Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aatmabandhuvulu

ఈ సంచికలో >> కథలు >> నీరుల్లీ మా తల్లీ!.

neerulli maa talli

అదొక పెద్ద మాల్. దాన్లో కూరగాయలన్నీ ఫ్రష్ గా ఉండేట్లు చల్లని నీళ్ళు, మంచు ముక్కలూ, ఇంకా కొన్ని రకాల రసాయనాలూ కొట్టి, వాటికి ఫేషియల్స్ చేసి ఉంచారు. తమ అందాలు చూసుకుంటూన్న కూరగాయలన్నీ స్వగతం అనుకుంటూ పైకే మాట్లాడుతున్నాయిలా.  టమోటా- “ఆహా! నా అందం ముందు వీళ్ళంతా బలాదూరే! ఎంత నున్నగా ఉంది నా ముఖ బింబం! నా రంగు చూసిన వారి కళ్ళను మెరిపిస్తుంది. నేను లేందే వంటశాలలో ఏ కూరా తయారవదు కదా!” దోసకాయ అనుకుంటున్నదీ" నా రూపం, రుచీ మరెవరికీ రావు. దోస దూరిన పొట్ట, దొంగ దూరిన కొంపా ఖాళీ అని, నా సాంబార్ లేక పప్పు తీటే చాలు పొట్టలోవన్నీ అరిగి ఖాళీ కడుపే అవుతుంది."వంకాయ -" ‘వంకాయ వంటి కూరయూ’ అని సీతమ్మ పక్కన నన్ను చేర్చారు కవులు , రుచికీ శుచికీ నా కూరే! ఒక మారు తిన్నారంటే ఇహ వదలరు. నున్నని నా రూపం శివ లింగంలా ఉంటుంది కదా! “పొట్లకాయ-" పత్యానికి నేనే ముందు కదా!శంకరుని రెండో కొడుకు నా పోలికే! శివుని మెడలో నాగ సర్పం నా పోలికే! నా గొప్ప ఎవరికీ లేదు. ”బీర కాయ, కాకర కాయ, సొరకాయ , ఇంకా అన్నీఇలా స్వగతాలు చెప్పుకుంటూ అందరూ వినే ఉంటారని తృప్తి పడుతున్నాయి.

ఇంతలో మిరపకాయ" అదేంటీ ! ఈ ఉల్లి మౌనంగా ఉంది? ఓహో రేటు పెరిగి ఎవ్వరూ కొనరని దిగాలుగా ఉన్నట్లుంది. ఐనా కంపు కొట్టే ఈ ఉల్లి ఏమని చెప్పుకుంటుందిలే పాపం, వెల నూరు దాకా వెళ్ళిందిటగా! రాత్రి మొబైల్ న్యూ స్ లో మాల్ వాలా పెట్టుకుంటే విన్నాన్లే! ఇహ ఇక్కడే కుళ్ళి కంపు కొట్టుకుంటూ డస్ట్ బిన్ లో పడాల్సిందే! ఏంటో పాపం పరాయి దేశాలకు టన్నుల కొద్దీ ఎగుమతై పోయి , స్వదేశంలో దిక్కు లేకుండా పోయింది ఉల్లికి పాపం."అంటూ సానుభూతి తెలిపింది. ఉల్లికి వళ్ళు మండింది. దీక్షగా త్రిమూర్తుల గురించీ తపస్సు ప్రారంభించింది. పూర్వ ఋషుల తర్వాత తమ గురించీ తపస్సు చేసేవారు లేక చిన్నబోయి ఉన్న త్రిమూర్తులు ఒక్క గంట లోపే ఉల్లికి దర్శనమిచ్చారు." ఏం ఉల్లీ! ఏమి నీ కోరిక, మా కోసం ఇంత కాలానికి తపస్సు చేసిన నీ కోర్కె తీర్చి గానీ వెళ్ళం" అని ఉల్లిని పలకరించారు."త్రిమూర్తులారా! సంతోషం. నా తపస్సుకు మెచ్చి మీరు దర్శనమివ్వడం నా భాగ్యం. ఐతే మీరొక పని చేయాలి. మా కూరగాయలన్నిట్లో ఎవరు గొప్పో చెప్పాలి." అంటూ వినమ్రంగా విన్నవించుకుంది. వెంటనే ముందుగా బ్రహ్మ" ఉల్లీ! నా బంగారు తల్లీ! నేను సృష్టి చేసిన ఈ కూరగాయలన్నిట్లో ఏది గొప్పో నేనెలా చెప్పగలను? అన్నీ నా సృష్టిలోవే కదా! నా దృష్టిలో దేని గొప్ప దానిదే!" అన్నాడు శివుడు" ఉల్లి తల్లీ ! నీ తపస్సుకు మెచ్చి నీ ఎదుట ప్రత్యక్షమయ్యానే కానీ నాకు వరాలివ్వటమే తప్ప న్యాయ నిర్ణయం చేయటం అంతగా రాదు. దానికంతా విష్ణుమూర్తే !"అన్నాడు. విష్ణుమూర్తి గొంతు సవరించుకుని "నీరుల్లీ మా తల్లీ! నీ ప్రత్యేకత వీరికి తెలీదులే!  ఓ కూరగాయలారా! మీరంతా గొప్పే, ఎందుకంటే నా కుమారుని సృష్టిలో దోషం నేనెలా ఎంచగలను?ఐతే ఉల్లికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మీరంతా ఇతర కూరగాయలతో చేరినపుడు మీ రూపం, రుచి, వాసన మారి పోవచ్చు, కానీ ఉల్లి మాత్రం తన వాసన ,రుచి, రూపం పోక పోగా మిగిలిన వాటికీ అందిస్తుంది. ఉదాహరణకు ఉల్లిని సాంబార్ లో వేస్తే దానిలో ఎన్ని కూర ముక్కలున్నా దానికి ఉల్లి రుచే వస్తుంది. ఏ కూరలో వేసినా దాని రుచిని ఉల్లి పెంచుతుంది. వళ్ళంతా వస్త్రాల వలె పొరలు కప్పుకుని భారతీయ సంస్కృతిని కాపాడుతుంటుంది.

ఉల్లికి మా మీద భక్తి ఎక్కువ, మా కోసం తపస్సు చేసింది. ఈ కాలంలో మమ్మల్నెవరూ తలంచడం లేదు, పెరిగి పోయిన కంది పప్పు ధరనూ, ప్రస్తుతం ఉల్లి ధరనూ, చదువులకై సీట్ల ధరలనూ తలంచుకునే వారే కానీ, మమ్మల్ని తలంచే వారే లేరు. అందుకే మేము ఉల్లి కోరిన కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాం, నీరుల్లీ కోరుకోమ్మా తల్లీ!! దీర్ఘాయువా? ఐశ్వర్యమా? ఆరోగ్యమా?.."అంటున్న విష్ణుమూర్తిని చూసి, " మహాప్రభో ! అవన్నీ మానవులకు కానీ నాకేల? మీరు నా పట్ల చూపుతున్న అభిమానానికి కృతఙ్ఞతలు. మీరే నాకు మీకు తోచిన వరాలివ్వండి చాలు." అంది."ఉల్లీ ! మా బంగారు తల్లీ! నీ ’కోరిక లేని‘ తనానికి మెచ్చాము. ఉల్లీ నా వలె నీకు గడ్డం ఉండు గాక! " బ్రహ్మ దీవించాడు."ఉల్లీ! నిన్ను అడ్దంగా కోస్తే చక్రము, నిలువుగా కోస్తే శంఖమూ కనిపించి నిన్ను కోసిన వారికి నేను గుర్తు వత్తును గాక" అన్నాడు విష్ణుమూర్తి. ఇహ శివుడు భోళా శంకరుడు కనుక " ఉల్లీ! నిన్నెవరు కోసినా వారికి కళ్ల నీరు కారి కళ్ళు మంటలెక్కును గాక! ఐతే ఆ కన్నీరూ కళ్ళకు మేలు చేయును గాక! నీవు రుచి కలిగి ఉండటమే కాక, నీతో చేరిన కూరలకూ రుచినిచ్చి, శరీర ఉష్ణం తగ్గించి, ’ ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే పేరు పొందెదవు గాక.’!" అని దీవించాడు.

త్రిమూర్తులు ముగ్గురూ మాయమై పోయాక , కూరగాయలన్నీ "ఉల్లీ! నీ గొప్పదనం తెల్సుకోలేక ఇంతసేపూ నిన్ను తక్కువ చేసి హేళన చేసిన మమ్మల్ని మన్నించు. నీ వెలతో పోల్చుకుంటే మా వెల కొండ ముందు గులక రాయిలా, డాలరు ముందు రూపాయిలా, బంగారు బిస్కెట్ ముందు తీపి లేని డయాబిటిక్ బిస్కేట్ లా , విమానం ముందు ఎద్దుల బండిలా, కార్పోరేట్ స్కూల్ ముందు వీధి బడిలా[ ప్రభుత్వపాఠశాల}  చాలా చౌకని తెల్సుకున్నాం, మమ్మల్ని మనఃపూర్వకంగా మన్నించానంటే గానీ మేము వదలం, నీవు నీ వెలతో తెచ్చిన సునామీతో ప్రభుత్వలే పడిపోతాయనే నిజం ఇప్పుడే గ్రహించాం తల్లీ మన్నించు” అంటూ పాదాభివందనం చేశాయి. మనమూ ఉల్లికి ఒక మారు పాదాభివందనం చేసి వెల తగ్గి మనకు అందుబాటుగా లభించాలని వేడుకుందామా!

మరిన్ని కథలు