గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue181/519/telugu-serials/atulitabandham/atulitabhandham/
మర్నాడు మధ్యాహ్నం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో, డొమెస్టిక్ ఫ్లయిట్ దిగి టాక్సీ లో వినత ఇంటికి వచ్చే సరికి, సమయం మూడైంది. రాగానే, నౌకర్ల ద్వారా ఆమెకి తెలిసిన వార్త ఏమిటంటే, సుందరమ్మ ముందురోజు సాయంత్రం నుంచీ హాస్పిటల్ లో ఉందని, ఉదయం ఆడపడుచు అవంతి ఎయిర్ పోర్ట్ నుంచి రాగానే తాను కూడా హాస్పిటల్ కి వెళ్ళి, తమ్ముడు పవన్ తో పాటుగా అక్కడే ఉందనీ...
వినతకి గుండెల్లో బండరాయి పడింది. అసలు పవన్ వద్దు వద్దంటున్నా టూర్ పెట్టుకుని వెళ్ళిపోయింది తను. పైగా రాత్రి అతను ఫోన్ చేసినా, తాను తీయనే లేదు... ఉదయమే ఛార్జ్ లేక మొబైల్ కాస్తా స్విచాఫ్ అయింది. దాన్ని పవర్ బాంక్ కి కనెక్ట్ చేసి, బాగ్ లో పడేసింది. గబుక్కున ఫోన్ తీసి కాల్ హిస్టరీ చూస్తే పాతిక మిస్డ్ కాల్స్ ఉన్నాయి పవన్ ఇచ్చినవి. ఒక్క క్షణం చాలా గిల్టీగా అనిపించింది వినతకు. కొద్దిగా భయం కూడా కలిగింది. ఇదేమిటి? అసలు ఆవిడకి ఇప్పుడు ఎలా ఉందో... అనుకుంటూ పవన్ మొబైల్ కి రింగ్ చేసింది కానీ జవాబు లేదు.
త్వరత్వరగా స్నానం చేసి, బట్టలు మార్చుకుని, టాక్సీ లో అత్తగారిని రెగ్యులర్ గా తీసుకువెళ్ళే హాస్పిటల్ కి వెళ్ళింది. అక్కడ రిసెప్షన్ లో అడగ్గానే మూడో ఫ్లోర్ అని చెప్పారు. లిఫ్ట్ లో అక్కడికి చేరుకొని, అక్కడున్న స్టాఫ్ ను వాకబు చేసి, అత్తగారినుంచిన స్పెషల్ రూమ్ కి చేరుకుంది. బెడ్ మీద కదలిక లేకుండా పడుకుని ఉంది సుందరమ్మ. పక్కనే పవన్ కూర్చుని ఉన్నాడు. అవంతి తల్లి చేయి పట్టుకుని నిలబడి ఉంది. ముంజేతికి అమర్చిన ట్యూబ్ లోంచి డ్రిప్స్ వెళుతున్నాయి.
“రామ్మా వినతా... బాగున్నావా?” ఎప్పటిలాగే ఆత్మీయంగా పలకరించింది అవంతి.
బాగున్ననన్నట్టు తలూపి, పవన్ వంక పలకరింపుగా చూసింది... అతను కోపంగా ముఖం తిప్పేసుకున్నాడు. “మీరు... మీరెప్పుడు వచ్చారు?” అంది ఆడపడుచుతో...
“ఉదయమే వచ్చాను... ఆయాసం ఎక్కువై, అమ్మను రాత్రంతా ఐసిసియు లో ఉంచారట... ఇక్కడ వీడు ఒక్కడే ఉన్నాడు పాపం... ఉదయానికి పరిస్థితి కాస్త మెరుగవటంతో రూమ్ లోకి మార్చారు. ఇప్పుడు అవుటాఫ్ డేంజర్... ఏమీ కంగారు పడనక్కర లేదు...” చెప్పింది అవంతి.
దీర్ఘంగా ఒక నిట్టూర్పు వదిలింది వినత. ఆమె మనసులో మొట్టమొదటిసారిగా ఒక అపరాధ భావన కదలాడింది.
“నేనుంటాను... మీరు ఇంటికి వెళ్లి పడుకోండి... మీకు జెట్ లాగ్ కదా వదినా...” అంది అవంతితో పీక్కుపోయినట్టున్న ఆమె ముఖాన్ని, నిద్రలేని కళ్ళను చూస్తూ.
“ఫర్వాలేదు అమ్మా... నీ టూర్ అంతా బాగా జరిగిందా?”
తలూపింది వినత. పవన్ లేచి బయటకు వెళ్ళిపోయాడు. వినత మనసులో గుబులు మరింతగా పెరిగింది.
