Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Fourth Part

ఈ సంచికలో >> సీరియల్స్

బైరాగి - బి.వి.యస్‌. రామారావు

రేవు దాటడానికి నావకోసం టిక్కెట్టు కొనబోతుంటే కట్టుతాడు కొరికేసి, దౌడు తీసింది కుక్కపిల్ల.
దానిని పట్టుకోవడానికి పరగడుపునే చెడుగుడు ఆటయిపోయింది మన్మథరావుకి.
    కుక్కపిల్లని చంకలో బిగించి, రొప్పుతూ రేవు చేరేసరికి, నావని కాస్తా వదిలేశాడు సరంగు.
    "ఇదిగో సరంగూ, కాస్త ఆగు! నన్ను కూడా ఎక్కించుకో, ఆవతల రేవులో బస్సు వెళ్ళిపోతుంది. ఏయ్‌ నిన్నే! టిక్కెట్టు కొన్నాను. చిల్లర లేదంటే ముప్ఫై పైసలకి ఏకంగా రూపాయిచ్చాను రేవు గుమాస్తాకి. ఆపవోయ్‌! బస్సు అందకపోతే ఆఫీసుకు టైములో అందుకోలేను. కొంపలంటుకుంటాయి నాకు. ఇదిగో నిన్నే అదనంగా ఒక రూపాయి యిస్తాను. రెండు పుచ్చుకుందిగానిలే... పోనీ ఐదూ... సరే! ఆగు, పదిరూపాయలిస్తాను," అని ప్రాధేయపడ్డాడు మన్మథరావు.
    "ఆ అబ్బాయిగారేదో పదిరూపాయిలిస్తానంటున్నారు. వెనక్కి మళ్ళించి ఎక్కించుకోకూడదా పోలయ్యా!" అన్నాడు నావలో కూర్చుని తత్త్వం పాడుతున్న కళ్ళులేని బైరాగి నావ సరంగుతో.
    తెరచాప దింపి తెడ్డేసి నావని వెనక్కి మళ్ళించాడు సరంగు. 'హమ్మయ్య' అనుకున్నాడు మన్మథం.
    నావంతా ఆడా-మగా, పిల్లామేకలతో కిక్కిరిసి వుంది. దానికి సాయం ఆ ఫిర్కాలోని మైనరుబాబు ఒకడు సగం నావ ఆక్రమించేస్తూ, సైకిల్‌కి స్టేండువేసి పట్టుకునుంచున్నాడు.
    నావ మధ్య కూర్చున్నాడు గుడ్డి బైరాగి. చేతుల బనీను, గులాబిరంగు పంచె, నెరిసిన గడ్డం, గిరజాల జుట్టు, పంగనామం, చెవుల్లో గన్నేరుపువ్వు, చేతిలో తంబురా. ఎప్పుడూ నావలో కూర్చుని అరిగిపోయిన గ్రామ్‌ఫోను ప్లేటులా ఒకే చరణాన్ని పదేపదే పొద్దస్తమానం పాడుతుంటాడు.
    బైరాగి లేకుండా రేవులో ఏ నావా కదలదు.
    బైరాగి చుట్టూ కూలీవాలీ చేసుకునే జనం కూర్చుని పాటను శ్రద్ధగా వింటున్నారు. 'ఏ తీరుగ నను దయచూసెదవో... రామా,' బైరాగి చరణం.
    మన్మథం నావ పడిచెక్క మీద కూర్చుని, వొళ్ళోని కుక్కపిల్లని దువ్వుతూ మచ్చిక చేసుకుంటున్నాడు.
    తెరచాప విప్పి కొయ్యమీద కెక్కిస్తూ, "బాబుగారూ! తొట్టెలో కూర్చోండి. మెరకున్న కాడ గడెయ్యడానికి అడ్డొస్తారు," అన్నాడు సరంగు.
    "ఫర్వాలేదు, నుంచుంటా," అని నుంచోబోయాడు మన్మథం.
    "గాలిపోటు ముదిరిందంటే, పరమానుతాడు పీక్కి చుట్టుకుని తూలి గోదాట్లో పడగలరు తమరు. మీకు సాయం చంకలో కుక్కపిల్లొకటి. అది యీదెయ్యగలదనుకోండి. మరి మీకీతొచ్చో లేదో సూసుకోండి. అయినా మద్దెన నాకెందుకు, మీ యిట్టం," అన్నాడు తెరచాప తాళ్ళను కట్టడంలో సరంగుకి సాయపడుతున్న ఓ రైతన్న.
    "బాబుగారూ! 'మాకు' దగ్గర తాళ్ళచుట్ట ఒకటి వుండాలి. దానిమీద కూర్చోండి," అన్నాడు బైరాగి.
    నావ ముందు భాగాన్ని తాళ్ళచుట్ట కనబడిరది. రెండు అడుగులు ముందుకేశాడు మన్మథం.
    "నిమ్మది నాయనా! యీ మడిజాడీ ముట్టుకోగలవు. కాస్త అసుంటా జరుగు," అని హెచ్చరించింది తాళ్ళకట్ట ప్రక్కన కూర్చుని, చిన్నసైజు జాడీని కాపలా కాస్తున్న, ఓ నడివయస్సు బోడమ్మ.
