Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pounch patas

ఈ సంచికలో >> శీర్షికలు >>

వాస్తు - వాస్తవాలు - సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)

 

బావి ఈశాన్యంలో, ఉపగృహం నైరుతిలో ఎందుకుండాలి?

దిక్కులను యే విధంగా ఉపయోగించుకోవాలో మనం పరిశీలిద్దాం. అన్ని దిక్కులు ఉపయోగకరమైనవే. ఏ దిక్కుకు ఉండే లాభ నష్టాలు ఆ దిక్కుకు ఉంటాయి. మానవ మనుగడకు దిక్కులను సమతౌల్యం చేసి వినియోగించుకోవాలి. సుఖ శాంతులను ప్రసాదించే దిక్కుల బలాన్ని పెంచి, నష్టాలను ఇచ్చే దిక్కుల బలాన్ని తగ్గించడం ద్వారా మంచి జీవితాన్ని పొందవచ్చు అనే విషయాన్ని మనం గత అధ్యాయాలలో తెలుసుకొన్నాం. దిక్పతుల బలం, నవగ్రహ బలం మనపై ఉంటుంది. దిక్పతుల, నవగ్రహాల లక్షణాలను అనుసరించి దిక్కుల బలాబలాలను సమతౌల్యం చేయాలి..

దిక్పతుల బలాన్ని యే విధంగా పెంచాలి లేదా తగ్గించాలి అన్నది వాస్తులో చాలా ముఖ్యమైన విషయం. ఈ పరిజ్ఞానం తప్పనిసరిగా వాస్తు పండితునికి ఉండాలి. ముందుగా దిక్పతి బలాన్ని యే విధంగా పెంచాలో తెలుసుకొందాం. మనకు యే దిక్పతి బలం అవసరమో ఆ దిక్కును బాగా పల్లం చేయాలి. అదే విధంగా విశాలంగా బరువులు వేయకుండా ఉంచాలి. అప్పుడే ఆ దిక్పతి బలం పెరిగి అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. అదేవిధంగా ఏ దిక్పతి బలం మనకు నష్టం కలిగిస్తుందో లేదా ఏ దిక్పతి బలహీనంగా ఉంటే లాభిస్తుందో, ఆ దిక్కును బాగా మెరకలో అంటే ఎత్తులో ఉంచి బరువులను వేయాలి. అదే విధంగా ఆ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం వదలాలి.

అప్పుడే ఆ దిక్కు బలం తగ్గి మంచి లాభాలను కలిగిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే పల్లమైన దిశ అధిబలం కలిగి ఉంటుంది. మెరకలో ఉన్న దిశ 
 బలహీన మౌతుంది.తూర్పు, ఉత్తరం మరియు ఈశాన్య దిక్కులు శుభాలను ప్రసాదించే గ్రహాల మరియు దిక్పతుల ఆధీనంలో ఉంటున్నాయి. అదే విధంగా దక్షిణ, పశ్చిమ,నైరుతి,వాయవ్య మరియు ఆగ్నేయ దిశలు అశుభాలను ప్రసాదించే గ్రహాల మరియు దిక్పతుల ఆధీనంలో ఉంటున్నాయి. సుఖప్రదమైన జీవితానికి శుభాలను ప్రసాదించే తూర్పు,ఉత్తర మరియు ఈశాన్య దిక్కుల బలం పెరగాలి. అదేవిధంగా అశుభాలను ప్రసాదించే దక్షిణ,పశ్చిమ ,నైరుతి మొదలగు దిశల బలం తగ్గాలి. అప్పుడే దిక్కుల మధ్య సమతౌల్య స్థితి ఉండి మనిషి మనుగడ సుఖప్రదంగా సాగుతుంది. మంచి జీవితం కోసం శుభాలను కలిగించే తూర్పు ఉత్తర మరియు ఈశాన్య దిక్కుల బలం పెరగాలి కాబట్టి ఈ దిక్కులను పల్లంగాఉంచి బరువులు వేయకుండా విశాలంగా ఎక్కువ ఖాళీగా ఉంచాలని వాస్తు ఆదేశిస్తుంది. అదేవిధంగా మిగిలిన దిక్కులు కష్టాలను నష్టాలను ఇస్తాయి కాబట్టి ఈ దిక్కుల బలం తగ్గాలి కనుక తక్కువ ఖాళీ స్థలం వదలి బరువులు పెట్టి  మెరకలో ఉంచాలని వాస్తు తెలుపుతుంది. ఈ విధంగా చేస్తే మనిషి జీవితం సుఖప్రదంగా ఉంటుంది.

పై సూత్రం ప్రాతిపదిక పైనే మనం ఈశాన్యం లో జలాశయాలు, బోర్ వెల్స్ మరియు బావులను త్రవ్వుతున్నాము. బావి, బోర్లు ఈశాన్యంలో ఉండుటవలన అవి బాగా పల్లంగా లోతుగా ఉండటం వల్ల ఈశాన్యం బలం పెరిగి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. 

మరిన్ని శీర్షికలు
navvunalugu yugaalu