గోతెలుగు ప్రచురించే ధారావాహికలఅకు పాఠకుల మనసుల్లో ఒక విశిష్ట స్థానం వుంది... మానవీయ, నైతిక కోణాల ఇతివృత్తాలు, బిగి సడలని శైలి, ఇలా అనేక అంశాల ఆధారంగా ధారావాహికలను ఎంపిక చేసి పాఠకులకందించడంలో మేము వహించే ప్రత్యేక శ్రద్ధ ఒక కారణం కావచ్చు....ఎవరు రాస్తున్నారు అనేదానికన్నా, ఏం రాస్తున్నారు, అది మా పాఠకులనెంతవరకు అలరిస్తుందనే విషయానికే మా ప్రాధాన్యత.. ఆ క్రమంలో కొత్తగా రాసే వారితో బాటు, గోతెలుగుకి కొత్తగా రాస్తున్న లబ్ధప్రతిష్టులైన వారి నవలలను కూడా అంతే శ్రద్ధతో పరిశీలించడం జరుగుతోంది... ఈ క్రమంలో గోతెలుగు పాఠకుల ముందుకు వస్తోన్న సరికొత్త ధారా వాహిక ఆకునూరి మురళీకృష్ణ కలం నుండి జాలువారిన " అతడు... ఆమె... ఒక రహస్యం " వారి రచనా నేపథ్యం గురించీ, ఈ సీరియల్ గురించీ వారితో గోతెలుగు అందిస్తోన్న ముఖాముఖీ
గోతెలుగు : నమస్కారం మురళీ కృష్ణగారూ. గోతెలుగుకి స్వాగతం...శుభాభినందనలు....
మురళీకృష్ణ: కృతజ్ఞతలండీ. పుస్తక పఠనానికి రీప్లేస్‍మెంట్ లా వస్తున్న తెలుగు వెబ్ మ్యాగజైన్లలో గోతెలుగుది ప్రముఖ స్థానం. గోతెలుగులో సీరియల్ రావడం మాకూ ఆనందంగా ఉంది.
గోతెలుగు : ముందుగా మీ నేపథ్యం గురించి పాఠకులకు తెలియచేస్తారా?
మురళీకృష్ణ: ఆకునూరి మురళీకృష్ణ, వరలక్ష్మి మురళీకృష్ణ అన్న పేర్లతో నేనూ, నా శ్రీమతి వరలక్ష్మి కలిసి ఇప్పటి వరకూ నూట యాభైకి పైగా కథలూ, ఆరు నవలలు రాసాము. దాదాపు అన్ని ప్రముఖ తెలుగు పత్రికలలోనూ మా రచనలు వచ్చాయి. చాలా కథలు బహుమతులు పొందాయి. నవలలు సీరియల్స్ గా వచ్చాయి. రెండు నవలలు కన్నడంలోకి అనువదించబడి సీరియల్స్ గా వచ్చాయి.
గోతెలుగు : మీకు ప్రేరణ కలిగించి, పాఠకుడి నుంచి మీలోని రచయితని వెలికి తీసిన రచనలు, రచయిత(త్రు)ల గురించి......
మురళీకృష్ణ: చదువుకునే రోజులనుంచీ అలవాటైన పుస్తక పఠనం మమ్మల్ని రచయితలుగా మార్చింది. ఆ రోజుల్లో రాసిన అందరు రచయిత(త్రి)ల రచనలూ మాకు ప్రేరణలే. ప్రస్తుతానికి వస్తే, మా సమకాలీన రచయిత(త్రు)లంతా మాకు స్నేహితులు. అందరం రచనల గురించి ఎటువంటి అరమరికలు లేకుండా చర్చించుకుంటూ ఉంటాం. రాయకుండా ఉండలేని ఒక బలహీనత… రచనలు చేయడం ద్వారా లభించే ఉత్సాహం- ఇవి రచయితలుగా ఇంకా మమ్మల్ని కొనసాగిస్తున్నాయి.
గోతెలుగు : ఎంచుకునే ఇతివృత్తం-శైలి వీటిలో దేనికెక్కువ ప్రాధాన్యతనిస్తారు?
