Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
fifty fifty story

ఈ సంచికలో >> కథలు >> లేవండోయ్

levandoy

 మూ డు రోజులనుంచీ లక్ష్మి నలతగా ఉంది.
ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు. మీరొక సారి డాక్టర్ గారిని తీసుకురండి. సరస్వతి  సంధ్యావందనం ముగించుకొన్న భాస్కరశర్మ వంక అభ్యర్థనగా చూసింది. లక్ష్మి మగతగా ఉంది. ఆహారం ముట్టి నాలుగో రోజు. "మీరు వావిళ్ళ వారింట్లో వ్రతం చేయించాలి తెలుసు కానీ "లక్ష్మిని నేను తీసుకెళ్ళలేను కదా!"
అంది సరస్వతి.వంటింట్లోకి వసారాలోకి తిరుగుతూనే వుంది. భాస్కర శర్మకు కూడా పాలుపోలేదు. ఏ డాక్టరు దగ్గరకు తీసుకుపోవాలో తనకైతే తెలీదు. కొత్తపల్లి సురేంద్రకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
"అట్టాగా సామే, నువ్వు సెప్పాలా,వుండుండు, ఆపాట్నే వస్తావుండా" అన్నాడు సురేంద్ర. ఐదేఐదు నిముషాల్లో భాస్కరశర్మ యింటిముందు వాలాడు. కానీ ఈలోగా ఎన్ని ఆలోచనలో.
***
లక్ష్మి భాస్కర శర్మ ఇంటికి వచ్చి మూడు నెలలు. వేదమంత్రాలు చదివి ఎంతో మంది చేత గోదానం చేయించారు శర్మగారు. యిదివరలో చాలామంది ఇవ్వగా గోదానం స్వీకరించారు. వాటిని ఇచ్చేసి డబ్బు స్వీకరించేవారు. కానీ మనమెందుకు ఒక గోవును పెంచుకోకూడదు అంది సరస్వతి. ఆ మాట నిజమే అని భాస్కరశర్మ లక్ష్మిని ఇంటికి తెచ్చాడు. గోవు ముఖానికి రోజూ అంత పసుపు, కుంకుమ రాసి అంత బొట్టు పెడితే లక్ష్మి కళకళ్లాడుతూ ఉండేది. విప్పారిన లక్ష్మి కళ్ళు - బాపు వేసిన సంక్రాంతి గ్రీటింగ్ లలో లాగా - కాటుక పెట్టినట్లు ఉండేవి. కొమ్ములకు కట్టిన చిరు గంటలు అది తల ఆడించినప్పుడల్లా ఘల్లుఘల్లు మంటూ సవ్వడి చేసేవి. మెడలో నీలం, తెలుపు పూసల దండలేసుకొని తోకెత్తి పరిగెడుతూ అంబా అని అరిస్తే - " ఆ జగజ్జనని ని ఆర్తిగా పిలుస్తోంది ఆ మూగ జీవి చూడు" అనేవాడు శర్మ గారి అబ్బాయి శేషఫణి శర్మ.లక్ష్మి రోజుకు ఎనిమిది లీటర్ల పాలిచ్చేది. ఇటీవల వరకూ బాగానే ఉండేది. నాలుగు రోజులుగా నలతగా వుంటోంది. పాలు ఇవ్వడం లేదు. నెమరు వేయడం లేదు. చలనం లేదు.
సురేంద్ర నేరుగా లక్ష్మి దగ్గరికే వెళ్ళాడు. సురేంద్ర పది పన్నెండు పాడి పశువులున్న ఆసామి. సురేంద్రకీ, ఆయన తండ్రి తరం నుంచీ శుభ కార్యాలకు శర్మగారే బ్రహ్మ. జ్వరం వుందేమోనని చూసాడు. జ్వరం లేదు. కంటివెంట నీళ్ళు కారుతున్నాయి. మూతి కదల్చడం లేదు. పశువుల పెంపకంలో మంచి అనుభవం వున్న సురేంద్రకి ఏమీ తోచలేదు. వెట్ర్నరీ డాక్టర్ వేణుగోపాల్ కి ఫోన్ చేసాడు.
