Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి


జరిగిన కథ :  సహస్ర ఇంటి నుంచి తిరిగొస్తూ తమ ఇంటిముందు ఆగి వున్న వ్యాన్ ని చూసి ఆశ్చర్యపోతాడు విరాట్. కానీ అది తమ స్పిన్నింగ్ మిల్లు తాలూకూ వెహికల్ అని గుర్తుపడతాడు కానీ వచ్చిందెవరో అర్థం కాదు.....తీరా లోపలికొచ్చి చూసి, మునుసామి అని తెలియగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటాడు...ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి విరాట్ ప్రేమ కి సహకరించాలో ప్లాన్ చేస్తాడు మునుసామి...ఆ తర్వాత...

సహస్ర గురించి విరాట్‌, దీక్ష గురించి చందూ
మనసులో బాధపడుతూనే వున్నారు. వాళ్ళు తమతో మాట్లాడక పోవటం చాలా బాధ కలిగించే విషయం.

నాలుగో రోజు రాత్రి పది గంటలకి పడుకున్నాడే గాని నిద్రకు దూరమయ్యాడు విరాట్‌. ఎంత కాదనుకున్నా తనను మర్చి పోలేక పోతున్నాడు. కోపం తగ్గిందో ఇంకా అలాగే ఉందో తెలీదు. ఓ సారి ఫోన్‌లో ట్రయ్‌ చేద్దామనే ఉద్దేశం తో ఫోన్‌ అందుకొని సహస్ర సెల్‌కి ఫోన్‌ చేసాడు.

అటు సెల్‌ రింగవుతోంది...

సహస్ర ఎత్తటం లేదు...

ఒకసారి... రెండోసారి.... మూడో సారి కూడ ఫోన్‌ తీయ లేదు. సహస్ర కోపం తగ్గలేదని అర్ధమవుతోంది. అయినా వదలకుండా కాసేపాగి తిరిగి ఫోన్‌ అందుకున్నాడు. సహస్ర కు ఫోన్‌ చేయక ముందే అతడి ఫోన్‌ మోగింది.

అటు నుంచి సహస్ర చేసుంటుందనుకొని ఉత్సాహంగా ఫోన్‌ డిస్‌ప్లే వంక చూసాడు. అది సహస్ర నంబర్‌ కాదు. విశాల నంబరు. ఓరి దేవుడా... ఇదేమిటి ఇప్పుడు ఫోన్‌ చేసింది? అనుకుంటూ చట్టున లేచి కూచున్నాడు. ఫోన్‌ లిఫ్ట్‌ చేద్దామా వద్దా అనుకునే లోపలే ఆగిపోయింది.

ఆ రోజు రెస్టారెంట్‌ పార్కింగ్‌లో కలిసాక తర్వాత తనూ ఫోన్‌ చేయలేదు. విశాలా ఫోన్‌ చేయలేదు. తను చేస్తాడని ఎదురు చూస్తుండాలి. ఉన్నట్టుండి ఈ టైమ్‌లో ఇప్పుడు ఫోన్‌ చేసింది. ఆలోచించే లోపలే మరోసారి ఫోన్‌  మోగింది.

ఈ సారి లిఫ్ట్‌  చేసాడు.

‘‘హలోఈ టైం లో ఫోన్‌ చేసావ్‌, ఇంకా నిద్ర పోలేదా?’’ మృదువుగా అడిగాడు.

‘‘నిన్ను చూసాక నిద్ర మర్చి పోయి చాలా రోజులైంది. అయినా నీకు తెలీదా? ఇది లవర్స్‌  టైమ్‌. రాత్రిళ్ళు ఫోన్లు చేసుకుంటారు’’ అంది అటు నుంచి విశాల.

‘‘ఏయ్‌........మాటలతోనే సైలెంట్‌గా చంపేస్తావ్‌ నువ్వు’’ అంటూ నవ్వాడు.

‘‘ఫోన్‌  చేయకుండా నువ్వు నన్ను చంపుతున్నావ్‌గా!’’

