Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
ఆముక్తమాల్యద

తనను కనికరించి తన వికృత రూపం తొలిగిపోయే
విధంగా మాలదాసరి ఆనాడు చేసిన కీర్తనాఫలితాన్నితనకు ధారపోయాలని కోరాడు బ్రహ్మరాక్షసుడు.తద్వారా ఈ జన్మలో గొప్ప పుణ్యాన్ని పొందవచ్చును అని చెప్పాడు. ఈ జన్మ, దీనికోసం నా పుణ్య ఫలితాన్నిధారబోయడం..యిలాంటివి ఎన్ని జన్మలు ఎత్తివుంటాము 
అని పరిహాసంగా నవ్వాడు మాలదాసరి.దిక్పాలతను వెత్తి తిరిపంపుఁదనుఁ దోన / యెన్నిమార్లెత్తమీ యేను నీవు?మాతంగతను వెత్తి మశకంపుఁదనుఁదోన  / యెన్నిమార్లెత్తమీ యేను నీవు?కేసరితనువెత్తి కీటంపు దనుఁ దోన / యెన్నిమార్లెత్తమీ యేను నీవు?
ధరణీశతను వెత్తి దాస్యంపు దనుఁ దోన / యెన్నిమార్లెత్తమీ యేను నీవు? సోమయాజు లెన్ని మార్ల్గాము శ్వపచ 
ఖగకులుల మెన్నిమారులు గాము పాము గాములమ యెన్ని మారులు గాము వెండి కంసరిపుభక్తుల మొకండె కాము గానిదిక్పాలకుల దివ్య జన్మలను ఎన్నిసార్లు  ఎత్తి ఉంటాము, వెంటనే మరుసటి జన్మలో  బిచ్చగాళ్ళ జన్మలను కూడా ఎన్నిసార్లు ఎత్తి వుంటాము? యెన్ని  సార్లని ఏనుగులుగా, వెంటనే దోమలుగా పుట్టివుంటాము? సింహాలమై ఎన్నిసార్లు పుట్టి వుంటాము, వెంటనే క్షుద్ర కీటకాలమై ఎన్నిసార్లు
పుట్టి ఉంటాము? చక్రవర్తులుగా ఎన్నిసార్లు పుట్టి ఉంటాము, వెంటనే బానిసలుగా ఎన్నిసార్లు పుట్టి ఉంటాము? ఎన్నిసార్లు నిష్ఠ కలిగిన సోమయాజులమై పుట్టి ఉంటాము, ఎన్నిసార్లు కుక్క మాంసాన్ని తినేవాళ్ళమై పుట్టి ఉంటాము? పక్షులమై, పాములమై, పిశాచాలమై ఎన్నిసార్లు పుట్టి వుంటాము, కంసహారి ఐన శ్రీకృష్ణుని భక్తులమై పుట్టి ఉండము గాని! ఉత్తమ నీచ జన్మలను ఎన్ని పొంది ఉంటాము, శ్రీకృష్ణుని భక్తులమై పుట్టి ఉండము గానీ అన్న ఎకసక్కెం లో కూడా దివ్యమైన చమత్కారాన్ని పొదిగాడు రాయలవారు. యిన్ని జన్మలను 
ఎత్తడం అంటే శ్రీకృష్ణ భక్తులము అప్పటికి యింకా కాలేదు అని, ఎందుకంటే శ్రీకృష్ణ భక్తి ఒక జన్మలో కలిగితే మరొక జన్మ ఉండదు అని విరుపు! యింత క్లుప్తంగా, నాలుగే నాలుగు పదాలలో, యింత ఉన్నతంగా శ్రీకృష్ణ స్తుతి చేసినవారు యిదివరకు ఎవరూ ఉండకపోవచ్చు, 
పుంఖాను పుంఖాలుగా గ్రంథాలు వ్రాసి ఉండవచ్చును గానీ, రాయలకు నమస్సులు!  

