Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

ఒకానొకప్పుడు, అంటే ఏదో శతాబ్దాలకిందటి మాట కూడా కాదు,  30-40 సంవత్సరాల క్రితం వరకూ, నీటి కొరత అన్నమాట ఎవరూ వినలేదు.  ఏదో, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో  ఉండేది కానీ, మరీ ప్రాణాంతకంగా ఉండేది కాదు. సకాలంలో వర్షాలు పడక,  కావాల్సినన్ని నీళ్ళు లేక కష్టాలు పడేవారనుకోండి.. కానీ ఏ కొద్దిప్రాంతాలకో పరిమితమయ్యుండేది.. కానీ చిత్రం ఏమిటంటే ప్రస్తుతం, ఆ నీటి కొరత దేశం అంతా ఉంది.  కారణాలు అన్నీ స్వయం కృతమే అనడంలో సందేహం లేదు. ఏదో అకస్మాత్తుగా పైనుండే దేవుళ్ళందరూ మనమీద కక్ష సాధిస్తున్నారనడం తప్పు. మనం అనుకూల పరిస్థితులు కల్పిస్తేనే కదా, ఆ దేవుళ్ళు కనికరించేదీ? గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఎలా కుదురుతుందీ?    అలాగని వర్షాలు లేవనీ అనలేము. తూర్పు కోస్తా ప్రాంతం కొల్కటా నుండి, తమిళనాడు వరకూ, ఏడాదిలో కనీసం నాలుగైదు సార్లు తుఫాను బారిన పడుతున్నారు.  ఆ వర్షాల ధర్మమా అని, లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోంది.  మన దేశంలో పారిశ్రామికభివృధ్ధి ఎంత జరిగినా, ముఖ్య వృత్తి  వ్యవసాయమే. వేసిన పంటకి సరైన సమయంలో వర్షాలైనా పడాలీ, లేదా , కాలవలద్వారా, సరిపడె నీళ్ళైనా సరఫరా అవ్వాలి. దురదృష్టవశాత్తూ, ఈ రెండూ పూర్తిగా కనుమరుగైపోయాయి.  జరుగుతున్నదేమిటంటే, ఏదో నానా తిప్పలూ పడి, పంట వేసి, తీరా ఆ ధాన్యం చేతికొచ్చేసమయానికి ఏ తుఫానో వచ్చి కొట్టేసికుని పోవడం..  చివరకు మిగులుతున్నది అప్పులూ, ఆత్మహత్యలూనూ.

ఇలాటి పరిస్థితులకి కారణాలు వెదకడమంటూ మొదలెడితే, మనల్ని మనమే తిట్టుకోవాలి. ఎవరో వచ్చి చేసిందికాదు ఇదంతా. ఓ ముఖ్యకారణం   పెరుగుతున్న జనాభామీదకి నెట్టేయడం ఓ ఫాషనైపోయింది. అసలు ఆ జనాభా పెరుగుదలే లేకుండా, ఉన్నవాళ్ళందరూ ఓ వయసుదాటిన తరువాత వెళ్ళిపోతే , ఇంక మిగిలేదెవరూ? అందువలన జనాభాపెరుగుదల మీదకు  తప్పునెట్టేయడం, భావ్యం కాదు.  వచ్చిన గొడవల్లా ఏమిటంటే పుష్కలంగా ఉన్న నీటి వనరులని, దురుపయోగం చేయడం. పోనీ ఎలా వినియోగించాలో తెలియకానా అంటే అదీ కాదు. పూర్తి నిర్లక్ష్యం. ఉదాహరణకి ఫలానా పని చేయొద్దురా అంటే,  “ పోనిద్దూ మనమొక్కరమే చేస్తే పాడైపోతుందా ఏమిటీ, అందరూ పాటించాలి కానీ.. “ అని ప్రతీవాడూ ఎవడికివాడే అనేసికుని, నీటి వనరులన్నీ ఎండ బెట్టేశారు.