‘‘అది కాదు విశాలా.........’’

‘‘ఇంకేం చెప్పొద్దు. ఫోన్‌ చేస్తానన్నావ్‌ చేయ లేదు’’

‘‘వీలు కాలేదు. సారీ’’

‘‘పోనీ రేపయినా వీలవుతుందా? ఫోన్‌ కాదు నువ్వు మా ఇంటికి రావాలి.’’

‘‘వస్తాలే.... కాని రేపు కాదు.’’

‘‘రావాలి... రేపు నా పుట్టిన రోజు’’

పుట్టిన రోజనగానే ఉలికి పడ్డాడు విరాట్‌.

దీక్ష పుట్టిన రోజు రసాభాసై సహస్ర తనతో మాట్లాడ్డం మానేసింది. ఇప్పుడు విశాల పుట్టిన రోజంటోంది. ఇదే సమస్య కు దారి తీస్తుందో........‘‘ఏయ్‌........నువ్వు నిజమే చెపతున్నావా?’’ అనుమానంగా అడిగాడు.

‘‘నీతో అబద్దం చెప్తానా? నువ్వు వస్తానంటేనే పుట్టిన రోజు జరుపుకుంటాను. లేదంటే అంతే.’’

‘‘ఏమిటిది? మరీ ఇరుకున పెట్టేస్తున్నావ్‌. అటు చూస్తే సహస్ర పీకల దాకా కోపంతో నాతో మాట్లాడ్డం మానేసింది. నువ్వు చూస్తే పుట్టిన రోజంటున్నావ్‌...’’

ఉన్నట్టుండి ఏడ్చేసింది విశాల.

‘‘విశాల ప్లీజ్‌ వూరుకో. ఇప్పుడేమైందని ఏడుస్తున్నావ్‌?’’ బుజ్జగించ బోయాడు.

‘‘ఏడవక ఏం చేయను విరాట్‌? నా సంతోషం కోసం ఈ చిన్న కోరిక్కూడ తీర్చలేవా?’’ అని అడుగుతుంటే ఇంకేం చెప్తాడు. కాదనలేక పోయాడు.

‘‘ఒకె ఒకె తెల్లవారితే పుట్టిన రోజు. ఇలా ఏడవ కూడదు. వస్తాను. సరేనా’’ అన్నాడు.

‘‘నిజాంగా వస్తున్నావా?’’ వస్తాననగానే ఆనందంతో విశాల గొంతులోమార్పు వచ్చేసింది.

‘‘ప్రామిస్‌గా వస్తాను. సరేనా? ఎప్పుడు రమ్మంటావ్‌ ఉదయమా, సాయంత్రమా?’’

‘‘సాయంత్రం నాలుగంటలకి. అడ్రసు నీ కిచ్చిన విజిటింగ్‌ కార్డు మీద వుంది. ఓల్డ్‌ మాంబళంలోమాయిల్లు.’’

‘‘ఒకె..........టైమ్‌కి వచ్చేస్తాలే’’

‘‘థాంక్యూ విరాట్‌. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా?’’

‘‘ఒకె విశాలా సీయు....  రేపు సాయంత్రం కలుద్దాం’’ అంటూ లైన్‌ కట్‌ చేసాడు.

తర్వాత మరోసారి ప్రయత్నించి చూద్దామని సహస్ర సెల్‌ కి ఫోన్‌ చేసాడు

సెల్‌ స్విచ్చాఫ్‌లో వుంది.

సహస్రకి విశాలకి ఎంత తేడా వుంది? ఒకరు ప్రశాంతంగా వుండే పార్వతి అయితే, ఒకరు తల మీద చిందు లేసే గంగమ్మ. సెల్‌ పక్కన పడేసి నిద్రకుపక్రమించాడు.

విరాట్‌ పరిస్థితి యిలా వుంటే.

పక్క గదిలో చందూ పరిస్థితి మరోలా వుంది.

చందూ కి మాగన్నుగా నిద్ర పడుతుండగా.

అతడి సెల్‌ మోగింది.