    తాళ్ళ మీద చతికిలబడ్డాడు మన్మథం.
    స్థలం మార్పుకి విసుగేసిన కుక్కపిల్ల 'భౌ' మంది. దాని అరుపుకి అదిరిపడి 'మే' అంది పిల్లమేక. 'ఫరవాలేదు. అది మన జోలికి రాదులే,' అని మేకభాషలో 'మే! మే!' అని ధైర్యం చెప్పింది తల్లిమేక.
    'ఏ తీరుగ నన్ను దయచూసెదవో,' చరణం ఆపి, "బాబుగారూ కుక్కపిల్లను పెంచుతున్నారా? మంచి జాతికుక్క కామోసు తమరిది," అడిగాడు బైరాగి.
    "కాదులెహెస్‌! అది వూరకుక్క. కరణంగారి జాగిలం డాక్టరుగారి సీమకుక్కతో క్రాసింగయింది ఆ మద్దిన. పిల్లల్ని వూరంతా పంచిపెట్టాడు కరణం. దాని బాపతే అయివుండాలి యిది," అన్నాడు మైనరుబాబు.
    కుక్కపిల్ల భుజాలు తడుముకోడాన్ని మన్మథం చూడలేదు.
    మైనరు దీన్ని ఊరకుక్క అన్నందుకు వొళ్ళు మండిరది. ఈ పల్లెటూరి బైతుకి కుక్కల గురించి ఏం తెలుసులే అని వూరుకున్నాడు.
    "అయితే బాబుగారూ, కరణం గారికి మీరు చుట్టమా?" బైరాగి ప్రశ్న.
    ఆ కరణం తన మామ అనాలో, లేక తను కరణం అల్లుడిననాలో తేల్చుకునేలోగా, "మీరు వారి అల్లుడు గారా?" అని అడిగేశాడు బైరాగి.
    "ఊ!" అని టూకీగా సమాధానం చెప్పాడు మన్మథం. ఈ ముష్టాడితో కబుర్లేమిటని.
    "కరణంగారి అల్లుళ్ళందరివీ పెద్ద వుద్యోగాలని చెప్పుకుంటారు. తమరు కూడా ఏదో గొప్ప వుద్యోగం చేస్తూ వుండాలి."
    'వీడికి యివన్నీ చెప్పడం ఏమిటి?' అని వూరుకున్నాడు కానీ, అందరూ తనకేసి కుతూహలంగా చూస్తున్నారని గ్రహించి, గుమాస్తానని చెప్పుకోడానికి నామోషీపడి, "కాకినాడ స్టేట్‌బ్యాంకులో పని," అన్నాడు కప్పదాటుగా.
    "మేనేజరుగిరా బాబూ!"
    "ఆ!" అన్నాడు యింతటితో వూరుకుంటాడన్న భరోసాతో.
    "మరక్కడ కృష్ణమూర్తిగారు కదా మేనేజరు. వారిదీ కోనసీమేలెండి. మారాజు, రేవు దాటినప్పుడల్లా పలకరించి ఓ రూపాయి దానం చేసేవారు."
    "ఆయన కింద అసిస్టెంటు మేనేజర్ని." అని బుకాయించాడు మన్మథం.
    "వారి అసిస్టెంటుగా భజగోవిందంగారు కదా పనిచేస్తూ వుంట?"
    గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది మన్మథానికి. 'గుడ్డిపీనుక్కి యిన్ని వివరాలు ఎలా తెలుసు చెప్మా?' అని ఆశ్చర్యపోయాడు.
    "వారు పంటభూముల లావాదేవీల్లో అప్పుడప్పుడు వస్తూ వుండేవారులెండి. ఏమాట కామాటే చెప్పుకోవాలి. నా చేతుల్లో ఎప్పుడూ గుప్పెడు చిల్లర పోసేవారు."
    వీడు డొంకంతా కదిపేస్తున్నాడు. కొంపతీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తాడేమోనని భయపడి పర్సులోంచి రెండు రూపాయల కాగితం తీసి, "యిదిగో యింద," అంటూ రెండడుగులు ముందుకేసి, బైరాగి చేతిలో పెట్టాడు మన్మథం.
    ఆ రెండడుగులూ ముందుకు వేస్తుంటే, 'అసుంటా, అసుంటా, జాడీ ముట్టుకు తగలెయ్యగలరు," అంది బోడెమ్మ గొంతు చించుకుంటూ.
    "ఎవరూ సూరమ్మగారా! అమ్మాయిని చూడ్డానికి పట్నం వెళుతున్నారా తల్లీ!" అని పలకరించాడు బైరాగి.
    "ఆవకాయ రోజులు కదా! అమ్మాయిది బొత్తిగా ఆడదిక్కులేని సంసారమాయె. కాస్త సాయం చెయ్యడానికి వెళ్తున్నాను," అంటూ కొంగుముడిలోంచి ఐదుపైసలు తీసి, "అలా అతనికియ్యి," అని ప్రక్కనున్న షావుకారికి అందించింది. షావుకారు, "యింద, ఆరికియ్యి," అంటూ అడ్డపొగ కాలుస్తూ, బండ కొడవలితో వీపు గోక్కుంటున్న గడ్డిమోపావిడకి అందించాడు. నోట్లోంచి చుట్టతీసి, గుప్పున పొగవదిలి, "యిదిగో సూస్కో ఐదుపైసలు," అంటూ ఆ బైరాగి చేతిలో పెట్టింది- ఆ గడ్డిమోపు.