"డాట్రూ మన పంతులు శర్మగారుళ్ళా! ఆయనీమద్దెన ఆవును పెంచుకుంటావుండాడ్లే, ఆ...! అదే అదే...ఎవురో దానం యిస్తేనూ ...దానికి సుస్తీ చేసి వుండాది. మీరు ఎట్టైనా రావాల.! తప్పదు...సార్..నాకు తెల్సు సార...మీరు ఈరోజే రిటైర్ అవుతాండారు. సాయంత్రం మీటింగుకు నేనూ వస్తా వుండా. ఏం అనుకోబాకండి. ఇబ్బందే కానీ ఇది అయ్యోరి ఆవు అయిపాయెనే. ఆయనకంటే ఆయన భార్య దిగులు పెట్టుకుని కూకుండినాది. టిఫిన్లేదు. వంటలేదు..పొయ్యి లేస్తేగదా...ఫోనుకి చెయ్యి అడ్డం పెట్టి చెబుతున్నాడు. ...డాట్రు వేణుగోపాలని మంచోడు. ఈవాళే రిటైర్ అవుతాండాడు. వేరే సిన్న డాక్టరుని అంపిస్తానంటే వొద్దెహే...నువ్వే రావాలని సెప్పినా..ఇంట్లో వాళ్ళకి సెప్తావుండాడు. ..వస్తాళ్ళే"   సరస్వతమ్మ వైపు చూస్తూ చెప్పాడు.
లక్స్మి పరిస్తితి వివరించాడు సురేంద్ర. అడ్రస్ కనుక్కొని నేనే వస్తానన్నాడు డాక్టర్ వేణుగోపాల్. దాక్టర్ వచ్చేలోగా "అమ్మా అంత కాఫీ పెట్టీ"అని స్వతంత్రంగా అడిగి కాఫీ తాగుతున్నాడు.
యిఘనేం కాదునే" అని ధైర్యం చెప్తూ సురేంద్ర.
***
బోలెరో లోంచి దిగిన డాక్టర్ గారికి శర్మ దంపతులిద్దరూ అభివాదం చేశారు. డాక్టరు వచ్చేలోగా సురేంద్ర తన అసిటెంట్లను పిలిపించి వసారా క్లీన్ చేయించాడు. ముందు రెండు వేప గుంజలు నాటి ఒక అడ్డగుజ కట్టించాడు. లక్స్మిని డాక్టర్ గారు పరిక్షించడానికి అనువుగా ఏర్పాట్లు చేశాడు.  సరస్వతమ్మకు చెప్పి రెండు బక్కెట్ల వేణ్ణీళ్ళు, సబ్బు, టవలు ఏర్పాటు చేయించాడు. డాక్టర్ వేణుగొపాల్ ఆవును పరీక్షగా దూరం నుంచే పరికించాడు. అనుభవం పండిన వైద్యుడికి రోగి లక్షణాలు ఇట్టే తెలిసిపోతాయి. లక్ష్మికి బాగా నలతగా వుంది. మూతి పెదాలు బాగా డ్రై గా వున్నాయి. కళ్ళనుంచి నీళ్ళు కారుతున్నాయి. లక్షిమిని పరీక్షించాడు. ప్రబ్లెం లంగ్స్ లో లేదు. గైనిక్ ప్రబ్లెం కూడా కాదు. జ్వరమూ పెద్దగా లేదు. వివరంగా అడిగితే ఆహారం మానేసి నాలుగు రోజులూ, నెమరు వేసి మూడు రోజులూ అయ్యిందనీ నీళ్ళు కూడా ముట్టడం లేదనీ చెప్పారు. పొట్ట బాగా ఉబ్బరంగా వుంది. ఎడమ వైపు కాస్త స్వెల్లింగ్ వుంది. "చాలా రోజులు తిన్నది ఏదీ జీర్ణం అయినట్లు లేదు. ఇంఫాక్షన్ వుందయ్యా!సర్జరీ చేయాలి" అన్నాడు.
"డాట్రూ, పొడిమందు, మాత్రలూ ఏవైనా ఇస్తే సరిపోదా"ఆదుర్దాగా అడిగాడు సురేంద్ర. "లేదండీ...ఇది ఇంఫెక్షన్ కాదు. యింఫాక్షన్ అంటే తిన్నది అంతా కదలక అలాగే జాం పాక్డ్ గా వుండిపోవడం. ఈ పరిస్తిలో సర్జరీ ఒక్కటే మార్గం. మీరు సరే అంటే ...డాక్టర్ శర్మ వంక చూశాడు. సరస్వతి తల్లడిల్లింది. నోటికి ఘూద్దా అడ్డం పెట్టుకుని లోనికి పరిగెత్తింది. దు:ఖం ఆపికొంటూ శర్మగారు తల దించుకొన్నాడు దిక్కు తోచక. సురేంద్ర తలపాగా వదులు చేసి భుజమ్మీద వేసుకున్నాడు. పెంపుడు జంతువు మీద ప్రేమ అలాంటిది. మూగజీవి మౌనంగా బాధను అనుభవిస్తోంది. శర్మకి ధైర్యం చెప్పాడు డాక్టర్ వేణు. "ఏం కాదు పంతులుగారూ..నేనున్నాగా" హామీ ఇచ్చారు. చేయగలిగింది లేక సరస్వతీ సరేనంది కళ్ళు తుడుచుకొంటూ.
