Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : విరాట్ పిలుపు మేరకు ఏ. ఎస్. పి. ప్రకాష్ గురించి ఆరా తీస్తాడు ధర్మ. బ్రహ్మచారి అయిన ప్రకాష్ డ్యూటీ ముగించుకుని గర్ల్ ఫ్రెండ్ ఆముదవల్లి ఇంటికి వెళ్తాడు. అర్ధరాత్రి దాకా ఆమెతో గడిపి బయల్దేరతాడు. మందెక్కువైందని ఆమె వారించినా వినకుండా బైక్ పై వెళ్తున్న ప్రకాష్ కి దారిలో పడిపోయిన ఒక యువకుడు కనిపించేసరికి ఆగి అతడి ముఖం మీద మంకీ క్యాప్ ఉండడంతో గుర్తించలేక ఎవరాని చూస్తూంటాడు......ఆ తర్వాత.....

ఆలోచిస్తూ సిగరెట్  దమ్ములాగి అవతల పడేసాడు.  శవంతల దగ్గర గొంతు కూచొని ముఖం చూసే ఉద్దేశంతో మంకీ కేప్ ని తొలగించ బోయాడు సరిగ్గా అప్పుడు `సడెన్ గా కదిలింది శవం.

నిజానికది శవం కాదు. శవంలా అంతవరకూ నటించిన యువకుడు. ఎ యస్ పి ప్రకాష్ అదిరి పడి లేచే లోపు ఆ యువకుడు స్ప్రింగ్ లా లేస్తూ ప్రకాష్ నడుం బెల్టు నుండి సర్వీస్ రివాల్వర్ ని లాగేసుకున్నాడు. దాన్ని ప్రకాష్ కి గురి చేస్తూ పెద్దగా నవ్వాడు.

వూహించని ఈ సంఘటనకి షాక్ తిన్నాడు ప్రకాష్.

‘‘రేయ్ ఎవడ్రా నువ్వు? పిచ్చోడివా, మతి లేని వెధవా. అది బొమ్మ తుపాకి కాదు. సర్వీస్ రివాల్వర్. దాన్నిలా ఇచ్చెయ్’’ అనరిచాడు.

‘‘ఇవ్వనుగా... ఇది నాది’’ అన్నాడు వాడు.‘‘మర్యాదగా ఇస్తావా లేదా?’’ రెండడుగులు ముందుకేసాడు ప్రకాష్.

‘‘నీకు మర్యాదేమిట్రా? అసలు మర్యాదంటే ఏంటో నీకు తెలుసా? నేర్పిస్తా చూడు. రండ్రోయ్ రండి. దొంగ దొరికి పోయాడు. రండి రండి’’ అనరుస్తూ రివాల్వర్ ని ప్రయోగించాడా యువకుడు.కాళ్ళ దగ్గర బుల్లెట్లు దుమ్ము రేపుతుంటే ఓ మైగాడ్ అంటూ భయంతో ఎగిరెగిరిగంతులేసాడు ఎ యస్ పి ప్రకాష్. తాగిన మత్తు మోకాళ్ళలోకి దిగి పోగా ఫోన్లో తనకు మర్యాద నేర్పిస్తానన్న హెచ్చరిక తిరిగి చెవుల్లో మారు మోగింది. వీళ్ళెవరో పథకం ప్రకారం తనను అటాక్ చేయటం లేదు గదా అనుమానంతో చుట్టూ చూసాడు.

అప్పటికే ధర్మ బృందం నిశ్శబ్ధంగా చుట్టు ముట్టేసింది. ఒక్కొక్కరే బైక్  వెలుగులోకి ముందుకొస్తుంటే ఎ యస్ పి కి కళ్ళు తిరిగినంత పనైంది. ఒకరు కాదు యిద్దరు కాదు ఇరవై మందికి పైగా వున్నారు. ముఖాలు తెలీకుండా అంతా మంకీ కేప్ లు ధరించారు. చేతుల్లో క్రికెట్ బేట్లు ‘‘ఎవరు? ఎవర్రా మీరంతా నేనెవరో తెలిసే వచ్చారా? మీ అందర్ని లోన పడేసి కాళ్ళు చేతులు పనికి రాకుండా చేయిస్తా’’ కోపంతో పెద్దగా అరిచాడు.

