Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Bannu - Cartoonist

ఈ సంచికలో >> సినిమా >>

కృష్ణ చైతన్య తో ఇంటర్వ్యూ

తొలి అడుగే సింగిల్ కార్డ్ తో మొదలయ్యే అదృష్టం పాటల రచయితలకి తక్కువ. అప్పుడెప్పుడో సముద్రాల సీనియర్, దేవులపల్లి , తర్వాతి తరంలో సినారె, సీతారామ శాస్త్రి ....  ... ఇలా తరానికొక ఉదాహరణలా 'సంభవామి తరే తరే'  లాంటి సరదా ప్రయోగం చెయ్యడం కోసమే అన్నట్టుగా వర్తమానంలో కృష్ణచైతన్య ... ఎందుకంటే ఆయన 'సంభవామి యుగే యుగే' సినిమాలో అన్ని పాటలూ రాయడం ద్వారా తన కెరీర్ మొదలుపెట్టాడు కనుక.

నిజానికి అతను పాటలు రాయడం 8 th స్టాండర్డ్ లో వుంటుండగానే మొదలు పెట్టాడు. చెన్నై లో ఇంజనీరింగ్ పూర్తి చేసే లోగానే ప్రముఖ నిర్మాత వాకాడ అప్పారావు గారబ్బాయి శశి తో  ఫ్రెండ్ షిప్ మూలంగా సినిమా పరిచయాలు ఏర్పడ్డాయి. అలా 'గమ్యం' సినిమాకి సంగీతాన్నిచ్చిన అనిల్ తో  స్నేహం 2003 కుదిరింది.

"అనిల్ నాకు చాలా మెళకువలు నేర్పాడు. పాటకి ఓపెనింగ్ బావుండాలి. హుక్ లైన్ వుంటే ఇంకా బాగా నాటుకుంటుంది లాంటివెన్నో చెప్పేవాడు "  అన్నాడు కృష్ణచైతన్య - అనిల్ ని తల్చుకుంటూ.  " అవి నాలో బాగా హత్తుకున్నాయి. చెన్నై లోనే  వుండేవాణ్ణి కనుక కరుణానిధి నుండి వైరముత్తు వరకు అందరి పాటలూ గమనించే అవకాశం వచ్చింది.  60-70 మధ్య వచ్చిన సినిమా పాటల్లో కవిత్వం వుండేది.  70-80 టైమ్ లో కొంచెం ప్రోజ్ ఎంటరయింది.  90 కి వచ్చేసరికి సైన్స్ , లాజిక్ కలిసి చోటుచేసుకున్నాయి - ఉదాహరణకి  ' టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా' లాంటివి . "

" సో ... మనం అప్ డేట్ అవుతుండాలన్న మాట అనుకున్నాను. జవేద్ అఖ్తర్ గారు ఓ మంచి మాటన్నారు - మనసు, తపన, హృదయం, నువ్వు, నేను లాంటి మాటలేవీ లేకుండా  రాయగలిగితే అదో గొప్ప ప్రేమ పాటవుంది - అని .  ఆ మాటల ప్రభావం తో 'సంభవామి యుగే యుగే' లో 'వేల వేల కాంతులన్ని' పాట రాశాను. ఇంకో విషయం ఏమిటంటే ఆ సినిమా డైరెక్టర్ రవివర్మ ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా పాటలు కావాలన్నారు. అది చాలెంజింగ్ గా తీసుకుని 'సంభవామి యుగే యుగే' లో పాటలన్నీ ఇక్క ఇంగ్లీష్ పదం కూడా వాడకుండా రాశాను. ఈ పాటలన్నీ మ్యూజిక్ చార్ట్ స్ లో 11 వారాల పాటు నంబర్ 1 ప్లేస్ లో వుంటూ వచ్చాయి. తీరా చూస్తే పిక్చర్ డిజాస్టర్. భయంకర మైన డిప్రషన్ లోకి నెట్టేసింది నన్ను. "