    "ఎవరూ చిట్టెమ్మా! కమ్మని పొగవాసన తగలగానే అనుకున్నాను, నా పక్కన కూర్చున్నది చిట్టెమ్మేనని. ఇందరు చుట్టలు కాలుస్తారుగాని, నీ దగ్గరున్న కమ్మదనం ఎవరికీ రాదంటే నమ్ము చిట్టెమ్మా," అని పొగిడాడు బైరాగి.
    చిట్టెమ్మ ఐసైపోయి, బొడ్లోంచి నాలుగు పొగాకు పాయలు తీసి, ఓ పాయ ఇవ్వబోయి మూడుపాయలిచ్చేసింది బైరాగికి.
    అందుకున్న పొగాకు బాపతు ఘాటు పీలుస్తూ చిట్టెమ్మెప్పుడూ చిట్టెమ్మే అని మెచ్చుకున్నాడు బైరాగి.
    అలా అనగానే ప్రక్కనున్న అప్పాయమ్మకి పౌరుషం వచ్చి, బుట్టలోంచి అమ్మకానికి తీసుకెళుతున్న మామిడిపళ్ళను ఓ పుంజీడు తీసి, ఇంద అని బైరాగి వొళ్ళో వేసింది.
    "అప్పాయమ్మ చేతికి ఎముకలుండవు. ఎంతందితే అంత. అప్పాయమ్మా, నిన్ను అందరూ చక్కనిచుక్క అంటారు. నీ అందాన్ని నీ మంచి మనసులో చూస్తున్నాను," అని తేరగా పొగిడాడు బైరాగి.
    అప్పాయమ్మ మరింత పొంగిపోయి, మరో రెండు పళ్ళు తీసి, "పోలయ్య మావా యింద," అంటూ సరంగు చేతికి అందించింది.
    'అలా నావని నమ్ముకు బ్రతుకుతున్నాడు పాపం, ఈ గుడ్డివాడు,' అని అందరూ సానుభూతి చూపిస్తారు బైరాగి మీద. నావకి కట్టవలసిన ముప్ఫైపైసలు కాక, బైరాగికో ఐదుపైసలు కూడా- లెక్కేసుకుని రేవుకొస్తారు అక్కడి జనాభా.
    ఇంకెందుకు ఆలస్యం అన్నట్టు, తక్కినవారు కొంగుముళ్ళు, పంచెకుచ్చిళ్ళు తడిమి బైరాగికి వరుసగా ముడుపు చెల్లించేశారు.
    "తిరిగొచ్చేటప్పుడు యిస్తా తాతా," అంది అలా యివ్వనందుకు బాధపడిన ఓ పల్లెపడుచు.
    "ఎవరూ నాగమల్లా! ఏంటి పిల్లా పన్లోకి యింత లేటుగా వెళుతున్నావు," బైరాగి పలకరింపు.
    "ఇయ్యాల బట్టువాడా రోజు," అంది బిరుగ్గా కప్పుకున్న వోణీకొన ముందుకి లాగి గాలికి ఎగరకుండా గట్టిగా పట్టుకు కూర్చుని.
    తెల్లదారంతో కుట్టిన నల్లరంగు జాకెట్టు, చాలీచాలని చిలకాకుపచ్చ వోణీ, వెలిసిపోయిన పరికిణీ, బోసి మెడా, చెంపల్లో ప్లాస్టిక్కు సీతాకోకచిలుక, కొప్పులో మందారపువ్వు, దాయలేని నిండు యౌవనపు అంగసౌష్టవంతో, పంచకల్యాణిలా, ఏపుగా వుందా నాగమల్లి అనే పల్లెపడుచు.
    ఆ పడుచు పక్కనే నుంచున్నాడు మైనరుబాబు. ప్రతి కదలికలో ఆమెలోని అందాన్ని అడపాతడపా కళ్ళతో జుర్రేస్తూ తెడ్డు వూపుకి నావ అల్లల్లాడగా కుదుపు కుదుపుకీ, తన మోకాలితో ఆమె వీపుని రాపాడిరచేస్తూ బులపాటం తీర్చేసుకుంటున్నాడు - ఏమీ ఎరగనట్టే ఆకాశంలోకి చూస్తూ.
    ముందుకు జరిగితే పళ్ళబుట్ట, వెనక్కి జరిగితే మోకాలు పోట్లు, ఒకపక్క సైకిలు, మరొపక్క మేకలు - పద్మవ్యూహంలో చిక్కడినట్టు బిక్కచచ్చి బిగుసుకుపోయిందా పంచకల్యాణి. వీపు మద్దనకి వొళ్ళు పులిసిపోయి యింక భరించలేక చెంపపిన్ను తీసి బలంగా మైనరు కాలి మడంమీద కసిగా పోటుపొడిచి, మేకలున్న వేపు జరిగి కూర్చుంది - ఏమీ తెలియనట్టు.