అతడి అరుపులు తమకు వినబడనట్టే నిశ్శబ్ధంగా మరో మూడడుగులు ముందుకొచ్చారంతా. ఒక్కడూ ముఖం తెలీటం లేదు. గోడ కట్టినట్టు రౌండప్ చేసారు. అర్థరాత్రి ఆ దారిన ఎవరూ వచ్చే అవకాశం కూడా లేదు. ఆ నిశ్శబ్ధం మరింత భయనకంగా ఉంది. మొదటి సారిగా వెన్ను జలదరించింది ఎ యస్ పి ప్రకాష్ కి.

‘‘ఎవడ్రా... మీకేం కావాలి?’ మరోసారి అరిచాడు.

‘‘మర్యాద... మర్యాద కావాలి ఇస్తావా?’’ మరి కాస్త ముందు కొస్తు గొంతు మార్చి అడిగాడు ధర్మ.

‘‘అంటే... ఆ ఫోన్లో మాటాడిన వాడి తాలూకా మీరంతా? ’’

‘‘అర్థమైందిగా? జగన్మోహన్ పెంపుడు కుక్కగా మారి వూరి జనాన్ని కరుస్తావ్ రా పిచ్చి కుక్క. నీకు పొగరెక్కువై మర్యాద మర్చి పోయి మా వాడితో పెట్టుకున్నావ్. మా మర్యాద ఎలా వుంటుందో చూడరా!’’ అంటూ క్రికెట్ బేట్ తో లాగి పెట్టి ముఖం మీద కొట్టాడు ధర్మ .మొదటి దెబ్బతో చేతులు అడ్డం పెట్టి తప్పించుకున్నాడు కాని చేతులు విరిగినంత బాధతో కెవ్వు మన్నాడు. ఆ తర్వాత అరవటానికో ఆలోచించడానికో అవకాశం యివ్వలేదు ధర్మ బృందం. కంది కంపను దులిపినట్టు అయిదు నిమిషాలు దులిపి వదిలేసారు. నేల మీద పడేసి పొర్లుగింతలు పెట్టించారు. తల చిట్లింది. ఒళ్ళంతా హూనమై తెలిలి తప్పిపడి పోయాడు.

అంతలో ఎగువ నుండి బీట్ కానిస్టేబుల్స్ విజిల్స్ విన్పించాయి అంతే`

ఎంత నిశ్శబ్ధంగా వచ్చారో అంతే నిశ్శబ్ధంగా చీకట్లోకి తప్పుకున్నారంతా. శవంలా నటించిన యువకుడు రివాల్వర్ని వేలి ముద్రలు లేకుండా తుడిచి ప్రకాష్ పక్కన పడేసి వెళ్ళి పోయాడు.

ఎగువన దూరంలోఉండగానే బీటు కానిస్టేబుళ్ళు యిద్దరూ పార్క్ గేటు దగ్గర మోటార్ బైక్ లైట్ కాంతిని గమనించారు. అక్కడేదో జరిగిందనే సందేహంతో సైకిళ్ళును వేగంగా తొక్కుకుంటూ అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో అంత దూరంలో పార్క్ గోడ అవతల నుంచి రివ్వు రివ్వున కొన్ని బైకులు రోడ్ మీదకు దూసుకొచ్చి ఎగువకు దూసుకు పోవటం కన్పించింది.

అక్కడ రోడ్డు మీద పడున్నది ఎవరో కాదు తమ ఎ యస్ పి ప్రకాష్. ఈ టైమ్ కి దారిలో తమను పలకరించి వెళ్ళేవాడు ఇంకా రలేదేమిటా అనుకుంటున్నారు. ఇంతలో ఈ ఘోరం జరిగి  పోయింది. ఎవరో దారి కాచి తాట తీసి పారి పోయారు.

వెంటనే పోలీసులు అంబులెన్స్ కి ఫోన్ చేసారు. అలాగే తమ పై అధికారుల కి ఫోన్లు కొట్టి పరిస్థితి వివరించారు. ఈ లోపల ధర్మ బృందం ఎగువకు వెళ్ళగానే గుంపుగా పోకుండా తలో రూట్ కి చీలీ పోయి తమ దారిన యిళ్ళకు వెళ్ళి పోయారు. వాళ్ళను కనిపెట్టడం ఇక ఎవరివల్లా కాదు.