"ఆ రోజు మార్చ్ 10, 2005. మా ఫాదర్ ఫస్ట్ టైమ్ నన్ను పిలిచారు. ఆయన రణధీర్ అనే పేరుతో కథలు రాసేవారు. అసలు పేరు పుణ్యమూర్తుల వెంకట  విశ్వ సుందర్రావు. ఆయన టైమ్ లో కథలు రాసుకోవడం ఆ  విధానం వేరు, ఆ ఆలోచనలు వేరు, ఇప్పుడు ట్రెండ్ వేరు అనే అభిప్రాయం వుండేది నాకు.  అదే ఫీలింగ్ తో ఆయన దగ్గరకి వెళ్ళాను. "ఎలా వుంది సినిమా ? " అని అడిగారు. "నాకు నచ్చలా " అన్నాను. "ఎక్కడ నచ్చలేదు ? " అంటూ అడిగారు. " అసలు ఎక్కడా నచ్చలేదు" అన్నాను. "పోనీ ..నీకు నచ్చిన సినిమా ఏది ? " అన్నారు . "శివ" అన్నాను. "అందులో క్రూరుడైన విలన్ ని చంపడానికి ఎంత టెన్షన్ బిల్డప్ చేశారు ? మనిషి ప్రాణానికున్న విలువ అటువంటిది. వాడు క్రూరుడే కావొచ్చు అంత టెన్షన్ బిల్డప్ చెయ్యడం వల్ల వాణ్ణి చంపడం కరక్టే అనిపిస్తుంది. మానవ సంబంధాలకున్న ఇంపార్టెన్స్ అంత బలమైనది.  మరి మీరు ? చావు ఓ పెద్ద విషయమే కాదన్నట్టు ఓ గన్ తీసుకుని పటపట  పేల్చుకుంటూ పోయారు. పుట్టుక నుంచి చావు వరకు ఏం చూపించినా మానవ  సంబంధాలకు విలువ ఇవ్వకపోతే రిజల్ట్ ఇలాగే వుంటుంది. " అన్నారు.

"మైండ్ అంతా షఫిల్ అయిపోయింది ఆయనకున్న క్లారిటీకి.   ఆ తర్వాత  మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ పిలిచి 'నిన్న నేడు రేపు' అనే సినిమాకి ఓ రెండు పాటలు రాయించాడు. ఆ సినిమా కూడా  పోయింది. ఆదే టైమ్ కి ఓహియో స్టేట్ యూనివర్శిటీ లో నాకు స్కాలర్ షిప్ తో పాటు ఎడ్మిషన్ వచ్చింది. ఇవన్నీ వదిలేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళితే తిరిగి రానేమోనన్న రీజన్ తో వీసా రిజెక్ట్ అయింది. అప్పటికే సర్టిఫైడ్ టెస్ట్ ఇంజనీర్ గా నేను గురించబడ్డాను. దాంతో వాల్యూ మైన్స్ కంపెనీలో సీనియర్ టెస్ట్ ఇంజనీర్ గా జాయిన్ అయి ఓ 6 నెలలు పని చేశాను.   "

" కానీ నా ఆలోచనలన్నీ ఇటువైపే సాగేవి. ఈ లోగా ఓ బ్రేక్ వచ్చింది. 'బాణం' డైరెక్టర్ దంతులూరి చైతన్య మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారికి మంచి ఫ్రెండు. అతను నన్ను మణిశర్మ గారికి ఇంట్రడ్యూస్ చేశాడు - పాటలు రాస్తానని.  మణిశర్మ గారు నాకొక పరీక్ష పెట్టారు. "నీకు నాలుగు ట్యూన్ లు ఇస్తా ... నాలుగిటికీ నాలుగు పాటలు రాయాలి. ఒక్కటొక్కటిగా కాకుండా నాలుగూ ఒకేసారి వినిపించాలి. నచ్చితే ఈ సినిమా తో పాటు ఫ్యూచర్లో కూడా రాయిస్తా. నచ్చకపోతే ఇంకొకరితో రాయించుకుంటా " అని నాలుగు ట్యూన్ లు ఇచ్చారు.