    "అమ్మా," అన్నాడు మైనరు. పిల్లమేకకు కొప్పులో ఉన్న మందారం నోటి కందడంతో, కొప్పుతో సహా మేసేస్తూ వుంటే, "సీ, పాడు," అంది నాగమల్లి. ఈ రెండు పదాలూ ఒకేసారి వినపడడంతో, ఏమిటా అని అటుకేసి తిరిగాడు బైరాగి చరణం ఆపి.
    మైనరు భుజాలు తడుముకుని, ఆ చేత్తోనే జేబులు కూడా తడిమి ఓ రూపాయి కాగితం తీసి బైరాగికిచ్చాడు - ఎప్పుడూ యివ్వనివాడు.
    "అదేంటి బాబూ, కూలాళ్ళ మధ్య నుంచున్నారు, కామందులు. క్లాసుగా తాళ్ళ చుట్టమీద బాబుగారి పక్కన కూర్చోలేకపోయారా?" అన్నాడు బైరాగి - రూపాయి కాగితం మడిచి జేబులో వేసుకుంటూ.
    ఫర్వాలేదని కాలరు సర్దుకొని హేండిల్‌ బారుమీద మద్దెల కొడుతూ, దిక్కులు చూడసాగాడు మైనరు - సూదిపోటుకి రక్తం కారి నెప్పెడుతున్నా, కిక్కురుమనకుండా.
    "తీరుగ నను దయచూసెదవో..." బైరాగి చరణం.
    కుక్క 'భౌ' మంది. పిల్లమేక 'మే' అంది. తల్లిమేక 'మే! మే!' అంది.
    దూరం నుంచి బస్సు బాపతు గేసు హారను గావుకేకలా వినబడిరది.
    "మీరేం కంగారుపడకండి బాబుగారూ! యీ నావ వెళ్తేకాని బస్సు కదలదు," అని గ్యారంటీ యిచ్చాడు బైరాగి.
    'వీడికి కర్ణపిశాచం ఉంది కాబోలు,' అని ఆశ్చర్యపడ్డాడు మన్మథం.
    కుక్కపిల్ల మళ్ళా 'భౌ' మంది. పిల్లమేక 'మే' అంది.
    'ఎందుకలా చెవి కోసిన మేకలా అరుస్తావు?' అని మేకభాషలో 'మే! మే!' అని కోప్పడిరది తల్లి మేక.
    "ఏ తీరుగ నను దయ చూసెదవో...' బైరాగి చరణం.
    మన్మథరావు మనసు కుదుటపడిరది. చల్లని గోదావరి, హాయిగా వీస్తున్న పైరగాలి, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, అమాంతం అతన్ని పూనేశాయి. మైమరచచి శూన్యంలోకి చూస్తూ వుండిపోయాడు.
    కెవ్వుమని పిడుగులా కేకెట్టింది సూరమ్మనే బోడెమ్మ. ఆ కేకకు ఆకాశం అదిరింది. గోదావరి స్తంభించిపోయింది. సరంగు హడలిపోయి చీకుతున్న మామిడిటెంకను గుటుక్కున మింగేసి, చుక్కాని వదిలేశాడు. చుక్కాని లేని నావలా, నావ అటూ యిటూ పొర్లింది. ఆ కుదుపుకి సైకిలు అటుపడగా, దాన్ని పట్టుకోడం మానేసి, ఇటుపడి దొరికింది ఛాన్సు అని. నాగమల్లి మీద పడి వాటేసుకున్నాడు మైనరు. 'నీ జిమ్మడ' అని మైనరుని బలంగా ఓ తోపు తోసింది నాగమల్లి. దెబ్బతో అప్పాయమ్మ, చిట్టెమ్మల మధ్యనున్న మామిడిపండ్ల గంప మీద దభీమని బోర్లాపడ్డాడు మైనరు. మిగల ముగ్గిన పళ్ళు చితికి చిందగా రసం కాస్తా చిట్టెమ్మ మీద పడిరది. కంగారుపడ్డ చిట్టెమ్మ అడ్డపొగ బాపతు నిప్పు నాలిక్కంటుకుంది. తుప్పుమని ఉమ్మేసిందా చుట్టని. అదెళ్ళి బైరాగి ముఖం మీద పడిరది. బైరాగి బెదిరి తంబూరాను గట్టిగా మీటాడు. తీగ తెగి ఎగిరి షావుకారి పీకకు చుట్టుకుంది. బాబోయ్‌ అంటూ డబ్బుల సంచీని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసేసుకున్నాడు ఆ షావుకారు. యివన్నీ ఒక త్రుటిలో జరిగిపోయాయి.
    "హయ్యో-హయ్యో!" అని మళ్ళీ గావుకేక పెట్టింది సూరమ్మ. అందరూ అటు చూశారు.
    నున్నగా కనబడ్డ జాడీని చూసి ముచ్చటపడి, కాలెత్తి హాయిగా తడిపేస్తూంది ఆ కుక్కపిల్ల.
    ఛీఛీ అంటూ కుక్కని పీక పట్టుకు లాగాడు మన్మథం.