ఎవర్రా బాబు ఈ టైమ్‌లో అనుకూంటూ సెల్‌ అందుకొని చూసాడు... దీక్ష.

చందూ నిద్ర మత్తు చట్టున ఎగిరి పోయింది. దీక్ష ఫోన్‌ కాల్‌ గమనించగానే లాటరీలో కోటి రూపాయలు తగిలినంత సంతోషం వేసింది. గబుక్కున లేచి కూచొని సెల్‌ ఆన్‌ చేసాడు. చాలా బెట్టుగా బుద్ది చెప్పేలా మాట్లాడాలనికుని మనసు దృఢం చేసుకుంటూ ‘‘హలో..........ఎవరూ?’’ అనడిగాడు కావాలని.

‘‘ఏంటీ? అప్పుడే నా పేరు కూడ మర్చి పోయావా?’’ అటు నుంచి దీక్ష కోపంగా నిలదీసింది.

‘‘అవును మర్చి పోయాను. నీ పేరేంటి?’’ అన్నాడు బింకంగా.

అంతే!

ఉన్నట్టుండి వా అంటూ.

ఫోన్‌లోనే ఏడ్చేసింది దీక్ష.

ఆ ఏడుపు వినగానే చందూ కోపం దూదిపింజలా ఎగిరి పోయింది.

‘‘ఓ మై గాడ్‌ దీక్షా........ఏమైంది?’’ కంగారుగా అడిగాడు.

దీక్ష ఏడుపు ఆప లేదు.

‘‘సహస్ర........ తను క్షేమంగానే ఉంది గదా?’’ ఆందోళన రెట్టింపు అవుతుండగా అడిగాడు.

‘‘తనకేం? హాయిగా గదిలో నిద్ర పోతోంది’’ అంది వెక్కి వెక్కి పడుతూ దీక్ష.

‘‘మరింకేమిటి..... ఎందుకా ఏడుపు?’’

‘‘ఏంటా.... ఎదురుగా వుంటే నిన్ను కొట్టాలనుందిరా. తన్నాలనుంది. కోపం తీరా తిట్టాలనుంది.’’

‘‘అదే ఎందుకంటున్నాను. కారణం చెప్పి తిట్టు’’

‘‘కారణం వేరే చెప్పాలా? ప్రాణంలా ప్రేమించిన పిల్ల అలిగింది. కనీసం ఓ ఫోన్‌ చేద్దామన్న బుద్ది ఉండక్కర్లా?’’

‘‘ఎలా ఉంటుంది? నా ముఖం చూపించొద్దని ఒక అమ్మాయి చెప్పాక బుద్ధున్న ఏ మగాడయినా ఫోన్‌ చేస్తాడా?’’

‘‘అవును. నీముఖం చూపించొద్దన్నాను. నా ముఖం చూడొద్దన్నానా?’’

‘‘ఇంటి తలుపులు శాశ్వతంగా మూసుకు పోయాయన్నావ్‌గా?’’

‘‘గుండె తలుపులు మూసుకు పోయాయని చెప్పలేదుగా’’

‘‘అయ్యా బాబోయ్‌ పిచ్చెక్కిస్తున్నావ్‌. నీ మాటల్లో ఇన్ని అర్ధాలు వెదుక్కునేంత తెలివి తేటలు నాకు లేవు గాని ఇప్పుడేమంటావ్‌?’’

‘‘నా వల్ల కావట్లేదు. అర్జంటుగా నిన్ను చూడాలి.’’

‘‘రేపు చూద్దాంలే’’

‘‘రేపు కాదు. ఇప్పుడే ... ఈ క్షణమే. సహస్ర లోపల నిద్ర పోతోంది. నేను నిద్ర పట్టక బయట అటు యిటు తిరుగుతున్నాను. నువ్వు వచ్చేయ్‌.’’

‘‘ఇప్పుడా...........వూహూ నేను రాను’’

‘‘నువ్వొస్తావా? గోడ దూకి నన్ను రమ్మంటావా?’’

