Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
svamirara..

ఈ సంచికలో >> కథలు >> ఆత్మ బంధువులు

aatmabandhuvulu

ఆకులు రాలిన అడవిలాగున్నాడు చెంచయ్య. కళ్ళల్లో తడి, గుండెల్లో అలజడి. పదే పదే దగ్గుతూ ఆయాసపడుతోన్న భార్యను చూస్తూ నిట్టూర్చాడు. ఊపిరితిత్తులు దెబ్బతిని, శ్వాస సరిగా తీసుకోలేకపోతుందామె. సాధ్యమైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు హెచ్చరించారు.                ఆ ఆలోచనలతో మునిగిపోయి, గతాన్ని గుర్తు చేసుకోసాగాడు.

*     *   *

మనిషి బతుకు చారెడు సుఖం, పుట్టెడు దు:ఖం. చెంచయ్య ఏనాడు చారెడు సుఖానికి నోచుకోలేదు. బాల్యంలో పాలబుగ్గల జీతగాడు. పెద్దయ్యాక మీసం వచ్చిన పనోడు. పెళ్ళయ్యాక కొమ్ములు తిరిగిన కూలోడు. సూటిగా చెప్పాలంటే కరువు, కాటకాల మీద నిలిచిన మొనగాడు.

వారసత్వంగా వచ్చిన రెండెకరాలు తండ్రి అప్పులకు అహుతి కాగా, ఒక గుడిసె, రెండు ఆవులు మిగిలాయి. ఒకటి తెల్లావు, మరొటి ఎర్రావు. ఆ నోరు లేని జీవాలే చెంచయ్యకు చేదోడు, వాదోడుగా నిలబడ్దాయి. పాలు ఇచ్చాయి, అరక దున్నాయి. వాటి సాయంతోనే పెంకుటిల్లు కట్టాడు. ఎకరం భూమి కొన్నాడు.  రోజులు అలా నెమ్మదిగా సాగుతున్నాయో లేదో ఒక్కగానొక్క కూతురు పెళ్లికొచ్చింది. కూతుర్ని అత్తవారింటికి పంపటానికి ఉన్న ఎకరం భూమి అమ్మక తప్పలేదు. ఘనంగా కాకపోయినా ఉన్నంతలో బాగానే చేశాడు పెళ్లి.  గుండెల మీద కుంపటి దిగిపోయిందని ఊపిరి పీల్చుకున్నాడు.

ఊహించని వాటిని ఉత్పత్తి చేస్తుంది కాలం. సంవత్సరం గడువక ముందే అదనపు కట్నం వేధింపులు గ్యాస్ సిలిండర్ రూపంలో కూతుర్ని బలి తీసుకున్నాయి. కటిక చేదు వార్తను తట్టుకోలేక విలవిల్లాడారు చెంచయ్య, అతని భార్య. కాలం గడుస్తున్నా కొద్దీ చెంచయ్య ఒంట్లో బలం తగ్గసాగింది. మళ్లీ ఆవులే కన్నబిడ్డల్లా తోడు నిలిచాయి. అరక దున్నడానికి ఆవులను కిరాయికి ఇస్తూ, దానిపై వచ్చే డబ్బులతో కలో, గంజో తాగుతున్నాడు.  భార్య దగ్గుతుండటంతో  మళ్ళీ వర్తమానంలోకి వచ్చాడు చెంచయ్య.

*     *   *

రాత్రైంది. గుడ్డి దీపం మసక మసకగా వెలుగుతోంది. నులక మంచంలో నిలువు గుడ్లేసాడు చెంచయ్య. భార్య సేవలను తలచుకోసాగాడు. 'నా కోసం ఎన్నో త్యాగాలు సేసింది. ఆపరేషన్ ఎలాగైనా సేయిద్దామంటే సేతిలో సిల్లిగవ్వ లేదే? యెలా?' కళ్ళు ఊరి చివర రాముడి చెరువు తూములను తలపిస్తుంటే, మంచంల్లోంచి లేచి బయటకు వచ్చాడు. అల్లంత దూరంలో నెమరేస్తున్న ఆవులు. ప్రతి రోజూ చూస్తున్నవే కానీ ప్రస్తుతం చెంచయ్య కళ్లను వెలిగించాయి.