ఊఁతనీరు చెలఁది నేత మూ టాయిటి 
దూది యెండపసుపు తొఱ్ఱియక్క
రంబు మేను దీని రహిఁ బుణ్య మమ్ముట 
కప్పురంబు వెట్టి యుప్పు గొనుట

ఊత అంటే వెదురుతో అల్లిన జాడీ వంటిది, పైనా క్రిందా మూత ఉండదు, దాన్ని నీటిలో ఉంచితే దానిలోనుండి దూరిపోయే చేపలు ఆ వెదురు సందులలో యిరుక్కుపోయి దొరికిపోతాయి. రెండుప్రక్కలా మూత ఉండదు కనుక అందులో నీరు నిలిచే అవకాశమే ఉండదు, అటువంటిది, ఊతలో నిలిచే నీటి వంటిది మానవ జన్మ, అంత క్షణికం! చెలది నేతమూట అంటే సాలెపురుగు నేసిన దారాలతో కట్టిన మూట. సాలెపురు దారాలు మూటలను మోస్తాయా? ఈ మానవ జన్మ సాలెపురుగు దారాలవంటిది, బలహీనమైనది.అయిటి దూది అంటే ఎండి గాలికి ఎగిరిపోయే దూది, బూరుగు దూది, అలాంటి క్షణికమైనది ఈ శరీరము. ఎండలో ఉంచిన పసుపులాగా యిట్టే రంగు పోయి, మ్లానమై నల్లబడేది ఈ శరీరము.తొఱ్ఱి అక్కరంబు అంటే తొఱ్ఱివాడి పలుకులాగా పసలేనిది ఈ మానవ జన్మ. యిటువంటి ఈ జన్మకోసం 
పరమాత్ముడిని కీర్తించిన పుణ్యాన్ని అమ్ముకోవడం అంటే కప్పురాన్ని యిచ్చి బదులుగా ఉప్పును తీసుకోవడమే, అంత పిచ్చివాడిలా కనిపిస్తున్నానా నేను? అన్నాడు మాలదాసరి.

సంగీతఫలంబునఁ గో
సంగీ సగమైన దయపొసఁగ నీవే మీన్ 
మ్రింగినగ్రుక్కన్వారిధి 
కిం గొఱఁతయె కొదయె విష్ణుకీర్తన కనినన్

బ్రహ్మరాక్షసుడు బ్రతిమిలాడడం మొదలెట్టాడు. గోసంగీ, ఓ దాసరీ! సంగీత కీర్తనా ఫలంలో కనీసం సగమైనా నాకు ధారపోయవయ్యా! చేప మింగిన నీళ్ళవలన సముద్రానికి నీరు తగ్గిపోతుందా? విష్ణు కీర్తనకు తగ్గడం అనేది ఉంటుందా? అన్నాడు. దానికి కొద్దిగా విసుగుతో, కొద్దిగా అనునయంగా

యిలా అన్నాడు మాలదాసరి.
ఏలా నొంచె ద దేయ మిట్లడిగి  యెంతే బాస మేనంబలం 
బో లీలావటుగీతకీర్తనఫలంబో నీయెడ న్మున్ను పా
తాళప్రశ్నలు మాని మేన్గొనుము బేతాళచ్ఛలోక్తిన్ రుషం 
దూలింపందలఁతేని పుట్టు మఱి నూతుల్ద్రవ్వ బేతాళముల్

అదేయము అంటే యివ్వకూడనిది. యివ్వకూడని పుణ్య ఫలితాన్ని యివ్వమని ఎందుకు నన్నిలా నొప్పిస్తావు? నీకు ఇంతకుముందు నేను ప్రమాణం చేసింది నా శరీరంలోని మాంసాన్ని కానీ,మాయా వటువైన వామనుడిని,  ఆ శ్రీహరిని నుతించి చేసిన కీర్తనా ఫలితాన్ని కాదు కదా! యిక  నీ పాతాళ ప్రశ్నలు, తిక్క ప్రశ్నలు మాని మర్యాదగా నన్ను తినెయ్, అంతే. నాకు కోపం తెప్పించడానికి ప్రయత్నిస్తే 'బావి తవ్వడానికి బయల్దేరితే భూతాలు బయట పడ్డాయ్' అన్నట్టు  అవుతుంది. అనుకున్న ఫలితం దొరక్కుండా పోతుంది. కనుక ఎక్కువ మాట్లాడకుండా నన్ను మెక్కెయ్ అన్నాడు మాలదాసరి నిష్కర్షగా!

(కొనసాగింపు వచ్చేవారం)
మరిన్ని శీర్షికలు
weekly horoscope 23rd  febuary  to 3rd  march