‘‘ఇదెక్కడి గోలరా బాబు. నువ్వు రాకు. రాక ఛస్తానా నేనే వస్తా ఆగు’’ అంటూ లైన్‌ కట్‌ చేసి బెడ్‌ దిగాడు.

దీక్షకు కలవబోతున్నందుకు చాలా ఆనందంగా వుంది. షర్టు వేసుకొని గది తలుపు ఓరగా తెరిచి హాల్లోకి చూసాడు. హాల్లోని సోఫాలో బండ శివ గురక పెట్టి నిద్ర పోతున్నాడు. అవతల మునుసామి ఉంటున్న గెస్ట్‌ రూమ్‌ తలుపు ఓరగా తెరిచి వుంది. ఇటు విరాట్‌ గది తలుపు మూసి వుంది. ఎవరూ తనను గమనించటం లేదని నిర్ధారణ కొచ్చాక పిల్లిలా గదిలోంచి బయటకొచ్చి తలుపు దగ్గరగా మూసాడు.

చప్పుడు గాకుండా వీధి తలుపు తీసి ...

తిరిగి మూసి తాళం వేసి తాళాలు జేబులో వేసుకున్నాడు, కాంపౌండ్‌ గేటు తాళం తీయకుండా గేటు దూకి వీధిలోకొచ్చాడు. అప్పటికి సమయం పదకొండు గంటలు. అమావాస్య చీకట్లు నగరమంతా వ్యాపించినట్లున్నాయి. వీధిలైట్లు కునిపాట్లు పడుతున్నాయి. గబగబా దీక్ష ఇంటి వైపు నడక ఆరంభించాడు.

కాలనీ అంతా నిశబ్దంగా వుంది.

ఇళ్ళలో లైట్లు ఎక్కడా వెలగటం లేదు.

చందూ మలుపు తిరిగి కాలనీ గేటును సమీపిస్తున్నాడు. సరిగ్గా ఆ గేటు దగ్గరే గ్రామ సింహాల్లా మూడు కాలనీ సింహాలు తీరిగ్గా పడుకునున్నాయి. గ్రామ పొలిమేరల్లో గ్రామ దేవతలు కాపలా వున్నట్టు ఆ మూడు వీధి శునకాలు కాలనీ కి కాపలాన్న మాట. అవి ఒంటరిగా వస్తున్న చందుని చూడగానే అనుమానంతో తోకలు నిటారుగా చేస్తూ లేచి నిలబడి గుర్రుమన్నాయి.

వాటి అలికిడిని గమనించగానే

ఉలికిపడి ఆగిపోయాడు చందూ

అతడు ఆగటం చూడగానే అవి మూడు ఒకే సారి కోరస్‌గా భౌ...భౌ మంటూ ముందుకొచ్చాయి.

చందూకి ఏం చేయాలో తోచలేదు

అక్కడ దీక్ష తన కోసం వేయిట్‌ చేస్తుంటే

వెధవది కుక్కలకి భయపడి ఆగి పోవటమా...?

అటు యిటు చూసి పొడవాటి ఒక కర్రముక్క అందుకున్నాడు. ఎందుకైనా మంచిదని రెండు పలుకురాళ్ళు కూడా అందుకొని వాటి వైపు విసిరాడు. కుక్కలు కాస్త వెనక్కి తగ్గాయి. కాని మొరగటం ఆపలేదు. వాటికి కర్ర చూపించి బెదిరిస్తూ గేటు దాటి మూడో వీధిలోకి మలుపు తిరిగాడు. అలాగని కుక్కలేమీ అతడ్ని వదల్లేదు. మొరుగుతూ వెంట పడ్డాయి. వాటి గోల కి కాలనీ యిళ్ళలో లైట్లు వెలగటం మొదలైంది. చందూకి కంగారు పట్టుకుంది. పెళ్ళికి పోతూ పిల్లిని చంక పెట్టుకెళ్తూన్నట్టుంది తన పరిస్థితి. ఈ కుక్కల గోల ఏంటిరా దేవుడా, లాభం లేదనుకొంటూ ఒక్కసారిగా పరుగు ఆరభించాడు.

