Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
annamayya pada seva

ఈ సంచికలో >> శీర్షికలు >>

భగవాన్ శ్రీ రమణ మహర్షి (తొమ్మిదవ భాగం) - సుధారాణి మన్నె

bhagavaan shree ramana maharshi biography

ఓం నమో భగవతే శ్రీ రమణాయ.

విరుపాక్ష గుహ:
విరూపాక్ష గుహలో "మట్టి అడుసుతో కట్టిన ఆ అరుగు మీద పడుకున్నప్పుడు ఉన్న సుఖం, రమణాశ్రమంలో ఉండట్లేదని భగవాన్ అంటూ వుండేవారు. విరూ పాక్ష గుహకు ముందున్న వసారాలోని అరుగు భగవానే స్వయంగా కట్టారు. ఆ తర్వాత దానికి సిమెంట్ చేశారు. ఇప్పటికీ "ఆ అరుగును" విరూ పాక్ష గుహలో చూడవచ్చును. "ఆ అరుగు కడుతూ ఉండగా క్రొత్తవారు ఎవరో వచ్చి "స్వామీ ఎక్కడ?" అని భగవానే అడిగితే, "ఎక్కడికో వెళ్ళారని" చెప్పి పంపారట కదా అని, భగవాన్ ని ఒక భక్తుడు అడిగితే, భగవాన్ ఇలా చెప్పారు.

"ఒక రోజు ఉదయాన్నే రాళ్ళు పేర్చి కాళ్ళతో మన్నుతొక్కి, ఆ అడుసుతో అరుగువేస్తూ వున్నాను. వారెవరో క్రొత్త వారు వచ్చారు." స్వామి ఎక్కడ?" అని నన్నే అడిగారు. నేను తప్ప అక్కడ మరెవ్వరూ లేరు. అందువల్ల నేనే బదులు చెప్పవలసి వచ్చింది. "స్వామియా ఇప్పుడే ఎక్కడికో వెళ్ళారు" అన్నాను. "ఎప్పుడు వస్తారని" వారంటే "ఏమోనన్నాను". ఎంతసేపవునో ఏమోనని, వారు కొండదిగి పోతూవుంటే, ఎచ్చమ్మ (భగవాన్ కి సేవ చేసిన వాళ్ళలో ఒకరు. శ్రీ రమణులకు ప్రతిరోజూ భోజనం పెట్టడం, వాళ్ళు ముసలివాళ్ళు అయినా, రమణాశ్రమంలో వంట వసతులు ఏర్పడినా, స్వయంగా తాము వండి తెచ్చిన భోజనాన్ని మహర్షికి వడ్డించటం మానలేదు. దురదృష్టవశాత్తు ఆమె భర్త, పిల్లలూ గతించారు. తన దు:ఖాన్ని ఏదో గురువు అంతమొందిస్తారని గట్టి నమ్మకముండేది ఆమెకు. శ్రీ రమణుల నాశ్రయించి, ఆమె స్వాంతన పొందారు) ఎదురై విషయం అడిగి తెలుసుకొని, "స్వామిని నేను చూపిస్తాను. రండని" వెంట బెట్టుకు వచ్చింది.  ఈ లోపల నేను స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. పలని స్వామీ వాళ్ళు వచ్చారు. ఎచ్చమ్మ అన్నపు గిన్నె లోపలపెట్టి, నాకు నమస్కరించి లేచి, ఆ వచ్చిన వారితో "అరుగో వారే స్వామి" అన్నది. పాపం వారు తెల్లబోయి నమస్కరించి "స్వామి వారు వీరేనా అమ్మా. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అరుగు కడుతున్నారు. ఎవరో ననుకొని "స్వామి ఎక్కడ?" అని అడిగాం. ఎక్కడికో వెళ్ళారని సెలవిచ్చారు. నిజమేననుకుని వెనక్కు వచ్చాము" అన్నారు.

"అదేమి స్వామి! అలా మాయ మాటలు చెప్పి పంపారు పాపం" అని ఎచ్చమ్మ నాతో జగడం పెట్టింది. "ఓహో.! సరిపోయింది. నేనే స్వామినని ,మెడలో బోర్డు కట్టుకునేదా ఏమి!" అన్నాను. అదొక తమాషా" అని భగవాన్ సెలవిచ్చారు.

