Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyotishyam - vignaanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వేపాకు ప్రసాదం – మద్దూరు మహత్యం - పి.యస్.యమ్. లక్ష్మి

అవునండీ..మీరెప్పుడన్నా వేపాకు తిన్నారా?  తింటే అది ఎలా వుంది?  చేదుగానా!   మరీ చెప్తారు!!  వేపాకు మీకు చేదుగా వుందేమోగానీ మద్దూరు వాసులకు మాత్రం తియ్యగా వుంటుంది!  ఏం అక్కడ వేప చెట్లని పంచదార నీళ్ళు పోసి పెంచుతారా!!  అని అడక్కండి.  అక్కడ వున్న మహిషాసురమర్దని మహిమ అది!  మరి అలాంటి మహిమగల తల్లి గురించి తెలుసుకోవాలి కదా.

తమిళనాడులోని తిరుత్తణి తాలూకా, తిరువల్లూరు జిల్లాలో వున్నదీ ఆలయం.  పొరుగింటి పుల్లకూర రుచి అనకపోతే ఇక్కడ ఒక విషయం చెబుతానండీ.  తమిళనాడులోని పురాతన ఆలయాలు అతి పెద్దవి, అద్భుతమైన శిల్పసంపదతో అలరారేవి.  అంతేకాదు ..  అక్కడి ప్రజలు కూడా ఆలయాలను భక్తి ప్రపత్తులతో దర్శిస్తారు.

శ్రీ మహిషాసురమర్దని ఆలయం, మద్దూరు

ఆలయ నిర్మాణం

 

ఆలయం చిన్నదే.  ప్రాంగణం మాత్రం చాలా విశాలమైనది.  1960లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.    ఆ సమయంలో ఇక్కడ చెన్నై – ముంబయి మధ్య రైల్వే ట్రాక్ వెయ్యటానికి తవ్వకాలు జరుగుతున్నాయి.   ఆ తవ్వకాలలో బయటపడింది ఈ అమ్మవారి విగ్రహం.  ఆ విగ్రహాన్ని పురాతనమైన విగ్రహంగా గుర్తించి, ఇక్కడ ప్రతిష్టించి పూజలు చేయసాగారు.  అప్పటినుంచి ఆ తల్లి కొలిచేవారికి కొంగు బంగాలమయి భక్తులపాలిట కల్పవల్లిగా కరుణిస్తోంది.

తమిళనాడులో నేను గమనించిన ఇంకొక విషయం.  అక్కడివారు దేవాలయంలో దీపం వెలిగించటానికి ప్రాధాన్యమిస్తారు.  కొందరు నూనె, వత్తులు తీసుకువచ్చి వున్న దీపాలలోనే వేస్తున్నారు.  కొందరు వుట్టి నూనె తీసుకువచ్చి దీపాలలో వేస్తున్నారు.  చాలా ఆలయాలలో నెయ్యి దీపాలు, నూనె దీపాలు, నువ్వుల దీపాలు వగైరా అనేక రకాల దీపాలు అమ్ముతారు.  చిన్న చిన్న ప్రమిదలలో వుండే ఈ దీపాల ఖరీదు కూడా రూ. 1,  రూ. 2 వుంటాయి.  మనం ఇంటినుంచి తీసుకు వెళ్ళలేదే అనుకోకుండా, ఎక్కడికక్కడ కొని కూడా దీపారాధన చెయ్యవచ్చు.

ఆలయం బయట  ఓం శక్తి ఉపాలయం వున్నది.  అక్కడ మహిళలు, దాదాపు వచ్చినవారంతా,  అమ్మవారి మూర్తిముందు  నిమ్మకాయ డిప్పలలో దీపాలు వెలిగిస్తున్నారు.  మేము ముందు తీసుకువెళ్ళలేదుగానీ అక్కడ అమ్మేవాటిని తీసుకుని   తలా ఒక నిమ్మకాయ దీపం వెలిగించాం.  దానికేమన్నా లెక్క వుందేమో తెలియదు.

మహిషాసురమర్దిని తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాము.  ఈ తల్లి పేరు మహిషాసుర మర్దిని.   అమ్మవారు  అష్ట భుజాలతో అలరారుతూంటుంది.  ఎనిమిది చేతులలో ఆయుధాలున్నాయి.  మహిషాసురుణ్ణి శూలంతో చంపుతున్నట్లున్నా, అమ్మవారి ముఖం రౌద్రంగా కాక,  ప్రశాంత వదనంతో భక్తులను కరుణిస్తున్నట్లున్నది.  భక్తులు కూడా బాగానే వస్తున్నారు.

స్ధల వృక్షం

 

ఇక్కడి స్ధల వృక్షం వేప చెట్టు.    ఇక్కడి విశేషం ఏమిటో తెలుసా?  స్ధల వృక్షం ఆకు ప్రసాదంగా ఇస్తారు.  అది చేదుగా వుండదు.  తియ్యగా  వుంటుందంటారు!  మేము తిన్నాము!  కొంచెం వగరనిపించింది కానీ చేదు లేదు!!  అది అమ్మవారి మహిమ అంటారు..    ఇక్కడ అమ్మ మన బాధలన్నీ హరింపచేసి మనకి సుఖవంతమైన జీవితాన్నిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి పౌర్ణమికీ అమ్మవారికి 108 లీటర్ల పాలతో అభిషేకం, హోమాలు చేస్తారు.

మార్గం

తిరుత్తణినుంచి చెన్నై – తిరుపతి రహదారిలో (యన్.హెచ్. 205), రేణిగుంట, చెన్నై రైల్వే ట్రాక్ పక్కనే వెళ్తుంటే లెవెల్ క్రాసింగ్ వస్తుంది.  అది దాటాక కొద్ది దూరంలోనే మహిషాసుర మర్దని ఆలయం కనబడుతుంది. తిరుత్తణి బస్ స్టాండ్ నుంచి మద్దూరు గేటుదాకా బస్సులుంటాయి.  ప్రయాణం 10 నిముషాలు పడుతుంది.  అక్కడనుంచి ఆలయందాకా షేర్డ్ ఆటోల్లోగానీ, మినీ బస్ లో గానీ  5 నిముషాల్లో చేరుకోవచ్చు.

దర్శన సమయాలు

ఉదయం 6-30 నుంచి మధ్యాహ్నం 1-00 గం. దాకా, మళ్ళీ సాయంకాలం 4 గం. ల నుంచి 9-30 దాకా.

సమీప ఆలయాలు

తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాలయం, మరియు మద్దూరు కి 15 కి.మీ. ల లోపే వున్న నల్లత్తూరు ఆంజనేయస్వామి  ఆలయం

కాంటాక్టు నెంబరు

శ్రీ కురుకల్  రామమూర్తి   నెంబరు  9626274195

మరిన్ని శీర్షికలు
Weekly Horoscope april 10th to april 16th