    "మే!' అంది కుక్కపిల్ల.
    ఆ అరుపు విన్న పిల్లమేక మతిపోయి 'భౌ' మంది. అది విన్న తల్లిమేక కన్ఫ్యూజు అయి భౌ భౌ మంది.
    అసలు ఏం జరిగిందో తెలియని గుడ్డి బైరాగి, "వోదసె చూయదనున గరుతీ ఏ" అని రివర్సు పాడేస్తున్నాడు తనూ కన్‌ఫ్యూజయి.
    అలా నావంతా గగ్గోలయి సగ్గోలు అవడానికి కొన్ని క్షణాలు పట్టింది.
    "నిక్షేపంలాంటి జాడి కుక్క ముట్టుకుపోయింది. ఈ పాపం వూరికే పోదు. రౌరవాది నరకాలు అనుభవిస్తారు. ఆ కుక్క మనుషులు," అంది సూరమ్మ.
    "ఇంతోటి దానికి నరకానికెళ్ళాలని శాపాలెట్టాలామ్మా సూరమ్మా!" అని కోప్పడ్డాడు బైరాగి.
    "ఇంతోటి విషయంటయ్యా యిది!? నా పెళ్ళయిన కొత్తలో మా పుట్టింటారు యిచ్చిన జాడీ! వెయ్యికళ్ళతో మడిగా చూసుకుంటున్నాను యిన్నాళ్ళూ. కష్టపడి సంపాదిస్తే కానీ, మళ్ళీ వస్తుందా ఈ జాడీ!"
    "మా కష్టపడి సంపాదిస్తున్నావమ్మా. రూపాయికి రూపాయి వడ్డీ కట్టి..." ఏదో అనబోయాడు రైతన్న.
    "మగదిక్కులేనిదాన్ని ఏం చేయమంటావు. మొగుణ్ణొదిలేసిన మీ పెద్దమ్మాయిలా వీధులమ్మట తిరిగి పేడెత్తి పిడకలద్దమంటావా? పుంతలమ్మట పోయి పుల్లలేరమంటావా?" అంది ఏకబిగిని సాగదీస్తూ.
    నోటికి హద్దూపద్దూ లేకుండా పరువు తీసేస్తున్నందుకు, తన నోరు మూసేసుకున్నాడు రైతన్న.
    తనకేం సంబంధం లేనట్టు ధీమాగా కూర్చున్నాడు మన్మథం.
    "సర్లేవమ్మా! నువ్వేం నష్టపోకు. దాని ఖరీదెంతో చెప్పు. బాబుగారు నీకిచ్చేస్తారు," అని తుని తగువు తీర్చాడు బైరాగి.
    అదిరిపడి జాడీకేసి చూశాడు మన్మథం - దాని ఖరీదు ఏమాత్రం ఉంటుందోనని. 'మహావుంటే ఐదో. ఆరో.. వుంటుంది. మొగాన్ని కొట్టెయ్యొచ్చు,' అని ఖరారు చేసుకున్నాడు.
    "షావుకారూ! నువ్వు చెప్పవయ్యా ఆ జాడీ ఖరీదెంతుంటుందో," అడిగాడు బైరాగి.
    "ఆ! వుండకేం, వుంటుంది. నేనీ మద్దినే తొమ్మిది రూపాయల ఏభై పైసలకమ్మాను కొట్టుకాడ," అన్నాడు. రెండు రూపాయలు ఎక్కువే వెలకట్టి.
    "ఇంకా నయం. నిరుడీరోజుల్లో పాత రెవెన్యూ ఇన్‌స్పెక్టరుగారి భార్య వంద రూపాయలిస్తాను, ఆ జాడీ నాకివ్వమని కాళ్ళావేళ్ళాపడిరది. ఆచ్చొచ్చిన పిత్రార్జితం జాడీ కదా అని, ససేమిరా అన్నాను. ఇది ఈస్టిండియా కంపెనీ నాటి జాడీ! సిసలైన లండను సరుకు."
    "అవును. మరే! యిప్పుడు లండను సరుకు బజారులో ఎక్కడుందీ," సాక్ష్యం చెప్పాడు షావుకారు.
    ఆడంగులందరూ ఆ జాడీకేసి చూశారు. 'లండనంటే యిలాగే వుంటుంది కామేసు,' అనుకున్నారు.
    "ఇది తరతరాలనాటి జాడీ. మా అమ్మ కర్మం కాలి ముండమోస్తే, మనోవర్తి లేకుండా ఎలాగో నన్ను పెంచి పెళ్ళిచేసి, ఈ జాడీ నాకిచ్చింది. నా తల చెడ్డా నేనెలాగో నెట్టుకొచ్చి మా పిల్లకి పెళ్ళి చేశాను. యిప్పుడీ జాడీ దాని కందజేద్దామనుకుంటే, పాపిష్టివాళ్ళు ముదనష్టపు కుక్కతో ముట్టించేశారు," అని భోరున ఏడిచింది చిర్రున చీదేస్తూ.
    "అబ్బా - వూరుకోవమ్మా! ఆ వందా బాబుగారు యిచ్చేస్తారులే," అని వూరడిరచాడు బైరాగి - అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు.
