Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
visheshalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాజస్థాన్ అందాలు చూద్దాం రారండి ( పది+ఒకటవ భాగం) - కర్రా నాగలక్ష్మి

                                                                                 ఉదయపూర్--3

మరునాడు మేము ఉదయపూర్ చూడ్డానికి యెప్పటిలానే యెనిమిదికల్లా బ్రేక్ ఫాస్ట్ చేసి బయలుదేరేం . ముందుగా సిటీ పేలస్ చూడ్డానికి వెళ్లేం .ఉదయపూర్ లోని మాన్సూన్ పేలస్ , సమ్మర్  పేలస్ లలో కొన్ని విదేశీ చిత్రనిర్మాణం జరగడం తో ఉదయపూర్ విదేశీపర్యాటకులను ఆకర్షింప సాగింది . ఉదయపూర్ ని " వెన్నిస్ ఆఫ్ ద ఈస్ట్ " గా కూడా వ్యవహరిస్తూవుంటారు .

 సిటి పేలస్ --- 

1553 లో మహారాణా ఉదయసింగ్ కట్టించడం మొదలు పెట్టగా తరవాత సింహాసనం యెక్కిన రాజులు వారికి కావలసిన విధంగా మార్పులు చేస్తూ సుమారు 300 సంవత్సరాలు నిర్మాణం జరిగింది . పిఛోల సరస్సుకితూర్పు వొడ్డున యెత్తైన కొండమీద నిర్మించడం వల్ల యీ కోట నుంచి మొత్తం ఉదయపూర్ నగరాన్ని వీక్షించవచ్చు .

ఇది రాజ భవనమే అయినా కోటను పోలి వుంటుంది . రాజస్థాన్ లోని అతి పెద్ద రాజభవనం గా చరిత్రలో చోటు సంపాదించింది . ఈ భవనం నగరంలో మరో నగరం అని అనవచ్చు యెందుకంటే యీ భవనంలోపోస్టాఫీసు , బ్యాంకు , లతో సహా అనేక వ్యాపార సంస్థలు వున్నాయి . చిన్నా పెద్దా హస్తకళల షాపులు అనేకం వున్నాయి . లోపల వుండే భవనాలకు వెళ్లే వంకరటింకర దారులు యెందుకంటే శతృరాజులు దండెత్తి వస్తేరాజ మందిరం యెక్కడవుందో తెలియకుండా వుండేందుకు అలా దారులు నిర్మించేరు . రాజభవనం లోకి ప్రవేశించడానికి ' బడ పోల్ ' 1600 సంవత్సరంలో నిర్మించిన ద్వారం లోంచి ముందుకు వెడితే ' త్రిపోలియా గేటుచేరుతాం. ఈ రెండింటికి మధ్య చేతితో తయారు చేసిన అనేక మైన రాజస్థానీ కళ ల విక్రయ శాలలు వుంటాయి . అవి దాటుకొని యెనిమిది పాలరాతి తోరణ ద్వారాల దగ్గరకి చేరుతాం . దీనిని తోరణ పోల్ అని అంటారు .ఇక్కడ మహారాణాలు వెండి బంగారాలతో తులాభారం వేసుకొని ఆ ధనాన్ని దేశం లోని బీదలకు పంచేవారు . దీనికి యెదురుగా వున్న జాగాలో రాజులు యేనుగుల పందేలు నిర్వహించేవారు . అంటే పలనాటి రాజులు కోడిపందేలు నర్వహించినట్లు , మహారాణాలు యేనుగుల పందేలు నిర్వహించే వారన్నమాట . ఇలాంటి పందేలు 1995 వరకు జరిగినట్లుగా చరిత్రకారుల అంచనా .

యీ భవన నిర్మాణం " రాయ్ ఆంగన్ " తో  మొదలు పెట్టేరు . ముఖ్యద్వారం దగ్గరకు వచ్చేసరికి 244 మీటర్ల పొడవు సుమారు 30 మీటర్ల యెత్తు కలిగిన విశాలమైన భవనం యొక్క ముందు భాగం మనలని మంత్ర ముగ్ధులను చేస్తుంది . ఈ భవన నిర్మాణంలో రాజస్తానీ , మొఘల్ , చైనీ , యూరోపియన్ శిల్పకళల మిశ్రమంగా కనిపిస్తుంది .

