Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Dullu Koora - Smashed Potat

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

ధామస్ ఆల్వా ఎడిసన్ డిపో మ్యూజియమ్  


ధామస్ ఆల్వా ఎడిసన్ పేరు వినగానే మీకేం గుర్తొస్తున్నాయి?  మీ ఇంట్లో వెలిగే ఎలక్ట్రిక్ బల్బు, మీరు చూసే చలన చిత్రం,  వగైరాలన్నీ గుర్తొస్తున్నాయికదా? మరి మనకిన్ని సౌఖ్యాలు అమర్చిపెట్టిన ధామస్ ఆల్వా ఎడిసన్ గురించి కొంచెం తెలుసుకుందామా?

అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో పోర్టు హ్యూరన్ కీ, ధామస్ ఆల్వా ఎడిసన్ కీ చాలా సంబంధం వున్నది.  ప్రస్తుతం పోర్టు హ్యూరన్ లో ధామస్ ఆల్వా ఎడిసన్ జీవిత విశేషాలనూ, ఆయన సాధించిన ఘనతలనూ తెలుపుతూ ఒక మ్యూజియమ్ నెలకొల్పారు.  క్రీ.శ. 1858లో గ్రాండ్ ట్రంక్ రైల్వేవారు నిర్మించిన చారిత్రాత్మకమైన ఫోర్ట్ గ్రాటియట్ డిపోలో 2001, ఫిబ్రవరి 11న ఈ మ్యూజియమ్ ప్రారంభింపబడినది.   

ప్రస్తుతం ఈ మ్యూజియం వున్న ప్రదేశంలోనే ఎడిసన్ చిన్నతనంలో నివసించిన ఇల్లు వుండేది. తర్వాత అక్కడ నిర్మింపబడిన రైల్ మార్గం వల్ల అది ధ్వంసమయ్యి, ఆయనకి సంబంధించిన వివరాలన్నీ మరుగున పడిపోయాయి.  అయితే , 1980 లో పోర్టు హ్యూరన్ మ్యూజియమ్, సైంట్ క్లైర్ కమ్యూనిటీ కాలేజ్ కలిసి రైలు మార్గం నిర్మాణంలో శిధిలమైన ఎడిసన్ అంతకు ముందు నివసించిన ఇంటిని త్రవ్వించి, ఆయన వాడిన అనేక పరికరాలు కనుగొన్నారు.  ఆ తవ్వకాల గురించి ఆర్కియాలజిస్టులు 1500 నోట్ బుక్స్ పేజీలనిండా వివరాలు రాశారు.  1700 కన్నా ఎక్కువ ఫోటోలు తీశారు.  1,28,000 వుపకరణాలుగానీ   వాటిలో భాగాలుగానీ సేకరించారు.

ఇంత ఉన్నతస్ధాయికి చేరిన ఎడిసన్ చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. 

ధామస్ ఆల్వా ఎడిసన్ 1847 ఫిబ్రవరి 11వ తారీకున యనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని మిలన్ లో తల్లిదండ్రులకు ఏడవ సంతానంగా జన్మించారు.  ఎడిసన్ తండ్రి శామ్యూల్ ఓగ్డెన్, తల్లి నేన్సీ మేధ్యూస్ ఇల్లియటి.

1854లో మిలన్ రైల్ రోడ్ వల్ల ఎడిసన్ కుటుంబ ఆదాయం తగ్గిపోవటంతో ఆ కుటుంబం బతుకుతెరువు కోసం పోర్టు హ్యూరన్ వచ్చారు. ఎడిసన్ చిన్నప్పుడు స్కూల్ కి ఎక్కువకాలం వెళ్ళలేదు.  అతనికి చిన్నతనంలోనే వినికిడి సమస్య వచ్చింది.  దానితో స్కూల్ లో చేరిన 3 నెలలకే మానెయ్యాల్సి వచ్చింది.  ఆయన తల్లే ఆయనకి గురువై చదివించింది.  పెద్దయిన తర్వాత ఎడిసన్ మా అమ్మే నన్ను మలచింది.  నేను తప్పకుండా గొప్పవాడినవుతానని ఆవిడ నమ్మకం.  దానితో నేను సాధించవలసినది ఏదో వుందని అనుకునేవాడిని.  ఆ నమ్మకాలతోనే ఆయన చాలా సైంటిఫిక్, పరిశోధనాత్మక గ్రంధాలు చదివి, తాను పరిశోధనలు చేసేవాడు. 