డాక్టర్ వేణు తనతో తెచ్చుకున్న పరికరాలన్నీ ఓ వైపు టేబుల్ వేయించి పెట్టుకున్నాడు. తలకు కాప్, మెడకు ఆప్రస్, చేతికి గ్లోవ్స్, వేసుకొన్నాడు. ఎడమ డొక్కలో నొక్కి చూసి ఎక్కడ కోత కోయాలో నిర్దారించుకున్నాడు. మొదట డొక్క మీద వెంట్రుకలన్నీ క్లీన్ గా షేవ్ చేసాడు. సోప్ వాటర్ తో కడిగి శుభ్ర పరచి స్పిరిట్ అప్లై చేశాడు. నొప్పి తెలియ కుండా ఇంజక్షన్ చేశాడు. స్టెరిలైజ్ చేసిన పరికరాలన్నీ సిద్ధంగా వున్నాయి. తదుపరి పని పూర్తి చేయడానికి డొక్క నిలువుగా ఆరు అంగుళాలు కోశాడు వేణు. పై స్కిన్ కట్ చేసి రక్తాన్ని తుడుస్తూ తర్వాత కండరాల్ని కత్ చెసి లోపలి భాగాల్ని పరిశీలించాడు. జీర్ణకోశం బాగా ఉబ్బిపోయి ఉంది. లోనికి చెయ్యి  పట్టి గట్టిగా లాగి పట్టి బయటకు తీశాడు. జీర్ణాశయం చూసిన డాక్టర్ వేణుగోపాల్ ఒకాసారి షాక్ కి గురైనాడు. ఎన్నో సర్జరీలు చేసాడు. తన 35ఏళ్ళ అనుభవం లో కానీ ఎన్నడూ ఎదురుకాని అనుభవం. లోన చెయ్యిపట్టి బయటకు లాగేసాడు. పొట్టనిండా క్యారీ బ్యాగ్ లు.!ప్లాస్టిక్ సంచులు. !! పాన్ పరాగ్ ప్యకెట్లు. షాంపూ సాచెట్లు...కుక్కుకొని పోయి ఉన్నాయి. లాగుతుంటే వస్తూనే వున్నాయి. బయటకు లాగి పక్కకు పడేసిన కుప్ప - వీధి చివర చెత్తకుప్పలాగుంది.
ఒకవైపు సర్జరీ చేస్తూ చెబుతున్నారు డాక్టర్ వేణుగోపాల్,  అక్కడ చేరిన జనాల వైపు చూస్తూ - " చూడండి, ఆవు, గేదె ఏదైనా- దాని పొట్ట కెపాసిటీ నలభై కేజీలుంటుంది. పశువు గడ్డి ముందు తిని మళ్ళీ నోట్లోకి తెచ్హుకొని నెమ్మదిగా నెమరు వేస్తుంది. ఎప్పుడూ దాని కడుపులో కనీసం పది కేజీల గడ్డి వుండాలి. దీని పొట్టలో అరకిలో గడ్డికూడా లేదు. మొత్తం నలభై కేజీలూ క్యారీ బ్యాగులూ, ప్లాస్టిక్ సంచులూ, షాంపూ పాకెట్లే ఉన్నాయి. "విచారం వెలిబుచ్చాడు. లోనుంచి నిరోధ్ పాకెట్లనూ తీస్తూ.
"ప్రజల నిర్లక్ష్యం పశువులకు ప్రాణాంతకమౌతుంది. " ఇకనైనా పట్టించుకోండి. మారండి. ప్లాస్టిక్ వినియోగం మానండి...."చెప్పసాగాడు. ఆవు కడుపు మొత్తం ఖాళీ చేసేసి అందులో ఐదు కిలోల గడ్డి సన్నగా ముక్కలుముక్కలుగా చేసి నీళ్ళు చల్లి దాన్ని - ఆవు జీర్ణాశయం లో పెట్టి కుట్లు వేశాడు. మరో పది నిముషాల్లో ఆపరేషన్ ప్రక్రియ, డ్రెస్సింగ్ పూర్తి చేసాడు.వేయాల్సిన మందులూ రాసిచ్చాడు.
అక్కడ గుమికూడిన వారంతా గోవు వంక జాలిగా చూసారు. నీకంతటి కష్టం మావల్లనే కదా అని కొందరూనుకొంటే, - మేమిక ప్లాస్టిక్ వాడబోమని గట్టి నిర్ణయం తీసుకున్నారు కొందరు. డాక్టర్ ఆపరేషన్ చేసి చేతులు కడుక్కొనేసరికి అక్కడికి చాలామంది ప్రజలూ, విలేకరులూ, టీవీవాళ్ళూ చేరుకొన్నారు. ఫోటోలు తీస్తున్నారు. డాక్టర్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు.