మెల్లగా ఆమె మంచం దగ్గరకు వెళ్ళాడు. "సుజాతా!" అని పిలిచాడు.

"యేం...ద...య్యా! " దగ్గుతూ పైకి లేచి కూర్చుంది."నీ అవస్థ సూస్తుంటే నా గుండె పగిలేలా ఉందే. సంసారం కోసం నాతో కల్సి యెన్ని సెరలుబడ్డవ్. గంజినీళ్ళు కూడా కడుపు నిండా తాగని రోజులున్నయ్! కంటికి రెప్పలా సాదిన బిడ్డెల్లిపోయింది. ఇక మీదట నువ్వు లేకుంటే, గీ భూమ్మీద నెనెలా గుంటానే? నాకో ఉపాయం తట్టింది. ఆవులనమ్మి, డబ్బు తెస్తా! దవాఖానాలో సూపిస్తానే!"  తువ్వాలుతో కళ్లొత్తుకోసాగాడు."మూగ జీవాలే అయినా మన కన్నబిడ్దలనుకున్నాం! మన మీ రోజుకీ గుక్కెడు మెతుకులు గతుకుతున్నామంటే వాటి దయే గదయ్యా! ఆ మాటంటానికి నోరెలా వచ్చింది!" బాధగా అన్నదామె."ఒక్కోపాలి మనసుకు బరువనిపించినా కొన్ని పన్లు సేయక తప్పదే! నువ్వు ఊరిక్కినే మనాది పెట్టుకోమాకా! జాగ్రత్తగుండు. త్వరగానే వస్తాలే!" అన్నాడు. పది కిలోమీటర్ల దూరంలోనున్న సిటికి అర్థరాత్రి నడక మొదలెట్టాడు. తనకు అత్యంత ఇష్టమైన ఆవులతో.

*     *   *

చీకట్లను తరుముతున్న వెలుగులు సిటిని వెలిగిస్తుండగా సిటి పొలిమేరల్లోకి ప్రవేశించాడు. చెంచయ్యకు సిటి గురించి పెద్దగా తెలీదు. గతంలో చాలా సార్లు వచ్చినా, బస్టాండులో బస్సు దిగి, భారతమ్మ కిరాణంలో రెండు నెలలకు సరిపడా సరుకులు కొనుక్కొని తిరిగి వెళ్ళటం తప్పితే మరో వీధిలోకి పోలేదు.  ఆ అవసరం రాలేదు. ఆవులను ఎక్కడ కొంటారో తెలీదు. రాత్రి నడక వల్ల బాగా నీరసించాడు. పైగా ఆకలితో కూడా ఉన్నాడు. ఆవులను చెట్టుకు కట్టేసాడు. పక్కనే ఉన్న సిమెంట్ బల్లపై కూర్చున్నాడు. ఎదురుగా చిన్న హోటల్ కనిపించింది. హోటల్ ముందున్న టబ్బులోని నీళ్ళతో ముఖం కడుక్కొని, కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు.

"అయ్యా! యిడ్లీ యెంత?" జేబులు తడుముకుంటూ అడిగాడు.

"ప్లేటు ఇరవై!"

"అబ్బో! యి..ర..వైయా!" జేబులు వెతికిన చేతిని చూసుకున్నాడు. రెండ్రూపాయల బిళ్ళ తెల్లగా మెరుస్తోంది. "ప్చ్...!" నిట్టూర్పు విడుస్తూ వెనుదిరిగాడు.