    అదిరిపడి, మరోసారి జాడీకేసి చూశాడు మన్మథం.
    వందపెడితే ఆ సైజు వెండిజాడీయే వస్తుంది అనుకున్నాడు. బోడెమ్మ పేరాశకి మనసులోనే తిట్టుకున్నాడు. సతీసహగమన నిషేధచట్టాన్ని రద్దుచేసి, యిలాంటివాళ్ళకు స్ట్రిక్కుగా అమలుపరచనందుకు గవర్నమెంటు మీద మనసులో కోప్పడ్డాడు.
    ఆ వందా యిస్తాడా, లేదా అని అందరూ తనకేసే కనురెప్ప వాల్చకుండా చూస్తున్నారన్న సంగతి గ్రహించాడు మన్మథం. ఠపీమని జేబులో చెయ్యెట్టి పర్సులాగాడు - ఏ పదో, పరకో పారేద్దామని.
    "వెనకటికో దొరగారు పెంపుడుకుక్క కోసం తాజ్‌మహల్‌ లాంటి గోరీ కట్టించాట్ట. పెంచిన మమకారం అంటే అలాంటిది. బాబుగారు మట్టుకు తక్కువా? కుక్కకోసం బ్యాంకినే ఒడ్డెయ్యగలరు," అన్నాడు బైరాగి జనాంతికంగా.
    ఆ మాటలకు కుక్క జ్ఞానంతో కుక్క గ్రహించింది. అమాంతం మన్మథం మీద ప్రేమ, అభిమానం, భక్తి, విశ్వాసం అన్నీ కలగాపులగంగా పుట్టుకొచ్చి, మన్మథం చేతులు నాకేస్తూ పర్సుని కూడా నాకబోయి, పొరపాటున అతని వేలు కొరికేసింది. అమ్మో అంటూ చెయ్యి విదిపాడు మన్మథం.
    ఆ విదుపులో పర్సు షావుకారు వళ్ళో పడిరది. నోట్లకట్టలు విచ్చుకున్నాయి. సూరమ్మ కళ్ళు మెరిశాయి.
    "అలా డబ్బుని విసిరికొట్టకూడదు నాయనా - కళ్ళోతాయి," అంది సూరమ్మ.
    "ఇదిగో తీసుకోండి," అని వందరూపాయల నోటు సూరమ్మకిచ్చాడు షావుకారు.
    "చివర సున్నా వుంటే అరిష్టం నాయనా. నాటవొకటి చెయ్యాలి, మరో రూపాయి యియ్యి," అంది సూరమ్మ.
    మరో రూపాయి కూడా యిచ్చి పర్సుని మన్మథానికి అందించాడు షావుకారు.
    "ఈ రూపాయి ఆ బైరాగాయనకిచ్చెయ్యి నాయనా - యిచ్చేవాళ్ళకే తప్ప పుచ్చుకున్న వాళ్ళకి వుండదు శంఖ," అనగానే అంచెలంచలుగా బైరాగి జేబులో చేరింది ఆ రూపాయి.
    జాడీకేసి చూశాడు మన్మథం. జాడీని ఆప్యాయంగా వేళ్ళతో నిమురుతోంది సూరమ్మ.
    'ఆ జాడీ వదులు అది నాది,' అన్నట్టు చూశాడు మన్మథం.
    "కుక్క ముట్టుకున్న జాడీ తీసుకుంటావా నాయనా! నిక్షేపంలా తీసుకో. కడిగేసి వాడుకోవచ్చు. కాని దాని మట్టులో చిన్న బీట వుంది. కాస్త చింతపండు పూస్తే వూట కారినా పిండి మట్టుకు కారదు. యింద తీసుకో," అంది.
    "చిల్లుజాడీ ఆరేం జేసుకుంటారు. యిలా యియ్యి చిల్లరేసుకుంటాను," అన్నాడు బైరాగి. మరుక్షణంలో జాడీ బైరాగిని చేరింది.
    జుట్టు పీకేసుకుని గట్టిగా అరచి గోదాట్లోకి దూకేద్దామనుకున్నాడు - ఒళ్ళు కుతకుతలాడిపోతున్న మన్మథం. కాని పేంటు, షర్టు తడిసిపోతాయని మానేశాడు.
    "పోలయ్యా! గేదెలకీ, ఆవులకీ పుచ్చుకున్నట్టు బాబుగారి దగ్గర కుక్కకి లగేజి పుచ్చుకోకు. వారసలే కొత్త. ఐదు రూపాయలే పుచ్చుకో. సరదాపడి యింకో రూపాయిస్తే పుచ్చుకో, కాని అడక్కు. వారు అదనంగా పదిరూపాయలు యిస్తానన్నారు కనక, మొత్తం పదహారే పుచ్చుకో. పొరుగూరి వారని మోసం చేశావా దేముడు క్షమించడు," సరంగుకి వార్నింగిచ్చాడు బైరాగి.
    ఏడవలేక వూరుకున్నాడు మన్మథం. కుక్క నోరుమూసి, పీక పిసికి గోదాట్లో పడేద్దామన్నంత కోపం వచ్చింది. జీవహింస పాపం అని గుర్తుకొచ్చి మానేశాడు.
