దూరంగా అమ్మాయిలు కంచు మువ్వలు కాళ్ళకి కట్టుకుని కథక్‌ నాట్యం చేస్తున్న చప్పుళ్ళు, ఇంకోచోట ఆహిర్‌ భైరవి పాడిన గాయని మూలుగులు, కాస్త దూరంగా జలతరంగ్‌ తబలా తరంగ్‌ జుగల్బందీలు. మధ్యమధ్యలో రaాముల్ని సూచించే ఢంకా వాయించేవాళ్ళ చప్పుళ్ళు, ఇటుపక్కకి చూస్తే ఊగుతున్న స్ఫటిక దీపతోరణాల వెలుగులు, కాస్త ఇంకాస్త దూరంగా విచ్చలవిడి శృంగారానికి సంబంధించిన మూలుగులు, కామం కలగలిసిన కారుకూతలు.

ఆలోచిస్తూ బంగళా బయటి తోటలో కొచ్చేసరికి ఏదో ఒక విధమైన మోహం నన్ను ఆవరిస్తుంది అనిపించింది. లాంతరు పట్టుకొచ్చిన ముస్లిం నౌకరు నేనున్న ఆ గది టేబుల్‌ మీద పెట్టి వెళ్తూ అతను చేసిన చప్పుళ్ళకి మామూలు స్థితికి వచ్చాను.

భోజనం ఆరగించి, గదిలో దీపం ఆర్పేసుకుని మంచం మీద వాలబోతూ తెరిచి వున్న కిటికీల్లోంచి బయటికి చూశాను.

కారుచీకటి, ఆకాశంలో ఒకే ఒక నక్షత్రం మెరుస్తూ కనిపించింది. ఒక రకమైన కుతూహలంతో దాన్నే చూస్తూ ఎప్పటికో నిద్రలోకెళ్ళాను.

అలా ఎంతసేపు పడుకున్నానో తెలీదుగానీ ఎవరో కుదిపినట్టవ్వడంతో ఉలిక్కిపడతూ లేచాను. ఎవరూ అక్కడున్న జాడగానీ, నీడగానీ లేదు. మరి నన్నెవరు కుదిపినట్టు?... అదే అర్థంగావటం లేదు. కిటికీలోంచి బయటికి చూస్తే గుడ్డి వెన్నెల. ఆకాశంలో ఆ నక్షత్రం ఇప్పుడు లేదు. గాలి మాత్రం మెల్లమెల్లగా వీస్తోంది.

కళ్ళు మూసుకున్నాను. ఆలోచిస్తున్న నాకు నిద్ర రావడం లేదు.

ఏంటీ విచిత్రం! ఈ గుల్‌బాగ్‌లో అదృశ్యశక్తులున్నాయా?... అదృశ్య వ్యక్తులున్నారా? ఎంత ఆలోచించినా ఏమీ పాలుపోవడం లేదు.

మెత్తని చేతివేళ్ళేవో నన్ను తాకినట్టనిపించి లేచి చూశాను. రూపం అస్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఒక అందాల అరబ్బు కన్య. పాలరాతితో చేసినట్టున్న సన్నటి బలమైన అందమైన ఆమె చెయ్యి కనిపిస్తోంది. శిరస్సు నుంచి సిరిపాదం దాకా నల్లటి సిల్కు బురకా, నడుము పట్కాకి వంకర కత్తి వేలాడుతోంది. ఏం మాటాడకుండా తన ఉంగరాల వేళ్ళతో నన్ను తన కూడా రమ్మని సైగ చేసింది.

ఆమె కూడా నడిచాను. తాళాలు వేసిన బాగా గదుల్ని దాటుకుంటూ వెళ్తున్న ఆ మనిషి వెనకాలే నడుస్తున్నాను. సన్నటి చీకటిదారులు, పెద్దపెద్ద వరండాలు, గాలి ఆడని రహస్యద్వారాలు దాటుకుంటూ ముందుకు నడుస్తున్నాను. ఒక నీలం పరదా కనిపించేసరికి నడుస్తున్న ఆ మనిషి ఆగిపోయి కింద చూడమని సైగ చేసింది.