***
“హమ్మయ్య, మన టీయల్ ట్రైనింగ్ కి వెళ్ళిపోయాడు... మనం ఫ్రీ...రా ఐశూ, కాఫీకి వెళ్దాం...” ఐశ్వర్య కొలీగ్ షామిలి అంది.
కార్తీక్ అప్పజెప్పిన పనిని కంటిన్యువస్ గా చేస్తున్న ఐశ్వర్య, కాస్త తలనొప్పిగా ఉన్నట్టు అనిపించటం తో సరేనన్నట్టు తలూపి లేచింది. ఇద్దరూ కలిసి కెఫేటేరియాకి వెళ్ళారు.
కాఫీ తాగుతూ అంది షామిలి... “ఇదే నాకు మొదటి జాబ్... బాగానే ఉంది... నీ విషయం ఏమిటి?”
“నేను ఇదివరకు రెండు చోట్ల చేసాను. ఇది మూడవ కంపెనీ...” చెప్పింది ఐశ్వర్య.
“ఓహ్ అవునా? అయితే నీకు ఎక్స్ పీరియన్స్ బాగానే ఉంది అన్న మాట... నిజానికి నాకు జాబ్ చేయాల్సిన అవసరమేం లేదు... ఊరికే కాలక్షేపానికి...” అంది షామిలి నవ్వుతూ... చిన్నగా నవ్వింది ఐశ్వర్య...
“మన టీమ్ లీడర్ బాగుంటాడు కదా?” షామిలి మాటలకు ఉలిక్కిపడింది ఐశ్వర్య.
“ఊ...” అంది ముక్తసరిగా...
“కొంచెం పరిచయం పెంచుకొని, ఆపైన ప్రపోజ్ చేద్దామని ఉంది... ఎలాగూ మా వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు... ఇలాంటి వాడైతే బావుంటుంది కదా...”
“కానీ, కార్తీక్ నీకన్నా చాలా పెద్దవాడు... కనీసం ఏడెనిమిది సంవత్సరాల తేడా ఉంటుంది...” చెప్పింది ఐశ్వర్య.
“అయితేనేం? నాకేం ఫర్వాలేదు...”
“నీ ఇష్టం... ముందు వర్క్ బాగా నేర్చుకో... తర్వాత మిగిలిన విషయాలు చూసుకో...” నవ్వుతూనే అంది ఐశ్వర్య.
“నీ సంగతి ఏమిటి? నువ్వింకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు?” ఐశ్వర్య ముఖంలోకి చూస్తూ అడిగింది షామిలి.
నవ్వింది ఐశ్వర్య.
“అన్నట్టు మన బాచ్ లో ఆ నీరూ ఉంది కదా... ఆ పిల్లకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు...” గుసగుసగా చెప్పింది షామిలి...
“ఓహో, ఓకే...” తలపంకించింది ఐశ్వర్య.
“ఫేస్ బుక్ పరిచయం అట... ఇంకా ఒకరినొకరు కలుసుకోలేదట... చూస్తూ ఉండు, ఆపకుండా మొబైల్ లో ఛాటింగ్ చేస్తూనే ఉంటుంది...”
“అది తన పర్శనల్ లే... ఇప్పుడైతే ఇంకా మనకి పని పూర్తిగా మొదలు కాలేదు కనుక ఫర్వాలేదు కానీ తర్వాత తర్వాత ఆఫీస్ టైం లో అలాంటివి చేస్తే బాగుండదు... పై వాళ్ళు చెబుతారు లే...అదే మిస్టర్ కార్తీక్...” అంది ఐశ్వర్య.
“నీకూ అతనికీ పూర్వపరిచయం ఉందా?” అనుమానంగా చూస్తూ అడిగింది షామిలి.
“అఫ్ కోర్స్... అతను నాకు స్నేహితుడు...ఇక వెళదాం, నాకు చాలా పనుంది...” చెప్పి లేచింది ఐశ్వర్య.
***
“మీకు థర్డ్ ఫ్లోర్ లో త్రీ నాట్ ఫోర్ అలాట్ చేసారు. మీతో మరొకరు ఉంటారు...” హోటల్ రిసెప్షన్ లో, రిజిష్టర్ లో సైన్ చేయించుకుంటూ అన్నాడతను.
“ఓహ్, థాంక్ యు... రేపటి నుంచే సెషన్స్ ప్రారంభం కదా...” సైన్ చేసి, లిఫ్ట్ వైపు నడిచాడు కార్తీక్.
“రూమ్ లో అతనున్నాడు... మీరు వెళ్ళండి, బెల్ బాయ్ సామాన్లు తెస్తాడు...”