మురళీకృష్ణ: రెండిటికీ సమాన ప్రాధాన్యత. మా మటుకు మేము ఇతివృత్తంలో కొత్తదనం ఉండేట్టు. శైలి ఆసక్తి రేకెత్తించేలా ఉండేట్టు చూసుకుంటూ ఉంటాము. చక్కటి ఇతివృత్తం ఉన్న నవలకి రాసే విధానం కూడా తోడైతే ఆ నవలని పాఠకులు మర్చిపోలేరు.
గోతెలుగు : ఇప్పటి వరకూ మీ కలం నుండి జాలువారిన నవలలు, కథలు ఎన్ని? అందుకున్న పురస్కారాల గురించి?
మురళీకృష్ణ: మా రచనా జీవితంలో సంతోషంగా చెప్పదగ్గ విషయం ఏమిటంటే, దాదాపు అన్ని ప్రముఖ పత్రికల కథల పోటీ, నవలల పోటీలలోనూ మాకు బహుమతులు వచ్చాయి. రాసిన మొదటి సీరియలే స్వాతి వారపత్రికలో బహుమతి పొందడం, విపుల డబ్బై ఐదేళ్ళ సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందడం, ఆంధ్రభూమి స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహించిన నవలల పోటీలో మా నవల ‘నీడ’ బహుమతి పొందడం, ఒక కన్నడ పత్రిక ఎడిటర్ మా నవలలని చదివి అనువదించి, తమ పత్రికలో సీరియల్ గా వేసుకుంటామని స్వయంగా ఫోన్ చెయ్యడం. ఇలాంటి ఎన్నో మరిచిపోలేని అనుభూతులున్నాయి. రచనలు చదివిన సాటి రచయితల, పాఠకుల స్పందన అన్నింటికన్నా గొప్ప పురస్కారంలా అనిపిస్తుంది. రాసినది తక్కువే అయినా, వచ్చిన పేరు సంతృప్తికరంగా ఉంది.
గోతెలుగు : అన్ని ప్రశ్నలకీ మీరే సమాధానం చెప్పేస్తున్నారు. వరలక్శ్మి గారు ఏమీ మాట్లాడరా? అసలు ‘ఆకునూరి మురళీకృష్ణ’ రచనలలో వరలక్శ్మీ మురళీకృష్ణగారి పాత్ర ఏమిటి?
మురళీకృష్ణ: (నవ్వుతూ) పెద్ద పెద్ద కంపెనీల్లో ‘క్వాలిటీ కంట్రోల్ డిపార్టుమెంట్’ అని ఉంటుంది. తమ ఉత్పత్తుల క్వాలిటీని స్వయంగా పరిక్షించే విభాగం అది. అలా రాయడంతో పాటూ, మా స్వంత రచనలని నిష్పక్షపాతంగా విశ్లేషించి క్వాలిటీ కంట్రోల్ చేసే పెద్ద పని ఆమెది. మొదట్లో నేను ఒక్కడినే రాసే వాడిని. ఆఫీసు పనుల్లో నేను బిజీ అయిపోవడం వల్ల వచ్చిన ఆలోచనలని రచనలుగా మార్చే బాధ్యతని ప్రస్తుతం ఆమె తీసుకుంది. రచయితగా ‘ఆకునూరి మురళీకృష్ణ’ కి వచ్చిన పేరును ముందుకు తీసుకు వెళ్ళాలని ఆ పేరుతోనే రచనలు చేస్తున్నాం.
గోతెలుగు : ఇంక సీరియల్ విషయానికి వచ్చేద్దాం. అతడెవరు? ఎవరామె? రహస్యం ఎక్కడుంది? ఎవరు చేదిస్తారు?
మురళీకృష్ణ: (నవ్వుతూ) అసలు రహస్యం ఇప్పుడే చెప్పేస్తే ఎలా?!
గోతెలుగు : వద్దులెండి అయితే. పోనీ ఈ నవల రాయడానికి మీకు కలిగిన ప్రేరణ గురించి చెప్పండి?