అలాగే నాలుగు పాటలు రాసుకొచ్చాను. అన్నీ నచ్చాయి మణిశర్మ గారికి. దాంతో మరో పాట కోసం సిట్యుయేషన్ క్రియేట్ చేయించి ఇంకో పాట కూడా  నాతో రాయించారు. అలా మణిశర్మ గారి సంగీతం లో 'యువత' సినిమాకి సింగిల్ కార్డ్ పడేసరికి అవకాశాలు వరసగా రావడం మొదలు పెట్టాయి"

" తిరిగి అవకాశాలు వచ్చినప్పుడు ఇంత కాంపిటీషన్ మధ్య మీ ప్రత్యేకతని ఎలా నిలబెట్టుకున్నారు ?"
" నిజమే ... ఒకవైపు  శాస్త్రి గారు తెలుగులోనే అద్భుతమైన ఎక్స్ ప్రెషన్ల తో రాస్తున్నారు. మరో వైపు బోస్ గారు, విశ్వ గారు ఇంగ్లీష్ ని , మిగిలిన భాషల్ని కలుపుకుంటూ సక్సెస్ ఫుల్ గా ప్రయోగాలు చేస్తున్నారు. భాస్కరభట్ల గారు మాస్ పాటల్లో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నారు. రామజోగయ్య గారు ప్రతిపాట లోనూ మంచి మంచి  ఎక్స్ ప్రెషన్లు చూపిస్తున్నారు. ఇవన్నీ గమనీంచి 70-80 విదేశీ భాషల్లో కొన్ని బేసిక్ పదాల్ని నేర్చుకున్నాను. అది 'ఓయ్' సినిమాలో  'శెహరీ' అనే పాటకి ఉపయోగపడింది."

"ఆ పాటకి మీతో పాటు సురేంద్రకృష్ణ పేరు కూడా టైటిల్స్ లో వుంది కదా ?"
" అవును ... పల్లవి ఆయనది. చరణాలు, 'శెహరీ' అనే హుక్ లైన్ నావి "

" ఇంతకీ 'శెహరీ' అంటే ఏంటి ? అది ఏ భాష ? "
" నైరోబీ లో స్వాహలీ భాషకి చెందిన పదం అది. శెహరీ అంటే సెలెబ్రేషన్స్ అని అర్ధం. దాన్ని లెటజ్ సెలబ్రేట్  అని అర్ధం వచ్చేలా వాడాను. "

" ఇదెవరు చెప్పారు మీకు ?"
"మా అక్క వాళ్ళ తోటికోడలు నైరోబీలో వుంటారు.  ఆవిడ దగ్గర నేర్చుకున్నాను "

" ఆ తర్వాత ?  "
" ఆ తర్వాత ఎవరైనా ఎపుడైనా, బాణం, సోలో, లీడర్ సినిమాల్లో రాసే చాన్స్ వచ్చింది ."

" లీడర్ లో రాసినట్టుగా ఎక్కడా లేదే ... ఏ పాట రాశారు ?"
" సినిమా మధ్యలో ప్రియా ఆనంద్ ఊహించుకుంటూ వుంటే ఆమె మీద 'జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడేమో' అనే ఓ రెండు లైన్లు వినిపిస్తాయి. అక్కడ ఓ పాట వుండాలి. అది నేనే రాశాను. సినిమాలో తీసేశారు"

" ఎందుకు తీసేశారని అడగలేదా ? "
"లేదు"

"శేఖర్ కమ్ముల నిబద్ధత, మోరల్ వాల్యూస్ ఉన్న దర్శకుడు కదా మీరు అడిగితే కారణం చెప్పేవారేమో ... !?"
"ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ ప్రోడక్ట్ ముఖ్యం. 24 క్రాఫ్ట్ ల్లో నాది ఒక క్రాఫ్ట్ మాత్రమే. ఆయన బాధ్యత 24 క్రాఫ్ట్ లని సమానంగా చూసుకోవడం. ఏది ఎక్కువ అయితే అక్కడ కట్ చేసే అధికారం ఆయనకుంటుంది. అడగడం వల్ల ఇబ్బంది పెట్టినట్టుందే తప్ప ప్రయోజనం లేదు. నా మొదటి సినిమా  'సంభవామి యుగే యుగే' దగ్గిర్నుంచి చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినవాణ్ణి కనుక ఆయన్ని అర్ధం చేసుకోగలను."