అలాగే ఇంకొకసారి, స్వామి తెల్లవారు ఝామున లేచి, తలంతా దుప్పటి కప్పుకొని కూరలు తరుగుతూ కూర్చున్నారు. గిరి ప్రదక్షణకి వెళ్ళే వాళ్ళు, స్వామిని ఎవరో అనుకోని "అయ్యా! సోఫా మీద స్వామి లేరే. ఎక్కడున్నారు?" అని స్వామినే అడిగారు.

దానికి వారు సమాధానంగా 'ఇదుగో ఇప్పుడే అట్లా బయటికి వెళ్ళారు. కొంచెం సేపుంటే వస్తారు" అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది అక్కడున్న వాళ్ళెవరో చూసి, "అదేమి స్వామి? అట్లా చెప్పి పంపారు?" అన్నారు.

"ఏం చేసేది? స్వామి ఎక్కడ?" అని స్వామినే అడిగితే, నేనే స్వామినని చెప్పుకునేదా యేమి అన్నారు. ఆ విధంగా ఎన్నో సార్లు జరిగింది" అని సెలవిచ్చారు శ్రీ భగవాన్.

స్కందాశ్రమంలోని భక్తులు సుబ్రహ్మణ్యస్వామిని స్తుతిస్తూ పాడేవారు. రెండు కర్ర ముక్కలు తీసుకొని, ఎదురుగా ఉన్న కుంపటి అంచు మీద కొడ్తూ వాళ్ళతో పాటు తాళం వేసేవారు శ్రీ భగవాన్. వారి చేతులు తాళం వేస్తున్నా, లోతు తెలియని అనుగ్రహపూరితమైన దృక్కు ఏదో లోకాతీతమైన దానిని మౌనంగా కనబరిచేది.

ఒక భక్తుడు " రమణ సద్గురు, రమణ సద్గురు" అని పాడుతుండగా, వారితో పాటు భగవాన్ కూడా పాడారు. అక్కడ వున్న భక్తులకు ఇది విడ్డూరంగా తోచి, నవ్వారు. అప్పుడు శ్రీ భగవాన్, "ఇందులో వింత ఏమిటి?" "రమణ" అంటే ఆరు అడుగుల విగ్రహానికే ఎందుకు పరిమితం చెయ్యాలి? సర్వవ్యాప్తమైన దైవాన్నే కదా మీరు "రమణ సద్గురు, రమణ సద్గురు" అంటూ స్తుతిస్తారు? నేను మాత్రం ఎందుకు స్తుతించకూడదు?" అన్నారు.

ఒక భక్తుడు సంస్కృత స్తుతులను భగవాన్ దగ్గర పాడుతూ ఉంటే, శ్రీ భగవాన్ "ఇవన్నీ నీవు నేర్చుకున్నావు. నా సంగతి అలా కాదు. నేనిక్కడికి(తిరువాన్నామలై) వచ్చేటప్పటికి నాకేమీ తెలియదు. నేనేమీ నేర్చుకోలేదు. ఏదో తెలియని శక్తి నన్ను పట్టి, నాలో మార్పుతెచ్చింది" అన్నారు.

ఒక భక్తుడు "పశువులాగ బ్రతుకుతున్నాను, నేను ఎదిగేది ఎట్లా?" అని భగవాన్ ని అడిగారు.

శ్రీ భగవాన్ సమాధానంగా, "ఇంద్రియాలకంటే, మనస్సుకంటే బలమైన శక్తిని మేల్కొల్పటం వల్లే ఇది జరుగుతుంది. నీలో ఉన్న ఆ శక్తిని మేల్కొల్పి, పెంపొందించుకోగలిగితేనే అన్నిటినీ జయించవచ్చు. ధ్యాన ధారను అంతరాయం లేకుండా నిలుపుకోవాలి. మితమైన ఆహారం తీసుకోవటం వల్లా, అట్లాగే ఇతర నియమాలని పాటించటం వల్లా లోపల సమాభావాన్ని నిలుపుకోవచ్చు". "నీవు శరీరంతో తాదాత్మ్యం చెందినంత కాలం లైంగిక బావాలను, ఇతర ఆకర్షణలనూ, తప్పించుకోలేవు," అన్నారు.

