Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: శ్రీమంతుడు
తారాగణం: మహేష్‌బాబు, శృతిహాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య, బ్రహ్మానందం, ముఖేష్‌ రుషి, సంపత్‌ రాజ్‌, తదితరులు
చాయాగ్రహణం: ఆర్‌.మాధి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్‌, జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాతలు: వై నవీన్‌, వై రవిశంకర్‌, సివి మోహన్‌, మహేష్‌బాబు
విడుదల తేదీ: 7 ఆగస్ట్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే
కోట్ల ఆస్థి ఉన్నా అవి తనకు సంతోషాన్నివ్వలేవని నమ్మే యంగ్‌స్టర్‌ హర్షవర్ధన్‌ (మహేష్‌బాబు). తనకి కావాల్సిందేదో వుందని దానికోసం వెతుకుతుంటాడు. కొడుకు వ్యాపార సామ్రాజ్యంలో కింగ్‌లా వెలిగిపోవాలని కోరుకుంటాడు హర్షవర్ధన్‌ తండ్రి రవికాంత్‌ (జగపతిబాబు). అలా తండ్రి కోరికని కాదని, తనక్కావాల్సిన సంతోషం ఎ్కడుందోనని వెతుకుతోన్న హర్షవర్ధన్‌కి చారుశీల (శృతిహాసన్‌) పరిచయమవుతుంది. ఈ క్రమంలోనే తన సొంతూరు దేవర కోటను దత్తత తీసుకోవాలనుకుంటాడు హర్షవర్ధన్‌. అయితే అక్కడ హర్షవర్ధన్‌కి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవేమిటి? హర్షవర్ధన్‌ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని, ఊరిని దత్తత తీసుకుని, దాన్ని ఉద్ధరించాడా? చారుశీల ప్రేమను పొందాడా? హర్షవర్ధన్‌ తాను కోరుకున్న సంతోషాన్ని ఊరిని దత్తత తీసుకోవడంలో పొందాడా? ఇవన్నీ తెరపై చూడాల్సిన అంశాలు.

మొత్తంగా చెప్పాలంటే
మహేష్‌ బాబు వన్‌ మేన్‌ షో అన్నట్లుగా ఇదివరకు ఎన్నో సినిమాల్లో చేశాడు. దానికి కొనసాగింపు ఇది. మెచ్యూర్డ్‌ పెర్ఫామెన్స్‌తోపాటు, అవసరమైన చోట్ల ఎంటర్‌టైనింగ్‌ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. అన్ని భావాల్నీ అద్భుతంగా పలికించాడు. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోశాడనడం అతిశయోక్తి కాదు. డాన్సులూ అదరహో అన్పించాడు. ఇంతకుముందు సినిమాల్లోకన్నా అందంగా కనిపించాడు మహేష్‌.

శృతిహాసన్‌ అందంగా ఉండటమే కాదు, అభినయంతోనూ ఆకట్టుకుంటుంది. సినిమాకి కీలకమైన ట్విస్ట్‌ హీరోయిన్‌తోనే లభిస్తుంది కాబట్టి, హీరోయిన్‌కి ఇంపార్టెన్స్‌ ఎక్కువే ఉంది సినిమాలో. తనకున్న ఇంపార్టెన్స్‌ నేపథ్యంలో ఇంకా బాధ్యతాయుతంగా నటించింది శృతిహాసన్‌. డాన్సుల్లో ఇప్పటికే ప్రూవ్‌ చేసుకున్న శృతిహాసన్‌, ఇంకా స్టైలిష్‌గా ఈ సినిమాలో డాన్సుల్ని పెర్ఫామ్‌ చేసింది.

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తమ అనుభవాన్ని రంగరించి, తమ పాత్రలకు ప్రాణం పోశారు. ముఖేష్‌ రుషి సహా ఇతర పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు. కమెడియన్స్‌ సినిమాలో హాస్యం పండించడానికి తమవంతు కృషి చేశారు. కామెడీ పరంగానూ సినిమా ఆకట్టుకుంటుంది.

ఊరిని ఊద్ధరించడం అనే కాన్సెప్ట్‌ గతంలో కొన్ని సినిమాల్లో చూశాం. ఇందులో కొత్తగా చూపించడానికి దర్శకుడు పెద్దగా ప్రయత్నించింది లేదు. అయితే కమర్షియల్‌ డైరెక్టర్‌గా కొరటాల శివ కాన్సెప్ట్‌ని సరిగ్గానే వాడుకున్నాడు. మహేష్‌బాబు ఇమేజ్‌కి తగ్గ క్యారెక్టర్‌ని సృష్టించి, సన్నివేశాల్ని బాగా పేర్చుకుంటూ పోయాడు. కథనంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. మ్యూజిక్‌ బాగుంది బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకి మంచి ఫీల్‌ ఇచ్చింది. ఎడిటింగ్‌ సెకెండాఫ్‌లో ఇంకాస్త బెటర్‌గా వుంటే బాగుండేదనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి రిచ్‌నెస్‌ తేవడంలో ఉపయోగపడ్డాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పాటలు తెరపై చూడ్డానికి ఇంకా అందంగా ఉన్నాయి.

ఫస్టాఫ్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో కాస్త స్లో అవుతుంది. ఫస్టాఫ్‌లోని రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పాళ్ళు సెకెండాఫ్‌లో తగ్గడంతోపాటు, సినిమాలో ఎమోషన్‌ కంటెంట్‌ పెరగడంతో సెకెండాఫ్‌ స్లో అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగుంది. స్టార్‌ కాస్టింగ్‌ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ డీసెంట్‌గా అనిపిస్తాయి. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. అవి మహేష్‌ నోట పలకడం ద్వారా వాటికి డబుల్‌ కిక్‌ వచ్చింది. ఓవరాల్‌గా మహేష్‌ సోలోగా సినిమాని భుజాన మోసేయగలడు. ప్రమోషన్‌ బాగా చేస్తున్నారు కాబట్టి, సినిమా నిర్మాతలకి ప్రాఫిట్‌ వెంచర్‌ అయ్యే అవకాశం ఉంది. అన్ని వర్గాల ఆడియన్స్‌ని మెప్పించడం సినిమాకి ఎప్పుడూ ప్లస్సే.

ఒక్క మాటలో చెప్పాలంటే
శ్రీమంతుడు.. మహేష్‌ వన్‌ మ్యాన్‌ షో

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka