మెగా కుటుంబం నుంచి ఓ హీరోయిన్ వస్తోందంటూ గత కొద్ది రోజుల నుంచీ ప్రచారం జోరుగా సాగుతోంది. సినీ నటుడు, నిర్మాత నాగబాబు కుటుంబం నుంచే ఓ హీరోయిన్ వస్తుందనేది గాసిప్పే అయినా ఆసక్తికరం కాకుండా ఎలా వుంటుంది.? నాగబాబు కుమార్తె నిహారిక, అక్కినేని అఖిల్‌తో కలిసి ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందనేది ఆ గాసిప్ సారాంశం.
అసలు వాస్తవమేంటని ఆరా తీస్తే. నాగబాబు కుమార్తె నీహారికకి సినీ పరిశ్రమపై ఆసక్తి వున్నమాట వాస్తవమే అట. అయితే ఆమె ఓ ఆన్ లైన్ పబ్లిసిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్, డైరెక్షన్ వంటి అంశాలపై ఆమెకు ఆసక్తి వుందట. అంటే, భవిష్యత్తులో తండ్రిలా నిహారిక నిర్మాణ రంగంలోకి వచ్చే అవకాశం వుందన్నమాట. ఏమో, డైరెక్షన్ చేయాలన్న ఆసక్తి కూడా ఆమెలో వుండొచ్చు. అంతే తప్ప, ఆమె హీరోయిన్‌గా నటించే అవకాశాలు లేవు.
నాగబాబు తనయుడు వరుణ్‌తేజ విషయానికొస్తే, అతని తెరంగేట్రానికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ వంటి వాటిల్లో వరుణ్ తేజ ట్రెయినింగ్ తీసుకుంటున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. వరుణ్ తెరంగేట్రంపైనే ఇంకా పూర్తిస్థాయి స్పష్టత లేదు. ఈలోగా నాగబాబు కుమార్తె హీరోయిన్ అని గాసిప్స్. వినడానికి ఫన్నీగానే వుందీ గాసిప్. అయినా ‘మెగా’ గాసిప్ కదా, దానికి క్రేజ్ ఎక్కువ. అందులో వాస్తవం వున్నా, లేకున్నా.
|