ఆ పెద్దాయనను చూస్తే హొటల్ యజమానికి జాలి అనిపించిందో ఏమో! "అయ్యో పాపం! ఆకలితో ఉన్నట్టున్నావు. ఫర్లేదులే రా..రా! కూర్చో!" అన్నాడు.వేడి వేడి ఇడ్లీలు పల్లీ చెట్నీతో గబ గబా తిన్నాడు. రెండు బాటిళ్ళ నీళ్లు గట గటా తాగాడు. "బ్రేవ్...!"మని తేపాడు. "దేవుడు సల్లంగ సూడాలయ్యా!" అంటూ హోటలతను వద్దంటున్నా రెండ్రూపాయలు చేతిలో పెట్టి బయటకు వస్తూ, టక్కున ఆగాడు."అయ్యా! అగో యెదురుంగా సెట్టు కిందున్నాయే గయి నా ఆవులేనయ్యా! అమ్మటానికి తోలుకొచ్చిన, ఆట్ని యెక్కడ కొంటరో నీకేమైనా తెలుసాయ్యా!""అవునా! ఇదే బజారు చివరకు పోయి, కుడి వైపుకి తిరుగు, అక్కడ నుంచి నాలుగడుగులేస్తే పెద్ద రేకుల షెడ్ కనపడుతుంది. దాంట్లోకెళ్లు కొంటారు"

"మంచిదయ్యా!" చేతులు జోడించి హోటలతనికి నమస్కారం చేసాడు. గుర్తుల ప్రకారం రేకుల షెడ్డుకు చేరుకున్నాడు. మంచి బేరం పలికాయి ఆవులు. నలభై వేల రూపాయలిచ్చారు. చెంచయ్య ఆనందానికి అవధుల్లేవు. ఒకటికి రెండు సార్లు లెక్క చూసుకుంటున్నాడు. ఈలోపు పిల్లి గుడ్లు, రింగుల జుట్టు, ఎత్తు పళ్లున్నోడు తాళ్ళు తీసుకొచ్చి ఆవుల మెడకు కట్టాడు. కాకి రంగున్నోడు కాళ్ళపై కొడ్తూ, "హయ్య్...! హయ్య్...!" మంటూ అదిలించసాగాడు.

వాటి కళ్లల్లో కన్నీటి సుడులు. చెంచయ్యను వీడలేకపోతున్నాయి. అలాగని దెబ్బలను తట్టుకోలేకపోతున్నాయి. అవి కదలకపోవడంతో వాళ్ళ కోపం తారాస్థాయికి చేరింది. బాగా కొట్టడం మొదలుపెట్టారు.

"అయ్యా! బాబూ! నోరులేని జీవాలు! గట్టిగా కొట్టమాకండయ్యా!" చెంచయ్య వేడుకోసాగాడు."ఏయ్! ముసలోడా! డబ్బు ముట్టిందిగా! నోరు మూసుకొనిపో! లేదంటవా! మా డబ్బు మా ముఖాన పడేసి ఆవులు తోలుకుపో!" కళ్లెర్ర చేశారిద్దరు.సొంత వారికి దూరమవుతున్న బాధతో విలవిల్లాడుతూ... అడుగు తీసి అడుగు వేయలేక... మెల్లగా రేకుల షెడ్డు బయటకు వచ్చాడు.