ట్రిపోలియా ద్వారంలోంచి లోనికి వెళితే మహారాణాలు ప్రజలకు దర్శనమిచ్చే ప్రదేశమైన 'సూరజ్ గోఖడ ' , దాని తరవాత ' మోర చౌకు ' యిందులో ఆకుపచ్చ , బంగార పసుపు , నీలం రంగులతో చిత్రించిన అతిసుందరమైన మూడు నెమళ్లు చూడొచ్చు . దిల్ ఖుష్ మహల్ లో రాజులు తమ ఆంతరంగికులతో కూర్చొని నృత్యగానాలతో మనస్సులను ఉల్లాసపరచుకొనేవారట , సూర్య మహల్ , శీష్ మహల్ , మోతిమహల్ ,భీమవిలాస్ , అమర విలాస్ చూడదగ్గవి . శంభునివాశ్  ప్రస్తుతపు రాజైన అరవింద సింగ్ నివసిస్తున్న భవనం , యిందులోనికి పర్యాటకులకు ప్రవేశ అనుమతి లేదు .

పై అంతస్తులో వున్న అమరవిలాస్ ఉద్యానవనం కలిగి వుంటుంది . పాలరాతి పౌంటెన్స్ , పూలతోటలు నలుచదరపు పాలరాతి నీటి తొట్టెలతో కూడుకొని వుంటుంది . దీనిని దాటుకొని ' బడీ మహల్ " లోకి అడుగుపెడతాం . దీనిని ఉద్యానవన భవనం అని కూడా అంటారు . ఈ భవనం 27 మీటర్ల యెత్తులో వున్న రాతి కొండపై నిర్మింప బడింది . ఈ భవనం మొదటి అంతస్తు మిగతా భవనాల నాలుగో అంతస్తుతో సమానం గావుంటుంది . ఈ. భవనాన్ని రాజపరివారం వివిధ పండగలు , ఉత్సవాలు నిర్వహించేందుకు వుపయోగించేవారు . ఇక్కడ వున్న పెద్ద పాలరాతి తొట్టెలో రంగుకలిపి హోళీ పండగ జరుపుకొనేవారుట . పక్కగా వున్న హాలులో18 , 19 వ శతాబ్దానికి చెందిన చిత్రపటాలు ప్రదర్శనార్దమై వుంచేరు . చైనీ చిత్రశాలలో చైనా , డచ్ దేశాలకు చెందిన పలకలను చూడొచ్చు .

ఫతే ప్రకాశ భవనం లో అప్పటి వైస్రాయి లార్డ మింట్ చేత శంకుస్థాపన చేయబడ్డ ' దర్బార్ హాల్ దీనిని మింట్ హాల్ గా కూడా వ్యవహరిస్తారు ప్రస్తుతం యిందులో హెరిటేజ్ హొటల్ నడపబడుతోంది .

సిటీ పేలస్ లో వున్న జగదీష్ మందిరం చూడదగ్గది . కోవెల పైన శ్రీకృష్ణ లీలలు , దేవీ దేవతా మూర్తులతో , యిండో ఆర్యన్ శిల్పకళలను అనుసరించి కట్టబడిన మందిరం . గర్భగుడిలో నల్లరాతి నిర్మితమైనజగన్నాధానికి విగ్రహం , వెలుపల యిత్తడి గరుడుని విగ్రహం భక్తులను ఆకట్టు కుంటాయి .

సిటీ పేలస్ లో మరో ముఖ్య మయిన ఆకర్షణ ఫతేప్రకాశ్ భవనం లోని ' క్రిస్టల్ గది ' . మహారాజా సజ్జను సింగ్ 1877 లో లండన్ కంపెనీకి రకరకాలయిన క్రిస్టల్ సామానులు రాజభవనానికి తెచ్చే బాధ్యతను యివ్వగారాజు మరణానంతరం యివి రాజభవనానికి చేరగా యేవో కారణాల వలన తరవాత రాజులు వీటిని విప్పి పోవడంతో యీ సామానులు  సుమారు 110 సంవత్సరాలు అలానే పేకట్స్ లోనే వుండి పోయాయట . వాటిని యేరాజులు వాడక ప్రదర్శనలో వుంచేరు . కుర్చీలు , భోజనాల బల్ల , సోఫాలు , మంచాలు , టేబుల్ పౌంటెన్స్ , డిన్నరు సెట్టు  , వజ్ర వైఢూర్యాలు పొదిగిన కార్పెట్టువున్నాయి .

జనానా మహల్ ని మ్యూజియం గా మార్చేరు . ఇందులో రాజుల చిత్రపటాలు , వివిధ పండగలు , వుత్సవాలకు సంబంధించిన చిత్రపటాలు చూడొచ్చు . కృష్ణ మహల్ లో రాజుల జీవితాలకు సంబంధించిన చిత్రాలు , వారి సంబరాల చిత్రాలు ప్రదర్శనలో వున్నాయి . ఈ మహల్ కి సంబంధించిన మరో కధ కూడా ప్రచారం లో వుంది . ఉదయపూర్ రాజకుమారికి జయపూర్  మరియు జోధ్ పూర్ రాజుల నుంచి వివాహ ప్రస్తావనలు రాగా వారిలో యెవరిని వరించినా వేరొకరితో వైరం తప్పదని గ్రహించిన రాజకుమారి యీ మహల్ లో బలవన్మరణం పొందుతుంది .

మహారాణా సజ్జన్ సింగ్ 1884 ప్రాంతాలలో ఆరావళీ పర్వతాలలో కట్టించిన మరో అద్భతమైన భవనం యిది ' మాన్ సూన్ భవనం . వర్షాకాలంలో కదిలే మబ్బులను చూసేందుకు యెతైన కొండమీద కట్టబడింది .దీనిని సజ్జన్ గఢ్ భవనం అనికూడా అంటారు . ఈ భవనం నుంచి అస్తమిస్తున్న సూర్యుని చూడొచ్చు . ఈ కొండ మీంచి చూస్తే మేవాఢ్ పురాతనరాజధాని 'చిత్తోర్ ' కోట కనిపిస్తుందని , సజ్జన్ సింగ్ యిక్కడి నుంచి తమపూర్వీకుల వైభవానికి చిహ్నమైన ' చిత్తోర్ గఢ్ ' చూసేవాడని అంటారు .

సమ్మర్ పేలస్ ని లేక్ పేలస్ అని కూడా అంటారు . వేసవి తాపం నుండి తప్పించు కొనేందుకు ప్రతీ సంవత్సరం మూడునెలల కాలం రాజపరివారం ఈ భవనం లో గడిపేవారు . మొత్తం 83 గదులు కలిగిన యీ భవనంపూర్తిగా పాలరాతితో నిర్మించేరు .  ఈ భవనం పిఛోల సరస్సు మధ్యలో నిర్మింప బడింది . ప్రస్తుతం ఈ భవనంలో తాజ్ హొటల్ నడుపబడుతోంది .

ఉదయపూర్ లో ముఖ్యంగా 5 పెద్ద సరస్సులు ఒకదానికి ఒకటి ఆనుకొని వున్నాయి అవి పిఛోల సరస్సు , ఉదయసాగర్ , ఫతేసాగర్ , రాజసమండ్ సరస్సు , జైసమండ్ సరస్సు . ఈ సరస్సులకు వాటిని తవ్వించినరాజు  పేరుతోనే పిలవడం అలవాటు . యివి కాక దూద్ తలై , బడి తలాబ్ , కుమారిగా తలాబ్ లు కూడా వున్నాయి . ఈ సరస్సులను తవ్వించడం లో రాజులు వాన నీటిని నిలువ చేసేందుకు , వేసవి సమయంలో యీసరస్సు ల మీదుగా వీచే గాలులు వేసవిలో ప్రజలకు సేదతీర్చేందుకు వుపయోగింప బడతాయని వుద్దేశ్యాలు అవొచ్చు . ఉదయపూర్ చరిత్రలో యెప్పుడూ ప్రజలకు మంచినీటి సమస్య కలగలేదని అంటారు .