చూసిన నన్ను ఒక రకమైన భయం కమ్మేసింది. గుండెల్లో రక్తమంతా ఆగిపోయినట్టయ్యింది. ఆ పరదా కింద నేలమీద జరీపూలు కుట్టిన సిల్కు బట్టలేసుకున్న భయంకరమైన ఒక నీగ్రో కొజ్జా ఒరలోంచి కత్తిని ఒళ్ళో పడేసుకుని, కాళ్ళు రెండూ బారజాపుకుని కునికిపాట్లు పడ్తున్నాడు.

దగ్గరకొచ్చి ఆ స్త్రీ చటుక్కున వాడి రెండు కాళ్ళూ ఎత్తి ఓ పక్కకి లాగేసి కిందికి చూడమని సైగ చేసింది. ఒక సొరంగం కనిపించింది. ఇంకా లోపలికి చూస్తే పర్షియన్‌ తివాచీలు పరిచి వున్న విశాలమైన హాలు కనిపించింది. కాస్త దూరంగా ఒక సింహాసనం. దాని మీద రాజుగారు కూర్చునున్నారు. చిలకపచ్చ రంగులో వున్న వదులు పైజామా వేసుకునున్న ఆ రాజావారి సుకుమారమైన పాదాలకి జరీ పాదరక్షలు తగిలించి వున్నాయి. ముట్టుకుంటే కందిపోయేట్టున్న ఆ పాదాలు గులాబీరంగు ముఖమల్‌ పాదపీఠం మీద వున్నాయి. అక్కడ్నుంచి తల పైకెత్తితే రాజావారు ధరించిన ధగధగా మెరిసే రత్నాల కిరీటం కనిపించింది తప్ప, పెద్ద నీడ పడుతుండటం వల్ల ముఖం కనిపించలేదు.

ఎడమపక్కన రోజ్‌వుడ్‌ బల్ల మీద లేత నీలంరంగు గాజు గిన్నెలో ఏపిల్‌ పళ్ళు, కమలా పళ్ళు, నల్లద్రాక్ష గుత్తులూ వున్నాయి. ఒక గాజు సీసాలో మెరిసిపోతున్న వైన్‌ కనిపించింది. షాక్‌లో వున్న నేను ఇంతసేపూ గమనించలేదు గానీ సొరంగం కిందనున్న ఆ గదిలోంచి ఒక అద్భుతమైన అత్తరు పరిమళం నా ముక్కుని తాకుతోంది. ఆ గదిలోకి వెళ్ళిపోవాలన్న తాపత్రయం బాగా పెరిగిపోవడంతో ఆ కొజ్జా కాళ్ళని దాటి ముందు కెళ్ళబోతుంటే భయంకరమైన రాక్షసుడి అరుపులాంటి అరుపు వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాను.

ఒరలోంచి మెరిసే కత్తి తీసిన నీగ్రో కొజ్జా పెద్దగా అరుస్తూ ఆ కత్తితో మీదకొస్తున్నాడు. ఉలిక్కిపడుతూ లేచాను. ఒకటే గస, ఒగరుస్తున్నాను.

చాలాసేపయ్యేక ఇందాకోసారి నిద్ర పట్టక లేచాను గదా అనుకున్నాను. ఆలోచించగా అది కలలో భాగం, ఇది నిజం అని తేలింది. గుల్‌బాగ్‌ బయటికొచ్చాను.

పరమ నిశ్శబ్దంగా వుంది వాతావరణం. ఆ తెల్లవారురaాము కృష్ణపక్షమి చంద్రుడు జాగరణ చేసిన రోగిలా వున్నాడు. సుప్తానది అలల చప్పుళ్ళు స్పష్టంగా వినిపిస్తున్నాయి. నిద్రలేచిన పిచ్చి మొహరాలీ ఎప్పట్లాగే భవనం చుట్టూ తిరుగుతూ 'అంతా అబద్ధం... తప్పుకో... తప్పుకో' అంటున్నాడు.