రాత్రికి రాత్రి అస్పత్రిలో చేర్పించిన ఎ యస్ పి ప్రకాష్ కి ఉదయం అరు గంటలకి గాని స్పృహ రాలేదు. తలకు రెండు కుట్లు పడ్డాయి. ఒంటి మీద బాండేజ్ లు. అదృష్టం ఏమంటే ఎముకలు ఒక్కటీ విరక్క పోవటం.

ఉదయం సరిగ్గా ఎనిమిదిన్నర గంటలకి ఎ యస్ పి ప్రకాష్ ఫోన్ రింగయింది. ఆ సమయంలో కానిస్టేబుల్ వన్నాట్ ఫోర్ మరో యిద్దరు పోలీసులు మాత్రమే అక్కడున్నారు. అంత క్రితమే కొందరు అధికారులు వచ్చి పరామార్శించి వెళ్ళారు. త్రిటౌన్ పోలీస్ స్టేషన్ లోకేసు బుక్ చేసి దుండగుల ఆచూకీ కోసం తమ ప్రయత్నాలు ఆరంభించారు అక్కడి పోలీసులు.

‘‘అరే... ఆ ఫోన్ ఎవరిదో చూడరా’’ అన్నాడు. ప్రకాష్ వన్నాట్ ఫోర్ తో.‘‘ఎవరిదో ఏంటి సార్. ఈ ఫోన్ మీదేగా’’ అన్నాడు వన్నాట్ ఫోర్.‘‘ఫోన్  చేసింది ఎవరో చూడరా మూర్ఖా’’ విసుక్కున్నాడు ఎ యస్ పి. బెడ్ మీద కట్టెలా పడున్నాడు. కాస్త కదిలినా ఒళ్ళంతా భరించరాని నొప్పి.‘‘హలో.. ఎవరండీ? ఎవరు కావాలి?’’ ఫోన్ లో అరుస్తున్నాడు వన్నాట్ ఫోర్.

‘‘నేనెవరైతే నీకెందుకురా? ఫోన్ ప్రకాష్ గాడికివ్వు’’ అటునుంచి విరాట్  గొంతు గరగరలాడిరది.

‘‘ఎవర్రా?’’ అంత బాధ లోనూ గొంతు పెకిల్చిఅడిగాడు ఎ యస్ పి.

‘‘పేరు చెప్పటం లేదు సార్. ఫోన్ మీకిమ్మంటున్నాడు’’ ఫోన్ యివ్వబోయాడు వన్ నాట్ ఫోర్ వెంటనే`

‘‘వద్దు వద్దు’’ అన్నాడు కంగారుగా ప్రకాష్.

‘‘వాడే... వాడే అయి వుంటాడు ఏదోటి మాటాడి లేట్ చెయ్’’ అన్నాడు.

‘‘ఎవడు సార్ వీడు? ఇప్పుడే నన్ను చెంచా అన్నాడు. ఇంకా మాటాడితే కూజా అనేట్టున్నాడు. మీరే మాట్లాడండి’’ అంటూ ఫోన్ చెవి దగ్గరుంచాడు వన్ నాట్ ఫోర్. ఇంక తప్పదని`

‘‘హలో!’’ అన్నాడు నీరసంగా ఎ యస్ పి ప్రకాష్.

‘‘సార్... ఎ యస్ పి ప్రకాష్ గారేనా?’’ అటు నుండి ప్రశ్న.

‘‘అవున్రా ఇంతకీ ఎవడ్రా నువ్వు?’’ అరిచాడు విసుగ్గా.వెంటనే అటు నుండి నవ్వు విన్పించింది.‘‘ఏరా కరిచే కుక్కకి నీకు తేడా లేదనుకుంటానే. మర్యాదగా నేను సార్ అంటే ఎవడ్రా నువ్వు అంటున్నావ్. మూర్ఖుడా. నీకింకా మావాళ్ళు పూర్తిగా మర్యాద నేర్పినట్టు లేదు. ఇంకో కోటా ఇప్పించమంటావా?’’ అటు నుంచి అడిగాడు విరాట్.

‘‘రేయ్ నవ్వులాటగా ఉందా నీకు? నా గురించి నీకు తెలీదు. నిన్ను వదను నీ మనుషుల్ని వదలను...’’ కటువుగా హెచ్చరించాడు.‘‘వదలక. అదే మాట మీద వుండు. అప్పుడేగా నేనూ నిన్ను వదను. నా చేతిలోనే ఛస్తావ్. అయినా నేను ముందే హెచ్చరించినా అంత అజాగ్రత్తగా వున్నావంటే నీకన్నా చవట మరొకడుండడు. ఈ సారన్న జాగ్రత్త పడు. తొందరలోనే నీకు మరో కోటా పడుతుంది’’ అంటూ అవతల లైన్ కట్ చేసాడు విరాట్.

