Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటిఫణిబాబు

 వేసవి కాలం వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేవి వేసవి శలవలు. స్కూళ్ళలో పిల్లలకి పరీక్షలు పూర్తయి, ఫలితాలు కూడా ప్రకటించేయడంతో ,  పిల్లలూ వారి తల్లితండ్రులూ కూడా ఊపిరి పీల్చుకుంటారు. కొత్త తరగతిలో ఉపయోగించే పుస్తకాలని, వారివారి స్నేహితుల దగ్గర ముందుగానే రిజర్వు చేసేసికుని, శలవల్లో ఓసారి తల్లితండ్రుల బలవంతంమీద, ఓసారి తిరగేయడం. అక్కడికేదో సంవత్సరమంతా ఎంతో కష్టపడ్డట్టు,  అటక మీదుండే, ఆటసామాన్లన్నీ, బయట పెట్టుకోడం. ఇంక ప్రతీరోజూ స్కూలు టైమైపోతోందని, పెందరాళే లేవక్కర్లేదుగా. పొద్దేకేదాకా పడుక్కోవచ్చు, అని అనుకుంటారు కానీ, అదేం చిత్రమో, ఎవరూ లేపాల్సిన అవసరం లేకుండా, తెల్లారేసరికి లేచిపోవడం. వేసవి శలవలు వచ్చాయంటే, ఎక్కడికి వెళ్ళాలా అనే ఆలోచనే. ఆరోజుల్లో చుట్టాలందరూ “ బస్సు వేటు “ దూరంలోనే ఉండేవారు కాబట్టి, రైళ్ళూ రిజర్వేషన్ల గొడవా ఉండేది కాదు. మహా అయితే, దూరప్రాంతాల్లో ఉండే పిన్నిలూ, అత్తయ్యలూ, వారివారి కుటుంబాలతో పుట్టింటికే వచ్చేవారు. ఇంక ఆ అమ్మమ్మలకీ, నానమ్మలకీ హడావిడే హడావిడి. ఇల్లంతా సందడిగా ఉండేది. మనవరాళ్ళని, అందంగా జడలు వేసి, సాంప్రదాయ వేషాల్లో, ( పరికిణీ, ఓణీ ) అలంకరించడం.   ఆడపిల్లలందరూ తోటల్లో ఆడపిల్లలతో ఆడుకోవడం. మగపిల్లలైతే, తోటల్లోకీ పొలాల్లోకీ వెళ్ళి, మామిడికాయలు తోటమాలికి తెలియకుండా  కోసుకుని, ఉప్పూ కారం, పొట్లాల్లో కట్టి తెచ్చుకుని, హాయిగా లేత మామిడిముక్కలు కోసుకుని తినడం.    దగ్గరలో ఉండే కాలవలకి వెళ్ళి, హాయిగా ఈతకొట్టుకుని,  ఏ మిట్టమధ్యాన్నానికో కొంపకి చేరడం. సుష్టుగా భోంచేసి, మళ్ళీ ఆ ఎండలో బయటకి వెళ్ళకుండా తోటి పిల్లలతో ఆడుకోవడం. సాయంత్రాలు, ఏ తాతగారితోనో, బాబయ్యలతోనో, మామయ్యలతోనో, పొలాలవైపు వెళ్ళి, హాయిగా పాలేరు కోసిన ఏ కొబ్బరి గంగా బొండాలో తాగడం. రాత్రిళ్ళు భోజనాలయిన తరువాత, పెద్దలందరూ ఏ ఆరుబైటో, మంచాలో, మడతమంచాలో వేసికునీ, పిల్లలందరూ ఏ అరుగుమీదో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ పడుక్కోవడం, చల్లని గాలిలో.