రూమ్ ముందు నిలబడి మునివేళ్ళతో తలుపు చిన్నగా తట్టాడు కార్తీక్.
“ఇట్స్ ఓపెన్... ప్లీజ్ కమిన్...”
సున్నితంగా తలుపు తెరచుకొని లోపలికి వచ్చాడు, కార్తీక్. ఏసీ చల్లదనం, కమ్మని రూమ్ ఫ్రెషనర్ పరిమళంతో పాటుగా ఒక్కసారిగా కమ్మేసింది.
అక్కడ నడుము చుట్టూ టవల్ చుట్టుకొని స్నానానికి వెళ్ళబోతున్న వేణు కనిపించేసరికి ఆశ్చర్యానందాలతో ఊగిపోయాడు.
“హాయ్ వేణూ, మీరు... మీరిక్కడ... గ్రేట్ ప్లెజర్ ఫర్ మీ... నా రూమ్ మేటంటే ఎవరో అనుకున్నాను...” నవ్వుతూ అన్నాడు కరచాలనం కోసం చేయి చాస్తూ...
“ఓహ్, కార్తీక్... మీకూ ఇక్కడే ట్రైనింగ్ ఉందా? నిజంగా ఎంతో సంతోషంగా ఉంది... మనం మూడురోజులు కలిసి ఇక్కడ ఉండబోతున్నాం... ఆహా, ప్రపంచం ఎంత చిన్నదో కదా...” ఆనందంగా చేయి కలుపుతూ అన్నాడు వేణు.
“మీరు స్నానం చేసి రండి... వచ్చాక కాఫీ తాగుదాం... ఈలోగా నా సామాను వస్తుంది...” షూ విప్పుకుంటూ అన్నాడు కార్తీక్.
“సరే, త్వరగా వచ్చేస్తాను...” వేణు వాష్ రూమ్ లోకి వెళ్ళగానే కార్తీక్ సామాను వచ్చింది.
వేణు స్నానం చేసి రాగానే, కార్తీక్ తానూ స్నానం చేసి వచ్చాడు.
“మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ కదా... తొమ్మిదికి వెళదాం... ఈలోగా కాఫీ ఆర్డర్ చేసాను... ఈరోజంతా ఫ్రీనే కదా మనం?” అన్నాడు వేణు.
“అవును... ముంబై చాలా సార్లు వచ్చాను, అందుకే బయటికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు... నేను రూమ్ లోనే ఉంటాను. అదీగాక రేపటికి కాస్త ప్రిపరేషన్ అవసరం నాకు... మీది ఏ ప్రోగ్రాం?” అడిగాడు కార్తీక్ ఆసక్తిగా.
వేణు మాటల్లో తెలిసింది ఇద్దరిదీ ఒకటే ప్రోగ్రాం అని. మేనేజ్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం ఇండియా లోని యమ్మెన్సీల వాళ్ళు ఒక ప్రఖ్యాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించే ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం కొందరిని ఎంపిక చేసి, ముంబయి పంపించారు. వాళ్ళలో వీళ్ళిద్దరూ ఉండటం విశేషం, కాకతాళీయం.
వేడిగా కాఫీ తాగుతూ రిలాక్స్ అయ్యాడు కార్తీక్. న్యూస్ పేపర్ తీసి చదువుతూ సిగరెట్ వెలిగించాడు. ఆ పొగ పడక ఇబ్బందిగా ముఖం పెట్టాడు వేణు.
అది గమనించిన కార్తీక్, “ఓహ్ సారీ...” అంటూ సిగరెట్ ఆర్పేసి యాష్ ట్రే లో వేసేసాడు.
“నాకోసం మీరు ఇబ్బంది పడకండి... నేను రూమ్ మారనా?” అడిగాడు వేణు మొహమాటంగా...
“అబ్బే, వద్దు... నేనే ఈ మూడురోజులూ రూమ్ లో ఉండగా, స్మోక్ చేయకుండా ఉంటాను...” నవ్వాడు కార్తీక్.
“థాంక్స్ అండ్ సారీ టూ...”
“నో... ఎవరో కొత్తవాళ్ళతో ఉండే బదులు మీతో ఉండాలని ఉంది నాకు... సాధారణంగా నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను...” అని చెప్పిన కార్తీక్ పై ఎంతో సదభిప్రాయం కలిగింది వేణుకు.
మరుక్షణమే, ‘మరి ఐశ్వర్యను?’ అనిపించింది... దాన్ని కప్పిపుచ్చుకుంటూ, “ఓకే కార్తీక్, మీరు కాసేపు రిలాక్స్ అవండి... మరో అరగంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయటానికి వెళదాం...” అని టీవీ ఆన్ చేసాడు వేణు.
***
|