విరాట్  చివరి మాటలు వినగానే`

ఎ యస్ పి ప్రకాష్ ముఖంనెత్తురు లేనట్టు పాలి పోయింది.

I              I                     I

ఉదయం ఎనిమిది గంటలకే దీక్ష స్కూటీ వచ్చి గేటు ముందు ఆగింది. సహస్ర దీక్ష యిద్దరూ లోన కొచ్చారు.

అప్పటికింకా విరాట్ చందూలు రెడీ కాలేదు.

స్నానాలు చేసి కాఫి తాగారు.

నిన్న సాయంకాలనికే ఇంటికి కొత్త ఫర్నిచర్  రప్పించటంతో ఇల్లు ముందు కన్న మరింత శోభాయమానంగా ఉంది.

పొద్దునే వచ్చిన అమ్మాయిలద్దరూ చక్కటి డిజైన్ తో కూడిన చుడీదార్లు ధరించి ఎగిరే సీతాకోకచిలుకల్లా వున్నారు. ఎప్పటిలాగే సహస్ర చున్నితో ముఖం తెలీకుండా కవర్ చేసుకొని వచ్చినా లోనకు రాగానే తీసేసింది. కడిగిన ముత్యంలా ఇవాళ మరింత అందంగా వుంది.‘‘ఎక్కడికి పొద్దుటే బయలు దేరారు?’’ అడిగాడు చందూ.

‘‘డ్యూటీకి వెళ్ళాలిగా!’’ వెంటనే బదులిచ్చింది సహస్ర.

‘‘అవును మీ మూలంగా నిన్న షాపింగ్ మాల్ కి పోకుండా శలవు పెట్టాల్సొచ్చింది. ఇవాళయినా వెళ్ళాలిగా, మామూలుగా అయితే ఎనిమిదిన్నరకు బయలుదేరేవాళ్ళం. మీ కోసం కాస్త ముందుగా వచ్చాం!’’ అంది దీక్ష.

‘‘మా కోసం అంటే నేన్నమ్మను’’ అన్నాడు విరాట్.

‘‘అవున్లే నిజాలు నువ్వెప్పుడు నమ్మావు గనక. ఇవాళ రాఖీ పండగ. మీకు రాఖీ కట్టడం కోసం ముందుగా వచ్చాం’’ అంటూ విరాట్ పక్కన కూచొని చేతిలో ప్లాస్టిక్ బుట్టని టీ పాయ్ మీద ఉంచింది సహస్ర. బుట్టలోరెండు స్టీలు బాక్స్ లున్నాయి.

విరాట్ చందూలు ముఖముఖాలు చూసుకున్నారు. సహస్ర పైనున్న బాక్స్ తెరిచింది. లోన స్వీట్లు పక్కనే అందమైన రెండు రాఖీలు ఉన్నాయి.

వాటిని చూడగానే అదిరి పడి.

వెనక్కి జరిగాడు విరాట్.

‘‘ఎయ్... ఏంటిది?’’ అనడిగాడు.

‘‘తెలీటం లేదా? రాఖీలు’’ అంది సహస్ర.

‘‘అది తెలుస్తోంది. నిజంగానే తెచ్చావేంటి? కొంప దీసి నాకు కట్టేస్తావా ఏమిటి? వరసలు మారి పోతాయి.’’

‘‘ఏం ఫరవా లేదు. వరసలు కలుపుకుందామనే ఇవి తెచ్చాం’’ అంటూ కొంటెగా నవ్వుతూ ఒక రాఖీ దీసింది. అంతే.

సోఫాలోంచి ఎగిరి అవతలకు దూకాడు విరాట్.

‘‘ఒరేయ్ చందూ ఏమిట్రా పొద్దుటే చమటలు పట్టిస్తున్నారు. కష్టపడి లవ్ చేస్తే ఇప్పుడు రాఖీలు కట్టేస్తామంటున్నారు. ఇదేమన్నా బాగుందా?’’ అనరిచాడు. చందూ భుజాలెగరేసాడు.

‘‘నాకు బాగానే వుంది. నువ్వే అనవసరంగా కంగారు పడుతున్నావ్’’ అంది సహస్ర రాఖీతో ముందుకొస్తూ

‘‘ఏయ్... తమాషాగా ఉందా? రాకు చెప్తున్నాను’’ అనరుస్తూ చందూ వెనక్కి దూకాడు విరాట్.అయితే సహస్ర విరాట్ ని పట్టించుకోకుండా చందూ కుడి చేయి అందుకుంది.

‘‘నేను రాఖీకట్టడానికి అన్నదమ్ములెవరూ లేరు. మా డాడీకీ ఒకే కూతుర్నయిపోయాను. ఈ రోజు నుంచి నీకు చెల్లెలిగా ఈ రాఖీ కడుతున్నాను. మీ స్నేహం లాగే మన అనుబంధం కూడా కల కాలం ఉండాలి’’ అంటూ రాఖీ కట్టింది సహస్ర.

‘‘నన్నాశీర్వదించు అన్నయ్యా’’ అంటూ పాదాలకు నమస్కరించింది.

దీక్ష చందూ చేతిలో అక్షింతలు ఉంచింది.

చందూ కళ్ళలో గిర్రున నీరు తిరిగింది.

‘‘కల కాలం సుఖ సంతోషాలతో వర్థిల్లు తల్లీ!’’ అంటూ సహస్ర శిరస్సున అక్షితలు వేసి భుజాలు పట్టి లేపాడు.
|
‘‘ఇంటి దగ్గరుంటే నా చెల్లెళ్ళిద్దరూ రాఖీలు కట్టే వాళ్ళు ప్రతి సంవత్సరం. ఈ పండక్కి ఇంటి కెళ్ళాలనున్నా వెళ్ళ లేక పోతున్నాను. ఆ లోటు నువ్వు తీర్చావ్. ఈ రోజు నుంచి నాకు చెల్లెళ్ళు ఇద్దరు కాదు నీతో కలిపి ముగ్గురు.’’ అంటూ జేబు లోంచి అయిదు వందల నోటు తీసి సహస్ర చేతిలో ఉంచాడు.

సహస్ర అతడి నోటికి లడ్డూ అందించి నోరు తీపి చేసింది. విషయం అర్థమై ఇవతలకొచ్చిన విరాట్ నవ్వుతూ ‘‘ఈ మాట ముందే చెప్పొచ్చుగా. క్లారిటీ వుండేది. అనవసరంగా నన్ను కంగారు పెట్టావ్’’ అన్నాడు.

ఇంతలో దీక్ష రెండో రాఖీతో ముందుకొచ్చింది. సహస్ర అందించిన అక్షింతలు తీసుకొని దీక్ష శిరస్సున చల్లి ‘‘కల కాలం చల్లగా ఉండమ్మా’’లే అంటూ భుజాలు పట్టి లేపాడు విరాట్.

‘‘అయిదుగురన్నలకు చెల్లెలివై ఉండి ఇక్కడ అనాధల ఒంటరిగా బతుకుతున్నాను. అలాంటి నాకు మీరంతా తోడు నీడ గాదొరికారు. ఇక నుంచి నువ్వే నా అన్నగా భావిస్తాను’’. అంటూ విరాట్ నోటి ని లడ్డూ తో తీపి చేసింది. వెంటనే వెయ్యి రూపాయల నోటు ఆమె చేతిలో ఉంచాడు విరాట్.

‘‘ఉంచమ్మా. అన్నగా ఇక మీదట నీకు ఏమిచ్చినా కాదనకూడదు’’ అన్నాడు.

‘‘ఒరే విరాట్ ఇప్పుడేమిట్రా ఎప్పుడో నువ్వు తనకు అన్నవయ్యావ్. కాని ఆ సంగతి నీకు తెలీదు’’ అన్నాడు చందూ. అర్ధం కానట్టు చూసాడు విరాట్.|

‘‘దీక్ష ఎవరో ఇంకా తెలీలేదా?’’ నవ్వుతూ అడిగాడు చందూ.‘‘ఏమిట్రా తమాషా చేస్తున్నావ్? నాకేం తెలుసు?’’ అన్నాడు విరాట్.‘‘మధురైలో కొంత కాలం కిందట అప్పటి ఎ యస్ పి అయ్యా సామి నుంచి అర్ధరాత్రి ఓ అమ్మాయిని కాపాడి క్షేమంగా తనుంటున్న హాస్టల్ దగ్గర విడిచి వెళ్ళావ్ అవునా?’’

