Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
that feel only made me star

ఈ సంచికలో >> సినిమా >>

ప్రకాశ్ రాజ్ చందమామరావే డాట్ కాం

prakash raj chandamama rave.com
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మాతృభాష కన్నడ అయినప్పటికీ బహుభాషావిదులు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో బాగా పట్టు సాధించిన ప్రముఖులు. మొదటి కొన్ని సినిమాలు తప్ప, తర్వాత్తర్వాత ఆయన ఏ భాషలో నటించినా వారి డబ్బింగ్ వారే చెప్పుకుంటూ వస్తున్నారు. డయలాగ్ డెలివరీలో విలక్షణత చూపిస్తూ ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఏ భాషా చిత్రానికైనా ఆయన కాస్ట్లీ యాక్టరే.

పలు భాషల్లో నటించే నటులకి, పాడే గాయకులకి ఆయా భాషల్లో ప్రవేశం లభించడం పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ప్రవేశం గురించి కాదు, ప్రావీణ్యం గురించి. ప్రకాశ్ రాజ్ ఎంతెలా తెలుగుపై ప్రావీణ్యం సంపాదించారంటే త్వరలో చందమామరావే డాట్ కాం అనే ఒక వెబ్సైట్ ప్రారింభించబోతున్నారు. ఈ విషయం స్వయంగా ప్రకాశ్ రాజ్ మొన్న మా గోతెలుగు బృందం చంద్రబోస్ గారితో కలిసి కొలొంబో వెళ్తుంటే చెన్నై ఎయిర్ పోర్ట్ లో ప్రస్తావించారు. అందులో స్వయంగా తాను తెలుగు సాహిత్యం నుంచి కొన్ని చక్కని కథలు చదివి వినిపిస్తారట. తెలుగు పిల్లలకి తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి పెంచడం ఈ వెబ్సైట్ లక్ష్యాల్లో ఒకటి. స్వయంగా ప్రాకాశ్ రాజ్ వచ్చి కథలు వినిపిస్తే పిల్లలేమిటి, పెద్దవాళ్లు కూడా ఆసక్తి చూపుతారు.

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ప్రకాశ్ రాజ్ తెలుగు సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఒకానొక పాత్రకి గాను ఒక సీనియర్ సమీక్షకుడి నుంచి తీవ్రమైన విమర్శ ఎదుర్కోవల్సి వచ్చింది. తెలుగు భాషని ఖూనీ చేసే ఇటువంటి నటుడిని పట్టుకొచ్చారు, కనీసం డబ్బింగ్ వేరే అతనితో చెప్పించి ఉంటే బాగుండేదని ఆ విమర్శ సారాంశం. ఆ విషయం ప్రకాశ్ రాజ్ ని చేరిందట. ఆయన ఆ సమీక్షకుడి నంబర్ తెలుసుకొని కాల్ చేసి, "మీ విమర్శని ఒక చాలెంజ్ గా తీసుకుంటాను. భాషని బాగా నేర్చుకుంటాను", అన్నారట.

ఆ పట్టుదలో మరి ఏమో కానీ మన ప్రకాశ్ రాజ్ తెలుగు మాట్లాడడమే కాదు, చదవడం, వ్రాయడం కూడా నేర్చేసుకుని, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని సైతం జుర్రేసుకుంటూ ఇలా వెబ్సైట్ ద్వారా తెలుగు పిల్లలకి తెలుగు పాఠాలు చెప్పే స్థాయికి ఎదగడం మనం చూడబోతున్న ఒక స్ఫూర్తిదాయకమైన విషయం.

కన్నడ మాతృభాష అయినా ఇలా తెలుగు పాఠాలు చెప్పే స్థాయికి చేరిన ప్రకాశ్ రాజ్ కు తెలుగు వారందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టాల్సిందే. కనుక అందరి తరపునా గోతెలుగు డాట్ కాం ప్రకాశ్ రాజ్ కి జైకొడుతూ వారు తలపెట్టిన చందామామరావే డాట్ కాం పెద్ద హిట్ కావాలని కోరుకుంటోంది.
మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam