Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyotishyam vignanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

 

ఈ రోజుల్లో ప్రతీదీ, వ్యాపారాత్మకం అయిపోయినట్టు కనిపిస్తోంది.  ఇదివరకటి రోజుల్లో అయితే,  సంబంధ బాంధవ్యాలు కొనసాగించుకోడానిక్. ఉత్తరాలు ఉపయోగించేవి. ఓ కార్డో, ఇన్ లాండ్ లెటరు ద్వారానో క్షేమసమాచారాలు, ఒకరికొకరు తెలియచేసికునేవారు.. మరీ అత్యవసరం అయితే, ఆరోజుల్లో Express Delivery అని ఒకటుండేది. ఓ పదిపైసల స్టాంపు అదనంగా అంటించేస్తే,  వారం పట్టే ఉత్తరం, రెఁడుమూడు రోజుల్లొ చేరిపోయేది..  ఏ పురిటి వార్తో, మరణ వార్తో అయితే, వాటికి టెలిగ్రాములుండేవి. వీటన్నిటికీ తోడు, బుక్ పోస్టులు, రిజిస్ట్రీ ఉత్తరాలూ సరేసరి. ఇంకోటుందేదండోయ్-- సర్టిఫికెట్ ఆఫ్ పోస్టింగ్ అని. మరీ రిజిస్ట్రీ అంత ఖరీదు కాదుకానీ,  పోస్టల్ వారు, దానికో రసీదుమాత్రం ఇచ్చేవారు.

ఏ  కోర్టువ్యవహారానికైనా ఈ రసీదు, ఓ ఋజువులా ఉపయోగించేది. కొడుకో, కూతురో పై చదువులకి ఇంకో ఊరికి వెళ్తున్నారూ అంటే చాలు, చేరగానే ఒక ఉత్తరం, అటుపైన కనీసం వారానికో ఉత్తరం రాయాల్సిందే.  పోస్టాఫీసుకి వెళ్ళి, కార్డులు తెచ్చికోడానికి బధ్ధకిస్తాడేమో, అని, ఎడ్రసు లు వ్రాసేసి, ఓ అరడజను కార్డులు, ఆ వెళ్ళే  పిల్లాడిదో, పిల్లదో బట్టలతోపాటు, పెట్టెలో సద్దేసేవారు. అక్కడ వాళ్ళకి ఏ కష్టం, అవసరం వచ్చినా, ఓ కార్డు ముక్క రాసిపారేస్తారని. ఏ కారణం చేతైనా అలా కార్డులు పెట్టడం మర్చిపోతే, తామే ఓ రిప్లై కార్డు రాసేసేవారు.

బంధువులతోనూ సంబంధబాంధవ్యాలు  అలాగే  సాగించేవారు. సాయంత్రం పోస్టుమాన్ వచ్చాడూ అంటే చాలు, ఏదో ఒక ఉత్తరం , చేతిలో పెట్టకుండా ఉండేవాడు కాదు. అందుకనేనేమో, దీపావళికీ, దసరాకీ,  వీళ్ళకి “మామూళ్ళు” ఇవ్వని గృహస్థు కనిపించేవారు కాదు. కాలక్రమేణా,  ఈ సంబంధాలూ అవీకూడా కనుమరుగైపోతున్నాయి. పోనీ, అలాగని , పరిచయాలు తగ్గుతున్నాయా అంటే అదీ కాదూ. ప్రయాణాల్లో  పరిచయం అయిన ప్రతీవాడి నెంబరూ నోట్ చేసికోడం. పోనీ ఫోను చేసి క్షేమసమాచారాలేవైనా అడుగుతాడా, అంటే అదీ లేదు. ఏదైనా అవసరం వస్తే తప్ప ఛస్తే ఫోను చేయడు. అలాగని మాట్టాడడా అంటే అదీ కాదు. అవతలివాడెవరైనా ఫోను చేశాడూ అంటే, చాలు, ఎక్కడలేని అభిమానమూ చూపించేస్తూ, గంటల తరబడి, ప్రపంచంలోఉన్న ప్రతీ విషయమూ మాట్టాడేయడం. బిల్లేమైనా, కట్టాలా పెట్టాలా?. పైగా , ఈయన ఫోను మోగ్గానే, వెంటనే చెప్పే డయలాగ్గు… “ అరే మీరా మాస్టారూ, ఇప్పుడే అనుకుంటున్నాను, ఫోను చేద్దామని చెయ్యెత్తడమేవిటి, ఇంతలో మీరే ఫోను చేసేశారాయె. చూశారా, ఇద్దరికీ ఒకేసారి అనిపించిందీ.. అదండీ స్నేహం అంటేనూ..”—ఇది పచ్చి అబధ్ధమని ఇద్దరికీ తెలుసు, అయినా సరే మొహమ్మాటం. మళ్ళీ ఇందులో ఓ తిరకాసూ—ఫోను చేసిందేమో, పాపం ఓ అమాయకచక్రవర్తి, ఛాన్సు దొరికిందికదా అని, అవతలాయన మాట్టాడేస్తున్నాడు,

