Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
death mistery

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగినకథ:  పిక్‌పాకెట్‌ కుర్రాళ్ళు తనను కాపాడారని ఫోన్‌లో సహస్ర చెప్పిందంతా విని...  తేలిగ్గా వూపిరి తీసుకుంటారంతా. కాని విరాట్‌ మనసు సహస్ర అక్కడే ఉండి పోతుందంటే అంగీకరించదు. వాళ్ళు సహస్రని  కాపాడినందుకు..  వాళ్ళకు కావల్సినంత డబ్బిచ్చేద్దాం, అక్కడే  ఉండిపోవడం బాగాలేదు అంటాడు విరాట్ . అందరం కలిసి నిన్ను కాపాడుకోలేమా? వచ్చెయ్‌ సహస్రా ప్లీజ్‌. ఎక్కడున్నావో చెప్పు  అంటూ రిక్వెస్ట్‌ చేస్తాడు విరాట్.

ఆ తరువాత...  

‘‘ఇదిగో పెద్దాయనా నాకు మూడు కోట్లు కావాలి. అక్కకి పాత చీర కావాలి, చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి పాత బట్టలు కావాల ఇస్తావా?’’ అనడిగాడు ముత్తు.

‘‘ఉంటే చూసిత్తాలేరా రండి’’

‘‘ఉత్తినే వద్దులే సామి. మా దగ్గర రెండు మాంచి నక్క కొమ్ములున్నాయి తీసుకో’’ అన్నాడు మరొకడు.

ఒకరి తర్వాత ఒకరు అంతా లోనకు రాగానే ధర్మ మనుషులు కదిరేషన్‌ మనుషులు కూడా చెకింగ్‌ కోసం వీధిలోకెళ్ళి పోయారు.

ఇంట్లోకి రాగాలనే అంతా వున్నారని కూడా చూడకుండా నల్ల పిల్ల చేయి పుచ్చుకుని చర చరా పడగ్గది లోకి లాకెళ్ళి తలుపు మూసాడు విరాట్‌.

కౌగిట బంధించి కంట నీరు నించాడు.

‘‘ఒక్క రోజు నిన్ను చూడకుండా ఉండ లేను. మూడు రోజులైంది. ఈ ఇరవై రోజులు ఎలా గడపాలో తెలీటం లేదు. ఇదేం ఖర్మ. ఆగర్భ శ్రీమంతురాలివై వుండి ఈ వేషం ఏమిటి? వీధుల్లో అడుక్కోవటం ఏమిటి? ఇదంతా అవసరమా?’’ అన్నాడు బాధగా.

‘‘అంతటి శంకరుడే బిచ్చమెత్తగా లేనిది మనమెంత బావా. ప్రాణాలు కాపాడుకోడానికి తప్పదు. నాకూ నీ నుంచి దూరంగా ఉండటం బాధ గానే వుంది కాని భరించాలి తప్పదు. మేకప్‌ చెడి పోతుంది వదులు బావా ప్లీజ్‌’’ అంటూ ముద్దిచ్చి మృదువుగా కౌగిలి విడిపించుకుంది.

‘‘మమ్మల్ని గుర్తు పట్టలేరనుకున్నాను. ఎలా గుర్తు పట్టావ్‌?’’ అంది నవ్వుతూ.

‘‘నేనెక్కడ గుర్తు పట్టాను. అసలెవరూ గుర్తు పట్ట లేదు. విశాల గుర్తు పట్టింది’’ అన్నాడు.

తలుపు తీసి విశాలను లోనకు పిలిచింది.

కాస్సేపు ముగ్గురూ చర్చించుకున్నారు.

తీసుకో వలసిన జాగ్రత్తల గురించి హెచ్చరించింది సహస్ర. తర్వాత విరాట్‌ ఇచ్చిన లక్ష రూపాయల పేపర్‌లో చుట్టిన పార్శల్‌ని డాల్డా డబ్బాలో వేసుకుంది, దీక్షను పిలిచింది. ఆమె తన గదిలోంచి తెచ్చిన నాలుగు జతల దుస్తుల్ని డాల్డా డబ్బాలో కుక్కుకొని బయటకొచ్చింది.

‘‘వీడు నా  పెద్ద తమ్ముడు ముత్తు’’ అంటూ ముత్తును పరిచయం చేసింది. ‘‘వీడు కిట్టు, వీడు బాల మురుగన్‌, వీడు శివకుమార్‌’’ అంటూ మిగిలిన కుర్రాళ్ళందర్ని పరిచయం చేసింది. ‘‘ఇది ముత్తు చెల్లెలు మీనా. ఈ అమ్మాయి ముత్తు అక్క కూతురు రమణి  నాకు తోడుగా వచ్చారు. అసలీ మారు వేషాల అయిడియా ముత్తుదే’’ అంటూ పరిచయం చేస్తుంటే అందరికీ నమస్కరించారు వాళ్ళు.

‘‘కిడ్నాప్‌ అయిడియా కూడా ముత్తుదే గదా’’ అని మునుసామి అనగానే అంతా నవ్వుకున్నారు.

ముత్తు భుజం తట్టి అభినందించాడు విరాట్‌.

‘‘ఏది ఏమైనా అంతా మన మంచికే అంటారు. ఈ పిల్లల్ని మనం సత్కరించాల్సిందే’’ అన్నాడు ముచ్చట పడుతూ మునుసామి.

‘‘ఏరా ఇక మీదట అక్క బాధ్యత మీది. మంచిగ వుండండి. దొంగతనాలు వద్దు. మీ భవిష్యత్తు బాగుండేలా మేం ఏర్పాటు చేస్తాం. అక్క చెప్పినట్టు వినండి’’ అన్నాడు విరాట్‌.

‘‘సరి బావా. అక్క మాట జవదాటం. మీరేమి దిగులు చెందక్కర్లేదు. కోర్టుకి ఎలా తీసుకొస్తామో ఎవరికీ తెలీదు చూడండి’’ అంటూ మాటిచ్చాడు ముత్తు.

సహస్ర వారించినా వినకుండా కుర్రాళ్ళందరికీ తలో పాతికవేలు బహుమతిగా ఇచ్చాడు విరాట్‌. అంతా బండ శివా వేసిన టిఫిన్లు తిన్నారు. దీక్షకు ధైర్యం చెప్పి ఓదార్చింది సహస్ర. చందూని పరామార్శించింది.

అలా అందర్ని పరామార్శించి బయలు దేరుతుండగా బయటి కెళ్ళిన ధర్మా కదిరేశన్‌లు తిరిగొచ్చారు.

‘‘ఏరా పోజిషన్‌ ఏమిటి?’’ అనడిగాడు విరాట్‌.

‘‘లైన్‌ క్లియర్‌. అనుమానించ తగ్గ వాళ్ళెవరూ లేరు. ఎందుకైనా మంచిదని మార్కెట్‌ వరకూ అక్కడక్కడా మన వాళ్ళని వుంచాం’’ అన్నాడు ధర్మ. ధర్మ కదిరేశన్‌లతో కూడా మాట్లాడాక సహస్ర బృందం ఎలా వచ్చారో అలాగే నక్కలోళ్ళ గుంపు లాగే ఆడుతూ పాడుతూ కుర్రాళ్ళందర్ని తీసుకొని బయటి కెళ్ళిపోయింది సహస్ర.

‘‘వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్ళాల్సిందేనా?’’ అమాయకంగా అడిగింది విశాల.

‘‘లేదు లేదు కాలనీ గేటు బయట వీళ్ళ తాలూకు రెండు ఆటోలు ఆగున్నాయి’’ అన్నాడు కదిరేశన్‌.

సహస్ర వెళ్ళిపోయిన చాలా సేపటి వరకు తాము తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించుకొంటూనే వున్నారంతా.

 

*****************************

 

మరో వారం గిర్రున తిరిగింది.

కీల్పాక్కం నుంచి తన అడ్డాను వేలచ్చేరికి మార్చుకున్నా విరాట్‌ మూలంగా త్యాగ రాజన్‌కి మనశ్శాంతి లేకుండా పోయింది. విరాట్‌ రోజు విడిచి రోజూ ఫోన్‌ చేస్తూనే వున్నాడు. సహస్రను ఏం చేసావ్‌. ఇంత వరకు తిరిగి రాలేదు. తను రాలేదంటే నిన్ను చంపేస్తాను’’ అంటూ బెదిరించి విసిగిస్తూనే వున్నాడు.