ఒకానొకప్పుడు ఓ ఊరుందంటే, అక్కడో చెరువూ, పొలాలపక్కన ఓ పంటకాలవా తప్పకుండా ఉండేవి. నిత్యకృత్యాలకే కాకుండా, త్రాగడానికి కూడా బావుండెది  వాటిలోని నీరు. మహా అయితే  ఒండ్రుమట్టితో ఉండెవి. ఓ బిందెలో పట్టఉకుని, ఓ నాలుగు ఇండుపుగింజలు వేసేస్తే, తెల్లారేసరికి హాయిగా ఆ మట్టి అంతా కిందకు దిగిపోయి, పైన నీరు తేటగా, స్వఛ్ఛంగా ఉండేది. పైగా అదో రుచికూడానూ. సాధారణంగా ఎవరైనా వచ్చినా, ఆ కాలవనీళ్ళే అడిగిమరీ తాగేవారు.. ఇంటికో నుయ్యయితే తప్పనిసరిగా ఉండేది. ఒక్కోప్పుడు, ఒక్కో నుయ్యి నీళ్ళు  ఉప్పగానూ, కొన్ని తియ్యగానూకూడా ఉండేవి. తియ్యగా ఉన్నాయంటే, ఆ చుట్టుపక్కలవారందరికీ ఆ నుయ్యి నీళ్ళే.  ఎంతమంది తోడుకున్నా ఊరుతూనే ఉండేవి. ఇంక నదీజలాలైతే అడగక్కర్లేదు. ఏ సముద్రంలోకో కలిసే ప్రదేశాల్లో తప్ప, మిగిలిన చోట్లలో రుచికరంగా ఉండేవి. పైగా కొండలూ కోనల్లో ప్రవహిస్తూ వచ్చేదేమో, ఆరోగ్యకరంగా కూడా ఉండేది. ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, స్వఛ్ఛమైన త్రాగునీరుకి కానీ, పంటల పచ్చగా ఉండడానికి కానీ, ఎవరూ లోటు అనుభవించలేదు. అందుకేనేమో ఆనాటి వారు ఇప్పటికీ ఆరోగ్యకరంగా కనిపిస్తారు. ఏదో వయసురీత్యా వచ్చే ఆరోగ్యసమస్యలు కానీ,  కలుషిత నీరు తాగి ఆరోగ్యాలు ఎవరూ చెడగొట్టుకోలేదన్నది పచ్చి నిజం. ఎంతైనా పునాది పటిష్ఠంగా ఉంటేనే కదా, కట్టిన ఇల్లు గట్టిగా ఉండేది?

జనాభా పెరుగుదలతోపాటు, వారి అవసరాలుకూడా ఎక్కువవడం ప్రారంభం అయింది.. పుట్టుకొస్తున్నవారికి ముఖ్యంగా కావాల్సింది ఓ గూడు కదా. ఉన్న గూళ్ళా సరిపోవడంలేదు. దానితో ఆ పాతకాలపు ఇళ్ళను, పడకొట్టి,  ప్లాట్ లలా చేసి, అమ్మడంతో ప్రారంభంఅయింది, ప్రాకృతిక విధ్వంసం.  ఇదివరకటిరోజుల్లో, చెట్లకి అంత ప్రాముఖ్యత ఇవ్వడానికి ముఖ్యకారణం, సరైన సమయానికి వర్షాలు పడి, అందరూ పచ్చగా ఉండాలనే కదా… కానీ మనదేశంలో చాలామందికి అదేమిటో కానీ , “ ఆకుపచ్చ “ రంగంటే  అదో రకమైన కక్షలా కనిపిస్తోంది.. ఆరంగుని వేళ్ళతోసహా పీకేయడమే ముఖ్యోద్దేశంలా  ఉంది.  అందుబాటులో ఉండే “ ఆకుపచ్చ” రంగంటే చెట్లేకదా, వాటితో మొదలెడితే సరీ అనుకుని.. మొదలెట్టేశారు…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
andam - chandam