Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Krishna Chaitanya

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం - 'నిర్మాతృదేవోభవ'

Aditya Hrudayam

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లక్ష్మీదేవి దర్శనం చేసుకొని హోటల్ రూమ్ కి వచ్చి నిర్మాతల గురించి ఈ కాలమ్ రాయడం కాకతాళీయమే అయినా, నాకు బావుంది.

సినిమా తీసే ప్రతి నిర్మాతకీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనసారా ప్రార్ధిస్తున్నాను.

ఇప్పుడు చిత్ర నిర్మాణ పద్ధతులు చూస్తే షూటింగ్ పూర్తయ్యేవరకు ఓ నిర్మాత గాని, ప్రొడక్షన్ టీమ్ గాని అస్సలు అవసరం లేదు, ముందులాగ. కాస్త ఫైనాన్స్ ఉంటే చాలు.

రిలీజు, డిస్ట్రిబ్యూషన్, థియేటర్స్ పద్ధతులు చూస్తే నిర్మాత ఉన్న కూడా చేయగలిగిందేమీ లేదు. సో, ఏ రకంగా చూసినా తెలుగు సినిమాకి ఇవాళ నిర్మాతతో పనిలేదు. ఇలాగే కొనసాగితే, కొన్నేళ్ళ తర్వాత డైనోసారస్ జాతిలాగ నిర్మాత అనే వాడు ఉండేవాడట మన సినిమాలకి అని చెప్పుకోవాల్సివస్తుంది.

30 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకి కనీసం 2000 పైచిలుకు థియేటర్లు ఒకేసారి రిలీజ్ రోజు దొరికితే తప్ప సక్సెస్, ఫ్లాప్ కి సంబంధం లేకుండా ఆ డబ్బు బ్రేక్ఈవెన్ అవ్వదు, తెలుగులో.

చిన్న సినిమాలకి అంత  బడ్జెట్ ఉండదు కాబట్టి, వాటికి ధియేటర్ల నుంచి ఎటువంటి డిమాండ్ ఉండదు - రిలీజై ఆడితే డబ్బు రావడమే తప్ప - ఆడకపోతే 100 శాతం లాసే.

ఈ మొత్తం ఈక్వేషన్ లో కథ, కథని బట్టి దర్శకుణ్ణి ఎంచుకోవడం, దర్శకుణ్ణి బట్టి బడ్జెట్ నిర్ణయించుకోవడం, దాన్నిబట్టి కథానాయకుడ్ని, నాయికని ఫిక్స్ చేసుకోవడం లాంటి ప్రాథమికమైన నిర్మాతల పనులు అటకెక్కేశాయి.

నేను పనిచేసిన శ్రీ బి. వెంకట్రామిరెడ్డి గారు - తెలుగు సినిమా తీయడానికి వెనుకంజ వేస్తూ, తమిళంలో చేస్తున్నారు. డాక్టర్ డి. రామానాయుడు గారు సినిమా తీయడం కోసం ఇంటా, బైటా ఒంటరిపోరాటం చేస్తున్నారు. వారబ్బాయి శ్రీ సురేష్ బాబు నిర్మాణం స్పీడు తగ్గించారు. వేరే నిర్మాతలతో చేరో, ఆర్థికసాయం చేసో నిర్మాణం చేస్తున్నారు. డాక్టర్ కె. ఎల్. నారాయణ, ఎస్. గోపాలరెడ్డి గార్లు చాలా కాలమైంది వారు నమ్మిన ఒక సినిమా తీసి. శ్రీ బూరుగుపల్లి శివరామకృష్ణ గారు ఎనిమిదేళ్ళ విరామం తర్వాత మళ్ళీ రవితేజ గారి డేట్స్ దొరికేవరకు సినిమా తీయలేదు. శ్రీ కె. అశోక్ కుమార్ గారు ప్రభాస్ లాంటి పెద్ద హీరోని పరిచయం చేసిన 'ఈశ్వర్' తర్వాత నిర్మాణం విరమించుకొని గృహ 'నిర్మాణం'లో పడ్డారు. అంజనా ప్రొడక్షన్స్ అధినేత శ్రీ నాగబాబు నిర్మాణం కన్నా నటనకే ప్రాధాన్యమిచ్చి బిజీ అయ్యారు. శ్రీ అశ్వనీదత్ గారు వరుసగా సినిమాలు తీస్తున్నా, హీరోల మీద, దర్శకుల మీద ఆధారపడే పరిస్థితే తప్ప ఆయన నిర్ణయించి సినిమా తీసి చాలా ఏళ్ళే అయ్యింది. ఈ నిర్మాతలంతా నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అన్నం పెట్టినవాళ్ళు.

ఇక, నేను దర్శకుణ్ణయ్యాక, శ్రీ ఎమ్మెస్ రాజు గారు నిర్మాణాన్ని పక్కనపెట్టి దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. బూరుగుపల్లి శివరామకృష్ణ గారి గురించి పైన చెప్పాను - కామాక్షి మూవీస్ శివప్రసాద్ రెడ్డి గారు నాగార్జున గారి పుణ్యమా అని వరుసగా సినిమాలు తీస్తున్నప్పటికీ ఆయన కష్టసుఖాలేంటో బైటికి తెలిసే అవకాశం లేనందున ఆయన్ని ఉదహరించలేను. డాక్టర్ డి. రామానాయుడు గారి గురించి మాట్లాడుకున్నాం.

ఇలా పేరున్న ప్రతి నిర్మాణ సంస్థ కథని కాక కాంబినేషన్ ని మార్కెట్ చేసుకునే పరిస్థితి రావడం వల్ల కాంబినేషన్ క్రేజ్ రెమ్యునరేషన్ తో పెంచగలిగిన బండ్ల గణేష్ గారు, బెల్లంకొండ సురేష్ గారు, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి కొన్ని సంస్థలు మాత్రం ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయి. ఈ పద్ధతిలో వాళ్లెన్నాళ్ళు  పరిశ్రమని ముందుకు నడిపించగలరన్నది ప్రశ్నే!

ఓ పక్క టెలివిజన్, ఓ పక్క ఇంటర్నెట్, ఇంకో పక్క డబ్బింగ్ సినిమాలు, మరో పక్క పెరిగిన టిక్కెట్ రేట్లు, టాక్సులు, నిర్మాణ వ్యయం, ధియేటర్ల రెంటు ఇన్నింటిని తట్టుకుని, సినిమాని ప్రేమించడం, నమ్మడం, అమ్మడం ఇవ్వాళ నిర్మాతకి కష్టమే. స్వంత పంపిణీ సంస్థ (డిస్ట్రిబ్యూషన్) ఉంది కాబట్టి శ్రీ దిల్ రాజు గారు కొన్నిసార్లు కథని, కొన్నిసార్లు కాంబినేషన్ని నమ్ముకుని జోడెడ్ల సవారీ చేయగలుగుతున్నారు. అదర్ వైజ్ సినిమా తీసిన ప్రతి నిర్మాతకీ పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలంటే, ప్రతిసారీ సిరి మీడియానో, మల్టీ డైమెన్షన్సో, దిల్ రాజు గారో, అల్లు అరవింద్ గారో, రామోజీరావు గారో, సురేష్ బాబో ఎవరో ఒకరు డబ్బిచ్చి కొనాలి అంటే వాళ్ళకి మాత్రం కష్టమే కదా! వాళ్ళొదిలేస్తే నిర్మాతలకి తీరని నష్టమే కదా! అందుకే, నిర్మాతలకి దణ్ణం పెట్టి దర్శకులు, నటీనటులు, ప్రొడక్షన్ మేనేజర్లు, వివిధ శాఖల వాళ్ళు, వాళ్ల పరిచయాలతో షూటింగ్ పని కానిచ్చేస్తున్నారు. అమ్మకానికి వచ్చేసరికి డీలా పడిపోతున్నారు. ఎక్కడో ఓ శేఖర్ కమ్ములో, ఓ మారుతినో అలా లాభపడ్డారు గానీ - మిగిలిన చాలామంది, నాతో సహా, నష్టాలే చవి చూశారు.

నిర్మాతలు కావాలి! మళ్ళీ నిర్మాణ సంస్థల హవా కావాలి! మళ్ళీ తెలుగులో ఏడాదికి 193 సినిమాలు రిలీజవ్వాలి (!?!).. అప్పుడే అందరికీ పని దొరుకుతుంది. క్రియేటివ్ ఫ్రీడమ్ కి నిర్మాత అనే క్వశ్ఛన్ చేసే కెపాసిటీ ఉన్నవాడు ఉండాలి. అప్పుడే సినిమా క్వాలిటీ పెరుగుతుంది. అప్పుడే పరిశ్రమ బైట సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. ఆరు నెలలు రోజూ అరవై మందికి అన్నం పెట్టే తల్లి - నిర్'మాత'.

అటువంటి నిర్మాతకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను.

ఈ కాలమ్, పరిశ్రమని నా కళ్ళతో చూసి, నా మెదడుతో కొలిచే ప్రయత్నమే తప్ప,
ఇదే నిజం కాకపోవచ్చు - ఇదే అందరి అభిప్రాయం కాకపోవచ్చు-
నచ్చని వాళ్ళు క్షమించండి.

వచ్చేవారం.. "నిను వీడని నీడను నేనే". 

మరిన్ని సినిమా కబుర్లు
Raja Music Muchchatlu