పోలోమని వీధంతా గోల చేస్తూ చందూ వెంట పడ్డాయి కుక్కలు. అయితే వాటికి అంద కుండా ఎక్కడా ఆగకుండా ఏక బిగిన పరుగెత్తి చివర వున్న దీక్ష ఇంటికి చేరుకున్నాడు. ఎగిరి గోడ దూకి కాంపౌండ్‌లో పడ్డాడు.

చందూ కోసం ఎదురు చూస్తూ...

పోర్టికోలో చీకట్లలో నే అటు యిటు తిరుగుతోంది దీక్ష. చందు గోడ దూకటం చూసి గబగబ గేటు వద్ద కొచ్చింది. మొక్కల మధ్య వున్న చందూ ని చూస్తూ ‘‘రాకు అక్కడే ఉండు’’ అంటూ నాలుగు పలుకు రాళ్ళు తీసి కుక్కల మీదికి విసిరింది. దాంతో అవి తోక ముడిచి వెను తిరిగాయి. అదృష్టం కొద్ది ఎవరూ వీధిలోకి రాలేదు చందూ లేచి దగ్గర కొచ్చాడు.

‘‘వచ్చే వాడివి ఒక్కడివీ రావచ్చుగా. వెంట అవెందుకు?’’ అంది చిన్నగా దీక్ష.

‘‘నువ్వు రమ్మన్నావుగా బాజా బజంత్రీలు ఈ టైంలో ఎలాగూ దొరకవు. అందుకని వాటిని వెంట తెచ్చాను. ముఖం చూడు. అర్ధరాత్రే గాని పిలవటానికి వేరే టైం దొరకలేదా నీకు? వచ్చేటప్పుడు ఎలాగో వచ్చేసాను. వెళ్ళేటప్పుడు ఎలాగో తెలీటం లేదు. దొరికితే పీకేసేవి’’ అంటుంటే చిన్నగా నవ్వేస్తూ అతడ్ని కౌగిలించుకుంది దీక్ష. అంతే.

పది నిముషాల పాటు ఇద్దరికీ సమయం తెలీలేదు. విరహం తీరా కౌగిలింతలు ముద్దులు ముంచెత్తాయి.

‘‘దీక్షా’’ పిలిచాడు.

‘‘వూ’’ అంది చిన్నగా.

‘‘ఏమిటిదంతా నాకే మాత్రం నచ్చలేదు. వాళ్ళిద్దరూ గొడవ పడ్డం ఏమిటి? మధ్యలో మనం విడిపోవటం ఏమిటి? ఇప్పటిగ్గాని నీకు బుద్ది రాలేదా?’’ అడిగాడు.

‘‘ష్‌........నెమ్మదిగా మాట్లాడు. సహస్ర లేస్తుంది. నా బుద్ది బాగానే వుంది. నీకే అర్ధం కాలేదు. నేను మిమ్మల్ని సమర్ధిస్తే సహస్ర ఒంటరిదై పోయినట్టు మరింత బాధ పడుతుంది. అందుకే అలా మాట్లాడాను. తర్వాతయినా నువ్వు ఫోన్‌ చేస్తావు చెప్పొచ్చులే అనుకున్నాను.’’‘‘అదీ కరక్టే అనుకో’’

‘‘అనుకోవటం కాదు గాని నిజం చెప్పు. విశాలని కూడ విరాట్‌  ప్రేమిస్తున్నాడా?’’

‘‘అంటే ఏంటి నీ ఉద్దేశం ఈ ఎంక్వయిరీ కోసమే నన్ను పిలిచావా?’’

‘‘అదేం కాదు. మనలో మనం నిజాలు చెప్పుకుంటే ఓ క్లారిటీ వస్తుంది గదా!’’

ఇద్దరూ పోర్టికోలోని బల్ల మీద కొచ్చారు.

‘‘ఓకె సహస్రతో చెప్పనంటే జరిగిందంతా చెప్తాను’’

‘‘ప్రామిస్‌గా చెప్పను, సరేనా!’’