ఇంతకుముందు కూర్చున్న సిమెంట్ బల్ల దగ్గరికి వచ్చాడు. మనసంతా దిగులు పేరుకొంది. కాసేపు కూర్చొని వెళ్దామనుకున్నాడు. తెల్లావు, ఎర్రావు కళ్లల్లో మెదుల్తున్నాయి. 'నోరొక్కటే లేదు కానీ కన్నబిడ్డల కంటే మించిన సేవలు సేసాయి. యెండకు యెండాయి, ఆనకు తడిసాయి, రేయింబవళ్ళు నాతో పాటు కట్టం సేసాయే? నా డొక్కెండకుండా కాపాడిన నా తల్లుల్ని యెలా మర్సిపోవాలి? ' కుమిలిపోసాగాడు. ఇంటికి వెళ్ళలేక పోతున్నాడు. చివరిసారి ఆవులను చూసి, వాటిని మనసారా చేత్తో తడిమాలని అనుకున్నాడు. కానీ మళ్ళీ వెళ్తే కొన్నోడు ఊరుకుంటాడా? ఆ సాహసం చేయలేకపోయాడు. ఇక ఈ రోజుతో ఆవులకు తనకు రుణం తీరిందనుకున్నాడు. గుండె లోతుల్లోంచి పొంగుతున్న కన్నీటిని తుడుచుకున్నాడు. ఎదురు వీధిలో ఉన్న ఆటోస్టాండ్ గమనించాడు. ఆటో ఎక్కి బస్టాండ్కు పోదామనుకున్నాడో ఏమో?  చిన్నగా నడవసాగాడు.

నాలుగడులేసాడో లేదో "అంబా! అంబా!" అనే అరుపులు.  గభాల్న వెనక్కి తిరిగి చూశాడు.  ముందు ఆవులు, వెనుక వాటిని కొనుకున్న వారు అతని వైపు దూసుకొస్తున్నారు.  తెల్లావు, ఎర్రావు చెంచయ్య చుట్టూ తిరగసాగాయి. మమ్మల్ని విడిచిపెట్టిపోతావా అన్నట్లు కంటతడి పెట్టసాగాయి. చెంచయ్యది సంకట స్ధితి. ఆలోచనల త్రాసులో నిలబడ్డాడు. భార్య వైపా?, ఆవుల వైపా? ఎటు మొగ్గాలో తేల్చుకోలేకపోతున్నాడు. రింగుల జుట్టోడు పలుపుతాడుతో ఆవుల పక్కటెముకలపై కొడ్తుంటే చెంచయ్య తట్టుకోలేకపోతున్నాడు. ఒంటరిగా ఇంటికి వెళ్ళడం తన వల్ల కాదనుకున్నాడు. "ఆగవయ్యా! యెందుకలా కొడ్తవ్!" కాస్త కోపాన్ని ప్రదర్శించాడు.

"నోరు లేస్తుందేమిటి? అయినా ఈ ఆవులు మాటినేట్లు లేవు. మా డబ్బు మాకిచ్చేయ్!" దబాయించాడు రింగుల జుట్టోడు. చెంచయ్యకు పౌరుషం పొడుచుకొచ్చింది."యేహే! యిగ బట్టు నీ డబ్బులు యెన్నడన్న సూసినవా లేదా?" డబ్బుల సంచిని అతని చేతిలో పెట్టాడు."ముసలోడికి పౌరుషానికేం తక్కువ లేదు. ఎక్కడమ్ముతవో! అమ్ముకోపో!" తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు రింగుల జుట్టోడు.పరిస్ధితి మొదటికొచ్చింది. ఉన్నట్లుండి చెంచయ్యకు పెళ్లి నాడు భార్య మెడలో కట్టిన పసిడి మంగళసూత్రం ట్రంకుపెట్టెలో దాచిపెట్టిన సంగతి గుర్తుకొచ్చింది. 'దాన్నమ్మి ఆపరేషన్ చేయిస్తా!' అనుకుంటుండగానే చెంచయ్య ముఖం కొట్ల శక్తిని పొందుకుంటున్నట్లు వెలిగింది. 'నేను బతికినన్ని రోజులు ఆత్మ బంధువులసొంటి ఆవులను నా దగ్గరే ఉంచుకుంటాను.' అనుకున్నాడు.అస్తమిస్తున్న పొద్దు వైపు ఉత్సాహంగా నడుస్తున్న ఆవుల వెనుక ఇంటికి బయలుదేరాడు చెంచయ్య. అతని తిరుగు ప్రయాణం ఉత్తేజంగా సాగుతోంది.   

*     *   *

మరిన్ని కథలు
neerulli maa talli