పిఛోల సరస్సులో బోటింగు ప్రత్యేక ఆకర్షణ . ఉదయ పూర్ లోని మరో ఆకర్షణ మోతి మగ్రి , ముత్యాల గుట్ట గా పిలువబడే యీ గుట్ట మీద మేవాఢ్ రాజులలో అత్యంత పరాక్రమ వంతునిగా పేరుపొందిన మహరాణా ప్రతాప్ , అతని ప్రియమైన ' చేతక్ ' నిఅధిరోహించినట్లు వున్న కంచు విగ్రహం వుద్యానవనం మధ్యలో వుంటుంది . ఈ విగ్రహం మహారాణా భగవత్ సింగ్  నిర్మాణం చేపట్టబడి ప్రజలందరి సహకారం తో పూర్తి చెయ్యబడింది . సహేలియోంకి బాగ్ ని మహారాణా సంగ్రామ సింగ్ 1710--1734 ల మధ్య తన రాణి ఆమె కి అరణంగా పుట్టింటి నుండి వచ్చిన నలబైయెనమండుగురు చెలికత్తెల విహారార్దం తానే స్వయంగా రూపకల్పన చేసినవుద్యానవనం . ఇందులో పచ్చిక మైదానాలు , పూలమొక్కలు , పౌంటెన్స్ , తామరకొలనులు వుండేటట్టుగా నిర్మించేడు . పాలరాతి విశ్రామగృహాలు , పాలరాతి యేనుగులు చూడ ముచ్చటగా వుంటాయి .

తరవాతి కాలంలో మహారాణా భూపాలసింగ్ యీ వుద్యానవనంలో  పొడవైన పాలరాతి వరండాలు నిర్మించి వర్షం పడతున్నట్లు అనుభూతి కలిగించేటువంటి ఫౌంటెన్ల యేర్పాటు చేసేడు .

మరునాడు పొద్దున్నే మేము ' చిత్తోఢ్ ' కి ప్రయాణ మయేం .

ఉదయపూర్ నుంచి చిత్తోఢ్ కి సుమారు 120 కిలోమీటర్లు . ప్రయాణం మొత్తం ణ్ -76 లో సాగుతుంది . చిత్తోఢ్ లో మేము మూడు రోజులకు హొటల్ బుక్ చేసుకున్నాం .

చిత్తోఢ్ గురించి చాలా కథలు విని వున్నాం కాబట్టి అందరం యెప్పుడు చేరుతామా అనే కుతూహలం తో వున్నాం .

 చిత్తోఢ్ అనగానే అపురూప సౌందర్యరాశి , రాజ్యాలను కూల్చేంత అందం సొంతం చేసుకున్న రాణి పద్మిని , తరవాతి కాలంలో మొఘల్ చక్రవర్తి హుమాయూన్ కి రాఖీ కట్టి న రాణి కర్ణావతి , అల్లావుద్దీన్ ఖిల్జీ తోయుధ్దం చేసి వీరయోధ్దులు గా పేరు పొందిన గోరా , బాదల్ అలాగే అక్బరు తో యుధ్దం చేసి అతని చే శభాష్ అనిపించుకొని వారి గౌరవార్దం వారి విగ్రహాలను శతృరాజు చే ఆగ్రా కోటలో ప్రతిష్టింప జేసుకున్న   రావుజైమల్ ,పట్టా , కృష్ణ భక్తిలో సర్వం మరచి విషాపానం చేసిన మీరాబాయి , రాజ వంశాంకురాన్ని కాపాడే క్రమం లో సొంత బిడ్డ కళ్లముందు కత్తి వేటుకు బలైనా చలించక స్వామిభక్తి నిరూపించుకున్న పన్నాదాయి యిలా యెన్నోగాథలు విని వుండడం వల్ల ఆ వూరు చేరగానే యెందుకో అంతగొప్ప నేలను తాకగానే మేము వుద్వేగానికి లోనయేం .

చిత్తోఢ్ ఈ మధ్యన రాజస్థాన్ లో యేర్పడ్డ ప్రతాప్ గఢ్ జిల్లాలో చేర్చేరు .

మొదటి నుంచి స్వతంత్ర రాజ్యంగానే వుండి స్వతంత్రం కొరకు యెన్నో యుధ్దాలు జరిపి నిలుపుకున్న ఆసియా ఖండం లోనే అతి పెద్దదైన కోట .

మహానగర ప్రభావానికి లోనుకాని నగరం . ' గంభీర్ , బెరచ్ నదుల వొడ్డున నిర్మింప బడ్డ నగరం .

 ఈ కోట 734 లో బప్పా రావల్ కి సోలంకిరాజుల నుంచి కట్నంగా వచ్చిందని కధ ప్రచారంలో వుంది .

 మిగతా కథ వచ్చే సంచికలో చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
water