విరాట్‌ విషయం పక్కనుంచితే...

అసలు తనకే చాలా ఆశ్చర్యంగా వుంది.

ఏమైందా అమ్మాయి? ఇంత వరకు కాలనీకి వెళ్ళక పోవటం ఏమిటి? ఫోన్‌ కూడా చేయకుండా తిరిగి రాకుండా ఏమై ఉంటుంది? ఒక వేళ ఆ పోరాటంలో తగిలిన గాయాలతో పారిపోతూ ఏ మారు మూలనో చని పోయి వుంటుందా? ఎట్టయప్ప గాని పాండ్యన్‌ గాని మిగిలిన వాళ్ళు గాని చెప్పిన మాటల్ని బట్టి చూస్తే అంత గొడవ జరిగినా ఆమె వంటి మీద చిన్న గీత కూడా పడ లేదు నిక్షేపంగా ఉందంటున్నారు. ఉంటే తిరిగి రాకుండా ఎక్కడికి పోయింది? వాయిదా తేదీ వరకు ఆజ్ఞాతంలో ఉందామని వెళ్ళి పోయిందా? లేక విరాట్‌ సహస్ర తిరిగి రాలేదంటూ అబద్ధాలతో తనకు గాభరా పుట్టిస్తున్నాడా!

ఏదీ ఒక అంచనాకు రాలేక పోతున్నాడు. దాంతో నిలకడగా ఏదీ ఆలోచించ లేక పోతున్నాడు. వేలచ్చేరి అడ్డా మీద కూడ తిరిగి విరాట్‌ వర్గం దాడి చేయొచ్చన్న అనుమానం కంగారు పెడుతూనే వుంది. తనక్కడ వుండటం క్షేమం కాదన్న ఉద్దేశంతో అక్కడికి మూడు వీధుల అవతల మరో యింట్లో ఆజ్ఞాతంలో కాలక్షేపం చేస్తున్నాడు.

ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా కూచుని మందు కొడుతుంటే విరాట్‌ ఫోన్‌ చేసి తిరిగి డిస్ట్రబ్‌ చేసాడు. విసిగి పోయిన త్యాగరాజన్‌ విస్కీ గ్లాసును కోపంతో నేలకు విసిరి కొట్టాడు.

ఆ సమయంలో పాండ్యన్‌ తో బాటు మరో ముగ్గురు అక్కడే వున్నారు.

‘‘ఏంట్రా పాండ్యా మీరంతా వుండి కూడా ఏమిట్రా నాకీ టార్చర్‌? మనం వాళ్ళని గమనిస్తుంటే మనల్ని మన కదలికల్ని వాళ్ళు గమనిస్తున్నారు. సహస్ర తిరిగి రాకుంటే నన్ను చంపేస్తానంటున్నాడు. ఏం చేయాలి? అటు చూస్తే వాయిదా దగ్గర పడుతోంది. మీ వల్ల ఏ ప్రయోజనం లేకుండా పోతోంది’’ అనరిచాడు కోపంగా.

‘‘సార్‌ నేనో మాట చ్పెనా?’’ అడిగాడు పాండ్యన్‌.

‘‘చెప్పరా ఉపయోగ పడేదుంటే చెప్పు. ఏంటది?’’

‘‘ఆ విరాట్‌ మిమ్మల్ని చంపుతానంటూ బెదిరస్తున్నాడు గాని వారం తిరిగినా ఇంత వరకు అలాంటి ప్రయత్నం ఒక్కటీ చేయలేదు. ఎందుకంటారు?’’

ఉన్నట్టుండి ఆలోచనలో పడ్డాడు త్యాగరాజన్‌.

పాండ్యన్‌ తన మాటల్ని పొడిగిస్తూ` ‘సార్‌ నిజంగా సహస్ర తిరిగి రాకుంటే విరాట్‌ లాంటి సమర్థుడు ఇన్ని రోజులు ఆగుతాడా? ఎప్పుడో మన మీద రెండో అటాక్‌ చేసే వాడు గదా?’ అనడిగాడు.

