Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగిన కథ:  ఈ కేసులో సిద్దార్థ  ప్రతిమను కూడా అనుమానిస్తాడు. తేజ మాత్రం ఆ విషయాన్ని అంగీకరించడు.. తనే కేసు విచారణ చేయమని చెక్ కూడా రాసిచ్చిందన్న విషయం మర్చిపోవద్దని అంటాడు సిద్దార్థతో.. ప్రతినిధే... చైర్మన్‌ కాదు.  ఐమీన్‌ ఆమె కూడా ఆ సంస్థలో అందర్లా ఓ  ఎంప్లాయే. అందుకే, ఆమెతో సహా  అందరూ అనుమానితులే అని సమాధానమిస్తాడు.. సిద్ధార్ధ  ఆ తరువాత..  

 

రీల్‌ ఎంటర్టయిన్‌మెంట్‌కు ప్రత్యామ్నాయాలొచ్చిపడ్డాయి.
వీకెండ్‌లో పబ్‌లు, రిసార్ట్‌లు, లాంగ్‌డ్రైవ్‌లు...ఓప్‌ా!
ఇప్పుడు ఎంటర్టయిన్‌మెంట్‌కి ఎన్నో అడ్రస్‌లు. ఒకప్పుడు సినిమా చూసేందుకు బండ్లు కట్టించుకుని మరీ హాళ్లకు వచ్చేవారు.
ఇప్పుడో...కొత్త సినిమా మార్నింగ్‌ షో మొదలవడం ఆలస్యం...సెల్‌ఫోన్‌ మెసేజ్‌ల ద్వారా సీన్‌సీన్‌కీ సింగిల్‌ లైన్‌ పోస్ట్‌మార్టం చేస్తూ  వెబ్‌సైట్లలో రివ్యూలిచ్చేస్తున్నారు సోకాల్డ్‌ సినీ రిపోర్టర్స్‌.

మార్నింగ్‌ లెవనోక్లాక్‌: టైటిల్స్‌.
లెవన్‌ ఫైవ్‌: హీరో ఇంట్రడక్షన్‌ విత్‌ ఫైట్‌. వెరీ ఇంట్రస్టింగ్‌.

లెవన్‌ ఫిఫ్టీన్‌: హీరోయిన్‌ ఎంట్రీ విత్‌ ప్రోవోకింగ్‌ సాంగ్‌. వెరీ రొమాంటిక్‌.  లెవన్‌ ట్వంటీ: కమెడీయన్‌ హ్యూమర్‌...సింప్లీ హేమర్‌...
ఇలా రీలురీలునీ నరికేస్తూ సంక్షిప్త సందేశాల సమీక్షల్తో సినీ వెబ్‌సైట్లు పోటీ పడుతుంటే...మరోపక్క మార్నింగ్‌ షో అయిపోయిన అరగంటలోనే...‘ఫైవ్‌బైటూ, ఫైవ్‌బైత్రీ...’ రేటింగ్‌ల్తో మూవీబాగోగుల్ని బట్టబయలు చేసేస్తున్నారు.

కొన్ని కోట్ల వ్యయం, కొన్ని నెలల కష్టం, కొంతమంది సృజనను దారుణాతిదారుణంగా కొల్లగొట్టేస్తున్నారు.

కొంత ఇన్నోవేషన్‌...కొద్దో గొప్పో సరుకుతో ఎలాగోలా బతికి బట్టకట్టాలనుకున్న కొత్త సినిమాను పురిట్లోనే సంధికొట్టేందుకు ఇంకోపక్క పైరసీ భూతం కోరలు చాస్తోంది.

ఉదయం ఆట అవడం ఆలస్యం... పైరసీ సీడీలు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి.

ఇరవైముప్పయ్‌రూపాయల్లో కారుచవగ్గా సినిమాని అమ్మేస్తున్నారు. ధియేటర్లలో వందలు వందలు ఖర్చుపెట్టి  సేకన్నా...డ్రాయింగ్‌రూంలో చిన్నితెరపై ఇంటిల్లిపాదీ తక్కువ ఖర్చుతో కొత్త సినిమా చూడొచ్చనేవారు చాలామంది ఉన్నారు. ఆ కాస్త డబ్బు కూడా దండగనుకునేవాళ్లు...ఓ రెణ్ణెళ్లాగి సూపర్‌హిట్‌ మూవీ ట్యాగ్‌లైన్‌తో టీవీలో ప్రసారమయ్యే ఈ రెండ్రోజుల ఫ్లాప్‌ సినిమాను చూసేస్తున్నారు.
పైరసీ పదఘట్టనల కింద సగటు సినిమా నలిగిపోతోంది. తిరిగి కోలుకోలేనిరీతిలో దెబ్బతింటోంది.

