Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ : గంగరాజు వేసుకున్న డ్రస్సు చూసి నవ్వుకుంటారు, యోగి, సాంగ్స్ మ్యూజిక్ కంపోజింగ్ లో ఉంటారంతా...ఆ తర్వాత ...

అయిపోతే అయిపోయింది. నువ్వెందుకేసుకున్నావని..?” అనడంతో గొళ్ళుమని ఏడుస్తూ ఎమిరైట్స్ ఫ్లైట్ లో నెగెటివ్ వచ్చింది గానీ, నా సూట్ కేసింకా రాలేదు సార్. ఫ్రాంక్ ఫర్ట్ వెళ్ళిపోయిందట. బట్టల్లేక ఇలా చావాల్సి వస్తుంది మరి” అన్నాడు.

ఇలాంటి వెదవ్వేషాలేసే బదులు... ఈ వూళ్ళో కొనుక్కోవచ్చు గదా బట్టలు..?”

“ఒక జత మన కరెన్సీ ప్రకారం వేల మీదుంది సార్.... నాకంత శక్తి లేదు...” అన్నాడు.

“నిన్నీ వేషంలో చూసే శక్తి మాకు లేదు” అన్నాడు గోవిందు.

చూడలేకపోతే కళ్ళు ముసుకో, లేకపోతే ఏదో చేస్కో... సరే నేనొచ్చింది ఎందుకంటే “డిన్నర్ రెడీ అంట తొందరగా రమ్మంటున్నాడు వంటోడు” అనెళ్ళిపోయేడు.

డిన్నర్ కెళ్ళొచ్చాకా “పడుకుందాం” అంటే “కాదు పాట కంపోజ్ చేస్తాను” అని పల్లవిలో మూడు లైన్లు చేసి ఫినిషింగ్ లైను రాక అవస్థ పడుతూ చివరికి నిద్ర పోయాడు యోగి.

నిద్ర రావడం లేదు జీవన్ కి. అబూ పెట్టిన గడువులో రెండో రోజు కూడా పూర్తి కావస్తుంది.

ఏం జరగబోతుంది...?

అసలు షహనాజ్ ఏం ఆలోచిస్తుంది..? లోపల్లోపల ఎంత అవస్థ పడ్తుంది..?

అలా పరిపరి విధాల పోతుంది జీవన్ మనసు. అలా నానా అవస్థా పడుతూ ఎప్పటికో నిద్రపోయాడు జీవన్.

అక్టోబర్ – 5

ఆ మర్నాడు ఎదురుగుండా ఉన్న రూంలోంచి వినిపిస్తున్న షహనాజ్ వయోలిన్ కి నిద్రలేచారిద్దరూ. యోగి అసంపూర్ణంగా వదిలేసిన పల్లవిని పూర్తి చేసి వాయిస్తుంది షహనాజ్. “భలేగుంది సుమా” అనుకుంటుండగా చరణం కూడా వినిపించింది. ఆమె యాడ్ చేసిన లైన్స్ తో ట్యూన్ కలరు మొత్తం మారిపోయింది. అదేదో హిందూస్థానీ రాగం... పహాడీ అనుకుంటాను.

“చాలా బాగా కంపోజ్ చేసిందే, ఇదే వాడేసుకుందాం” అంటూ బయటికెళ్ళిన యోగి పది యూరోలు ఖర్చు పెట్టి డిప్ప క్రాపు లాంటిది చేయించుకొచ్చాడు. ముందు భాగం కొంత ఇనిస్ట్ రో బ్లీచ్ చేయించుకున్నాడు.

“ఎలాగుంది..?” అన్నాడు.

“నవ్వొచ్చేలాగున్నావ్” అని నవ్వేసిన జీవన్ కిందకెళ్తుంటే... “మీకో విషయం చెప్పాలి” అన్నాడు యోగి

“ఏంటి..?” అన్నాడు జీవన్.

“రాత్రి నిదట్లో ఊపిరి ఆడక చాలా అవస్థ పడ్డారు మీరు. చాలా భయమేసింది నాకు” అన్నాడు యోగి.

“నిజమే..... హైదరాబాదు వెళ్ళాకా ఎవరన్నా మంచి లంగ్ స్పెషలిస్ట్ దగ్గరకెళ్ళాలి” అంటుండగా కింద కొచ్చేసింది లిఫ్టు.

హోటల్ కి దగ్గర్లో ఉన్న జస్కెన్చ్ స్టుబెర్ట్ అనే షాపులో కెళ్ళారిద్దరూ. పర్ ఫ్యూమ్ డ్ కేండిల్సు కొంటూ కనిపించింది షహనాజ్. అంటే ఈ కొవ్వొత్తులు వెలిగిస్తే కాంతితో పాటు మంచి పరిమళాన్ని కూడా ఇస్తాయట.

దగ్గరగా వెళ్ళిన వాళ్ళిద్దరూ పరిచయం చేసుకుంటుంటే గమ్మత్తుగా నవ్వింది.

“పల్లవి చివర మీరు కంపోజ్ చేసిన లైను చాలా బాగుంది.... చరణం కూడా...” అన్నాడు.