‘‘అవును... అయితే...?’’

‘‘ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ దీక్ష. నిన్న నువ్వు ఎ యస్ పి ప్రకాష్ తో మాట్లాడ్డం విన్నాక తనూ నిన్ను గుర్తు పట్టి నాతో చెప్పింది.’’ అంటూ అసలు విషయం చెప్పే సరికి నమ్మ లేనట్టు దీక్ష వంక చూసాడు విరాట్

‘‘అవునన్నయ్యా. ఆ రాత్రి నువ్వు కాపాడిన అమ్మాయి నేనే. అయిదుగురన్నలూ ఆస్థి కోసం దుర్మార్గులుగా మారి ఆ ఎ యస్ పి కి లంచం యిచ్చి నన్ను భయపెట్టమని నా తలరాతను మార్చాలని చూసారు. ఆ క్షణంలో ఎంత అరిచినా ఏ దైవం రాలేదు, నువ్వొచ్చావ్. అన్నలా నాన్నలా నన్ను కాపాడావ్. చీకట్లో నీ ముఖం తెలీదేదు. ఇంత కాలానికి నిన్నిలా కలుసుకోవటం అదృష్టం.’’ అంటూ చెమర్చిన కళ్ళు తుడుచుకుంది దీక్ష.

‘‘అదృష్టం నీది కాదమ్మా, నాది. నాకు పైన అక్క అన్నయ్య ఉన్నారు. చెల్లెళ్ళు లేరు. ప్రతి సంవత్సరం మా అక్క మహాలక్ష్మి మా అన్నదమ్ములిద్దరికీ రాకీ కట్టేది. సాగరికను చేసుకోనన్నప్పట్నుంచీ ఆ అలవాటు తప్పి పోయింది. ఆ కోరిక నీ మూలంగా తీరింది. నీ సొంత అన్నలు నీకు ద్రోహం చేయాలని చూసుండొచ్చు, ఆ విషయం మరిచిపో. నీకు పుట్టింటి లాంఛనాలకు ఏ కొరతా లేకుండా నేను చూసుకుంటాను’’ అన్నాడు విరాట్.

‘‘ఒకె ఒకె ఈ శుభ సందర్భంలో మనందరి కోసం అటుకుల పాయసం చేసి తెచ్చాం. త్వరగా కానిస్తే బయలు దేరుతాం’’ అంటూ సహస్ర రెండో స్టీల్ బాక్స్ తెరిచింది.

దీక్ష వెళ్ళి నాలుగు గ్లాసులు తెచ్చింది.ఈ లోపల విరాట్ ఎ యస్ పి ప్రకాష్ నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడాడు. హాస్పిటల్ పాలయినా వాడి పొగరు ఇంకా తగ్గనందుకు నవ్వుకున్నాడు. ఎ యస్ పి ప్రకాష్ మీద రాత్రి మధురైలో దాడి జరిగిందని అతడు ప్రస్తుతం ఆస్పత్రి బెడ్ మీద వున్నాడని తెలీగానే సహస్ర ఆనందం పట్టలేక విరాట్  బుగ్గ మీద ముద్దు పెట్టేసింది.

‘‘ఇప్పుడు మరింత నచ్చావ్ విరాట్. చెన్నై నుంచి కదలకుండానే బుద్ది చెప్నావంటే యుఆర్ గ్రేట్ ’’అంది మెచ్చుకుంటూ.‘‘హలో........... అప్పుడే ఏమైందని సంబరం? అసలు కథ ముందుంది. నీ మూలంగా నాకెంత మంది శతృవులవుతారో? ఎలాంటి రిస్క్ లు ఫేస్ చేయాలోఅర్ధం గావటం లేదు. ఏరా చందూ. నువ్వయినా ఓ మాట నన్ను హెచ్చరించుండొచ్చుగా. ఇప్పుడు చూడు ఖర్మ. లవ్ చేసి అనవసరంగా చిక్కుల్లో పడ్డాను’’ అన్నాడు.

సహస్రను ఉడికించటం కోసం విరాట్ ప్రయోగించిన మాటలు వెంటనే వర్కవుటయ్యాయి. కోపంతో చివ్వున లేచింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్