Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Headache | తలనొప్పి | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

తిరుప్పావై - వనం వెంకట వరప్రసాద రావు

tiruppaavai

తిరుప్పావై 

కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగ నాయకీం

ఆధ్యాత్మిక ప్రపంచంలో అతిపవిత్రమైన, విశిష్టమైన స్థానాన్ని పొందిన 'తిరుప్పావై' కావ్యాన్ని భూదేవి  అంశతో జన్మించిన గోదాదేవి విరచించి గానం చేసింది. పాండ్యదేశంలో, శ్రీ విల్లిపుత్తూరు అనే పల్లెలో,  కర్కాటక రాశిలో, పూర్వఫల్గుణీ(పుబ్బ)నక్షత్రంలో కలియుగం ప్రారంభం ఐన తొంభైమూడవ  సంవత్సరంలో, నరనామ సంవత్సరంలో, తులసీవనంలో ఉద్భవించిన గోదాదేవి విష్ణుచిత్తులవారికి   దొరికింది.  విష్ణు చిత్తులు నేటి తమిళనాడులోనిది, ఆనాటి పాండ్య ప్రభువుల ఏలుబడిలోనిది ఐన శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో జన్మించారు. ఈ గ్రామానికే ధన్వినవ్యపురం అనే పేరుకూడా ఉంది, వైష్ణవసంప్రదాయంలో. ఆ గ్రామంలో వటపత్రశాయి ఐన మహావిష్ణువు దేవాలయం ఉంది. ఆ స్వామిని వైష్ణవ సంప్రదాయంలో వడపెరుంగోయిలాన్ అని పిలుస్తారు. ఆ ఆలయ పూజారి ఐన ముకుందాచార్యులు, పద్మ అనే దంపతులకు జన్మించిన బాలకుడు విశేష జ్ఞానము, పాండిత్యమూ లేకున్నప్పటికీ, అపరిమితమైన భక్తి, సాత్విక గుణం కలిగినవాడు. ఆయనే విష్ణుచిత్తులు. యజుశ్శాఖాధ్యాయి, బోధాయన సూత్ర అనుయాయి. 

తన తండ్రి వలెనే ఆయన కూడా ఆ వటపత్ర శాయిని  నిత్యమూ పరమ భక్తితో అర్చన చేస్తుండేవారు.  తమ తాత తండ్రులు సంపాదించి ఇచ్చిన సారవంతమైన భూమిలో ఒక గొప్ప ఉద్యానవనమును పోషిస్తూ ఆ ఫల, పుష్పములచే స్వామిని అర్చిస్తూ, తమ తోటలోని తులసీ దళములనూ, పుష్పములనూ మాలికలల్లి నిత్యమూ స్వామికి అలంకరించి అతి నిరాడంబరమైన జీవనాన్ని గడిపే ఆ దంపతులకు  సంతానం లేని కొరత మాత్రమే ఉండేది. సంతానంలేని ఆయన తన పెరటిలోని తులసీవనంలో లభించిన ఆడపిల్లను పెంచుకుని, ముద్దుగా పూవులా ఉన్న పిల్లకు 'కోదై'అని పేరు పెట్టుకున్నారు. కోదై అంటే మాల(పూ/తులసీమాల)అని అర్థం తమిళంలో. తండ్రి కోదా..కోదై అని పిలిచే పిలుపు గోదా అయ్యింది తెలుగులో.

ఆయనకు భగవద్దత్తముగా దొరికిన గోదాదేవి తన తండ్రి ఐన విష్ణుచిత్తులు స్వామికి అలంకరించుటకు సిద్ధము జేసే పూలమాలికలనూ, తులసీమాలికలనూ తనతండ్రి చూడకుండా ధరించి పరవశించిపోతూ మరలా ఆ మాలలను ఏమీ ఎరుగనట్లు యథాస్థానములో నుంచేది. ఆవిషయము తెలియని ఆమెతండ్రి ఆమాలలనే  స్వామికి అలంకరించేవాడు. ఒకనాడు విష్ణుచిత్తులవారు స్వామికి సిద్ధం చేసిన మాలికను  తనకూతురు ధరించడం చూసి, కుమార్తెను మందలించి, ఆరోజు ఆ మాలను స్వామికి అలంకరించడం  మాని, మిగిలిన పూజను యథావిధిగా చేసి  నిదురించగా, స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి, ఆమె తన ఆంతరంగిక భక్తురాలనియూ, ఆమె ధరించి ఇచ్చిన మాల తనకు అత్యంత ప్రీతికరమైనది అనీ, ఆమె కారణజన్మురాలని తెల్పుతాడు. దిన దిన ప్రవర్ధమానయై అతిలోక లావణ్యవతియై  పెరుగుతూ, 