" అసిస్టెంట్ డైరెక్టర్ గా సంపాదించిన అనుభవం మిమ్మల్నిప్పుడు డైరెక్టర్ ని చేసిందనుకోవచ్చా ? లేక ఇంకేదైనా ప్రేరణ వుందా ? "
" వీటన్నికంటే ముందు చాలా కాలం క్రితం ఆంధ్రా యూనివర్శిటీ వారు షార్ట్ ఫిలింస్ మీద ఓ పోటీ నిర్వహించారు.  దాదాపు 80-90 కాలేజీలు పాల్గొన్నాయి. మా చెల్లెలు పేరు మీద ఓ షార్ట్ ఫిలిం తీసి పంపాను. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దర్శకుడిగా నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని  పెంచిన సంఘటన అది. "

" ఇప్పుడు డైరెక్ట్ చెయ్యబోతున్న సినిమా వివరాలు ఏంటి ?"
" నారా రోహిత్ హీరో . ఈ ఆగస్ట్ లో షూటింగ్ ప్రారంభించి 2014 సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేస్తాం.  'స్వామి రారా' సినిమా నిర్మాతలే ఈ సినిమాకీ నిర్మాతలు. "

"స్వామి రారా సినిమాలో మీరు రాసిన ఓ పాట లో ఓ లైన్ మూడు సార్లు రాయాల్సివచ్చినట్టుంది ? "
"అవును. ఆ సినిమా దైరెక్టర్ సుధీర్ వర్మ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచీ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరం  డైరెక్టర్ పరుశురామ్ దగ్గర అసోసియేట్స్ గా కలసి వర్క్ చేశాం కూడా.   అందులో 'కృష్ణుడి వారసులంతా' అన్నది మొదట రాసిన వాక్యం. సెన్సార్ వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో 'కృష్ణుడి కే ఇది వింత' అని మార్చాం. ఇదే అన్ని చోట్లా వినబడుతుంది. దీనికీ సెన్సార్ వాళ్ళు ఒప్పుకోలేదు. 'అసలు కృష్ణుడి ప్రసక్తే వద్దు . ఏదైనా ఓ వర్గం మనో భావాలు దెబ్బ తినే  అవకాశం వుంది" అన్నారు. చివరికి "తస్కర తనయులంతా' అని రిప్లేస్ చేశాం. ఇదే సినిమాలో వినబడుతుంది"

" రైట్ ... నేను అడగనిది,  మీకుగా మీరు చెప్పాలనుకున్నది ఏదైనా వుందా ?"
"వుంది  ... కొన్ని కోట్ల సంవత్సరాల ఈ సృష్టిలో ఒక జన్మలో మనిషి గట్టిగా బ్రతికేది 60 ఏళ్ళు. ఈ 60 ఏళ్ళలో  పడతాం. లేస్తాం. కానీ నచ్చింది చేస్తే నిలబడతాం.  అదిచ్చే  ఆనందం గ్రేటెస్ట్ గా వుంటుంది. ప్రస్తుతం నేను నాకు నచ్చిందే చేస్తున్నాను. "

"ఐతే మీకింకో విషయం చెప్పదలుచుకున్నాను. మాటల రచయితలు, కథా రచయితలు దర్శకులయ్యారు గాని దర్శకులైన పాటల రచయితలు అరుదు. సముద్రాల సీనియర్ వినాయకచవితి, బభృవాహన సినిమాలు డైరెక్ట్ చేసినా మాటలు రాసిన అనుభవం ఆయనకు అపారంగా వుంది. ఆత్రేయ వాగ్దానం సినిమాని డైరెక్ట్ చేసినా ఆయనకీ మాటల రచయితగా, నాటక రచయితగా విశేషమైన అనుభవం వుంది. నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పాటల రచయితగా వుంటూ సినిమా  దర్శకత్వం చేసిన  తొలి వ్యక్తి గా మీరు రికార్డుల్లోకెక్కే  అవకాశం వుంది .  సో .. అడ్వాన్స్ కంగ్రాట్స్. "

రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Aditya Hrudayam