Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ...http://www.gotelugu.com/issue184/529/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

( గతసంచిక తరువాయి) 

‘‘దేవీ! నీవు నన్ను అపార్థం చేసుకున్నావు. ఈ మౌనం నీవు నాకు నచ్చక గాదు. పాతాళ లోక యువ రాణివి, బలి చక్రవర్తి ప్రియ దత్త పుత్రికవు, కుసుమ కోమలివి, సాటి లేని సౌందర్య రాశివి. నీ ప్రేమకు పాత్రుడ నగుట నా అదృష్టమే. కాని....’’

‘‘ఊఁ...! అయితే అభ్యంతర మేమి ప్రభూ?’’

‘‘ఇప్పటికే నా హృదయ పీఠమున ఇరువురు భామలు అధివశించి వున్నారు. నీవు మూడవ స్థానమును కోరుచున్నావు....’’

‘‘దీని కింత చింతయే? సు క్షత్రియ రాకుమారుడు నలుగురు కన్యలను వివాహమాడ వచ్చునని శాస్త్రము చెబుతున్నది. మూడవ స్థానము నా కొసంగినను నాల్గవ స్థానము కాళీ గానే ఉన్నది గదా’’ అంటూ నవ్వింది.

‘‘అయ్యో! నా సంకటము నీకు అర్థము గాకున్నది.’’

‘‘నాకు అర్థమైనది ప్రభూ. ఈ చెర వాసము తొలగి పాతాళము నుండి భూ లోకము చేరుట ఎటులని గదూ మీ చింత? నేను మీ చెంత నుండ ఆ చింత మీకేల. మీరు సమ్మతించిన చాలును. ఈ క్షణమే మిమ్ము భూ లోకమునకు గొని పోగలను. ఇక మీరే నా ప్రాణము మీతో వచ్చెదను’’ అంది మణి మేఖల.

ఆమె దృఢ సంకల్పం విని`

విభ్రాంతి చెందాడు ధనుంజయుడు.

‘‘దేవీ! ఇది పద్ధతి యనుకోను. నిను పెంచి పెద్ద జేసిన ఆ పుణ్య దంపతులకు మాట మాత్రమైనా చెప్పకుండా నా వెంట వచ్చుట సరి కాదు. ఆ పైన నిను గొని పోయిన నేను మహా బలి ఎదుట నిజము గనే దోషినగుదును. ఆలోచింపుము’’ అన్నాడు సాలోచనగా.

‘‘అవును. కాని మనకు వేరు మార్గమెయ్యది? మిము దోషిగా చూస్తున్న జనకుడు నను మీకిచ్చి వివాహము జేయునా? వేరే వరునితో వివాహము జేయు నిశ్చయింతురు. ప్రాణము విడుతును గాని అందుకు అంగీకరింప జాల. పిమ్మట ఎటులనో వారికి నచ్చజెప్పుకొన వచ్చును. ప్రస్తుతము మనము భూ లోకమునకు వెళ్ళి పోవుటయే ఇందుకు పరిష్కారము’’ అంది మణి మేఖల. భారంగా నిట్టూర్చాడు ధనుంజయుడు.

‘‘నీవు పొరబడుచున్నావు దేవీ. నీకు చాలా విషయములు తెలియవు. భద్రా దేవి విషయంగా నాకు ఎలాంటి సమస్యా లేదు. కాని నాగ లోక యువ రాణి ఉలూచీశ్వరి నను వలచి నా చెంతకు వచ్చుటతో నాగ రాజుకి శత్రువునైతి. ఇప్పుడు నిను గొని పోయి మహాబలితో కూడ వైరము తెచ్చుకొనుట మనకు క్షేమమా?’’ అంటూ తన జనకుడు ధర్మతేజునికి ఏర్పడిన పుట్ట వణ్రము మాన్పుటకు దివ్య నాగ మణి కోసం బయలు దేరిన మొదలు జరిగిందంతా మణి మేఖలకు వివరించాడు ధనుంజయుడు.

