Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

Happy Sankranthi

మ‌ల్టీస్టార‌ర్‌లో ఉన్న మ‌జా... అనుభ‌వించాల్సిందే - వెంక‌టేష్‌

interview

ఇద్ద‌రు హీరోలు క‌ల‌సి న‌టించ‌డ‌మా?  తెలుగు ప‌రిశ్ర‌మ‌లో  ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా..అనే ప్ర‌శ్న‌కు స‌మాధానంలా, మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు ఓ వ‌రంలా దొరికారు వెంక‌టేష్‌!  రెండున్న‌ర ద‌శాబ్దాల న‌ట ప్ర‌యాణం.. వెంకీది. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో వెంకీకంటూ ఓ ఇమేజ్  ఉంది. ఆయ‌న కంటూ క‌థ‌లున్నాయి. ఆయ‌న‌కంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మంచి క‌థ దొరికితే చాలు.. ఇవ‌న్నీ వ‌దిలేసి మ‌ల్టీస్టార‌ర్ క‌ల‌కు ప్రాణం పోయ‌డానికి రెడీ అయిపోతారాయ‌న‌. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టుతో ఈ త‌ర‌హా క‌థ‌ల‌కు ఊపిరి పోశారు. తానే తొలి అడుగు అయ్యారు. ఇప్పుడు గోపాల గోపాల లోనూ ఆయ‌న స‌గ భాగం పంచుకొన్నారు. ఒక్క‌రితో కాదు, మంచి క‌థ రావాలేగానీ.. ప‌ది మంది హీరోల‌తో క‌ల‌సి న‌టించ‌డానికైనా నాకు అభ్యంత‌రం లేదు అంటున్నారు వెంక‌టేష్‌. ఈనెల 10న గోపాల గోపాల ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంక్రాంతి సంబ‌రాల‌ను ముందే మోసుకొస్తోంది. ఈ సంద‌ర్భంగా వెంకీతో ముచ్చ‌టించింది గో తెలుగు.

 

* సంక్రాంతి హ‌డావుడి అంతా గోపాలుడిదే అన్న‌మాట‌..
- (న‌వ్వుతూ)  నిజానికి ఈ సినిమాని ముందే రిలీజ్ చేయాల‌నుకొన్నాం. కానీ.. అనుకోని అవాంత‌రాలొచ్చాయి. మొత్తానికి సంక్రాంతికి రావాల్సిన సినిమానే ఇది. ఫ్యామిలీ అంతా ఓ చోట కూర్చుని ఎంజాయ్ చేసేలా ఉంటుంది.

 

* ఈ సినిమా ఓ న‌టుడిగా, ఓ వ్య‌క్తిగా ఎలాంటి అనుభూతుల్ని, అనుభ‌వాన్నీ మిగిల్చింది..?
- ఓ మైగాడ్ చూసిన వెంట‌నే... ఈ క‌థ మ‌న తెలుగులో కూడా బాగుంటుంది అనిపించింది. అదే సినిమాలో నేను న‌టించ‌డం చాలా హ్యాపీగా ఉంది. పైగా  ప‌వ‌న్‌లాంటి స్టార్ హీరోతో క‌ల‌సి స్ర్కీన్ పంచుకోవ‌డం మ‌రింత ఆనందాన్నిచ్చింది.  ఈసినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా దేశంలోని చాలా దేవాల‌యాలు సంద‌ర్శించా. అక్క‌డ ఆధ్యాత్మిక గురువుల‌తో మాట్లాడా. సినిమా అంతా దేవుడు, భ‌క్తి, మూఢ న‌మ్మ‌కాల ప్ర‌స్తావ‌న‌ల‌తో సాగుతుంది. ఏదో గుడికి వెళ్లొచ్చినంత ప‌విత్రంగా అనిపించింది.

 

* స్వత‌హాగా మీకూ ఆధ్యాత్మిక భావాలెక్కువ‌. కానీ ఈ సినిమాలో నాస్తికుడిగా క‌నిపించారు. ఇబ్బందిగా అనిపించ‌లేదా?
- (న‌వ్వుతూ) ఇది న‌ట‌నే కాదా..???   మీరు చెప్పింది నిజ‌మే. నాకంటూ ఓ ఆధ్మాత్మిక ప్ర‌పంచం ఉంది.  భ‌గ‌వ‌ద్గీత‌, ఖురాన్‌, బైబుల్ ఇలా అన్ని చ‌దివా. అన్నిట్లోనూ ఉన్న సారం ఒక్కటే. అన్ని మ‌తాలూ మంచే చెప్పాయి. మ‌తం అంటేనే మంచి చెప్పేద‌ని అర్థం. దేవుడంటే న‌మ్మ‌కం. భ‌గ‌వంతుడిని న‌మ్మాల్నిందే. ఎందుకంటే మ‌నల్ని సృష్టించింది ఆయ‌నే. ఈ సినిమాలో నాస్తికుడిగా క‌నిపించినా, చివ‌రికి భ‌క్తుడిగా మారిపోతా. ఆ ప్ర‌యాణమే `గోపాల గోపాల‌` క‌థ‌.

* ఓ స్టార్ క‌థానాయ‌కుడై ఉండి, ప‌రేష్‌రావ‌ల్ పోషించిన పాత్రని ఎలా ఒప్పుకొన్నారు..??
-  న‌న్నో స్టార్ హీరోగా నేనెప్పుడూ అనుకోలేదు. నేను ఓ న‌టుడ్ని అంతే. ర‌క‌ర‌కాల పాత్ర‌లు చేసే అవ‌కాశం రావ‌డం, దాన్ని ప్రేక్ష‌కులు స్వీక‌రించ‌డం నా అదృష్టం. స్టార్ డ‌మ్ అనేది... ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే క‌ల లాంటిది. అశాశ్విత‌మైన బంధాలు, బిరుదుల గురించి నేను ఆలోచించ‌ను.

* ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌న్న ఆలోచ‌న ఎప్ప‌టిది?
- చాలా కాలం నుంచీ అనుకొంటున్నా. త‌నూ ఆస‌క్తి చూపించేవాడు. కానీ క‌థ‌లు కుద‌ర‌క‌.... ప్రాజెక్టు కార్య‌రూపం దాల్చ‌లేదు. `మంచి క‌థ దొరికిన‌ప్పుడు త‌ప్ప‌కుండా చేద్దాం..` అని ప‌వ‌న్ నాతో చాలాసార్లు అన్నాడు. బ‌హుశా.. ఇలాంటి క‌థతోనే మా సినిమా రావాల‌ని రాసిపెట్టి ఉందేమో..?

* ప‌వ‌న్‌తో స్ర్కీన్ పంచుకోవ‌డం ఎలా అనిపించింది?
- సూప‌ర్బ్‌. శ్రీ‌కృష్ణుడి పాత్ర చేయ‌డానికి త‌నే క‌రెక్టుగా స‌రిపోతాడ‌నిపించింది. స్ర్కిప్టు డిస్క‌ర్ష‌న్స్‌లో ఉన్న‌ప్పుడు ప‌వ‌న్ గురించి అనుకొన్నాం. ఇక అక్క‌డే ఫిక్స‌యిపోయాం. ఎందుకంటే ప‌వ‌న్‌ని అత‌ని అభిమానులు దేవుడిలా చూస్తారు. ఆ క‌ళ్ళ‌లో ఓ స్పార్క్ క‌నిపిస్తుంది. ప‌వ‌న్ మాట‌లు, భావాలూ... వాళ్ల‌కు త్వ‌ర‌గా చేరిపోతాయి.

* న‌టుడిగా ప‌వ‌న్ గురించి..
- ఇప్పుడు ప్ర‌త్యేకించి చెప్పేదేముంది. హి ఈజ్ ఆల్వేస్ ఏ సూప‌ర్ స్టార్‌. త‌ను రావ‌డంతో ఈ సినిమా మ‌రో స్థాయికి వెళ్లింది.

* ప‌వ‌న్‌, మ‌హేష్‌.. ఇద్ద‌రితో క‌ల‌సి న‌టించారు. వాళ్ల‌లో మిమ్మ‌ల్ని ఆక‌ట్టుకొన్న విష‌యాలేంటి?
- ఇద్ద‌రూ నాకు స‌న్నిహితులే. ఓ అన్న‌య్య‌లా రిసీవ్ చేసుకొన్నారు. త‌మ వ‌ర్క్ ప‌ట్ల నిజాయ‌తీగా ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా జ‌నం మెచ్చిన న‌టులు.

* సీత‌మ్మ వాకిట్లో త‌ర‌వాత మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌లు ఊపందుకొన్నాయి..
- ఔను. ఈ విష‌యంలో చాలా హ్యాపీగా ఉన్నా. మ‌ల్టీస్టార‌ర్‌లో ఓ ర‌క‌మైన మ‌జా ఉంది. అది రుచి చూస్తే.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాంటి సినిమాలు చేయాల‌నేపిస్తుంది. ఇప్ప‌టి క‌థానాయ‌కులంతా మల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌డానికి సిద్ధంగానే ఉన్నామ‌ని చెబుతున్నారు. అయితే క‌థ‌లే దొర‌క‌డం లేదు. మంచి క‌థ వ‌చ్చిన‌ప్పుడు ఎవ్వ‌రూ వ‌ద‌ల‌రు.

* నాగార్జున‌. బాల‌కృష్ణ‌, చిరంజీవి.. మీరంతా ఒకే త‌రం వాళ్లు క‌దా. మ‌రి మీమ‌ధ్య ఇలాంటి వాతావ‌ర‌ణం ఎందుకు లేదు?
- మేం కూడా చాలాసార్లు అనుకొన్నాం. కానీ అప్ప‌టి ప‌రిస్థితులు వేరు. మ‌ల్టీస్లార‌ర్లు చేయ‌డానికి రెడీ అయిపోతే స‌రిపోదు. క‌థ‌లు దొర‌కాలి. నాకు క‌థ దొర‌కాలే గానీ, ఎంత‌మంది స్టార్స్‌తో క‌ల‌సి న‌టించ‌డానికైనా సిద్ధంగానే ఉన్నా.

* త‌దుప‌రి ప్రాజెక్టులేంటి?
- ఇంకా స్ప‌ష్టంగా ఏమీ అనుకోలేదు. పండ‌గ వెళ్ల‌నివ్వండి. గోపాలుడి హ‌డావుడి త‌గ్గాక అప్పుడు ఆలోచిస్తా.

* ఆల్ ది బెస్ట్‌...
- ధ్యాంక్యూ.


కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
hero with silent hits