Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

నా ఆలోచ‌న‌ల‌న్నీ అభిమానుల చుట్టూనే తిరుగుతాయి - మ‌హేష్ బాబు

 

టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ హీరో ఎవ‌రు..?
ఇంకెవ‌రూ.. మ‌హేష్‌బాబు!


అభిమాన గ‌ణంలో, క్రేజ్‌లో మ‌హేష్‌కి తిరుగులేదు. మ‌హేష్ సినిమా హిట్టుకొట్టిందంటే క‌నీసం రూ.60, 70 కోట్లు బ్యాగులో వేసుకెళ్లిపోవ‌డం గ్యారెంటీ.  హిట్టొచ్చినా, సినిమా ఫ్లాప్ అయినా మ‌హేష్ దూకుడు ఒకేలా ఉంటుంది. తానూ డాంబికాల‌కు పోకుండా సింపుల్‌గా క‌నిపిస్తుంటాడు. అన్న‌ట్టు శ్రీ‌మంతుడులో మ‌హేష్ క్యారెక్ట‌రైజేష‌న్ కూడా అలాంటిదేన‌ట‌. అందుకే తాను ఆ క‌థ‌కి తొంద‌ర‌గా క‌నెక్ట్ అయిపోయా అంటున్నాడు. ఈ శుక్ర‌వారం శ్రీ‌మంతుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌మంతుడు మ‌హేష్ బాబుతో గో తెలుగు చేసిన స్పెష‌ల్ చిట్ చాట్ ఇది.

* హాయ్ మ‌హేష్‌..
- హాయండీ..

* మ‌హేష్ సినిమా అంటే అభిమానుల్లో బోలెడు అంచ‌నాలుంటాయి. సినిమా ఎలా ఉంటుందా, అనే టెన్ష‌న్ తో గ‌డుపుతుంటారు. మ‌రి మీకూ అలాంటి ఫీలింగ్సే ఉంటాయా?
- ఎందుకుండ‌వండీ. నేనూ సినిమా గురించే ఆలోచిస్తుంటా. కానీ బ‌య‌ట‌ప‌డ‌ను.

* ఈసారి నిర్మాత‌గానూ ఉన్నారు క‌దా, ఆ టెన్ష‌న్ ఎక్కువ‌యి ఉంటుంది?
- నా ప్ర‌తి సినిమాకీ ఓ నిర్మాత‌గానే ఆలోచిస్తానండీ. కో ప్రొడ్యూస‌ర్ అన్న‌ది శ్రీ‌మంతుడు సినిమాకే ప‌రిమితం కాదు. ఇది వ‌ర‌కు మా బ్యాన‌ర్‌లో వ‌చ్చిన సినిమాల‌కు నేను అలానే వ్య‌వ‌హ‌రించా. కానీ పేరు వేసుకోలేదంతే.

* ఓ సినిమా బ‌డ్జెట్ విష‌యంలో మీరెంత కంట్రోల్‌లో ఉంటారు..?
- ఓ హీరోగా నా సినిమా బ‌డ్జెట్ గురించీ నేను ఆలోచించుకోవాలి. నిర్మాత సేఫ్‌గా ఉంటే.. సినిమా ప‌రిశ్ర‌మ బాగుంటుంది. ఈ విష‌యంలో నా స‌పోర్ట్  ఎప్పుడూ ఉంటుంది.

* సినిమాపై సంత‌కం పెట్టే ముందు అభిమానుల ఇష్టాయిష్టాలూ ఆలోచిస్తారా?
- త‌ప్ప‌కుండా. బేసిగ్గా నా ఆలోచ‌న‌ల‌న్నీ ఫ్యాన్స్ చుట్టూనే తిరుగుతుంటాయి. కాక‌పోతే క‌థ‌ని మాత్రం ఓ క‌థ‌లానే వింటా. మంచి ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు వాళ్లు త‌ప్ప‌కుండా మెచ్చుకొంటారు.

* శ్రీ‌మంతుడులో అలాంటి అంశాలేమున్నాయి?
- ఒక్క‌ట‌ని కాదండీ. చాలా ఉన్నాయి. క‌థ‌ని క‌థ‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశామిందులో. క‌థే హీరో.  దాని చుట్టూ క‌మ‌ర్షియ‌ల్ అంశాలుంటాయి. పాట కోసం పాట‌, ఫైటు కోసం ఫైటు అని ఉండ‌వు. అన్నీ క‌థ‌లో మిక్స‌యిపోయాయి.

* శ్రీ‌మంతుడులో మీకు బాగా క‌నెక్ట్ అయిన పాయింట్ ఏది?
- ఊరిని ద‌త్త‌త తీసుకోవ‌డం అనే పాయింట్ న‌చ్చింది. బేసిగ్గా ఇలాంటి సినిమా చేయ‌డానికి, ఇలాంటి పాత్ర‌లో క‌నిపించ‌డానికి మ‌న‌లోనూ ఎంతో కొంత స్వ‌చ్ఛ‌త ఉండాలి. నాకూ ఇలాంటి విష‌యాలు న‌చ్చుతుంటాయి. ఎవ‌రికైనా ఏదైనా చేయ‌డంలో హ్యాపీనెస్ ఉంటుంది. అందుకే వెంట‌నే క‌నెక్ట్ అయిపోయా.