‘‘అంటే ఏమిట్రా? సహస్ర వాళ్ళ దగ్గరే వుందంటావా? నన్ను బెదిరించి కన్ఫ్యూజ్‌  చేయటం కోసం నాకు ఫోన్‌ చేస్తున్నాడంటావా?’’

‘‘నా ఉద్దేశం అదే సార్‌. ఆ ఎఫెక్ట్‌ తోనే మీరు సరైన నిర్ణయం కూడా తీసుకో లేక పోతున్నారు. కొంచెం ఆలోచించండి సార్‌.’’

అవునన్నట్టు తలూపాడు త్యాగరాజన్‌.

‘‘అయితే ఆలస్యం దేనికి? ఈ రాత్రికే మన వాళ్ళని రెడీ చేసి కాలనీ మీద దాడి చేయండి. సహస్రతో సహా విరాట్‌ని కూడా చంపేయండి’ అన్నాడు.

‘‘అదంత సులువు కాదు సార్‌’’ అన్నాడు వెంటనే పాండ్యన్‌.

‘‘కాలనీలో సహస్ర దీక్షలుండే ఇల్లు ఒకటి విరాట్‌ ఉండే ఇల్లు ఒకటి రెండిళ్ళున్నాయి. ఆ యిళ్ళని, వీధుల్ని, కాలనీ కెళ్ళే రోడ్‌ వెంట కూడా వాళ్ళ మనుషులు తిరుగున్నారు. పగలు రాత్రి గట్టి నిఘా వుంది. మన వాళ్ళు కాలనీ గేటు దాటక ముందే వాళ్ళకి తెలిసి పోతుంది. వెళ్ళిన వాళ్ళలో ఒక్కడూ ప్రాణాలతో వెనక్కి రాలేడు. అలాంటి పొరబాటు చేయకూడదు’’.

‘‘మరెలా... ఏం చేద్దాం? చేత కాని వాళ్ళలా కూచోవలసిందేనా?’’

‘‘నా ఉద్దేశం అది కాదు సార్‌. మనకున్న ఒకే ఒక్క అవకాశం సైదా పేట కోర్టు. సహస్ర ఎక్కడ దాక్కున్నా వాయిదాకి వచ్చి తీరాలి. కోర్టు మెట్లు ఎక్కకుండానే కాల్చిపారేద్దాం’’

‘‘ఇలా ప్లాన్‌ చేసే మధురై కోర్టు దగ్గర దెబ్బ తిన్నాను. మళ్ళీ అదే ప్లానా!’’ అన్నాడు నీరసంగా త్యాగరాజన్‌.

‘‘ఈ సారి ఫైయిలవటం జరగదు సార్‌. పక్కాగా ప్లాన్‌ చేద్దాం. అన్నట్టు మీరు ఆ రోజు కోర్టుకు రావాలిగా’’ అడిగాడు పాండ్యన్‌.

‘‘లేదు నేను రానక్కర్లేదు. మన లాయర్లు ఆ విషయం చూసుకుంటున్నారు. మధురై కోర్టుకి నేను హాజరయ్యే ఏర్పాటు చేస్తున్నారు. టైం పడుతుంది’’

‘‘అయితే మీరిక నిశ్చింతగా ఉండండి సార్‌. సహస్ర ఎక్కడుందో వాళ్ళకి తెలుసు. మనల్ని రాంగ్‌ రూట్‌ పట్టిస్తున్నారు. కోర్టు వాయిదా లోపు ఆ విరాట్‌ మరో సారి మన మీద దాడి చేయటం జరగదు. విరాట్‌ ఫోన్‌ చేస్తే లిప్ట్‌ చేయకండి.

సహస్ర కోర్టుకి తప్పకుండా వస్తుంది. మన షూటర్స్‌లో ఇద్దర్ని బయట ఉంచుతాను. మరో ఇద్దరు లోన విజిటర్స్‌ గ్యాలరీలో ఉంటారు. ఇక దుస్తుల చాటున మారణాయుధాలతో సాధారణ పౌరుల్లా మనవాళ్ళు ఆవరణలో తిరుగుతూ రెడీగా ఉంటారు. సహస్రను ఎంత మంది రక్షణగా కోర్టుకి తీసుకొచ్చినా మెట్లు ఎక్కక ముందే చంపేస్తారు. అదీ తప్పించుకొని లోనకెళ్తే లోన ఇద్దరు షూటర్స్‌ ఉంటారు. వాళ్ళు సహస్రని బోను  ఎక్కక ముందే కాల్చి పారేస్తారు. ఎలా చూసినా ఆ రోజు సహస్రకు చావు తప్పదు’’ అంటూ పాండ్యన్‌ తన ప్లానును వివరిస్తుంటే ఆసక్తిగా వింటూండి పోయాడు త్యాగరాజన్‌. ఎందుకో ఈ సారి తమ ప్లాన్‌ వర్కవుటయి, సహస్ర మరణిస్తుందనే గట్టి నమ్మకం త్యాగరాజన్‌లో ఏర్పడసాగింది.