మాట్టాడడం ఆపే ఘటంలా లేడు. ఇంతలో ఇంటావిడ—“ ఎక్కడదొరుకుతారండి  స్వామీ, మీకు ఇలాటి స్నేహితులూ…” అనడం, ఇలాక్కాదని, ఫోను కట్టేయడం. మహా, తిరిగి ఫోను చేసినప్పుడు చెప్పడం, “ అదేమిటోనండీ, నెట్ వర్క్ సమస్యనుకుంటాను…”. నాలుగైదు ఇలాటి అనుభవాలు వస్తే ఎక్కడలేని లౌక్యమూ నేర్చేసికుంటాడు, ఎంత అమాయకుడైనా… ఈ గొడవలనుండి మనల్ని “ ముక్తులు “ చేయడానికి మన ప్రభుత్వరంగ BSNL   వారు, రాత్రి 9.00 నుండీ ప్రొద్దుట 7.00 దాకా ఉచిత సర్వీసు మొదలెట్టేశారు.  చాలామందికి వీరి కనెక్షన్ తీసికోడానికి నామోషీ. ఎవర్నడగండి, మాది  Airtel, Idea, Reliance  అని చెప్తారు. అదేమిటో, ఎన్ని సదుపాయాలిచ్చినా, ప్రభుత్వరంగ సంస్థల మీద ఎవరికీ నమ్మకం లేదు. బ్యాంకుల విషయమైనా సరే, ప్రెవేట్ బ్యాంకులనే నమ్ముకుంటారు.

చెప్పొచ్చేదేమిటంటే, స్నేహాలు చేసికోడమే కాదు, ఇరువైపులనుండీ ఆ స్నేహాన్ని నిలుపుకోడానికి ప్రయత్నం చేయాలి. ఏదో  Friendship  Day  రోజున, ఫేస్ బుక్ లో  ఫొటోలు పెట్టేసికోడం, పేపర్లవాళ్ళకి ఇంటర్వ్యూలివ్వడం కాదు. ఇంకొంతమందుంటారు, ఓ missed call  ఇచ్చేసి ఊరుకుంటూంటారు. అంటే దానర్ధం, మనం తిరిగి చేయాలన్న మాట. కొంతమందైతే, మరీ విశాల హృదయాలూ—మనం ఫోను చేస్తే, వారు కట్టేసి, తామే ఫోను చేస్తారు. కానీ, ఇలాటివారు  చాలా  rare breed. ఇంకో రకం వాళ్ళుంటారు—తల్లితండ్రులతో తప్ప, ప్రపంచంలో అందరితోనూ కబుర్లు చెప్పడానికి వాళ్ళకి కావాల్సినంత టైముంటుంది.  రెందు రోజులకో, వారానికో ఒకసారి ఫోను చేసి “ ఎలా ఉన్నారమ్మా..” అని అడిగితే, వాళ్ళ సొమ్మేంపోతుందో అర్ధం అవదు.ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఎవరి చేతుల్లో చూసినా సెల్ ఫోన్లే.   దగ్గరవారితో  సంబంధ బాంధవ్యాలు పెరగడానికి బదులు, రోజురోజుకీ  అటకెక్కేయడమే విచారకరమైన  విషయం…

సర్వేజనా సుఖినోభవంతూ… 

మరిన్ని శీర్షికలు
yuva