ముసుగులోంచే నవ్వింది.

“మొత్తం ట్యూన్లు ఒకసారి ప్లే చేస్తే రికార్డ్ చేసుకుంటా” అన్నాడు.

“నిజంగా బాగుందా..?” ఆమె అడుగుతుంతే మళ్ళీ వైజయంతిమాలా, మీనా కుమారీ, సావిత్రీ గుర్తొచ్చారు జీవన్ కి.

“చాలా బాగుంది.... మీరు కంపోజరా...?” అడిగేడు యోగి.

“కాదు” ఆ షాపులోంచి బయటికొచ్చిన ఆమె ఎదురుగుండా ఉన్న బంటర్ లాడెన్ అనే ఇంకో షాపులోకెళ్ళింది.

ఫాలో అయ్యేరిద్దరూ.

స్టేషనరీ, రెడీమేడ్ రెండు కలిపి ఉన్న షాపు అది. వాటర్ కలర్సూ పెన్నులూ కొన్నాడు జీవన్.

“కంపోజర్ కాకండా అంత బాగా అంత మెచ్యుర్డ్ గా ఎలా కంపోజ్ చేసేరు..?” అడిగేడు యోగి.

“ముందు మీ మూడు లైన్లు గొప్పగా ఉండటంతో వాటికి మేచ్ అయ్యేలా ట్రై చేసేనంతే” అందామె.

“కంపోజింగ్ లో మీరు కూడా మాతో పాటు కూర్చుంటే ఇన్స్ పిరేషన్ గా వుంటుంది” అన్నాడు యోగి.

“నేనంత గొప్పదాన్ని కాదు. ఏదో సరదాగా వయోలిన్ నేర్చుకున్నాను” అందామె.

“సరదాగానే కూర్చోండి మాతో పాటు, రూమ్ లో ఒంటరిగా వుంటే మీకు బోర్ కొడుతుంది” అన్నాడు జీవన్.

మాట్లాడ్తూనే ఆమెతో స్పోర్ట్స్ స్టోర్ లోకీ ఫోటో షాపులోకీ తిరిగారిద్దరూ.

ఆమెతో పాటు తిరుగుతూ బాగా చనువు పెంచుకునే ప్రయత్నం చేసేడు జీవన్. ఎందుకంటే చనువు పెరిగితే ఏవయింది ఆ వజీర్ ఏవన్నా ఫ్రూవ్ చేశాడా అని అడగొచ్చు.

ఆ మధ్యాహ్నం వాళ్ళు కంపోజ్ చేస్తుంటే రూమ్ లోకొచ్చి సహకారం చేసింది.

ఆమె నీలి కళ్ళ మీద ఎండపొడ పడి మాయమవుతున్నట్టూ ఫీలయ్యాడు జీవన్.

భోజనం చేసి పడుకుని సాయంత్రం లేదారిద్దరూ.

మరి కూర్చుందామా..? అన్నాడు యోగితో...

“ఏం కూర్చోడం సార్... ఎప్పుడు చూసినా ఈ రూమ్ లో కూర్చుంటే అయిడియాలు రావడం లేదు. అలా బయట తిరిగొద్దాం పదండి” అన్నాడు.

“ఇప్పుడు టైమెంతయ్యింది..?” అడిగితే టీ.వీ మీద పెట్టిన వాచీ తీసి చూసుకుని చెప్పేడు “ఆరు” అని.

“అయితే మార్కెట్లో షాపులు క్లోజ్ చేసేస్తారు” అన్నాడు.

కిటికీ లోంచి బయటికి చూసేడు యోగి. మధ్యాహ్నం మూడు అనిపించేంత ఎండ ఉంది కొండల మీద. “నా టైము తప్పేమో సార్” అన్నాడు.

“లేదు రైటే. ఈ సీజన్లో ఇక్కడ రాత్రి ఎనిమిదిన్నర దాకా సూర్యుడుంటాడు. అదే శీతాకాలంలో అయితే రోజుకి ఆరు గంటలు మాత్రమే వెలుగుంటుంది” అన్నాడు జీవన్.

“అయినా నాకు చాలా చిరాగ్గా ఉంది. కాస్సేపు అలా రోడ్ల మీద తిరిగొద్దాం రెడీ అవ్వండి” అనేసి బాత్ రూంలోకెళ్ళాడు.

అతను మేకప్పూ అదీ చేసుకు రావడానికి కనీసం అరగంట పడ్తుంది. పాంటు వేసుకుని శాలువా కప్పుకుని కిందికి దిగేడు జీవన్.

రిసెప్షన్లో కంప్యూటర్ ముందు కూర్చున్న వేణుగారు పలకరించేరు.

“షూటింగయిపోయిందా.... అంతా వచ్చేసారా...?” అడిగేడు జీవన్.

“లేదండీ... నాకు మెయిల్స్ చెక్ చేసుకునే పని ఉండే వచ్చాను” అన్నాడు.

“నా సైట్ ఓపెన్ చెయ్యండి” అన్నాడు జీవన్.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్