 

***************************************

రోజులు గడుస్తున్నాయి...

వాయిదా దగ్గర పడుతోంది.

రెండ్రోజుల్లో సహస్ర కోర్టుకు వెళ్ళాలనగా ఆ రాత్రి విరాట్‌ సహస్ర సెల్‌కి ఫోన్‌ చేసాడు. వెంటనే లిప్ట్‌ చేసింది సహస్ర.

‘‘బావా ఏంచేస్తున్నావ్‌? భోంచేసావా ఇంకా లేదా?’’ అనడిగింది.

‘‘ఇంత క్రితమే భోంచేసాను నువ్వు భోంచేసావా?’’

‘‘ఇప్పుడే. మన వాళ్ళంతా భోంచేసారా?’’

‘‘అంతా భోంచేసారు. విశాల కూడా మాతో బాటు ఇక్కడే భోంచేసి ఇంత క్రితమే ఇంటికెళ్ళిపోయింది. అన్నట్లు ఎల్లుండే నువ్వు కోర్టుకు వెళ్ళాలి గుర్తుందిగా?’’

‘‘గుర్తుంది బావా’’

‘‘ఎలా వున్నావ్‌? నిన్ను చూసి యుగాలు గడిచినట్టుంది. విశాల గోల చేస్తోంది. దీక్ష బెంగపడి పోతోంది.’’

‘‘ఇంకెంత బావా రెండ్రోజులు ఓపిక పడితే సమస్యల నుంచి బయట పడిపోతాం. తమ్ముళ్ళంతా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నా గురించి బెంగ పడాల్సిన పని లేదు’’

‘‘అది సరి. కోర్టుకి ఎలా వస్తావ్‌? మేం కోర్టు దగ్గర రెడీ గానే వుంటాం’’

‘‘బావా మీరు నా కోసం చూడకండి. మీలో కొందరు ముందు గానే విజిటర్స్‌ గ్యాలరీలో కెళ్ళి త్యాగరాజన్‌ మనుషులు ఎక్కడెక్కడున్నారో గమనించి కవర్‌ చేయండి...’’

‘‘అవన్నీ మేం చూసుకుంటాం. సరే నువ్వెలా వస్తావ్‌. నేరుగా వచ్చేస్తావా లేక...’’

‘‘బావా ఎలా అని అడక్కు సస్పెన్స్‌. నువ్వే చూస్తావ్‌గా!’’ అంటూ నవ్వింది సహస్ర. మరో మూడు నిముషాలు సహస్రతో మాటాడి లైన్‌ కట్‌ చేసాడు విరాట్‌.

 

**********************************

రేపు వాయిదా రోజు అనగా...

ఆ ముందు రోజు ఉదయం కూడా తమిళనాడు సియం సెల్విచెందామరై విరాట్‌ సెల్‌కి ఫోన్‌ చేసారు. ‘‘తగిన ప్రొటెక్షన్‌ లేకుండా సహస్ర కోర్టుకి వెళ్ళటం ప్రమాదం. ఇప్పుడైనా మీరు ప్రభుత్వ రక్షణ లోకి వస్తే మంచిది. తగిన ఏర్పాట్లు చేస్తాను’’ అన్నారు.

‘‘సారీ మేడం సహస్ర జాడ ఇంత వరకు తెలీలేదు. కోర్టుకి వస్తుందో రాదో తెలీదు. మీ మాట కాదంటున్నందుకు క్షమించాలి’’ అంటూ సున్నితంగా ఆమె సలహాను తిరస్కరించాడు విరాట్‌.

 

*******************************

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika