Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bhagavaan shree ramana maharshi biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

సుశాస్త్రీయం : నటసార్వభౌమ 'యశస్వి'రంగారావు - టీవీయస్. శాస్త్రి

Article on SV Ranga Rao by TVS Sastry

సామర్ల వెంకట రంగారావు గారు (SVR) 03-07-1918 న  లక్ష్మినరసాయమ్మ, కోటేశ్వరరావులు  అనబడే దంపతులకు కృష్ణాజిల్లాలోని నూజివీడులో జన్మించారు. స్వస్థలం కాకినాడ. తండ్రి  excise inspector గా నూజివీడులో పనిచేసారు. తల్లి వెంకటేశ్వరస్వామి  భక్తురాలు అవటం చేత కొడుకుకు వెంకట రంగారావు అనే పేరు పెట్టుకున్నారు.

ధనవంతులైన తల్లితండ్రులు ఇతనిని హైస్కూల్ విద్యకే మద్రాస్ పంపించారు. SVR తన 12 వ ఏటనే, హైస్కూల్ విద్య పూర్తి చేసి,B.Sc లో  చేరారు. హైస్కూల్ విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచి ఇతనికి కళలంటే ఎక్కువ మక్కువ. కాలేజీలో చదువుకునేటప్పుడే, అతను తన నటనకు మెరుగులు దిద్దుకున్నాడు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత, బందరులో Fire Service డిపార్టుమెంటులో ఉద్యోగం సంపాదించారు.

అప్పుడు ఆయన మదిలో రెండు ఆలోచనలుండేవి. M.Sc లో చేరటమా లేక సినిమా రంగంలో నటుడిగా కృషి చెయ్యటమా! అని. వారి బంధువైన బి.వి.రామానందం గారు తాను తీయబోయే సినిమాకోసం SVR ను సినీ రంగానికి ఆహ్వానించారు. ఆ సినిమా పేరు వరూధిని. రంగారావు గారు వెంటనే ఉద్యోగం మానివేసి, సినీరంగంలో ప్రవేశించటానికి  మద్రాస్ పయనమయ్యారు. వరూధిని అనుకున్నంత విజయం సాధించలేదు. అందుచేత కొంతకాలం వరకు వారికి సినిమాలలో వేషాలు వేసే అవకాశం రాలేదు. తర్వాత రంగారావు గారికి విసుగు పుట్టి, జంషెడ్ పూర్ లో TATA వారి సంస్థలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసారు. అయితే అతనికి నటన పైన ఉన్న ప్రేమ తొలగిపోలేదు, పైగా ఎక్కువ కూడా అయింది.

27-12-1947 న లీలావతి అనబడే కన్యామణితో వీరి వివాహం జరిగింది. SVR గారికి తదుపరి రోజుల్లో 'పల్లెటూరిపిల్ల' అనే చిత్రంలో విలన్ గా నటించటానికి శ్రీ బి.ఏ. సుబ్బారావు గారి నుండి ఆహ్వానం వచ్చింది. అయితే, దురదృష్టం ఏమిటంటే, వీరు మద్రాస్ వెళ్ళటానికి రైలు ఎక్కే సమయంలో, వారి నాన్న గారు స్వర్గస్తులైనారనే తంతి వార్త వచ్చింది. తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకొని, మద్రాస్ వెళ్ళేటప్పటికి, ఆ వేషం మరొకరికి ఇవ్వబడింది. ఆయన అదృష్టమేమంటే--విజయా వారి, కే.వి.రెడ్డి గారి దృష్టిలో పడటమే! పాతాళ భైరవిలో నేపాలీ మాంత్రికుడి వేషం వేసే ఛాన్స్ వచ్చింది. వచ్చిన ఆ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే కాకుండా, ఆయన ఆ పాత్ర పోషించిన తీరు పండిత పామరుల ప్రశంసలు అందుకుంది. ఇక విజయా వారికి ఈయన ఆస్థాన నటుడయ్యారు. ఆ తర్వాతనే విడుదలైన విజయా వారి 'పెళ్లిచేసిచూడు' సినిమాలో వీరు పోషించిన 'వియ్యన్న' పాత్ర  కూడా నేపాలీ మాంత్రికుడి వేషం వలే తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

దాని తమిళ version లో కూడా అదే పాత్రను పోషించి, తమిళ ప్రజల మన్ననలను కూడా పొందారు. విజయా వారు మాయాబజార్ తీసేటప్పుడు, 'ఘటోత్కచుని' వేషానికి ముందుగా వీరిని తీసుకున్నారు. కే.వి.రెడ్డి గారు అన్నారుట 'ఆ వేషానికి వేరే ఆప్షన్ లేదు' అని. మాయాబజార్ అంత రసవత్తరంగా తయారు కావటానికి ముఖ్యకారకులలో అతిముఖ్యుడీయన! అలా నిర్విరామంగా వీరి నటయాత్ర తెలుగు, తమిళరంగాలలో కొనసాగింది. వీరు నటించిన నర్తనశాల లోని  కీచకుని వేషానికి పలువురి ప్రశంసలు లభించింది. సతీ సావిత్రి అనే సినిమా తీసేటప్పుడు, చైనా ప్రధాని చౌ యెన్ లై , వీరిని సెట్లో యముని వేషంలో చూసి ఆశ్చర్య చకితులయ్యారట! జకార్తాలో జరిగిన ఇండోనేసియా ఫిలిం ఫెస్టివల్ లో, వీరి కీచకుని వేషానికి ఉత్తమ నటుని అవార్డుతో పాటుగా బంగారు పతకం కూడా దక్కింది. ముఖ్యంగా పౌరాణిక సినిమాలలో ప్రతినాయకుడిగా నటించి తనదైన ఒక ప్రత్యేక బాణీని ప్రవేశపెట్టారు.

రావణ బ్రహ్మ, దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు, మాయల పకీరు, మున్నగు వేషాలు వీరిని తెలుగు ప్రేక్షకుల గుండెలపై చిరస్థాయిగా కూర్చో పెట్టాయి. సంభాషణల ఉచ్చారణ, పలికే విధానం, మాటల విరుపు, హావభావాలు మరెవరి తరంకావు. ఎంత మహా నటుడినైనా Dominate చేయ గల సత్తా సామర్ధ్యం వీరి సొంతం. వీరితో నటించాలంటే ఆనాటి అగ్రనటులు సైతం భయపడేవారు, ఒక్క సావిత్రి తప్ప! ఆయన సమకాలీనుడైన గుమ్మడి గారి మాటల్లో చెప్పాలంటే, ఇటువంటి నటుడు పొరపాటున మన దేశంలో పుట్టాడు, మరే దేశంలోనైనా పుట్టివుంటే ప్రపంచపు నటులలోనే మేటి నటుడయ్యే వాడు! ఇంతకన్నా గొప్ప అవార్డు, రివార్డ్ ఏమున్నది? వీరు నటించిన “బంగారు పాప” (1955) ఆర్ధికంగా విజయం సాధించక పోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఎస్‌.వి.రంగారావు గారి  నటనను, లండన్‌లో చూసిన చార్లీ చాప్లిన్‌, ఇలియట్‌ “బ్రతికి ఉంటే చాలా సంతోషించి ఉండేవాడని” అన్నారు.(జార్జి ఇలియట్‌ రాసిన “సైలాస్‌ మార్నర్‌” అన్న ఆంగ్ల నవల 'బంగారుపాప'కు ఆధారం.)

చాలా సాంఘిక, చారిత్రిక, పౌరాణిక సినిమాలలో విభిన్న పాత్రలు పోషించి తనకు తానే సాటి అని అనిపించుకున్నారు రంగారావుగారు. బంగారు పాప అనే సినిమాలో ఒక గుడ్డివాని వేషం వేస్తున్నారు, అదే సమయంలో NTR గారు చిరంజీవులు అనే సినిమాలో గుడ్డివాని వేషం వేస్తున్నారు. ఇద్దరూ కలిసి పొద్దున్నే, మద్రాస్ రైల్వే స్టేషన్ కి వెళ్లి, గుడ్డి వారి హావభావాలు పరిశీలించేవారట! అలా సమాజంలో ఉన్న వ్యక్తులను పరిశీలించటం వల్లనే, వారి నటన అతి సహజంగా ఉండేది! ఆ రెండు సినిమాలలో వారి నటన అందరి మన్ననలను పొందిన విషయం మనందరికీ తెలిసినదే! తెలుగులో NTR నటించిన 'కథానాయకుడు' సినిమా ఎంత విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయం. అందులో నాగభూషణం గారు ప్రతినాయకుడి పాత్రను అద్భుతంగా నటించారు. అదే సినిమాను తమిళంలో మళ్ళీ తీసేటప్పుడు, నాగభూషణం వేసిన పాత్రను తమిళ సినిమాలో SVR వేసారు. కేవలం SVR నటన వల్లనే ఆ సినిమా తెలుగులో కన్నా ఘనవిజయం సాధించింది! తమిళం కూడా అనర్గళంగా మాట్లాడే ఆయన, తమిళ సినిమాలలో నటించేటప్పుడు తమిళులు చాలామంది, వీరు మా తమిళుడే అని భావించేవారట! అగ్రనటులతో సమానంగా వీరు పారితోషికం తీసుకునే వారట!

రంగారావు గారిని గురించి  శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు
నాకు ఎస్వీరంగారావు గారంటే ప్రాణం. స్క్రీన్‌పై ఆయనుంటే పక్కన ఎంతమంది ఉన్నా మనం ఆయన్నే చూస్తాం. రంగారావుగారి ఆంగిక, వాచకాభినయాలను అనుకరించాలన్నా, అనుసరించాలన్నా సాధ్యంకాదు. ఆయన డైలాగ్ చెబుతుంటే, శృతిశుద్ధంగా ఉంటుంది. రంగారావుగారికి పలికినంత అలవోకగా డైలాగ్ లు  చాలా తక్కువమందికి పలుకుతాయి. తెలుగువాడిగా పుట్టిన కారణంగానే ఆయన ఎక్కువ జాతీయ పురస్కారాలకు నోచుకోలేకపోయారు. అదే ఏ హాలీవుడ్‌లోనో పుట్టుంటే, ఆస్కార్‌ను సొంతం చేసుకునేవారు. కీచకుడు, దుర్యధనుడు, మాంత్రికుడు, రావణాసురుడు, బీదవాడు, జమిందార్... ఒకటేంటి, ఏ పాత్ర చేసినా ఆ పాత్రగా మారిపోయే మహానటుడాయన. ఎన్టీఆర్ లాంటి ఉద్దండ నటుడితో ఢీ అంటే ఢీ అని నటించిన మేరునటధీరుడు ఎస్వీఆర్. ఆయన సినిమాల్లో ఎక్కువసార్లు చూసిన సినిమా నర్తనశాల. ఓ యాభై సార్లకు తగ్గకుండా చూసాను. ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది.

వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు(విజయ,ప్రమీల) ఒక కుమారుడు(కోటేశ్వరరావు). నిర్మాతగా కూడా మారి విజయవంతమైన నాదీ ఆడజన్మే!, చదరంగం, బాంధవ్యాలు, సుఖదు:ఖాలు లాంటి చక్కని  సినిమాలను తీసారు. చదరంగం, బాంధవ్యాలు--సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సంస్థల నుండి చాలా అవార్డ్స్, బిరుదులు పొందారు. అకస్మాత్తుగా, తీవ్రమైన గుండెనొప్పి వచ్చి, ఉస్మానియా హాస్పిటల్ లో వైద్యం తీసుకునే సమయంలో, మళ్ళీ  మరొక్కసారి  గుండెనొప్పి చేత 18-03-1974 న తుదిశ్వాస విడిచారు. తన నటన చేత మనం ఇచ్చే డబ్బులకు మించి మనకు ఆనందం పంచిన ఈ మహానుభావుడు, మనకింకలేరు అన్నది తట్టుకోలేని నిజం! గుమ్మడి గారన్నట్లు, ఏ దేశంలోనో పుట్టి ఉంటారు! మళ్ళీ మనం ప్రపంచపు మేటి నటుడిని చూస్తామన్నమాట!

మహానటుడికి నా ఘనమైన నివాళి!!!

మరిన్ని శీర్షికలు
weekly horoscope(June 22 - June 28)