Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vatavaranam -  suryatapam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

 

                                                                             ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ - 1 


ఎల్లో స్టోన్ నేషనల్ పార్కు 1872లో నెలకొల్పిన మొదటి నేషనల్ పార్కు.  ఇది ఎక్కువ భాగం వయోమింగ్ రాష్ట్రంలో వున్నా, మోంటానా, ఇడాహో రాష్ట్రాలలో కూడా విస్తరించి వున్నది.  దీనిలో ప్రవేశించటానికి నాలుగు దిక్కులనుంచీ మార్గాలున్నాయి. మేము నార్త్ గేట్ లోంచి వెళ్ళాము.  3500 మైళ్ళ విస్తీర్ణంలో వున్న ఈ పార్కు అమెరికాలోని నేషనల్ పార్కుల్లో పెద్దది.  అమెరికా సందర్శించే చాలామంది ఈ పార్కు చూడాలనుకుంటారు.  ప్రతి ఏడాదీ 4 మిలియన్లకన్నా ఎక్కువ సందర్శకులు ఈ పార్కు అందాలు వీక్షిస్తారంటే ఇది ఎంత ప్రఖ్యాతి చెందిందో ఊహించండి.

అంత ప్రఖ్యాతి చెందటానికి కారణం ఇక్కడ పూచే పూవులు, కాచే కాయలు కాదండీ.    ఇక్కడ వున్నన్ని గీజర్లు,  వేడినీటి ఫౌంటెన్లు భూమి మీద ఇంకెక్కడా లేవంటారు.  పూర్వం ఇక్కడ వాల్కనోలు ఎక్కువగా వుండేవి.  వాటి కారణంగానే ఇప్పటికీ ఇలా వేడి నీటి ఫౌంటెన్లు వస్తాయి అంటారు.  సున్నపు రాయి గుంటలు, పొగలు కక్కే వేడినీటి మడుగులు,  భరించలేని దుర్వాసనతో కూడిన యాసిడ్ తో నిండి వున్న ప్రదేశాలు వున్న ఈ పార్కులోనే ఎత్తయిన చెట్లు, జలజలా పారే ఎల్లో స్టోన్ నది, ఇంకో పక్క చెట్టు జాడ లేని కొండలు,, మరోపక్క ప్రాణమున్న చెట్లనుంచి కాల ప్రవాహంలో శిలలుగా రూపొందుతున్న చెట్లు (ఇలాంటివి ఇక్కడ చూడగలం)  ..  ప్రపంచంలో వుండే వైవిధ్యాలన్నీ ఇక్కడే వున్నాయి.  పైగా ఒక్కో సీజన్ లో ఒక్కో విధంగా కనులవిందు చేస్తూ.  ఆందుకే ఈ పార్కుని అన్ని సీజన్లల్లోనూ చూడాలనుకునేవాళ్ళు కూడా వుంటారు.

ఈ పార్కుని పూర్తిగా చూడటానికి ఒక రోజు సరిపోదు.  తొందరగా అన్నీ చూడటానికే రెండు రోజులు కావాలి.  కాస్త నెమ్మదిగా చూడాలంటే మీ టైమ్, మీ ఇష్టం.  పార్కు లోపల ఎంత కారులో తిరిగినా, నడవవలసిది కూడా చాలా ఎక్కువగానే వుంటుంది. 

చూడవలసిన ప్రదేశాలు చాలా వున్నాయి, మేము ఆ పార్కుకి కేటాయించిన సమయం ఆ ఒక్క రోజే కావటంతో ఉదయం 7 గం.లకల్లా (లోకల్ టైమ్) రూమ్ వెకేట్ చేసి సామానుతో సహా బయల్దేరాము.   అక్కడనుంచి ముందుకి మా తర్వాత వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళటానికి వీలుగా.  మళ్ళీ ఎల్లో స్టోన్ లేక్ పక్కనుంచీ ధర్మల్ ఎరియాకి చేరుకున్నాము.  యాత్రికుల సౌకర్కంకోసం ఈ పార్కుని అనేక విభాగాలుగా చేసి పేర్లు పెట్టారు.  వీటి మేప్, ఎక్కడ ఏమున్నదీ స్పష్టంగా తెలియజేసేది విజిటర్స్ సెంటర్ లో ఉచితంగా లభిస్తుంది.  ముందుగా ఆ మేప్ చూడటానికి కొంచెం సమయం వెచ్చిస్తే మనకున్న సమయంపట్టి మనం చూడాలనుకున్న ప్రదేశాలు చూసి చక్కగా రావచ్చు.  

ధర్మల్ ఏరియా

ఇక్కడి నేల చాలా ప్రమాదకరమైనది.  అడుగున ఉడుకుతున్న వేడి నీటి బుగ్గలు వుంటాయి.  ఆ నేల స్వభావం ఎలా వుంటుందో ఎవరూ ఊహించలేరు.  కొన్ని చోట్ల కేవలం నీటి మీద తెట్టు కట్టినట్లు వుండవచ్చు.  కొన్ని చోట్ల బురదగా, ఇంకొన్ని చోట్ల వున్నట్లుండి హాట్ స్ప్రిగ్స్ రావచ్చు.  అందుకనే ఇక్కడ నిర్ణయింపబడిన దోవల్లోనే నడవాలి.

లే హార్డీ రివర్

ఈ నది లోతు ఎక్కువ వుండదు.  నీళ్ళు చాలా చల్లగా వుంటాయి.  దీనిలో కూడా పొగలు బాగా వస్తున్నాయి.  ఈ నదీ ప్రవాహక ప్రాంతం అందంగా ఫోటోలు తీసుకోవటానికి చాలా బాగుంటుంది.

మడ్ వాల్కనో ఏరియా

ఒక కిలో మీటర్ దూరం వ్యాపించి వున్న ఈ మడ్ వాల్కనో ఏరియాలో ముక్కు మూసుకోకుండా వుండలేము.  సల్ఫర్ వాసన ముక్కులు బద్దలు కొట్టేస్తుంటే, అక్కడనుంచి వచ్చే పొగలు  అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో వున్నట్లు అనిపిస్తుంది.  గబగబా చూశామనిపించి అక్కడనుంచి పరుగో పరుగు.

బ్రింక్ ఆఫ్ అప్పర్ ఫాల్స్

ఇక్కడ నుంచి ఎల్లో స్టోన్ రివర్ లోని నీరు మీలియన్ల గాలన్లు, 33 మీటర్ల ఎత్తునుంచి అతి వేగంగా కిందకి ప్రవహించటాన్ని చూడవచ్చు.  ఆ అందాన్ని చూస్తూ మీరు అక్కడనుంచి కదలలేరు.  ఈ ఉధృత ప్రవాహానికి రెండు వైపులా వున్న రాతి కొండలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భయంకరమైన లావా వెదజల్లే అగ్ని పర్వతాలు.  కాలక్రమంలో ఘనీభవించిన ఈ అగ్ని పర్వతాలనుంచే ప్రస్తుతం ఎల్లో స్టోన్ రివర్ అత్యంత వేగంగా కిందకి దూకుతోంది.  కాల ప్రవాహం ప్రకృతిలో ఎన్ని మార్పులు తెస్తుందో కదా!!

ఇంకొన్ని కబుర్లు వచ్చే వారం....

మరిన్ని శీర్షికలు
hest Pain Causes and Ayurveda Treatment in Telugu by Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D.