"డాక్టర్ గారూ, చెప్పండి. మీరు ఈ ఆపరేషన్ చేసి దాదాపు నలభై కిలోల క్యారీ బ్యాగులు, సంచులూ తీసారు కదా, ఇది ప్రజా నిర్లఖ్యంగా పరిగణించాలా!ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా! ఏవిధంగా అర్థం చేసుకోమంటారు"వాళ సహజ ధోరణిలో అడిగారు.
"క్యారీ బ్యాగులూ,ప్లాస్టిక్ సంచులూ వాడకం మానాలి. ఇది పశువులకే కాదు, మానవాళికీ మంచిది కాడు. మీరు కూరలు క్యారీ బ్యాగ్ లో తెస్తారు. కూరలు తరిగిన చెక్కులూ, తొక్కలూ, క్యారీ బ్యాగ్ లలో పెట్టి వీధిలోకి విసిరేస్తారు. అపార్టుమెంట్లలో అయితే పై ఫ్లోర్ నుండే మిగిలిపోయిన అన్నం, కూరలూ చికెన్ ముక్కలూ, అన్నీ కలగలిపి క్యారీ బ్యాగుల్లో ముడివేసి మరీ విసిరేస్తారు. వాటిలోని ఆహార పదార్థాల కోసం పశువులు వెంపర్లాడతాయి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లు వేరు చేసి తినాలనే తెలివి పశువులకు లేదు. ప్లాస్టిక్ బ్యాగ్ లలో అలా పారేయకూడదనే తెలివి మనకు లేదు. అలా తిన్న ఆహారం అరిగిపోగా, ప్లాస్టిక్ బ్యాగ్ లూ, సాచెట్లూ అలాగే వుండిపోతాయి. "గమనించండి. ఈ కుప్పలో అన్ని బ్రాండ్ల షాంపూ పాకెట్లూ, అన్నిరకాల పాన్ పరాగ్ ప్యాకెట్లూ నిరోధ్ లూ ఉన్నాయి " అని చెప్పగానే అందరూ నవ్వుకొన్నారు.
" ఈ ఆపరేషన్ చేసిన ఆవు మళ్ళీ మామూలుగా గడ్డి తింటుందా?" అని ఒక విలేకరి ప్రశ్నించాడు. "రెండు మూడు రోజుల్లో మళ్ళీ మామూలుగా గడ్డి తింటుంది. బేసిక్ గా పశువులకు ప్లాస్టిక్ నచ్చదు. కానీ ఒక్కసారి తిన్నాక అది అడిక్ట్  అయ్యే ప్రమాదమూ ఉంది. అందుచేత పశువులకు ప్లాస్టిక్ సంచులను దొరకకుండా చేయడంలోనే వుంది అందరి బాధ్యత. పశువులను పోషించేవారుకూడా పశువులనువిచ్చలవిడిగా వీధిలోకి వదిలేయకుండా కాపాడుకోవాలి."అని సూచించారు. మరి ఇంత ప్రమాదమైతే- ప్లాస్టిక్ వాడకాన్ని , తయారీని ప్రభుత్వం ఎందుకు నిరోధించదూ?మరో విలేకరి ప్రశ్న. "ప్రభుత్వం చట్టం చేసి వదిలేస్తుంది. చట్టం అమలయ్యేలా చూడ్డం అధికారుల బాధ్యత. సామాజిక స్పృహతో మనుషులుగా మెలగడం మనందరి బాధ్యత "అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ వేణుగోపాల్.
***
భాస్కరశర్మగారు ఆనాటి సాయంత్రం డాక్టర్ గారి రిటైర్మెంట్ సభలో వేద మంత్రాలు చదివి, శాలువతో సత్కరించి అశీర్వచనం పలికారు.
"డాక్టర్ గారూ, మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా పశు సన్రక్షణకి మీ సేవలు అంద్దించాలి!"అని తోటి డాక్టర్లూ, డైరెక్టర్ గారూ కోరారు.
ఆయన " నో" అనడంతో అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు. "సర్వీస్ లో వున్న మీరు ఆబాధ్యత స్వీకరించండి. నేను ఇకపై మనదేశం లో ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా గట్టి ఉద్యమం లేవనెత్తి నోరు లేని మూగజీవాలన్నిటి కోసం పోరాడుతాను!" అని ప్రకటించగానే సభాస్థలిలో చప్పట్లు మారుమోగాయి.!!!

మరిన్ని కథలు
evaru vikalangulu