ఎడిసన్ పోర్టు హ్యూరన్ -- డెట్రాయిట్ మధ్య నడిచే రైల్లో కేండీ, న్యూస్ పేపర్లు, కూరగాయలు అమ్మేవాడు.    ఆయన రైల్లో ఈ పనులు చేస్తూనే క్వాలిటేటివ్ ఎనాలసిస్ చదివి రైల్లోనే కెమికల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు.    రోజూ రైలులో తిరిగే సమయాలలో ఖాళీ సమయాన్ని వృధా చెయ్యటానికి ఇష్టపడని ఎడిసన్ రైల్లోని బేగేజ్ కార్ లో ఎవరూ వాడకుండా వున్న స్మోకింగ్ కంపార్టుమెంట్ ని తన ప్రయోగాలకి, ప్రింటింగ్ ప్రెస్ కి వాడుకుని ఆ సమయంలో పరిశోదనలు చేసేవాడు .  ఒకసారి ఒక ప్రయోగం ఫలించక ఆ కార్  మంటల్లో చిక్కుకుంది. రైల్లో వుండే కండక్టరు ఆ పరిశోధనా పరికరాలని, ప్రింటింగ్ ప్రెస్ ని, ఎడిసన్ ని కూడా స్మిత్స్ క్రీక్ స్టేషన్ లో దింపేశాడు. 

తర్వాత ఎడిసన్ అనేక వుద్యోగాలు చేశాడు.  ఉద్యోగం చేస్తూనే లైబ్రరీలలో ఎక్కువకాలం గడిపి పరిశోధనా గ్రంధాలు చదివి తన స్వంత ప్రయోగాలు చేసేవాడు.

ఎడిసన్  రోడ్డు మీద న్యూస్ పేపర్లు అమ్మటానికి హక్కులు తీసుకున్నాడు.  అంతేకాదు.  నలుగురు సహాయకులతో గ్రాండ్ ట్రంక్ హెరాల్డ్ అనే పేపరు స్వంతంగా ప్రింట్ చేసి, మిగతా పేపర్లతోపాటు అమ్మేవాడు.  ఇదే వ్యాపారవేత్తాగా ఎడిసన్ ఎదగటానికి దోహదపడింది.  ఆయనలో వున్న టాలెంట్స్  తోనే  ఆయన 14 కంపెనీలు స్ధాపించాడు.  వాటిలో జనరల్ ఎలక్ట్రిక్ ఇప్పటికీ నడుస్తున్న ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీ

ఎడిసన్  దేనినైనా మార్కెట్ చెయ్యటంలో విశేష ప్రజ్ఞ చూపించేవాడు.  సివిల్ వార్ లో డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ నుంచి ఎక్కువ  వార్తాపత్రికల కాపీలు  తీసుకునేవాడు.   ఒక టెలిగ్రాఫర్ తో యుధ్ధ వివరాలు ఎప్పటికప్పుడు తన రైలు వెళ్ళే స్టేషన్లకన్నింటికీ పంపించే ఏర్పాట్లు చేసుకున్నాడు.  ఎప్పటికప్పుడు తాజా యుధ్ధ సమాచారాన్ని  ఆ పేపర్ లలోవున్న ఖాళీ స్ధలాలలో తన ప్రింటర్ తో ప్రింట్ చేసి,  పేపర్ రేటు పెంచి అమ్మేవాడు.  తాజా వార్తలు తెలుసుకోవాలనే ఉత్కంఠతో  పాఠకులు ఎక్కువ మూల్యం చెల్లించి పేపరు కొనేవారు.

జీవితంలో ఎన్నో కష్టాలుపడి, స్వశక్తితో ఉన్నత స్ధాయికి వచ్చిన వ్యక్తి ఎడిసన్.  ఆయన జీవిత విశేషాలతో స్ధాపించిన ఈ మ్యూజియమ్ సందర్శనద్వారా ఎడిసన్ కనిపెట్టిన వస్తువులు, ఆయనకి తన కుటుంబంనుంచి వచ్చిన సపోర్టు, ఎదుర్కొన్న సమస్యలు, వాటన్నింటినీ అధిగమించి గొప్ప ఆవిష్కర్తగా ఆయన సాధించిన విజయాలు, ఆ కాలపు జీవన విధానాలు తెలుసుకోవచ్చు.   సందర్శకులు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటూ తాము కూడా చిన్న చిన్న ప్రయోగాలు చెయ్యవచ్చు.  విద్యార్ధులు ఇలాంటి మ్యూజియమ్ ఒక్కసారి చూస్తే వారి విజ్ఞానం పెరగటమేకాక, వారికి అన్ని విషయాలూ బాగా గుర్తుంటాయి. 