పైన చెప్పినదంతా ఏ కథలోనో చదివినదికాదు. ఒకానొకప్పుడు మన ఆంధ్రదేశంలో స్వయంగా అనుభవించిన  మధుర క్షణాలు. ఏడాదికొక్కసారైనా కుటుంబసభ్యులందరూ తప్పనిసరిగా  కలిసేవారు. వేసవి శలవలకంటే మంచి అవకాశం ఉండదుగా, సాధారణంగా కుటుంబపెద్ద కూడా, ఏ స్కూల్లోనో టీచరుగా ఉండడం మూలాన, అందరికీ శలవులే, గొడవుండేది కాదు. అంతగా కుదరకపోయి, శలవు దొరక్కపోయినా, భార్యా బిడ్డలని అత్తారింట్లో వదిలేసి, ఓ రెండురోజులుండి, వెళ్ళిపోయేవారు. తిరిగి తీసికెళ్ళడానికి మళ్ళీ రావడం.
 అవన్నీ పాతరోజులు. ఇప్పుడంతా మారిపోయింది. పిల్లలు వేసవి శలవల్లో ఎక్కడ సుఖ పడిపోతారో అనేమో, స్కూళ్ళలో,  శలవల్లో సరిపడేటన్ని,  Projects  ని నెత్తిమీద రుద్దేయడం. అదేదో పూర్తయేదాకా, అటు పిల్లలకీ, ఇటు తల్లితండ్రులకీ ఎక్కడలేని ఒత్తిడి. ఏదోలాగ పూర్తిచేసినా, ఏవేవో  so called creative activities  అని పేరు చెప్పి, పిల్లలని, ఏ  workshop  కో, డ్రాయింగు క్లాసులకో పంపి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. రకరకాల ఆటల కోచింగులకి పంపడం. చేతిలో పుష్కలంగా డబ్బులుండడం చేత, దేశవిదేశాల  Holiday Tours  లో ,ఓ ఏడాది ముందరనుండీ, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకి శలవు పెట్టి, బుక్ చేసేసికుని టింగురంగా మంటూ ఎగిరిపోవడం. “ పోనీ శలవలకి పిల్లల్ని పంపకూడదూ..” అని  గ్రామాల్లో ఉండే తల్లితండ్రులు అడిగినా, “ ఈసారి బయటకు వెళ్ళడానికి బుక్ చేసికున్నామూ… పై ఏడాది చూస్తానూ..” అని చెప్పి, వారిని నిరాశ పరచడం. ఈరోజుల్లో ఎక్కడ చూసినా  “ కుటుంబం “ అంటే, తనూ, భార్యా, బిడ్డలే.

చిత్రం ఏమిటంటే, తను చిన్నప్పుడు వేసవి శలవల్లో అనుభవించిన ఆనందాన్ని, తన పిల్లలకి దక్కనీయకపోవడం…దానికి సాయం, ఆ పిల్లలకి కూడా, తమకి చుట్టాలెవరో, అసలు చుట్టాలనేవారున్నారో లేదో తెలియకపోవడం, ఈనాటి  కుటుంబ వాతావరణానికి కొస మెరుపు.  పైగా ఏ విదేశాలకైనా వెళ్తే, నలుగురికీ చెప్పుకోవచ్చు…. ఫలానా చోటుకి వెళ్ళామూ అని. అలా వెళ్ళలేక, సాదాసీదాగా ఏ అమ్మమ్మ గారింట్లోనో శలవులన్నీ గడిపిన అర్భకులకి గొప్పగా కనిపించొచ్చు.

ఆతావేతా జరుగుతున్నదేమిటంటే, ఈరోజుల్లో వేసవి శలవులనేసరికి,   అన్ని రకాల ప్యాకేజీల తోనూ, విలాసయాత్రా కంపెనీలవారు, భారీ డిస్కౌంట్లు పేరు చెప్పి, ఆకర్షించడం. గ్రామాలకు వేసవి శలవల్లో వెళ్ళి , అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడమనే సంప్రదాయం  అటకెక్కేసింది….

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
andam - chandam