* ఈ సినిమా ప్ర‌చారం విష‌యంలో మీరు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకొన్నారు. ప్ర‌త్యేక కార‌ణం ఏమైనా ఉందా?  మీరు నిర్మాత కాబ‌ట్టే ఇంత దృష్టి పెట్టారా?
- అదేం లేదండీ. క‌థ‌ని న‌మ్మి తీసిన సినిమా ఇది. ఇలాంటి సినిమా ఆడాలి. అప్పుడే ధైర్యంగా మ‌రికొన్ని ప్ర‌య‌త్నాలు చేయ‌గ‌లం. సినిమా ఆడాలంటే జ‌నంలోకి వెళ్ల‌డం చాలా ముఖ్యం.

* ఎంతో క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా స‌రైన ఫ‌లితం రాక‌పోతే ఏమ‌నిపిస్తుంది?
- నిజంగానే బాధేస్తుంది. తేరుకోవ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. అయితే ఎక్క‌డో చిన్న త‌ప్పు చేసుంటాం. ఆ త‌ప్పు ఏమిటో క‌నిపెట్టాల్సిందే. ఎందుకంటే భవిష్య‌త్తులో అలాంటి తప్పు మ‌ళ్లీ చేయ‌కూడ‌దు క‌దా.

* రివ్యూల‌కు ప్రాధాన్యం ఇస్తారా?
- మౌత్ టాకే.. నా రివ్యూ. జ‌నం ఏమ‌నుకొంటున్నార‌న్న‌ది ముఖ్యం.

* మీకు రిజ‌ల్ట్ ఎప్పుడు తెలుస్తుంది?
- ఫ‌స్ట్ డే ఏం అర్థం కాదు. క‌నీసం రెండ్రోజులు ప‌డుతుంది.

* ఓట‌మిని జీర్ణించుకోవ‌డానికి ఎంత టైమ్ ప‌డుతుంది..?
- ఇంత అని చెప్ప‌లేం. కానీ కొన్ని రోజులు మాత్రం మైండ్ స‌రిగా ఉండ‌దు. కానీ తొంద‌ర‌గా బ‌య‌ట‌కు వ‌చ్చేయాలి. త‌ప్పుదు.

* మీ సినిమా ఫ్లాప్ అయితే... ఆ  ఓట‌మికి మీరే బాధ్యులా?
- త‌ప్ప‌కుండా నేనేనండీ. నేనొక్క‌డినే, ఆగ‌డు స‌రిగా ఆడ‌లేదు. అందుకే క‌దా.. శ్రీ‌మంతుడు ఆడియోలో అభిమానుల‌కు సారీ చెప్పా. క‌థ విని చేయాలా వ‌ద్దా అని నిర్ణ‌యించుకొనేది నేను. ఎవ్వ‌రూ ఫోర్స్ చేయ‌రు క‌దా. అలాంట‌ప్పుడు త‌ప్పు ఎవ‌రిమీదో నెట్టేయ‌డం ఎందుకు?

* తమిళ మార్కెట్‌పై ఈమ‌ధ్య బాగా శ్ర‌ద్ద పెడుతున్న‌ట్టున్నారు?
- శ్రీ‌మంతుడు విష‌యంలో మాత్రం కొంచెం కేర్ తీసుకొన్నాం. అక్క‌డ కూడా సినిమా బాగా ఆడితే... మ‌న‌కు బాగా హెల్ప్ అవుతుంది.

* త‌మిళంలో సినిమా ఎప్పుడు చేస్తారు?
- ఇది వ‌ర‌కు కొన్ని అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ నేనే ఒప్పుకోలేదు. త‌మిళంలో చేసినా తెలుగులోనూ విడుద‌ల చేయాలి. అలా చేయాలంటే ఇద్ద‌రికీ న‌చ్చే క‌థ‌లు ఒప్పుకోవాలి.

* బాహుబ‌లి చూశారా..?
- చూశా. ఎపిక్‌లా తీశాడు రాజ‌మౌళి. వెంట‌నే ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పా. ఇద్ద‌రం క‌ల‌సిన‌ప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకొన్నాం.

* బాహుబ‌లి తెలుగు సినిమాకి చేసిన హెల్ప్ ఏమిటి?
- తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. అంటే.. త‌ర‌వాతి సినిమా కూడా రూ.200 కోట్లు, 500 కోట్లు చేస్తుంద‌ని కాదు. ఆ ఇంపాక్ట్ మాత్రం చూపిస్తుంటుంది. ఇది వ‌ర‌కు సినిమా హిట్ట‌యితే రూ.70 కోట్లు వ‌స్తే... ఈసారి అది రూ.80 కోట్ల‌కు వెళ్లగ‌ల‌దు.

* బాలీవుడ్ పై మీరెందుకు దృష్టి పెట్ట‌లేదు..
- తెలుగు సినిమాలు శ్ర‌ద్ద‌గా చేస్తే చాలండీ... (న‌వ్వుతూ)

* బ్ర‌హ్మోత్స‌వం ఎలా ఉంటుంది?
- ఓ పండ‌గ‌లా ఉంటుంది. చాలా మంచి క‌థ‌. శ్రీ‌కాంత్ ఎప్పుడూ సెన్సిటీవ్ పాయింట్‌తోనే సినిమా తీస్తాడు. ఇదీ అలాంటిదే.

* రాజ‌మౌళి, వినాయ‌క్‌ల‌తో సినిమాలు ఎప్పుడు?
- క‌థ కుదిరిన‌ప్పుడు.

* ఓకే ఆల్ ది బెస్ట్‌.. అడ్వాన్స్‌గా హ్యాపీ బ‌ర్త్ డే..
- థ్యాంక్యూ...   

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
movie review