జరిగిన విషయాలన్నీ...

క్లుప్తంగా దీక్షకు వివరించాడు చందూ.

విచిత్రమైన విషయం సహస్ర, విశాల ఇద్దరూ ఒకే రోజు విరాట్‌ లైఫ్‌లోకి రావటం.

ఆ రోజు ఎగ్మోర్‌  రైల్వే స్టేషన్‌ బయట చందూ చేసిన అల్లరితో విశాల పరిచయమైంది. స్టేషన్‌కొచ్చి రైలెక్కగానే రైల్లో సహస్ర దీక్షలు పరిచయమయ్యారు. ప్రస్తుతం విరాట్‌ కోసం వచ్చిన మునుసామి అతడి మనుషుల గురించి కూడ చెప్పేసాడు.

సుమారు గంట పైగా దీక్ష వద్ద వున్నాడు. అప్పటికి పన్నెండు దాటుతోంది. అర్ధరాత్రి.

‘‘కుక్కలు తరుముతాయి వెళ్ళొద్దు. ఉదయంవెళ్ళు’’ అంది చందూని వారిస్తూ.

‘‘ఫరవా లేదు. ఇక్కడుంటే సహస్రకి తెలిసి పోతుంది. రేపు ఫోన్‌ చేస్తాలే’’ అన్నాడు చందూ.

‘‘రేపు కాదు. ఇప్పుడు ఇంటి కెళ్ళగానే ఫోన్‌ చెయ్యి. లేదంటే ఎలా వెళ్ళావో తెలీక కంగారు పడతాను.’’

‘‘ఓకె’’అంటూ మనసారా దీక్షను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఒక చెక్కు తీసి అతడి జేబులో ఉంచింది దీక్ష.‘‘బ్లాంక్‌ చెక్‌ ఇస్తున్నాను. ఎంత కావాలో రేపే బ్యాంక్‌ కెళ్ళి తెచ్చుకో. వెంటనే నువ్వు బైక్‌ తీసుకోవాలి’’ అంది.

‘‘వద్దని ఇంతకు ముందే చెప్పాగా’’ అంటూ చెక్కు రిటనివ్వబోతే కోప్పడింది దీక్ష.

‘‘ఎంత కాలం ఫ్రండు బైక్‌ మీద తిరుగుతావు? నా కోసం నువ్వు కొనాల్సిందే’’ అంది పట్టుదలగా. ‘‘ఒకె బైక్‌ తీయగానే నేరుగా షాపింగ్‌ మాల్‌ కొచ్చి పిలుస్తాను. వెంటనే నువ్వు రావాలి. వస్తేనే కొత్త బైక్‌ మీద గుడికెళ్ళి పూజ చేయించట.’’

గేటు దూకి వీధిలోకొచ్చేసాడు చందూ...

I              I                     I

మరునాడు విరాట్‌ చందూలు ఆఫీస్‌కు వెళ్ళకుండా ఫోన్‌ చేసి లీవ్  చెప్పేసారు. ఉదయం లేవగానే చందూ, ఈ రోజు నేను కొత్త బైక్‌ కొంటున్నాను. నువ్వు రావాలి, అంటూ గొడవ చేయటంతో ఇక లీవు పెట్టక తప్ప లేదు విరాట్‌ కి.

‘‘అయినా ఇప్పుడు నీకు బైక్‌ ఎందుకురా? నా బైక్‌ మీద తిరుగుతున్నాంగా’’ అంటూ కోపడ్డాడు విరాట్‌.

‘‘ఇది నా నిర్ణయం కాదు, దీక్ష నిర్ణయం, తనే డబ్బిచ్చింది.’’

‘‘వ్వాట్‌ అబద్ధాలు వేరేనా?’’

‘‘అబద్దం కాదు రా బాబు నిజం. అర్ధరాత్రి ఫోన్‌ చేసి గోల చేస్తుంటే వెళ్ళాను. కుక్కలు వెంట పడ్డాయి’’ అంటూ చందూ జరిగింది చెప్తుంటే పగల పడి నవ్వాడు విరాట్‌.