రమణాశ్రమానికి కొద్దిదూరంలో ద్రౌపది గుడిలో ఒక వృద్దుడు ఉండేవాడు. ఆయనకు ఉన్న ఆస్తి అంతా ఒక ఇనుపగిన్నె, ఒక గొడ్డలీ. గొడ్డలితో వంట చెరుకును నరికేవారు. ప్రతిరోజూ గంటల తరబడి శ్రీ భగవాన్ వైపే చూస్తూ నిలబడేవారు. అడవి మధ్యలో ఉన్న గుడిలో రాత్రిళ్ళు గడిపేవారు.

ఒకనాడు ఆయన గుడి ఎదురుగా నిలబడి ఉండగా, చలంగారు చూసి, ఈ నిర్జన ప్రదేశంలో ఏం చేస్తుంటారని అడిగారు. అక్కడే పడుకుంటానన్నారు. "ఏమిటీ! ఒక్కరే ఇక్కడ పడుకుంటారా? మీకు భయం వెయ్యదూ" అని ఆశ్చర్యంతో అడిగారు. "భయం ఎందుకు?" అంటూ, "శ్రీ భగవాన్ కాంతి నాపై విరజిమ్ముతారు. రాత్రంతా నీలపుకాంతి నన్ను చుట్టేస్తోంది. వారికాంతి నాకున్నంతకాలం నాకు భయమెట్లా ఉంటుంది?" అన్నారా వృద్ధుడు. శ్రీ భగవాన్ తన ప్రేమనీ, కాంతినీ, ఒక నిరుపేద ముసలి బిచ్చగానికి పూర్తిగా అనుగ్రహించారు. కానీ "మేము భక్తులం" అని చెప్పుకునే వారికి ఈ అనుగ్రహం లభించలేదు. ఎలా లభిస్తుంది అసలు? ఎంతసేపు మనస్సుతో పెనుగులాడుతుంటే?"

ఒక భక్తుడు రామనామం గొప్పదా? అరుణాచల మంత్రం గొప్పదా? అని భగవాన్ ని అడిగారు.

శ్రీ భగవాన్ సమాధానంగా రెండూ ఒక్కటే. 'రా' అంటే 'అది'. 'మ' అంటే నీవు. అరుణాచలంలో 'అ' అంటే 'అది'. 'రు' అంటే "నీవు". 'ణ' అంటే "అయి ఉన్నావు". నీ మనస్సునే నీ నోరు అనుకొని "రామ" అన్న నామం ఎప్పుడూ విష్ణు చక్రం వలె అందులో తిరుగుతూ ఉండనివ్వు, నువ్వు జపం చేస్తున్నట్లు ఎవ్వరికీ తెలియనివ్వకు" అన్నారు శ్రీ భగవాన్.

శ్రీ భగవాన్ తన చుట్టూ ఉన్న వారి ఆధ్యాత్మిక పరిపక్వతని గ్రహించేవారు. అంతే కాకుండా, వారి వద్దకు వచ్చే జంతువులలో కూడా కనిపెట్టగలిగేవారు. ఒకనాడు భగవాన్ తల్లిగారు "ఆ కుక్కకి నీ ఒళ్లోనే ఉండటం ఎందుకంత ఇష్టం" అని అడిగారు. అప్పుడు శ్రీ భగవాన్ "ఆ కుక్క ఎప్పుడూ చలించిపోని సమాదిలోనే ఉంటుంది. ఒక గొప్ప జీవి కుక్క రూపంలో వచ్చింది. అమ్మకీ విషయం తెలియదు" అన్నారు.

"జ్ఞానం కలగటానికి ఎన్ని జన్మలనెత్తాలి" అని ఒకరు అడిగితే, సమాధానంగా శ్రీ భగవాన్ "కాలమూ, దేశమూ అనేవి ఏవీ లేవు. కలలో, ఒక్క గంటలో ఎన్నో రోజులూ, సంవత్సరాలూ గడిచిపోయినట్టు చూస్తాం. సినిమా తెరమీద కేవలం నీడలు గొప్ప పర్వతాలు గాను, సముద్రాలు గాను మారిపోవటం చూస్తుంటాం కదా! ప్రపంచం నీ బయట లేదు. మనస్సులో ఉండే ఆ చిన్ని ప్రపంచమే బయట పెద్ద ప్రపంచం లాగ కనబడుతుంది. ఆ మనస్సుని నశింపచేయటమే జ్ఞానమంటే". అని సెలవిచ్చారు.

ఒక హరిజన భక్తునికి భగవాన్ మంత్రోపదేశం చేశారు. అతను శ్రీ భగవాన్ ని ఎంతో భక్తితో ఆరాధించేవాడు. దూరం నుంచే వారి దర్శనం చేసుకునేవాడు. దీన్ని కొన్నాళ్ళు చూసి, శ్రీ భగవాన్ అతనిని దగ్గరికి పిలిచి, కరుణతో చూస్తూ, " ఎప్పుడూ శివ, శివ అని జపిస్తుండు. కలలో కూడా మరచిపోవద్దు. అదే నిన్ను ధన్యుడ్ని చేస్తుంది" అని చెప్పారు.

అరుణాచల మహాత్మ్యాన్ని తెలిపే ఒక సంఘటనను రమణ భగవాన్ ఇలా వివరించాడు. "కుప్పు అయ్యర్" అనే వృద్ధుని భగవానులు గురుమూర్తంలో ఉండగా చూచారు. అతని కాళ్ళు చచ్చుబడి, నడవలేక చట్టపై దేకేవాడు. ఒకసారి అతడు అలాగే పిరుదులపై దేకుతూ వెళ్తున్నాడు. హటాత్తుగా ఒక ముదుసలి, ఆదారిలో అతనికి ఎదురయ్యాడు. ఇతనిని చూస్తూనే "ఏమిటా చట్టపై జరగటం, లేచి నడవవోయ్" అని గద్దించాడు. కుప్పు అయ్యర్ తనకు తెలియకుండానే లేచి నడవసాగాడు. జరిగిన దానిని,నమ్మలేక, నాలుగు అడుగులు వేసాక చుట్టూ చూసాడు. ఎక్కడా ముసలివాడు కనపడలేదు. అయ్యర్ నడిచివస్తుంటే ఊరివారందరూ సంభ్రమాశ్చర్యాలతో చూశారు. కుప్పు అయ్యర్ కు కాళ్ళు వచ్చిన సంగతి ఊరిలో ఆయనను చూసిన ఏ వృద్ధుడైనా చెప్పగలడు.

శ్రీ భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా, బిక్ష తెచ్చి ఇస్తూ ఉండే సుందరే అయ్యర్ ని "రాత్రి గిరి ప్రదక్షిణం వెళ్ళారా లేదా?" అని అడిగారు. వెళ్ళలేదు అన్నారు అయ్యర్. భగవాన్ భక్తులనుద్దేశించి " ఇదుగో రాత్రి ఇక్కడి వారంతా వెన్నెలలో గిరి ప్రదక్షిణకు వెళ్తుంటే వీరు పోవాలని బయలుదేరారు. కాని వారి వల్ల కాదని తోచిందట. అంతా నాతో చెప్పి వెళ్తుంటే, వీరు గబ గబా నన్ను చుట్టివచ్చారు. "ఇదేమయ్యా" అంటే గిరి చుట్టు వచ్చుటకు చేతకాదనిపించింది. అందువల్ల "భగవానుని చుట్టి వచ్చాను" అన్నారు. "నిన్ను నువ్వే చుట్టుకోవయ్యా, ఆత్మ ప్రదక్షిణమౌతుందని చెప్పాను" అంటూ శ్రీ భగవాన్ ఒకటే నవ్వు.
 

(శ్రీ రమణ మహర్షిని దర్శించుకున్న ప్రముఖుల అనుభవాలు వచ్చే సంచికలో)

మరిన్ని శీర్షికలు
Article on SV Ranga Rao by TVS Sastry