Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raw Tomato Pickle

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాజస్థాన్ అందాలు చూద్దాం రారండి ( రెండవభాగం) - కర్రా నాగలక్ష్మి

beauty of rajastan

భరత్ పూర్ 

భరత్ పూర్ ఢిల్లీకి దక్షిణాన 180 కిలో మీటర్ల దూరం లో వుంది . రాజస్థాన్ రాష్ట్రంలోని బ్రిజ్ ప్రాంతం లో వుంది భరత్ పూర్ . గోల్డెన్ టూరిజం ట్రయాంగిల్ గా పిలువబడే ఢిల్లీ - ఆగ్రా - జైపూర్  రూట్ లో వుంది .

ఆగ్రా నుంచి జైపూర్ మీదుగా బికనీరు వెళ్లే రోడ్డు NH-11 మీద ఆగ్రా పట్టణానికి 55 కిలో మీటర్ల దూరంలో వుంది ఈ భరత్ పూర్ .

 ధార్ యెడారిలో ఆనుకొని వున్న ఆఖరు పట్టణం .

భరత్ పూర్ చరిత్రను పరిశీలిస్తే  పది వందల సం.. తరవాత వివరాలు దొరికేయి గాని   అంతక  ముందు  చరిత్ర  లభ్యం  కాలేదు .  ఈ  ప్రాంతం  మొఘల్ చక్రవర్తులు , మరాఠాలు , యాదవులు , ఝాఠ్ లు పరిపాలించినట్లుగా తెలుస్తోంది .

లోహఘడ్----

భరత్ పూర్ లో వున్న కోట ని లోహఘఢ్ అంటారు . ఈ కోట ఝాఠ్ రాజైన సూర్య మల్లు ద్వారా నిర్మింప బడింది . ప్రపంచం లో దుర్భేధ్యమైన కోటలలో ఒకటిగా లెక్కిస్తారు . ఈ కోట గోడలు చాలా పటిష్టంగా వుండి శత్రురాజులచే యినప కోటగా పిలువ బడేది .

805 సం..లో బ్రిటిష్ వారు ఈ కోటను జయించాలనే వుద్దేశ్యంతో ఆరువారాలు యేకాద్రంగా పోరాటం జరిపినా కోటను గెలువ లేక వెనుతిరిగేరుట .

కోటకు ముందుభాగాన వున్న తలుపులు , ఉత్తరాన వున్న తలుపులు అష్టధాతువులతో నిర్మింపబడ్డాయి . తలుపుల మీద రంగులతో తీర్చిదిద్దిన పెద్దపెద్ద యేనుగు బొమ్మలు వుంటాయి . దక్షిణం వైపున వున్న ద్వారాన్ని " చౌబుర్జా " అని అంటారు . ఇది నాలుగు స్ధంభాలపై నిర్మింపబడి వుంటుంది . కోటలోపల కిశోరీమహల్ , మోతీమహల్ , మహల్ ఖాస్ , ఖోఠీఖాస్ లు వున్నాయి . ఫతేబుర్జ్ మొఘలులపై విజయానికి చిహ్నం గాను , జవహర్ బుర్జ్ బ్రిటిష్ వారంపై విజయానికి సంకేతంగా నిర్మించేరు .

భరత్ పూర్ దగ్గర గంభీర వనగంగ నదులు వర్షాకాలంలో పొంగి భరత్ పూరు ముంపునకు గురయేదట , ప్రతీ యేడూ వర్షాల వల్ల ప్రజలు అనేక యిబ్బందులకు గురౌతుండడంతో 1760 లో రాజు ' అజాన్ ఆనకట్ట ' నిర్మించేడు . ఆ నిర్మాణానికి కావలసిన రాళ్లు మన్ను తవ్విన ప్రదేశంలో వర్షాకాలంలో పడ్డ వర్షపునీటివల్ల యేర్పడ్డ మానవ నిర్మితమైన సరస్సు భరత్ పూర్ సరస్సు . ఈ సరస్సు దట్టమైన అడవిలో వుండడం , రెండువైపుల కొండలు వుండడం యీ సరస్సుకు అదనపు ఆకర్షణ అయింది . అప్పటిరాజులు యీ సరస్సు పైన మన్ను గడ్డిలతో చిన్న చిన్న అరుగులు కట్టి , చిన్నచిన్న ఆనకట్టలు కట్టి నీటి ప్రవాహాన్ని నియంత్రించి నీటి పక్షులువేటాడేందుకు వుపయోగించేవారు . ఇక్కడ రాజుల విశ్రామగృహం కూడా వుంది .  ' వైస్రాయి ఆఫ్ ఇండియా ' కూడా యిక్కడ వేటకు వెళ్లేవారు .