‘‘బాగుందిరా నీ అడ్వంచరు. ఒకె సహస్ర ఎలా ఉందట?’’ అడిగాడు.

‘‘బాగానే వుందట. మేం కలుసుకున్నట్టు తనకు తెలీదు’’ చెప్పాడు చందూ.

ఆ ఉదయమే బ్యాంకు కెళ్ళి చెక్కు మార్చి లక్ష రూపాయలు తీసుకున్నాడు చందూ. విరాట్‌ని వెంట బెట్టుకొని షోరూమ్‌కెళ్ళి తొంబై వేలకి మంచి బైక్‌ కొన్నాడు. మధ్యాహ్న సమయానికల్లా కొత్త బైక్‌ ఇంటి ముందు ఉంది. ఫస్ట్‌ రైడ్‌ గా ఫ్రండు విరాట్‌ నే బైక్‌ నుఇంటికి తీసుకు రమ్మని చెప్పి తను విరాట్‌ బైక్‌ మీద వచ్చాడు. సరిగ్గా మూడు గంటలకి కొత్త బైక్‌ స్టార్ట్‌ చేసుకొని లజ్‌ కార్నర్‌ ని షాపింగ్‌ మాల్‌ కు వెళ్ళాడు చందూ. ఫోన్‌ చేయగానే దీక్ష వచ్చేసింది. బైక్‌ ను చూసి మెచ్చుకుంది. బండికి ప్రత్యేక పూజ చేయించడానికి ఇద్దరూ బైక్‌ మీద ట్రిపిల్‌ కేన్‌ లోని పార్ధసారధి గుడికి బయలు దేరి వెళ్ళారు. ఈ విషయం సహస్రకు తెలీదు.

అక్కడ విరాట్‌ సరిగ్గా మూడున్నర గంటలకి...

విశాల ఇంటికి బయలు దేరి...

బైక్‌ని ఓల్డ్‌  మంబళం దిశగా పోనిచ్చాడు.

I               I               I

ఓల్డ్‌  మాంబళంలో

ముదలియార్‌ స్ట్రీట్‌ లోకి ఎంటర్‌ కాగానే...

ఎదురుగానే కుడి పక్క ఉంది విశాల నివాసం. సువిశాలమైన ఆవరణ, చుట్టూ ఎత్తయిన కాంపౌండ్‌ వాల్‌. మధ్యలో రెండంతస్థుల భవంతి.విరాట్‌  వెళ్ళే సరికి విశాల అతడి కోసం ఎదురు చూస్తూ ఆవరణలోనే ఉంది. పోర్టికోలో విశాల కారు దాని పక్కనే ఒక జీపు ఉన్నాయి. ఇద్దరు పని వాళ్ళు మొక్కలకు నీరు పోస్తూ ఆవరణలో బిజీగా వున్నారు.విశాల తలార స్నానం చేసి వదులుగా జడవేసుకొని జడలో గులాబి తురిమింది. పుట్టిన రోజు గదా, కంచి పట్టు చీర జాకెట్‌లో పుత్తడి బొమ్మలా మెరిసి పోతోంది.

సరాసరి పోర్టికో లో కొచ్చి బైక్‌ దిగాడు విరాట్‌. వెనకే వచ్చి అతడి చేయి అందుకుంది విశాల. ఆమె కళ్ళలో ఆనందం తొణికిసలాడుతోంది. ‘‘మమ్మీని పరిచయం చేస్తాను. నాతోరా’’ అంటూ చేయి వదల కుండా లోనకు తీసుకెళ్ళింది.

‘‘మమ్మీ.... మమ్మీ.... ఎక్కడ?’’ అనరిచింది విశాల.

‘‘ఆ... వస్తున్నా’’ అంటూ కిచెన్‌లోంచివిశాల తల్లి గొంతు వినిపించింది.

‘‘రా మమ్మీ. ఎవరొచ్చారో చూడు’’ మళ్ళీ పిలిచింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్