బాల్యమునుండే విష్ణు భక్తి గలదియై, తనతోనే పెరుగుతున్న విష్ణుభక్తి చేత మహావిష్ణువును ఆరాధించి,  ఆయననుతప్ప అన్యులను వివాహమాడనని నిశ్చయించుకుని, స్వామిమీద విరహముతో కృశించిపోతూ చివరికి ఆత్మత్యాగము చేయుటకైననూ నిశ్చయించుకొనగా ఆమె చెలికత్తెలు వారించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అంశతో జనించిన కారణజన్మురాలని, పూర్వజన్మలో గోదాదేవియే సత్యభామయనీ,  తాము నాగకన్యలమనీ, క్రితంజన్మలో తామే గోపికలుగా వున్నప్పుడు, కాత్యాయనీ వ్రతముచేసి  శ్రీకృష్ణుని భర్తగా  పొందినట్లే ఈ జన్మలోనూ గోద ఆ వ్రతమును ఆచరించినట్లయితే స్వామిని పొందవచ్చు అని తెలుపుతారు. 

వారి ఉపదేశానుసారము మార్గశిరమాసములో ధనుస్సంక్రమణంతో మొదలై మాసం సాగే ధనుర్మాసములో గోదాదేవి నెలరోజులు కాత్యాయనీ వ్రతమును చేసి, ఆ నెలరోజుల వ్రతములో తనను గోపకన్యగా, తన చెలికత్తెలను గోపకన్యలుగా, తన విల్లిపుత్తూరును నందగోకులంగా తమ నాధుడు శ్రీకృష్ణుని పొందడం కొరకు వ్రతంగా ఆ వ్రతాన్ని భావించి, ప్రతిరోజూ ఒక దివ్యమైన గేయాన్ని  రచించి స్వామికి వినిపించేది. ఆ పాటలకే 'తిరుప్పావై'అని పేరు. అవి మాములు పాటలు కావు, సర్వ వేద సారం అని పిలవబడే తిరుప్పావై అనే ముప్పై పాటల్ని పాడింది గోదా. ఇంకా భగవంతుని దర్శనం కలుగక, తన వేదనని తెలియజేస్తూ నాచియార్ తిరుమొఱ్ఱి అనే మరొక నూట నలభై మూడు పాటల దివ్య ప్రబంధాన్ని పాడింది.అప్పుడు అర్చామూర్తిగా ఉన్న రంగనాథుడు చలించి, తన వద్ద ఉన్న అర్చకుడిని ఆదేశించి గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూర్ నుండి పిలిపించుకుని, శ్రీరంగ క్షేత్రంలో రంగవిలాస మండపంలో మానవ కన్యగా ఉన్న ఆమెను వివాహమాడాడు. పవిత్రమైన ధనుర్మాస సందర్భంగా మన ప్రాప్తం మేరకు 'తిరుప్పావై' సేవ చేసుకుందాము. 

శ్రీకరము విల్లిపుత్తురు
‘శ్రీ’ కరముల సొబగు విరుల శ్రీకర మాలన్
శ్రీకర చరణపు సిరులన్
శ్రీకరమగు నిలకు పలుకు శ్రీకరమగుతన్

1వ పాశురము తాత్పర్యము:- మార్గశీర్ష మాసం వచ్చింది. నిండు చంద్రుడున్న మంచి పున్నమి రోజులొచ్చాయి. అందమైన నగలను  అలంకరించుకున్న, సకల సంపదలతో ఐశ్వర్యముతో తులతూగుతున్న వ్రేపల్లెలోని, పడుచులారా! వాడి ఐన శూలాన్ని ధరించి ఏ ఆపదా రాకుండా కాపలా గాస్తున్న నందునికుమారుడు, విశాలనేత్రి ఐన యశోద ముంగిలిలోని సింహపు కూన, సూర్యునిలా, చంద్రునిలా వెలిగిపోయే సుందరమైన ముఖమును  కలిగిన నీలమేఘశ్యాముడైన నారాయణుడినే మనం సేవిస్తే, మనకే 'పర' (వాయిద్యము)ను యిస్తాడు ఆ నారాయణుడు, శ్రీకృష్ణుడు. చూసేవారంతా సంతోషించి పొగిడేటట్లుగా, మార్గశిర స్నానం చేసి, ఈ వ్రతాన్ని చేద్దాం రండి! 

మార్గశి రమ్మిది ‘మన కప
వర్గపు వరదాత హరియె వంద్యుడు’ వనితల్
మార్గళి స్నానము జేసిన
మార్గము సులభంబునగును మాధవు పొందన్!  

