Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

క్లే, గ్లాస్ అండ్ మెటల్ షో,  రాయల్ ఓక్,  మిచిగాన్


వాషింగ్టన్ ఎవెన్యూ, రాయల్ ఓక్ డౌన్ టౌన్, మిచిగాన్ లో  క్లే, గ్లాస్ అండ్ మెటల్ షో జరిగింది.   దీనికోసం ఒక రోడ్డుని ట్రాఫిక్ రాకుండా మూసి వేశారు.  షుమారు 120 మంది కళాకారులు తమ కళలని ఇక్కడ ప్రదర్శించారు.  రోడ్డు మొత్తం చిన్న చిన్న గుడారాలలో స్టాల్స్ పెట్టారు.  స్త్రీల ఆభరణాలు, గృహాలంకరణ వస్తువుల స్టాల్స్ ఎక్కువ వున్నాయి.

అందరినీ ఆకర్షించినది గాజు అలంకరణ వస్తువులు తయారు చేయటాన్ని ప్రదర్శించిన స్టాల్.

చిన్న పిల్లలని ఆకర్షించటానికి చిన్న చిన్న రాళ్ళతో వస్తువులను తయారు చేయటం, మోటారుతో తిరిగే కుమ్మరి చక్రం మీద కుండ తయారు చెయ్యటం, ఇంకా తెల్ల షర్టులమీద స్ప్రే పెయింట్ చెయ్యటం ఇలాంటి స్టాల్స్ వున్నాయి. 10 డాలర్లు ఇచ్చి తెల్ల షర్టుమీద పిల్లలు వాళ్ళకిష్టమైన రంగులు స్ప్రే చేశారు. అవి పడ్డ ఆకారాలు చూసి తాము అద్భుతంగా పైంట్ చేశామనుకుని మురిసిపోయారు పిల్లలు.   మనవాళ్ళు కాయితాలమీద ఇంకు జల్లి వాటిని మడిచి రకరకాల ఆకారాలను చూసి మురిసిపోతారుకదండీ. అలాగే.
షో  అంటే తినుబండారాలు తప్పనిసరికదా.   కేండీలు, ఐస్ క్రీమ్సూ, ఇవేకాక ఎలిఫెంట్ ఇయర్స్ అని ఒక ప్రత్యేక తినుబండారం, మన పూరీలు పెద్ద సైజులో వున్నట్లుంటాయి..  వాటిమీద చక్కెర వగైరాలు వేసి ఇస్తారు..అవీ, ఇంకా రకరకాలు.

వీటన్నింటి మధ్యలో ఒక చిన్న స్టేజ్ ఏర్పాటు చేసి సంగీత కచేరీలు (సంగీత కచేరీ అన్నానని మనవి వూహించుకోకండి.   ఇప్పుడు చెబుతున్నది అమెరికా గురించి .. అందుకని వెస్ట్రన్ మ్యూజిక్ వూహించుకోండి.

వీటన్నిటి మధ్యలో ఒకాయన ప్రక్క వాయిద్యాలేమీ లేకుండా ఎలక్ట్రిక్ గిటార్ మీద అక్కడివారు కోరిన పాటలు వాయిస్తున్నాడు. అలాగే ఆయన ఆల్బమ్స్ అమ్మకానికి వున్నాయి. వివరాలన్నీ ఒక బోర్డుమీద రాసి పక్కన పెట్టాడు.

ఈ షోలో ఆడంబరమైన వస్తువులేమీలేకపోయినా ఇక్కడివారిలోని అభిమానాలు పెల్లుబికాయనిపించింది. చాలామంది తమ పెంపుడు కుక్కలని తెచ్చారు. ఎంత భయంకరమైన కుక్కలైనా తమ యజమానులతో హాయిగా తిరిగాయి ఎవరినీ భయపెట్టకుండా. పిల్లలు ప్రదర్శనకన్నా ఈ కుక్కలతో ఆడటానికి ఎక్కువ ఇష్టపడటం, ఒకరినొకరు పలకరించుకోవటం, వీటన్నింటితో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.
సందర్శకులతో వచ్చిన ఒక బుల్లి కుక్క ఒక పెద్దకుక్కని భయపెట్టటానికి చేసిన విశ్వ ప్రయత్నం అందర్నీ ఆకర్షించింది. మీ కోసం ఆ ఫోటోలు..చూడండి మరి.

మరిన్ని శీర్షికలు
Burning Mouth Syndrome, Ayurveda Treatment in Telugu by Dr. Murali Manohar