భరత్ పూర్ పక్షి సంరక్షణా కేంద్రం------ 

భరత్ పూర్ పక్షి సంరక్షణా కేంద్రం ఈ వూరులో వున్న మరొక ప్రత్యేక ఆకర్షణ .

దీనిని ' కేవల దేవ్ ఘన నేషనల్ పార్కు ' అని కూడా అంటారు .  పక్షిసంరక్షణా కేంద్రం లో వున్న పురాతన మైన శివమందిరాన్ని కేవలదేవ్ మందిరం అంటారు , ఆ పేరుమీదుగా ఈ సంరక్షణా కేంద్రానికి కేవలదేవ్ అనే పేరు పెట్టేరు . ఘన అంటే దట్టమైన అనిఅర్ధం . 

ఈ ప్రాంతం వలస పక్షులకు ప్రసిద్ధి ముఖ్యంగా సైబీరియానుంచి వచ్చే కొంగలకు నివాసస్థానం . సుమారుగా దేశవిదేశాల నుంచి వచ్చిన 230 లకు మించిన రకాల పక్షులను దర్శించుకోవచ్చు . మొత్తం 29 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన మానవనిర్మితమైన సరస్సు పైన నిర్మించేరు . 1956లో వలసపక్షులు యిక్కడకి వచ్చి గూళ్లు కట్టుకొని ఆరునెలల కాలం వుండడాన్ని కనుగొని  , 1960 లో వేటను అధికారికంగా నిషేధించేరు . 1982 లో ఈ సరస్సును ఆనుకొని వున్న అడవిని కలిపి జాతీయ వన్యప్రాంతంగా గుర్తించేరు . 

అక్టోబరు నుండి మార్చి వరకు సైబీరియన్ కొంగలను చూడొచ్చు . ప్రస్తుత వాతావరణ పరిస్తితుల వల్ల డిసెంబరు నుంచి జనవరి ఆఖరు లోపున వెడితే ఈ ప్రాంతమంతా వింత వింత పక్షులతోనూ , పక్షికూతలతోనూ నిండివుంటుంది . ప్రతీ చెట్టుమీద వేలసంఖ్యలో పక్షులు , పక్షి పిల్లలతో నిండి వనం కనువిందు చేస్తుంది .

ప్రవేశరుసుం చెల్లించి లోనికి రాగానే సైకిళ్లు అద్దెకిచ్చి యిస్తారు , సైకిల్ రిక్షాలు కూడా వుంటాయి . చాలామంది సైకిళ్లు అద్దెకు తీసుకొని ఈ అడవిని చుట్టి వస్తారు " లేదు అంటే సైకిల్ రిక్షా ఆరు గంటలకోసం మాట్లాడుకొని వెళ్లొచ్చు . రిక్షాలో అయితే రిక్షా అతను మనకి గైడుగా కూడా వ్యవహరిస్తాడు . ముందుగా మనని కేవల దేవ్ మందిరానికి తీసుకొని వెళతారు . ప్రాచీనమందిరం అని తెలిసింది గాని ఈ మందిరానికి సంభందించిన ఆధారాలు మా రిక్షా అతను చెప్ప లేకపోయేడు . అక్కడ నుంచి అతను వింత వింత పక్షులను చూపించసాగేడు 