మురళీకృష్ణ: ఒకప్పుడు డిటెక్టివ్ నవలలు పాఠకులని ఉర్రూతలూగించేవిట. టీవీలూ, కంప్యూటర్లూ రాని రోజుల్లో యువత చేతిలో డిటెక్టివ్ నవలలుండేవని చెప్పుకుంటారు. అలాంటి ఆసక్తి, ఉత్కంఠ మళ్ళీ పాఠకులకి అందించాలన్న సంకల్పంతో రాసిన డిటెక్టివ్ పాణి సిరీస్ లో ఇది మూడవ నవల. మొదటి నవల ‘అపరిచితులు’ స్వాతి వారపత్రికలో సీరియల్ గా వస్తోంది. రెండో నవల ‘యువర్స్ లవింగ్లీ’ ఆంధ్రభూమి దినపత్రికలో సీరియల్ గా వచ్చి క్రిందటి నెలలోనే ముగిసింది. ఇది మూడవది. పాణి క్యారెక్టర్ క్రియేట్ చెయ్యడానికి మాకు ఇన్స్పిరేషన్ కలిగించినది స్వాతి వీక్లీ పెట్టిన అపరాధ పరిశోధన నవలల పోటీ. వారికి మా కృతజ్ఞతలు ! చదివే పాఠకులకి మంచి సినిమా చూస్తున్న అనుభూతినివ్వాలన్న తపనతో రాసిన నవల ఇది.
గోతెలుగు : అయితే సినిమాని దృష్టిలో పెట్టుకుని రాసిన నవలా ఇది?
మురళీకృష్ణ: (మళ్ళీ నవ్వుతూ) అలా ఏం లేదండీ. చదివే పాఠకుడికి కళ్ళ ముందు దృశ్యం కనిపించేట్టుగా రాసే విధానంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాం అంతే. మీరు తయారు చేసిన ప్రచార చిత్రాలు ఉత్కంఠ రేపుతూ పాఠకులకి నవల ఎలా ఉండబోతోందో ఒక అవగాహననిచ్చాయి. ఎటువంటి అచనాలూ లేకుండా నవలని చదివి ఎంజాయ్ చెయ్యమని పాఠకులని కోరుతున్నాం.
గోతెలుగు : ఎప్పట్నుంచి గోతెలుగు పాఠకులు మీరు? గోతెలుగులో నచ్చే అంశాలేమిటి? గోతెలుగు పాఠకులకు చేరువ కాబోతున్నందుకు మీ అనుభూతి?
మురళీకృష్ణ: గోతెలుగు మ్యాగజైన్ని ప్రారంభం నుంచీ చూస్తున్నాము. పత్రిక గెటప్ బాగా నచ్చి వెంటనే ఒక కథ కూడా పంపాము. ‘పెత్తనం’ అన్న ఆ చిన్న కథ గోతెలుగులో చాలా రోజుల క్రితమే వచ్చింది. చక్కటి ఇల్లస్ట్రేషన్స్ తో సహా అచ్చు పుస్తుకాన్ని చేత్తో పట్టుకుని చదువుతున్న అనుభూతినిచ్చేలా వెబ్ మ్యాగజైన్ని తయారు చెయ్యడం బాగా నచ్చింది.
గోతెలుగు : తెలుగు రచనలకి పాఠకులు కరువవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. మీ దృష్టిలో దీనికి కారణం ఎవరు? పత్రికలా? పాఠకులా?
మురళీకృష్ణ: (నవ్వుతూ) రెండూ కాదు. రచయితలు ! పాపులర్ సాహిత్యాన్ని పెద్దగా సృజించకపోవడమే ఈ స్థితికి కారణం. ఇవాళ రచనలని ‘వృత్తిగా’ తీసుకునే పరిస్థితి రచయితలకి లేదు. అందుకే దానిమీద అవసరమైనంత కృషి జరగడం లేదు. ఈ పరిస్థితి రావడానికి మరో ముఖ్యమైన కారణం పిల్లలకి తెలుగు ‘చదవడం’ నేర్పడాన్ని తల్లిదండ్రులు ఒక తరం క్రితం నుంచీ మానెయ్యడం.
గోతెలుగు : ఈ పరిస్థితి ఇక మారదంటారా?
మురళీకృష్ణ: ఇంటర్నెట్ లో తెలుగు భాష వాడకం పెరగడం, విస్తరిస్తున్న తెలుగు వెబ్ మ్యాగజైన్ల వల్ల పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. మన సంపదని మనమే కాపాడుకోవాలి. ఈ విషయంలో గో తెలుగు చేస్తున్న కృషికి మనసారా అభినందనలు !
గోతెలుగు : ఆల్ ద బెస్ట్ అండీ....ఇక పాఠకులను మీ సీరియల్ లోకి తీస్కెళదామా?
మురళీకృష్ణ: తప్పకుండా... స్వాగతం !

|