పండిన వెన్నెల దినములఁ 
నిండెను సరసులు ఝరులను నిర్మలమయ్యెన్
దండిగ సుగుణా భరణము 
లుండిన జాణలు జలకము లొందుడు వడిగన్  

దండము చేగొని అజున, క
జాండములకు గతి పతియగు శార్ఙికి ప్రణతుల్
గుండెల నిడి చేయు జనుల
కండగు నందుని తనయుని కనుగొనవలయున్    

వనరుహనయన యశోదకు  
తనయుడు, నందుని గృహమున తాలిమి సింహం
బును, నగవుల రవియు శశియు
నన వెలిగెడి ఘనుడు వనజ నాభుని గొలువన్ 

మనమిదెజలకములాడుచు
ఘనసుందరు పతిగ గొనగ కాత్యాయనికౌ
మననోముల 'పర'పతి గద
మననోముల మహికి సకల మంగళమగుతన్

2వ పాశురం - తాత్పర్యము:-

ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించడానికి జన్మించిన వారంతా మా వ్రత విధానాన్ని సంతోషంగా  వినండి. పాలకడలిలో హాయిగా నిదురిస్తున్న ఆ పరమాత్ముని పాదములకు మంగళ సంకీర్తన చేస్తాము. ఈ వ్రతసమయములో పాలను, నేతిని ఆరగింపము. తెల్లవారుఝామునే లేచి స్నానం చేస్తాము. కనులకు కాటుక పెట్టుకోము. తలలో పూలను పెట్టుకోము. పెద్దలు చేసినట్లే, చెప్పినట్లే  చేస్తాము. యితరులకు బాధకలిగించే మాటలను, యితరులమీద చాడీలు చెప్పము. జ్ఞానాధికులకు  సంతోషము,సంతృప్తి కలిగేట్లుగా వారికి భిక్షను సమర్పించి సత్కరిస్తాము. 

మోదము గలదొకటి పరము
మోదము కనుగొనుట కొరకె మోయుట జన్మల్
మోదము హరిగుణ భజనము 
మోదము హరివశతనొంద మోక్షము నొందన్

సుందర శేషశాయి పరిశుద్ధుడు పాల సముద్రమందునన్
విందుగ మాయనిద్రగొను విష్ణుని పుణ్య పదాబ్జసంగతిన్
చెందగ చేయు మా వ్రతము చెచ్చెర నిచ్చును శాశ్వతాద్భుతా 
నందము నందుకై జలజనాభుని పాదములందు డందరున్ 

వినుడు నియమములు వేకువ
ననె జలకములాడి పాల నానక, నేయున్,
కనులకు అలదక కాటుక
యును, విరులు సిగన తురమక యుందుము నిరతిన్
పారము ముట్ట పండితుల పాదసమర్చన జేసి తోరముల్

పూరములైన మోదముల పూర్ణముగా నొనరించి సత్కృతుల్
ఏరల దూర కెన్నటికి నెన్నడు పూర్వుల మార్గమందు సం
చారము జేతు మెప్పుడు విచారము జేతుము జన్మధన్యతల్ 

3వ పాశురము - తాత్పర్యము:-    

వామనావతారంలో పెరిగి పెరిగి, ముల్లోకాలనూ కొలిచిన ఆ పురుషోత్తముని నామ సంకీర్తనం మేము చేయడంవలన దేశమంతా ఏ ఈతిబాధలూ లేకుండాపోయి, నెలకు మూడువానలు కురియాలి.వరిచేలు ఆకాశానికి అంటేట్లు పెరిగి, ఆ మళ్ళలో నిలిచిన నీళ్ళలో చేపలు ఎగిరిపడుతుండాలి.కలువపూలలో తుమ్మెదలు నిదురిస్తుండగా, చేయి తాకించగానే కడవలు నిండిపోయేట్లుగా ఉదారమైన పాల దారాలు కురిపించే బలమైన పొదుగులున్న ఆవులుండగా, దేశమంతా పంటలతో, పాడితో, నాశనం లేని, శాశ్వతమైన సంపదతో సమృద్ధిగా ఉండాలి. 

పెరిగి పెరిగి కొలిచెను గడ
సరిగ జగములతని నామ సంకీర్తనముల్ 
జరుపుటలను నెపమును గొని 
సరగున నరిగెదము గూడి స్నానములాడన్

నెలలో మూడుగ వానల

నిల యే ఈతియు నిడుముల నెరుగమి మడులన్
జలముల నెగురుచు చేపలు 
గలదౌ గగనముల నంటగా వరిచేలున్ 
కలువల నెలవుల తేటులు 

గలలెరుగని నిద్ర గొనగ ఘనమగు పొదుగుల్ 
గలవగుచును గోవులు కడ 
వల గురియగ పాలు పిదుకు వారలు సోకన్
పశువులు పాడియు పంటయు 

వశమగు సిరు లిలను నిండు వనితల్ ప్రభువుల్ 
యశమిడు నడతలు బడసి య 
నిశమును భూసురులు ధర్మ నిరతిని పొందన్

(మిగిలిన పాశురాల కొనసాగింపు తరువాతివారం)

***వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని శీర్షికలు
himagiri kailasa darshanam