కొన్ని పక్షులు నీటిమీద గడ్డి తో గూళ్లు కట్టుకొని నివసించడం ఆశ్చర్యాన్ని కలిగించింది . ప్రతీ చెట్టు పైన వందలసంఖ్యలో గూళ్లు వున్నాయి  మరో వింత యేమిటంటే ఒకే జాతికి చెందిన పక్షులన్నీ ఒకే ప్రాంతంలో గూళ్లు కట్టుకొని నివసించడం . సైబీరియన్ కొంగలున్న చెట్లను చూస్తే కొంగలు తప్ప ఆకులు కనిపించవు . పెలికెన్స్ , సైబీరియన్ పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు పొదిగేందుకు సరిపడా వాతావరణం వుండడంతో అవి యిక్కడకి వస్తాయి . యే కారణం చేతైనా వాతావరణం అనుకూలించకపోతే యీ పక్షులు రావు . ఈ ప్రదేశాన్ని సందర్శించు కొనే వారు ముందుగాపక్షుల రాక తెలుసుకొని వెళితే నిరాశనుంచి తప్పించుకోవచ్చు . మొత్తం యీ ప్రదేశమంతా చూడ్డానికి కనీసం నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది .దారిలో మనకు పక్షుల కాక నెమళ్లు ,దుప్పులు , జింకలు , అడవిదున్నలు , అడవి పందులు , నక్కలు , అడవి బల్లులు , ఎడారిబల్లులు మొదలయినవి కూడా కనపడతాయి .


ఒకచోట వందగజాలు మట్టి రోడ్డు మీదుగా వెళితే అక్కడ రకరకాలుగా సైజులలో నీళ్ళల్లో తిరుగుతున్న తాబేళ్లు చూసేం .

" ఒకచోట రిక్షాఅతను పాములను చూస్తారా ? " అని అడిగేడు . పాములను చూడ్డమేమిటో అర్ధం కాక మళ్లా అడిగితే " యిటువైపుగా వెడితే కొండచిలువలు వుంటాయి చూస్తారా " అని అడిగేడు . కొంతసేపు తర్జనభర్జన తరువాత సరే అన్నాం . అక్కడనుంచి అడవి దారంట ( సన్నని కాలిబాట ) ఓ అర కిలో మీటరు వెడితే అక్కడ పెద్ద పెద్ద కొండ చిలువలు చుట్టలుగా చుట్టుకొని వున్నాయి . బోనులలో కాదు బయటే వున్నాయి . పర్యాటకులు వాటికి హాని కలుగనివ్వకుండా నలుగురు గార్డ్స కాపలాగా వున్నారు . రాత్రి కూడా అవి అలాగే అడవిలో సహజంగా తిరిగి వేటాడి తిని ఆ ప్రదేశానికి వచ్చి విశ్రమిస్తాయట . నాకు చాలా వింతగా అనిపించింది . ఎవరైనాభరత్ పూర్ సందర్శించుకుంటే యీ కొండచిలువలను తప్పక సందర్శించుకోండి .

' కేవల దేవ్ ఘన నేషనల్ పార్కు ' సందర్శనం మాకెంతో ఆహ్లాదాన్ని , ఆనందాన్ని యిచ్చింది . ఏదో కొన్ని పక్షులని చూస్తాం అనుకున్నాం గాని వేలసంఖ్యలో పక్షులు , అన్ని పక్షులు ఒకేసారి చేసే శబ్ధాలు , అవి యెగురుతూ వుంటే వచ్చే రెక్కల చప్పుడు మాకు చాలా యేళ్లు గుర్తుండి పోయేయి . ప్రకృతికి అంత దగ్గరగా తిరగడానికి అవకాశం మనకు నేషనల్ పార్కులలోనే దొరకుతుంది . లేకపోతే మనం నిజమైన అడవులలోకి వెళ్లలేం కదా ?

మళ్లా వారం జైపూర్ వెడదాం , ముందుగా ఆ దారిలో వచ్చే " దెయ్యాల కోట  ( మోష్ట్ హౌంటెడ్ ఫోర్ట్ ) " ని చూసుకొని జైపూర్ చేరుదాం . అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
weekly horocsope 4th march to 10th march