ఎంతమంది ఎన్ని విధాల చెప్పిచూసినా పైరసీ రక్కసి ఆగడాలు ఆగడం లేదు. కేవలం పైరసీకోసమే సినిమాలు తీస్తున్నారనిపించే పరిస్థితి దాపురించింది. టాలీవుడ్‌లో సూపర్‌హీరోల సినిమాల దగ్గర్నుంచీ అప్‌కమింగ్‌ హీరోల సినిమాల వరకూ అన్నీ పైరసీబారిన పడ్డవే.
తాజాగా వాగ్దేవి ప్రొడక్షన్స్‌ ‘ప్రియతమా...!’ సినిమా రిలీజ్‌కి ముందే  ఏకంగా ఇంటర్నెట్‌లోనే హల్చల్‌ చేస్తోంది.

వాగ్దేవి ప్రొడక్షన్స్‌ ఇమేజ్‌, బ్రాండ్‌నేమ్‌, గుడ్‌విల్‌..ఇవన్నీ వూయర్స్‌ని అట్రాక్ట్‌ చేస్తుండడంతో లెక్కలేనన్ని ‘లైక్‌’లు, ‘షేర్‌’లతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది.ఇదీ దొంగతనమే. తలుపులు, తాళాలు బద్దలు కొట్టి శారీరక శ్రమతో చేసే దొంగతనం కాదు. మేధోపరఅపహరణ.
ఒకరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని మరొకరు దర్జాగా దొంగిలించేయడమే. సినీ స్టార్లను ప్రత్యేకించి హీరోయిన్లు కూడా ఇదే బెడదను ఎదుర్కొంటున్నారు.

ఈమధ్యే శృతి చేసుకున్న సినీ వారసత్వంగా ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఓ హీరోయిన్‌  ఇంటర్నెట్‌లో హల్‌ చల్‌ చేస్తున్న అభ్యంతరకరమైన తన స్టిల్స్‌ విషయంలో ఖాకీలనాశ్రయించింది. ఆమె లేటెస్ట్‌ హిట్‌మూవీలో హాట్‌హాట్‌గానే కనిపించింది. అంతకన్నా హాట్‌గా ఉన మరికొన్ని ఫొటోలు  ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చేసరికి తట్టుకోలేకపోయింది. పయ్యెద దాచలేని ఎదపొంగుల్ని చూపించే ప్రొవోకింగ్‌ స్టిల్స్‌ అవి. ఓ సాంగ్‌లో వాడిన ఆహార్యాన్ని బట్టీ షూటింగ్‌ స్పాట్‌లోనే దొంగచాటుగా ఎవరో ఆ స్టిల్స్‌ తీసారని అనుమానిస్తోంది తను. ‘ఎవరై ఉంటారు?’ ఆరాతీయడం మొదలుపెట్టింది. మొదట్లో ఆ స్ధాయిలోనే కెమెరాకి ఫోజిచ్చినా...డోస్‌ ‘శృతి’ మించుతోందనే భావనతో ఆ హాట్‌సీన్లు సిన్మానుంచి తొలగించారు. అయినప్పటికీ..హీరోయిన్‌ హాట్‌గానే కనిపించిందనే టాక్‌ వెల్లువెత్తింది. ఈ నేపధ్యంలోనే ...మరింత ప్రొవోకింగ్‌ ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేయడం మొదలెట్టాయి. ఆ ఫొటోలు ఎలా బయటకి వచ్చాయా? అనే విషయమై ఆ హీరోయిన్‌ పోలీసులను ఆశ్రయించింది. నిజానికి, ఆ హీరోయిన్‌ అంతలా చిందులు తొక్కాల్సిన అవసరం లేదని..ఆ స్థాయిలో హాట్‌గానే కనిపించింది కదా! అనే వాదనలూ మరోపక్క వినిపిస్తున్నాయి. ఆ వాదనని పక్కనపెడితే...హీరోయిన్లనూ ఇంటర్నెట్‌ వదలడం లేదని ఈ ఇన్సిడెంట్‌ ద్వారా అర్ధమవుతోంది. ఇదే అదనుగా మరోవైపు ఎలక్ట్రానిక్‌ మీడియా వేదికగా ‘ఇండస్ట్రీ` ఇంటర్నెట్‌’ డిస్కషన్‌ జోరుగా సాగుతోంది.
ఈ డిస్కషన్‌ పెట్టకపోతే రేసులతో తామెక్కడ వెనుకబడిపోతామోననుకున్న ప్రతిచానెల్‌ ఉదయం, సాయంత్రం తేడా లేకుండా స్టూడియోలో కొంతమందిని కూచోబెట్టి చర్చోపచర్చలు సాగిస్తున్నాయి.

‘‘ఇంటర్నెట్‌ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు.  అందుకే, వాగ్దేవి కేసు తనదాకా వచ్చింది. ఈ సైబర్‌ క్రయిం ఛేదించాలంటే ఇంటర్నెట్‌ సముద్రాల్ని ఈదేసే ఎథికల్‌ హ్యాకర్‌ కావాలి..’  

ఎథికల్‌ హ్యాకర్‌!

ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ తరుణంలో...జీవితాలకు ప్రైవసీ లోపిస్తున్న నేపధ్యంలో ఎథికల్‌ హ్యాకర్ల అవసరం కూడా ఎంతో ఉంది.
ఇప్పుడిప్పుడే జంటనగరాల్లోనూ ఎథికల్‌ హ్యాకర్లు పుట్టుకొస్తున్నారు. ఆయన టాలీవుడ్‌లో పేరు మోసిన డైరక్టర్‌. ఆయన కూతురికి ఓ మెయిల్‌ నుంచి అదేపనిగా అశ్లీల సందేశాలొస్తున్నాయి. వెంటనే...పోలీసుల్ని ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు...ఈ మెయిల్‌ కుర్రాడిని ట్రేస్‌ చేసి పట్టుకున్నాడు. ఇంటరాగేషన్‌ చేసిన తర్వాత తేలిన నిజమేమిటంటే...అసలా మెయిల్స్‌కి ఆ కుర్రాడికి సంబంధమే లేదని తెలిసింది. అంటే...అతడి ప్రమేయం లేకుండానే...అతడి ప్రమేయం లేకుండానే మరెవరో అతడి మెయిల్‌ అడ్రస్‌ను ఉపయోగిస్తున్నారన్నమాట.

వెంటనే...సైబర్‌ పోలీసులు లహరిని సంప్రదించారు.

ఆ మెయిల్స్‌ ఎక్కడ నుంచి వస్తున్నాయో...ఎవరు పంపిస్తున్నారో కేవలం  రెండ్రోజుల్లోనే తెలుసుకున్న లహరి ...ఆ వివరాల్ని పోలీసులకు అందించింది. ఈ ఇన్సిడెంట్‌లో ట్విస్టేమిటంటే...ఆ హ్యాకర్‌ ఇటు డైరక్టర్‌ కూతురికీ, అటు ఆ ఈమెయిల్‌ కుర్రాడికీ తెలిసినవాడే. ఇలాంటి కేసులెన్నింటినో చిటికెలో పరిష్కరించింది లహరి.

లహరి...సైబర్‌సిటీలోని ఎంఎన్‌సీ ఎంప్లాయి. చిన్నప్పట్నుంచీ చదువులో చురుకైన ఈ అమ్మాయి...ఎథికల్‌ హ్యాకర్‌గా జంటనగరాల్లో ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతోంది. ఓ రోజు తండ్రి కొనిచ్చిన పర్సనల్‌ కంప్యూటర్‌ అంతు చూసింది. కంప్యూటరే లోకంగా పెరిగింది. బోర్‌ కొడితే చాలు...కంప్యూటర్‌ని విప్పదీసిన మళ్లీ బిగించడం నేర్చుకుంది. దాంతో...నెమ ్మది నెమ్మదిగా ఆమెకు కంప్యూటర్‌ వినియోగం కరతాలమలకమైంది.

తర్వాత్తర్వాత...ఆమె ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ నేరాల గురించి తెలుసుకుంది.

ఆ క్రమంలోనే హ్యాకింగ్‌ గురించి తెలుసుకుంది. అందుకోసం ‘గూగుల్‌’ మహా సముద్రాన్ని ఈ చివర్నుంచి ఆ చివరివరకూ ఈదింది. అంతేకాదు...మొట్టమొదటిసారి తన తండ్రి ఈ మెయిల్‌ను హ్యాక్‌ చేసి కంప్యూటర్‌ కొనిచ్చిన తండ్రికే షాక్‌ తినిపించింది.

ఆ తర్వాత ఎథికల్‌ హ్యాకింగ్‌ గురించి పుస్తకాల్ని బట్టీ  పెట్టింది.

ఎథికల్‌ హ్యాకెట్‌ అండ్‌ ఇన్మర్మేషన్‌ టెక్నాలజీలో సెక్యూరిటీ కోర్సులో చేరింది.  

అంతేనా!

స్మార్ట్‌ ఫోన్ల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం...ఈమెయిల్‌ హ్యాకర్స్‌ను పట్టుకోవడం...ఆన్‌లైన్‌ మోసాల్లో ఐపీ అడ్రస్‌లు కనిపెట్టడం...సెల్‌ఫోన్‌ ట్రేసింగ్‌, ఏటీఎం ఫ్రాడ్‌లు...ఇలా ప్రతి అంశంపై పట్టు సాధిస్తోంది.

వెంటనే...సెల్‌ఫోన్‌ అందుకుని లహరికి కాల్‌ చేసి డిటైల్స్‌ అందించాడు సిద్దార్థ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్