******      ******      ******

పోనుపోను నా పగటి జీవితం వేరు, రాత్రి జీవితం వేరు అయిపోతోంది. పగలంతా కాకీటోపీ, పొట్టి కోటూ, పాంటూ వేసుకుని గుర్రమెక్కి ఉద్యోగానికెళ్ళే నేను భవనంలో కొచ్చేకా స్నానంచేసి వదులు పైజామా, సిల్కులాచ్చీ జరీపూలు కుట్టిన చేతుల్లేని చిన్న పట్టు కోటూ, ఎర్రటి ముఖమల్‌ టోపీ పెట్టుకుని ఎరుపురంగు చేతి రుమాలుకి అత్తరు రాసుకుని విశాలమైన హాలులో వున్న ఆ పెద్ద కుర్చీలో కూర్చుని హుక్కా కాడ పట్టుకునేవాడ్ని.

ప్రేయసి రాక కోసం ఎదురు చూస్తున్నట్టుండే నేను కొన్ని నిముషాలకే కలల సుడిగుండాల్లో గిరగిరా తిరిగేవాడ్ని. నాకొచ్చేవన్నీ మేలుకున్నవాడి కలలు. ఆ కలల్లో అందాలూ జరుగుతున్న అద్భుతాలూ వివరించడం ఇక నావల్లగాదు.

******      ******      ******

ఆరోజు ఒక అందాల సుందరి మెరుపులా మెరిసి మాయమయ్యింది. కళ్ళు సాగదీసిన గీతల్లాగున్నాయి. నేరేడుపండు రంగు పైజామా వేసుకుంది. బంగారపురంగు దారాలతో పూలు కుట్టిన కంచుకం బిగువైన రొమ్ములకి మాత్రం కట్టుకుంది. ఎర్రటి టోపి తలమీద పెట్టుకుంది. గులాబీరంగు కాంతుల్తో మెరిసిపోతున్న పాదాలకి కొనలు వంకర్లు దిరిగిన జరీ పాదరక్షలు తొడుక్కుంది. చూపులూ, నవ్వులూ ముఖ్యంగా ఆ మనిషి చేష్టలూ నన్ను పిచ్చోడ్ని చేసేస్తున్నాయి. ఎంతకీ తన పేరు చెప్పకపోయేసరికి సాకీ అని పేరు పెట్టుకున్నాను.

నా సాకీతో పాటు వెండివెన్నెల జాబిలిలో నిండు పున్నమి రాత్రుళ్ళలో నది ఇసుక తిన్నెల మీద అందంగా కలతిరుగుతున్నాను, వెలుగు వెన్నెలల్ని చూస్తున్నాను.

చాలా వింతవింత చేష్టల్తో ఒకానొక మాయలోకీ, మైకంలోకీ తీసుకెళ్ళిపోతున్న సాకీ తన భుజం మీద నా చెయ్యి వెయ్యడానికి మట్టుకి నవ్వుతూ ఒప్పుకుంది.

******      ******      ******

ఆ తర్వాత చాన్నాళ్ళు బులిపించి మురిపించి బాధలు పెట్టిన మనిషి ఒక వెన్నెల రాత్రి తేనె అంటించుకున్న తన పెదవుల్తోనే నా పెదాల్ని ముద్దెట్టుకుంది. కత్తుల్లాగున్న పళ్ళతో నా బుగ్గల్ని కొరికింది.

ఆరోజు నుంచీ నేను ఎప్పుడు చీకటి పడ్తుందా, ఎప్పుడు ముస్తాబయ్యి నా సాకీని కలుసుకుందామా అన్న యావలో పడిపోయాను.

******      ******      ******

ఆ చలికాలం దీపాలవేళ, ఎత్తయిన ఆ నిలువుటద్దానికి రెండువేపులా రెండు కార్తీక దీపాలు వెలిగించి, శ్రద్ధగా యువరాజులాగ ముస్తాబు చేసుకుంటున్నాను.

సరిగ్గా అదే టైములో ఆ అద్దంలో సాకీరూపం కనిపించింది. 'ఏంటాలస్యం?... ఇదిగో నిన్నే తొరగా రా!' అంటూ మాయమయ్యింది. ఈలోగా కిటికీల్లోంచి వచ్చిన ఈదురుగాలి అద్దానికి ఎడాపెడా వున్న దాపాల్నార్పేసింది.

