Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - ప్రేమ కధా చిత్రం

 
చిత్రం: ప్రేమకథా చిత్రం
తారాగణం: సుధీర్ బాబు, నందిత, ప్రవీణ్, సప్తగిరి తదితరులు
సంగీతం: జే బీ
చాయాగ్రహణం, దర్శకత్వం: జె ప్రభాకర రెడ్డి
నిర్మాతలు: మారుతి, సుదర్శన్ రెడ్డి
దర్శకత్వ పర్యవేక్షణ: మారుతి
విడుదల తేదీ: 7 జూన్ 2013

"ఈ రోజుల్లో", 'బస్ స్టాప్" వంటి ప్రస్తుత యువతరాన్ని ఆకట్టుకునే వినోదాత్మక చిత్రాలు తీస్తున్న మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో "ప్రేమకథా చిత్రం" నేడు వెండితెరను తాకింది. టైటిల్ చూసి, అలనాటి మేటి పాట "వెన్నలైనా చీకటైనా.." ను ట్రైలర్స్ లో విని చాలామంది యువతీ యువకులు థియేటర్లకుకు పరుగుతీసారు. కాని వారు ఒకటి ఆశించి వస్తే మరోటి కనపడింది. అదేంటో చూద్దాం. 
 
క్లుప్తంగా చెప్పాలంటే:
వేరు వేరు కారణాలతో జీవితం మీద విరక్తి చెంది ముగ్గురు యువకులు (సుధీర్ బాబు, ప్రవీణ్, సప్తగిరి), ఒక అమ్మాయి (నందిత) మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకోవాలనుకుని కలుస్తారు. అందరూ ఒక ఊరి చివర ఉన్న బంగళాలో చేరతారు. అక్కడే వాళ్ళ చావుకు ముహూర్తం పెట్టుకోవాలనుకుంటారు. ఆ తర్వాత ఏమయిందన్నదే కథ. 
 
మొత్తంగా చెప్పాలాంటే:
సుధీర్ బాబుకి హీరోగా తన ప్రతిభ చూపించడానికి ఏమీ లేదు. ఈ పాత్రకు ఎవరైనా సరిపోతారసలు. సుధీర్ బాబు కండలకు కాని, డ్యాన్సులకు కాని పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర ఇది. ఇందులో కథే హీరో. కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నందిత గురించే చెప్పుకోవాలి. రెండు కోణాల్లో ఉండే పాత్రలను బాగా పండించింది. 
 
కథ మొదలయ్యింది మొదలు అసలు ఎక్కడా విసిగించకుండా సాగే ప్రవీణ్, సప్తగిరిల పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. మహాభారతం నాటకం సన్నివేశం, సప్తగిరి చెప్పు తీసుకుని కొడతానని డంబాలు పలికే సన్నివేశాలు మినహా ఎక్కడా సాగతీత కనపడదు. 
 
ప్రేక్షకుల మూడ్ ని ఎక్కడా చెడకొట్టకుండా కథలోకి లీనమయ్యేలా చేయగలిగింది నేపధ్య సంగీతం. కథనం పకడ్బందీగా ఉంటే కథలో లాజిక్కులు, ఔచిత్యాలు వెతికే పని ఏ ప్రేక్షకుడూ పెట్టుకోడనడానికి ఈ చిత్రం ఉదాహరణ.  
 
టైటిల్ ని చూసి ఇది గుండెలు పిండే ప్రేమకథ అనుకుంటే మాత్రం పొరపాటే. హడలెత్తించే హారర్ ఇది. కొసమెరుపేంటంటే హారర్ ని ఎక్కడా సీరియస్ గా చూపించకుండా కామెడీలో కలిపేయడం. అంటే ఇది భయానక హాస్య చిత్రం అన్నమాట. 
 
ఇక ఇంతకు మించి వివరాలు చేప్పేస్తే సినిమా చూడాలనుకునేవారి ఆసక్తిని చల్లార్చినట్టు అవుతుంది కనుక ఇక్కడితో ఆపేద్దాం. 
 
ఒకటే లొకేషన్ లో చాలా తక్కువ బడ్జెట్ లొ తెరకెక్కించిన సినిమా కనుక కాసుల పంట పండడం పెద్ద కష్టమేమీ కాకపోవొచ్చు. 
 
ఒక్క మాటలో చెప్పాలంటే: చూడొచ్చు
 
అంకెల్లో చెప్పాలంటే: 3.25/5
మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Bannu - Cartoonist