    'నా మామ కుక్కనెందుకు పెంచాలి? పెంచినా ఆ కుక్క ఎందుకు యినాలి? యీనినా, కుక్క కావాలా అని మరదలు ఎందుకు రాయాలి? రాసినా, కుక్కను పెంచాలని సరదా నాకెందుకు పుట్టాలి? పుట్టినా శలవు చూసుకోకుండా, నేనెందుకు బయలుదేరాలి? దేరినా, ఆ కుక్కకి ఒక గొలుసు ఎందుకు కొనకుండా రావాలి? వచ్చినా, చంకలోని కుక్కను ఎందుకు జారవిడాలి? డాలినా, ఆ కుక్క జాడీని ఎందుకు పావనం చెయ్యాలి?... యిలా గొలుసుకట్టుగా ఆలోచించుకుంటూ... నిశ్శబ్దంగా గొంతును చించుకుంటూ తనని తనే ఆడిపోసుకుంటున్నాడు మన్మథం.
    కుక్క 'భౌ' మంది సానుభూతిగా.
    "ఛీ నోరుముయ్యి," అన్నాడు మన్మథం.
    మాబాగా అయింది అనుకుని, 'మే' అని నవ్వింది మేకపిల్ల.
    'ఛా! పాపం తప్పు,' అని 'మే మే' అంది నవ్వు బలవంతంగా ఆపుకుంటూ తల్లి మేక.
    "పళ్ళన్నీ చితికి ముద్దయిపోయినాయి," అంది తట్టలో పళ్ళు కెలుకుతూ అప్పాయమ్మ.
    నావ జనాభా యావత్తూ, మైనరుకేసి చూసింది - దీనికేం సమాధానం చెపుతావన్నట్టు.
    "ఒసేవ్‌ అప్పాయీ! సందాళ యింటికాడ కనబడు. తట్ట ఖరీదిచ్చేస్తాను," అన్నాడు మైనరు - జేబురుమాలతో పేంటు కంటుకున్న రసం తుడుచుకుంటూ.
    "ఆయ్‌. యీ పళ్ళన్నీ రసం పిండి, తాండ్ర చేసి, మీకే యిచ్చేస్తానులెండి," అంది. ముఖం చాటంత చేసుకున్న అప్పాయమ్మ చుట్టూ చిందిన రసాన్ని తట్టలోకి తోస్తూ.
    "అక్కరలేదు. అది కూడా నువ్వే అమ్ముకో," అన్నాడు మైనరు - వూదారత వొలకబోస్తూ.
    'వాళ్ళిద్దరి మధ్యనా ఎలాంటి కనెక్షన్లున్నాయో, మనకెందుకులే,' అనుకున్నారు నావ జనాభా.
    'ఈ రొంపిలోంచి బయటపడ్డానికి, యింకా పావుగంట పట్టచ్చు,' వాచీ చూసి అనుకున్నాడు మన్మథం.
    అవతల రేవు నుండి బయలుదేరిన నావ, యీ నావకి ఎదురయింది.
    "ఒరేయ్‌ పోలిగా - పోలిగా, డమాను దింపు, డమాను దింపు, గోసుకాడ చేరతా," అని పడవభాషలో కూశాడు అవతల నావ సరంగు.
    "ఓయ ఎహేస్‌. గోసుకాడికొద్దు. పయాలకాడికిరా - పయాలు కాడికి," అని పడవ భాషలో సమాధానం కూసి, తెడ్డుని రైతన్న కందించి, తెరచాప తాళ్ళు వదులుచేసి, తెరచాప దింపాడు పోలయ్య. అవతల నావ సరంగు కూడా తెరచాప దింపాడు.
    రెండు నావలూ తెడ్ల మీద దగ్గరకు చేరాయి. రెండిరటినీ తాళ్ళతో బిగించారు.
    బైరాగి లేచాడు. జాగ్రత్తగా అవతల నావలోనికి నడిచాడు. అవతల నావలో అతని స్థానం ఖాళీ చెయ్యబడిరది. తాపీగా చతికిలబడి, చరణం మొదలెట్టాడు. నావలో సంచలనం కలిగింది.
    అందరూ బొడ్లూ, కొంగుముడులూ తడుముకుని చిల్లర్లు వెతుకుతున్నారు.
    తాళ్ళు విప్పబడి నావలు విడిపోయాయి. కాస్త దూరం వెళ్ళాక, యధావిధిగా తెరచాపలు విచ్చుకున్నాయి.
    దూరం నుంచి 'వెళ్ళిపోతానోయ్‌,' అంటూ బస్సు కారుకూతలు కూస్తోంది.
    బస్సు దొరుకుతుందన్న ఆశ మన్మథానికి పూర్తిగాపోయింది. యీ ముష్టివెధవ కోసం మరో పావుగంట ఆలస్య మయినందుకు వొళ్ళంతా కంపరమెత్తిపోయింది.
    ఒళ్ళంతా పాకేసి, ఆ కంపరాన్నంతా నాకేసిందా కుక్కపిల్ల.
    'నేనంటే దీనికి ఎంత యిదో,' అని మురిసిపోయాడు మన్మథం.