ఆయన గొప్ప పరిశోధకుడే కాదు మంచి వ్యాపారవేత్త కూడా.  ఈ నాడు మనం వుపయోగిస్తున్నఅనేక పరికరాలు ఆయన కనిపెట్టినవే.  ఆయన కనిపెట్టిన అనేక రకార పరికరాలవల్ల మానవ జీవితం ప్రభావితమయింది.  ఫోనోగ్రాఫ్, చలన చిత్రం చిత్రీకరించే కెమేరా, ఎలక్ట్రిక్ బల్బు ఇలా ఎన్నో మానవ జీవితానికి వుపయోగపడే వస్తువులను కనిపెట్టటమేగాక వాటిని ఎక్కువ మంది కలిసి పని చెయ్యటం ద్వారా ఎక్కువ వుత్పత్తి చేయించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే.  అందుకే ఆయనని అప్పటివారు మొదటి ఇండస్ట్రియల్ రీసెర్చ్ లేబరేటరీగా అభివర్ణించారు. 

అసలు ఎడిసన్ ఎన్ని పరికరాలు కనిపెట్టారో వూహించగలరా   ఆయన పేరుతో అమెరికాలో 1,093 పేటెంట్స్ వున్నాయి.  అమెరికాలోనే కాదు.  యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ వగైరా దేశాలలో కూడా ఆయన కనిపెట్టిన పరికరాలకి పేటెంట్స్ వున్నాయి.  ఆయనకున్న పేటెంట్స్ కన్నా ఆయనకి ఎక్కువ ఖ్యాతి తెచ్చిపెట్టినవి ప్రజోపయోగకరమైన ఆయన పరిశోధనలు.  ఎలక్ట్రిక్ లైట్, విద్యుత్ వుపకరణాలు, శబ్దాన్ని రికార్డు చేసే యంత్రము, చలన చిత్రము తీసే కెమేరా .. వీటికోసం ప్రపంచవ్యాప్తంగా కొత్త పరిశ్రమలు స్ధాపించబడ్డాయి.  అసలు ఈ పరికరాలు లేని జీవితాన్ని ఈ నాడు మీరు వూహించగలరా?  

మాస్ కమ్యూనికేషన్స్ కి, టెలి కమ్యూనికేషన్ల్ కి ఆయన పరిశోధనలు ఎంతో వుపయోగపడ్డాయి.  మెకానికల్ ఓట్ రికార్డర్, ఎలక్ట్రిక్ కారుకోసం బేటరీ, విద్యుఛ్ఛక్తి, మ్యూజిక్ రికార్డర్,  వగైరా ఆయన కనిపెట్టిన అంశాలే.  మొదట్లో టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా పని చేసిన ఎడిసన్ విద్యుఛ్ఛక్తి వుత్పత్తి చేసి దానిని ఇళ్ళకి, వ్యాపారాలకి, పరిశ్రమలకి సరఫరా చేసేదాకా ఎదిగారు.  ఆయన మొదటి పవర్ స్టేషన్ న్యూయార్కులోని పెర్ల్ స్ట్రీట్ లో వున్నది. 

మ్యూజియంలో వున్న రైల్ కార్ దర్శకులను ఆకర్షిస్తుంది.  అందులో ఎడిసన్ మొబైల్ లేబొరేటరీ, ప్రింటింగ్ ప్రెస్ మోడల్స్ ని చూడవచ్చు.

చలన చిత్రం నిర్మించే స్టూడియో కూడా ఎడిసనే ముందు నిర్మించాడు.  అసలుది కాలగర్భంలో కలసిపోగా దాని మోడల్ తయారు చేసి ప్రేక్షకుల సందర్శనార్ధం వుంచారు. 

తను స్కూలుకి వెళ్ళకపోయినా, చదువంటే వున్న ఆసక్తితో స్వంతగా చదువుకుని, తనకున్న తెలివితేటలతో అనేక పరికరాలను కనిబెట్టి, అత్యంత ప్రతిభావంతుడైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న ఎడిసన్ 18, అక్టోబర్, 1931, తన 84వ ఏట న్యూజెర్సీలోని వెస్ట్ ఆరెంజ్ లో మరణించారు. 

మానవ జీవతాలలో ఉపయోగపడే అనేక వస్తువులను కనుక్కుని, వారి జీవన ప్రమాణాలను పెంచిన ధామస్ ఆల్వా ఎడిసన్ గురించిన విశేషాలు కొన్నయినా ఈ మ్యూజియంద్వారా తెలుసుకున్నామనే సంతోషంతో అక్కడనుంచి బయల్దేరాము.

మరిన్ని శీర్షికలు
varada vinaayayakudu