బయటికొచ్చిన నేను నది ఒడ్డునే నడుస్తుంటే ఆ నది మధ్యలో వున్న ఇసుకతిప్ప మీద నిలబడి ఎండలో కదిలే అద్దంలా మెరుస్తూ రారమ్మని రారారమ్మని పిల్చింది.

వెళ్ళాను.

ఎప్పుడూ లేంది నా నడుం చుట్టూ తన చెయ్యేసి ఆ నది దాటించింది. అడవిలో వున్న యాలకుల చెట్టు దగ్గరకీ, మిరియాల పాదుల దగ్గరకీ, కర్పూరం చెట్ల దగ్గరకీ, చీకటి రుద్రాక్ష వృక్షాల నీడల్లోకి తిప్పుతోంది. అలా తిప్పుతూనే అమాంతంగా నా మీదపడిపోయి నన్ను వేడి వెచ్చగా కౌగిలించుకుంటుంది. ఆమె నడుం పట్టుకున్న నాకు మైదాపిండి ముద్దని పట్టుకుంటున్నట్టుంది. చెంపల మీద చేతులేసినప్పుడు బూరుగుదూది గుప్పెట్లోకి తీసుకుంటున్నట్టనిపిస్తుంది. పెదాల్ని తాకుతుంటే అంతకుముందే ఆమె తియ్యటి మిఠాయి కిళ్ళీ వేసుకున్నట్టుంది. దాంతో తియ్యతియ్యగా వుంది. ఆమె శరీరమంతా సువాసనలే.

తన సూదిపళ్ళతో నా చెవిని మెత్తగా కొరికి శృంగారానికి సంబంధించిన చేష్టలెన్నో చేసి నన్ను మత్తెక్కించి, వేడెక్కించి నా శరీరం కాలిపోతున్న సమయంలో మాయమైపోయింది.

గిలగిలా కొట్టుకుంటూ నిద్రలేచి కూర్చున్న నాకు, 'అంతా అబద్ధం తప్పుకో... తప్పుకో...' అనరుస్తున్న మొహరాలీ అరుపులు వినిపించాయి. తెల్లారిపోయింది.

నిద్ర తక్కువవ్వడంతో కళ్ళు మండుతున్నాయి. నీరసంగా వుంది. చెట్టుకి కట్టి వున్న కాశీ గుర్రం సకిలిస్తోంది. ఎగురుకుంటూ పోతున్న పిరంగిపిట్టలు ఏదోలా అరుస్తున్నాయి.

తయారవ్వడానికి లేచాను. కానీ నేనేం చేస్తున్నా నా సాకీ గుర్తుకొస్తోంది. నా సాకీ కనిపిస్తోంది. సాకీ రాత్రి వస్తుంది గాబట్టి అసలు పగలు వద్దు, ఎప్పటికీ రాత్రే వుంటే బాగుండ్ను అనిపిస్తోంది.

******      ******      ******

ఆరోజు సాయంత్రమవ్వగానే గుర్రమెక్కుదామనుకుంటున్న నన్ను మా వాళ్ళంతా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు.

వాళ్ళ మాట ఏమాత్రం వినకుండా చిలక్కొయ్యకి తగిలించి వున్న దొరటోపీ, పొట్టి కోటూ తీసుకోబోతుండగా ఏదో శక్తిలాగ గదిలోకొచ్చిన నదిలో గాలి ఆ రెండిరటినీ ఎగరగొట్టుకుపోయింది. అంతటితో అవ్వలేదు. గాలిలో కలిసిన నవ్వులు నాలుగు మూలల్నించి నాకు వినిపించాయి. ఇంకాస్సేపటికి ఆ నవ్వుల్లో ఎవరివో ఏడుపులూ, పెడబొబ్బలూ కలిసి కలగాపులగంగా వినిపించడం మొదలెట్టాయి.

పోనుపోను అవి నన్ను చాలా కలవరపెట్టి భయపెట్టడంతో ఆరోజింక గుర్రమెక్కలేకపోయాను. ఆ రాత్రి గాఢంగా నిద్రపోతున్నవాడ్నల్లా మంచంకోళ్ళు ఒక్కసారి కదిలేసరికి ఆ కుదుపుకి లేచి కూర్చున్నాను. కుమిలికుమిలి గుండెలు పగిలేలా సాకీ ఏడుపులు వినిపిస్తున్నాయి.

ఎక్కడ్నుంచా అని చుట్టూ చూసిన నాకు నా మంచం కింది నుంచే అని తేలింది. భూజుభూజుమంటూ పగిలిన గోరీ బీటల్లోంచి వస్తున్నట్టుందా స్వరం. 'ఇదిగో మిమ్మల్నే ఈ గోరీల మధ్య ఇరుక్కుపోయిన నన్ను, ఈ కారుచీకట్లో చిక్కడిపోయిన నన్ను తీసుకెళ్ళిపోండి. మీ గుర్రమెక్కించుకుని మీ గుండెలకి అదుముకుంటా ఈ అడవుల్లోంచి తీసుకెళ్ళిపొండి. అడవి దాటాకా వచ్చే కొండలెక్కించి ఆ దిగువలో నదుల్ని దాటించండి. ఎండ పొడలు తాకే మీ ఇంటికి తీసుకెళ్ళి పోయి నాకు జీవితాన్నివ్వండి," అంటూ ఏడుస్తోంది. పోనుపోను శృతి పెంచి గుండెల్ని బాదుకుంటూ ఏడుస్త్తోంది.

ఆమె ఏడుపులకీ, పెడబొబ్బలకీ నా మెదడంతా గిరగిరా తిరిగిపోతున్నట్టూ నాకు తెలీందేదో నా లోపల జరిగిపోతున్నట్టూ అనిపిస్తుంది.

అసలుకొస్తే నేనెవర్ని... నాకు చీకటిపడ్డాకా మాత్రమే కనిపించే ఈ సాకీని... ఈ కలల సుందరిని ఈ కామినీ సుందరిని నేనెక్కడికి తీసుకెళ్ళను.

ఇదిగో నిన్నే నువ్వు ఎక్కడో చల్లటి సెలయేటి గట్టు మీద ఖర్జూరపు పొదరిళ్ళ నీడల్లో ఇల్లూ వాకిలీ లేని ఎవరో ఎడారి స్త్రీకి పుట్టుంటావు. నిన్ను ఎవరో అరబ్బు బందిపోటు దొంగ నీ తల్లి ఒడిలోంచి లాక్కుని తన గుర్రమ్మీది కెక్కించి కాలిపోతున్న ఇసుక ఎడార్లు దాటించి ఏదో మహానగరంలో జరిగే సంతలో అమ్మడానికి తీసుకెళ్ళుంటాడు.

యవ్వనంతో మెరిసిపోతా సిగ్గుతో ఒదిగిపోతా అందచందాల్తో ధగధగలాడిపోతా వున్న నిన్ను పాదుషాగారి పనివాడు చూసి వుంటాడు. ఆ బందిపోటు దొంగకి ఎక్కువ డబ్బులిచ్చికొని, సముద్రం దాటించి, బంగారు పల్లకీలో ఎక్కించుకుని వాళ్ళ పాదుషాగారుండే ఈ అంతఃపురంలోకి తీసుకొచ్చాడు కదా?

ఇక ఇక్కడ నవాబుగారి పక్కనుండే నీ చుట్టూ రోజూ జరిగేదేంటంటే, సారంగీ అనే సంగీత వాయిద్యం మీద రాగవిహారాలూ, కాలిమువ్వలతో వేసే ఖండతాళాలు, తర్వాత శృంగారనాదాలు.

సాయిబుగార్ని వదిలి బయటికెక్కడి కెళ్దామన్నా ధగధగా మెరిసే బంగారపు కత్తులు. ఏ మూలకెళ్ళినా దాసదాసీల పేర్లతో నిన్నో కంట కనిపెట్టే నవాబుగారి భటులు. దాసీల్లాగా నీకు వింజామరలు వీస్తూ నిన్నో కంట కనిపెడ్తుంటారు. నువ్వెక్కడి కెళదామన్నా నీ వెనకాల దాసుల పేరిట నవాబుగారి మనుషులుంటారు. ఈ విసుగు భరించలేక ఎలాగోలా అందర్నీ తప్పించుకుని ప్రధాన ద్వారం దాటుదామంటే దేవదూతలాగ ముస్తాబు చేసుకొని పొడుగాటి కత్తి పట్టుకొని నిలబడుండే నీగ్రో కొజ్జా.

దాంతో నీ జీవితంలో నువ్వేం దాటలేకపోయావ్‌. నువ్వేం చేయలేకపోయావ్‌. పాడైన రక్తం నిండిన మనుషులు, అసూయల్తో నిండిపోయిన వాళ్ళంతా చేసే నిందలూ, నిష్టూరాల మధ్య ఒరగలేక, మాటరాక మూగదానిలాగుండిపోయావ్‌ కదా... అంటూ ఎక్కువగా మాటాడ్డం వల్ల నా మెదడంతా దిమ్మెక్కి బంగు బాగా తాగినోళ్ళా ఏదేదో అర్థంపర్థంలేనివన్నీ మాటాడ్తా... మాటాడ్తా మధ్యమధ్యలో అరుస్తా... హాస్యం అనిపించినప్పుడు అమాంతంగా నవ్వుతా వుండగా, 'అంతా అబద్ధం తప్పుకో తప్పుకో,' అంటూ వస్తున్నాడు పిచ్చి మొహరాలీ.

తెలతెల్లవారుతోంది.

******      ******      ******

బంట్రోతు టపాలో వచ్చిన ఉత్తరాలు తీసుకొచ్చిచ్చాడు.

సలాం చేస్తా వచ్చిన వంటవాడు, "ఇవ్వాళ ఏం భోజనం చెయ్యమంటారు," అన్నాడు.

చెప్పి ఆఫీసుకి బయల్దేరాను. లోపలికెళ్ళగానే ముసలి గుమాస్తా కరీంఖాన్‌ నవ్వాడు. ఏ సమాధానం చెప్పకుండా నా పనిలోపడ్డాను.

పగలంతా కష్టపడ్డ నేను సాయంత్రమయ్యేసరికి మగతగా మందమతిలాగ అదేదో లాగయిపోవడం మొదలెట్టాను. నా లోపల ఏదేదో జరిగిపోతోంది. మెదడు లోపలికి ఏదో పురుగులాంటిది దూరి గిరగిరా తిప్పేస్తోంది నన్ను. పాలరాయి మీద వేసిన రకరకాల రంగుల్ని కలగాపులగంగా తొక్కేసినట్టనిపిస్తుంది. అంతా గుర్తుకొస్తుంది. అన్నీ గుర్తు కొస్తున్నాయి. నా మనసు మనసులో లేకుండాపోతోంది. నా చుట్టూ కలతిరుగుతున్న వర్తమానం అర్థంపర్థంలేనిది అనిపిస్తుంది. హీనమైందీ దీనమైందీ అని కూడా అనిపిస్తుంది. ఏదో ఆలోచనలో పడిపోయి క్షణాల కాలంలో ఏదోలాగయిపోతున్నాను.

దాంతో, రాస్తున్న పెన్ను కిటికీ మూలకి విసిరేసి, పెద్ద బైండు బుక్కుని టపీమని మూసేసి ఆఫీసు బయట ఆగి వున్న గుర్రం ఎక్కి గుల్‌బాగ్‌ వేపు బయల్దేరాను.

సూర్యాస్తమయమయ్యే వేళకి గుర్రం నేను కేంప్‌ చేసిన గుల్‌బాగ్‌ భవనం ప్రధాన ద్వారం ముందాగింది. ఒక ఉరుకుతో దిగి మెట్లెక్కి లోపలకెళ్ళాను.

ఎందుకో తెలీదు, ఇవ్వాళంతా ఏ చప్పుడూ వినిపించడంలేదు.

ఏ మూలకెళ్ళినా నిశ్శబ్దమే. ప్రతి గదిలోకీ వెళ్ళి కలతిరగడం మొదలెట్టాను. ఎంతసేపు తిరిగినా నిశ్శబ్దం తప్ప ఇంకేం లేదు.

ఒక వాయిద్యం తీసుకుని  మాల్‌కౌస్‌ రాగం వాయిస్తా. 'నిన్ను విడిచిపెట్టి పారిపోదామని చాలా ప్రయత్నాలు చేసిన గాలిపటం మళ్ళీ మరణించడానికి వచ్చింది. ఈసారికి దాన్ని క్షమించు. దాని రెండు రెక్కల్నీ నరికి బూడిద చెయ్యి.' అని పాడదామనిపించింది.

ఆలోచిస్తున్న నా చెంపల మీద రెండు కన్నీటి చుక్కలు పడ్డాయి. అవి నావి గాకపోడంతో తలెత్తి చూశాను. ఎవరూ లేరు. చుట్టూ కల తిరిగాను. ఎవరూ కనిపించలేదు. ఏ చప్పుడూ లేదు.

కిటికీలోంచి బయటికి చూస్తే నది అవతలి ఒడ్డునున్న ఆరావళి కొండలమీద కారుమబ్బులు చిక్కగా కమ్ముకునున్నాయి. చిక్కటి చీకటిని పులుముకునుంది ప్రకృతి. నదిలో చల్లటి నీళ్ళు రాబోయే ఉపద్రవం చూడ్డం కోసం ఉగ్గబట్టుకుని ఎదురు చూస్తున్నట్టున్నాయి.

కాస్సేపలా గడిచిందో.. లేదో... ఆకాశంలో పెద్దపెద్ద మెరుపులూ వాతావరణంలో లుంగలు చుట్టుకుంటున్న పెనుగాలులు. గుల్‌బాగ్‌ భవనంలో కిటికీలు ద్వారాల తాలూకు తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయి.

మబ్బులు పట్టిన ఆ అమావాస్య రాత్రి ఏ దీపాలు లేని భవనంలోకి మెరుపులు వచ్చి పడుతున్నప్పుడు ఒక గదిలో మూలకి చూసి అలాగుండిపోయాను.

నిగనిగలాడుతున్న చిక్కటి చీకటిలో నేను స్పష్టంగా గ్రహించగలిగాను. ఆ గది మూల వాల్చి వున్న మంచం మీద అందమైన ఓ అమ్మాయి బోర్లా పడుకునుంది. రేగిపోయిన జుట్టుని గుప్పిళ్ళతో గట్టిగా పట్టుకుని పీక్కుంటోంది.

తెల్లటి ఆమె నుదురు పగలటంతో వెచ్చటి రక్తం బయటికి చిమ్ముతోంది. వెర్రిదాన్లాగా నవ్వుతోంది. పిచ్చిదాన్లా అరుస్తోంది. ఉన్నట్టుండి కుమిలికుమిలి ఏడుస్తోంది. వెక్కిళ్ళొస్తున్నాయి. ఒంటి మీదున్న జాకెట్టు వేళ్ళగోళ్ళతో పరపరా చింపేసుకుంటూ ఏ బట్టాలేని రొమ్ముల మీద చేతులేసి బాదుకుంటోంది.

తెరిచివున్న కిటికీల్లోంచి దూసుకుంటూ వస్తోంది గాలి. బయట కుండపోత వర్షం. కిటికీలోంచి కొట్టే జల్లుకి ఆమె శరీరమంతా తడిసి ముద్దవుతోంది.

అమాంతంగా ఆ మనిషి నామీద పడి నన్ను కిందికి తోసేసరికి ఆ నేల మీద వెల్లకిలా పడిపోయాను.

మెరుపులా వచ్చిన ఆ మనిషి నా గుండెల మీద కూర్చుంది. చాలా బరువుండడంతో నా ఊపిరి సలపడం లేదు. కాళ్ళూ చేతులూ ఆడిస్తూ గిలగిలా కొట్టుకుంటున్నాను. నా జుట్టు పట్టుకుని టపటపా ఆ నేలకేసి బాదుతోంది. నా తల వెనుకభాగం చిట్లిపోయి రక్తం బయటికి రావడంతో కిందంతా బందబందయిపోతోంది. రక్తంలో తడిసిన జుట్టు ముద్ద ముద్దయిపోతోంది. గిలగిలా కొట్టుకుంటున్న నా ప్రాణం ఇక పోయేలాగుంది.

గబుక్కున మెలకువొచ్చింది. ఊపిరి ఎగబీలుస్తున్నాను. బట్టలు చెమటతో తడిసిపోయాయి. గజగజమంటూ వణుకుతోంది శరీరం.