    'దీనికేం పేరు పెట్టాలి చెప్మా,' అని ఆలోచించాడు. దాన్ని చేరదీయగానే జాడీని ఖరాబుచేసి, చేతి చమురు వదిలించింది కనుక, 'జాడీ' అని పేరు పెడదామనుకున్నాడు. 'ఛా! జాడీ అంటే బాగోదు. 'జార్‌ అని పేరు పెడదాం,' అనుకున్నాడు. "జార్‌," అని మెల్లిగా అన్నాడు. కుక్క క్రీగంటితో చూసి టపటపా తోకాడిరచింది. "జార్‌ జార్‌" అని రెండుసార్లు అన్నాడు. కుక్క ఛాతీపై కెగబ్రాకి, బుగ్గ నాకేసి ముద్దు పెట్టేసుకుంది. అయితే దీని పేరు 'జార్‌' అని ఖాయపరిచాడు మన్మథం.
    ఎట్టకేలకు నావ రేవు చేరింది. బస్సు హారను మోగుతోంది. రేవులోకి దూకబోయాడు మన్మథం.
    "బాబుగారూ ఆగండి," అన్నాడు సరంగు.
    నావలోని జనాభా యావత్తు రేవులోకి దిగుతున్నారు. మైనరు సైకిలు బెల్లు వాయిస్తూ గట్టెక్కుతున్నాడు.
    అతని వెనకాలే అప్పాయమ్మ వయ్యారంగా నడుస్తోంది.
    నాగమల్లి కొప్పు సవరించుకుంటూ నావ దిగింది. మైనరు బెల్‌బాటమ్‌ మీద రక్తం మరకలు చూసి కసిదీరా ఆనందించింది.
    చిట్టెమ్మ చీర దులిపి, గోచీ బిగించి, చుట్ట అంటించింది. పోలయ్య గడ్డిమోపు ఆమె నెత్తిమీద కెక్కించాడు.
    రైతన్న భుజానున్న తువ్వాలు దులిపి, తలపాగా చుట్టి, సూరమ్మకేసి కోపంగా చూసి గట్టు మీదకు దూసుకుపోయాడు. షావుకారు అంగవస్త్రం కుచ్చిళ్ళు బిగిస్తూ నడిచాడు.
    తల్లిమేక పడిచెక్క ఎక్కి వాటం చూసుకుని, గట్టు మీదకు దూకింది.
    పిల్లమేక కుక్కపిల్లని వెక్కిరించి, గట్టు మీదకు దూకబోయి, నోట్లోపడి నీళ్ళు దులుపుకొని పారిపోయింది సిగ్గేసి.
    "వస్తాను నాయనా, జాగ్రత్తగా వెళ్ళు," అంది శూర్పణఖ అప్పగారైన సూరమ్మ - మనసులో యింకో రెండు జాడీలు తెచ్చి కుక్కకి ముట్టించలేకపోయానని బాధపడుతూ.
    అందరూ వెళ్ళాక, "బాబుగారూ పదహారు రూపాయలివ్వండి," అన్నాడు సరంగు.
    చిర్రెత్తిపోయింది మన్మథానికి. 'ఏం ఎందుకివ్వాలి? నేనివ్వను. కావాలంటే ఈ ఐదు తీసుకో," అన్నాడు ఖచ్చితంగా.
    "అదేంటి బాబూ! పది రూపాయలిస్తామంటే కదా - కోసెడు దూరం నుంచి పడవ మళ్ళించాను. లేకుంటే పది నిమిషాలు ముందుగా చేరేవోణ్ణి యీ రేవుకి. యిచ్చెయ్యండి బాబు - పెద్దారు, మీకు మర్యాద కాదు!"
    "టిక్కెట్టుక్నొ నాకు రెండు నిమిషాలు లేటైతే, పదిరూపాయలా? మరి ఆ గుడ్డి నాయాలని, ఆ ఎదురైన పడవలోకెక్కించటం కోసం అరగంట చేశావు. దానికేం చెపుతావు?"
    "అయ్యబాబోయ్‌ అదేంటి బాబూ, యిస్తానన్నప్పుడు పెద్దతరంగా యిచ్చెయ్యాలిగాని, ఏరుదాటి పేచీ పెట్టడం ధరమం కాదు బాబూ."
    "ఏరా నా కొడకా - నేను ఆ ముష్టినాయాల కంటే తీసిపోయానుట్రా?"
    "అమ్మనాయనోయ్‌ నా కొంప ముంచేసారు. మీది పొరుగూరు కనుక నిజం చెప్పేస్తున్నాను. ఆరు మామూలు నాయాలు కాదండి. ఈ రెండు నావలూ ఆరివే. ఆరే ఈ రేవులో నావలన్నింటికీ ఓనరు. సందాళ ఈ డబ్బు యివ్వకపోతే, నా జీతంలో తెగ్గొడతాడు. పేదోడ్ని బాబూ," అని కాళ్ళట్టుకున్నాడు సరంగు.
    మన్మథరావు కొయ్యబారిపోయాడు.
    బస్సు బయలుదేరబోతూ కొట్టిన హారను వినబడలేదు.

                    

మరిన్ని సీరియల్స్