వర్షం తెరిపివ్వకుండా కురుస్తూనే వుంది. ఆ వర్షంలోనే గస్తీ తిరుగుతూ 'అంతా అబద్ధం తప్పుకో... తప్పుకో...' అంటున్నాడు మొహరాలీ.

తడుస్తూ ఆ పిచ్చి మొహరాలీ దగ్గరకెళ్ళి, "ఇదుగో నిన్నే... ఏది అబద్ధం?" అని అడిగాను.

నాకే సమాధానం చెప్పనివాడు తన పిచ్చి బలంతో బురదలోకి తోసేశాడు. చాచిన తన రెండు చేతుల్ని పక్షిరెక్కల్లాగ ఆడిస్తూ గుల్‌బాగ్‌ చుట్టూరా గిరగిరా తిరుగుతూ "అంతా అబద్ధం... తప్పుకో తప్పుకో," అని అరుస్తూ పోతున్నాడు.

******      ******      ******

వర్షం ఆ మర్నాడు పగలు కూడా ఆగలేదు. నేను బట్టలూ అవీ సర్దుకుంటున్నాను. సలాం చేస్తూ వచ్చిన వంటవాడు, "ఈ పూట భోజనం ఏం చెయ్యమంటారు బాబూ?" అన్నాడు.

"నాకేం వద్దు. నేనెళ్ళిపోతున్నాను," అని గుర్రమెక్కి వర్షంలో తడుస్తూనే ఆఫీసుకొచ్చి ముసలి కరీంఖాన్‌ ముందు నిలబడ్డాను.

కంగారుపడిపోయిన ఆ గుమాస్తా, "అయ్యయ్యో... తడిసి ముద్దయిపోయారేంటి బాబూ?" అని అన్నాడు.

దానికి సమాధానం చెప్పకుండా, "ఆ పిచ్చి మొహరాలీ మాటలకి అర్థమేంటో చెప్పు?" అన్నాను.

చెప్పాడు.

"ఒకప్పుడు ఆ గుల్‌బాగ్‌లో పూర్తిగా తీరకుండా మిగిలిపోయిన కోరికలెన్నో, సుఖభోగాలెన్నెన్నో, ఆకలితో, దాహంతో వున్న ఆ భవనంలో రాళ్ళు వాటిని పీల్చేసుకున్నాయి. అయినా వాటి ఆకలీ, దాహం తీరలేదు.

"దాంతో మనిషన్నవాడు ఏవడైనా ఆ భవనం లోపలికొస్తే వాడ్ని ఆడిరచి, ఆశపెట్టి, బులిపించీ మురిపించీ పిశాచాల్లాగ వాడి రక్తం పీల్చి పారేస్తున్నాయి. అలా ఎంతమందినో... ఆ భవనంలో వుండి ప్రాణాల్తో పిచ్చోడయ్యేడు మొహరాలీ. మామూలు మనిషిగా తిరిగొచ్చింది మీరు మాత్రమే." అన్నాడు.

"ఐతే... ఆ గుల్‌బాగ్‌ భవనంలో కెళ్ళినవాడు క్షేమంగా తిరిగి రావాలంటే ఏం చెయ్యాలి... ఉపాయమేమన్నా వుంటే చెప్పు?" అని అన్నాను.

"ఉంది... అయితే చాలా కష్టపడాలి." అన్నాడు కరీంఖాన్.

"ఏంటీ?" అన్నాను ఆత్రంగా.

"చెప్పడానికి ముందు ఆ గుల్‌బాగ్‌లో ఇరాన్‌ నుంచి కొనుక్కొచ్చిన అందాలరాసి జీవితచరిత్ర చెప్పాలి తమరికి... అయితే అది విన్నవాడు షాక్‌ నుంచి తేరుకుని మామూలు మనిషవ్వడానికి చాలా టైము పడుతుంది." అన్నాడు.

"ఔనా?"

"గుండెల్ని పిండి పిప్పి చేసే దారుణమైన కథ అది. అలాంటి కథ ఈ ప్రపంచంలో ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఇక ముందు కూడా జరగబోదు," అన్నాడు ముసలి గుమాస్తా అయిన ఆ కరీంఖాన్.

******      ******      ******


 

మరిన్ని సీరియల్స్