అంతా విని బేలగా చూసింది మణి మేఖల.

‘‘అటులయిన మన సమస్యకు పరిష్కారము ఏమి ప్రభూ? ఈ ఎనిమిది జాముల సమయమున భూలోకము చేరుట ఎటుల? గడువు దాటిన ఆమరణాంతము చెరసాల వాసము గదా’’ అంది రుద్ద కంఠంతో.

‘‘ఆ భయము నీకు వలదు హృదయేశ్వరి. అలాగున జరుగదు. ఆ మాధవుడు ఇట నుండి వెడలుటకు ఏదో మార్గము నాకు చూపక పోడు. నీవు మాత్రము ఇచటనే ఉండవలె. నిర్భయముగ నీ మనసులో మాట నీ తల్లిదండ్రులకు చెప్పవలె. వారు అంగీకరించినను నిరాకరించినను వారికి తెలియ పర్చుట నీ ధర్మము.

ఈ లోపల నేను భూ లోకమున నా బాధ్యతలు ముగించిన పిమ్మట నీ కొరకు ఈ పాతాళ లోకమునకు మరలి వత్తును. అప్పుడు నేనే మీ పెద్దలతో మాట్లాడి ఒప్పించి నిను చేపట్ట గలను. నా మాట నమ్ము. నిను కూడా నా వెంట రత్న గిరికి చేరిన పిమ్మట మీ మువురునూ ఒకే సారి పరిణయ మాడెద. నీవు దుఖ్ఖింప పని లేదు.’’ అంటూ లాలనగా కన్నీరు తుడిచాడు.

ధనుంజయుని విశాలమగు ఛాతీని కౌగిలించుకుని చాలా సేపు మౌనంగా ఉండి పోయింది మణి మేఖల. ఆమె కన్నీరు అతడి ఛాతీని తడుపు తూనే వుంది. కరి మబ్బులా దట్టంగా పొడవుగా తుమ్మెద రెక్కల్లా వుండి సుగంధ భరితంగా వున్న నిడు పాటి ఆమె కేశాలను సవరిస్తూ అనునయించాడు ధనుంజయుడు. ఆమె కన్నెపరువాలు ఎద భారాలు చాతీని అదిమేస్తుంటే ధనుంజయుని వలపు కోటలో అలజడి.

ముదమార ఆమె ముఖారవిందాన్ని తన వైపు తిప్పుకొని కన్నీరు తుడిచాడు. అంతే` ఒక్క సారిగా మీదకు ఎగ బ్రాకి అతని అధరాలను చుంభించింది. ఆమె సుందర దేహం అతడి కౌగిట బంధీ అయింది. తొలి కౌగిలి సుఖాన్ని ముద్దు మాధుర్యాన్ని అనుభవిస్తూ కాసేపు సర్వం మర్చి పోయారు.

‘‘దేవీ...’’ పిలిచాడు.

‘‘ఊఁ...’’ అంది.

‘‘నీవు వచ్చి సమయము గడిచినది. ఇక నీవు అంతఃపురమున నీ మందిరమున కేగుట మంచిది. ఎవరైనా గమనించిన ఇప్పుడే మన గుట్టు రట్టు కాగలదు’’ అంటూ గుర్తు చేసాడు.

ఇష్టం లేకున్నా మణిమేఖలకు`

బయల్లు దేరక తప్ప లేదు.

ఆమెను సాగనంపుటకు మందిర ద్వారం వరకు వచ్చాడు ధనుంజయుడు. గడప దాటక ముందే గిరుక్కున వచ్చి మరోసారి ధనుంజయుని గాఢంగా కౌగిలించుకుని అధర చుంబనాందించింది మణి మేఖల.

‘‘నను మరువరు గదా. మీ కోసం ఎదురు తెన్నులు చూస్తూనే వుంటాను’’ అంది.

మరో సారి ధనుంజయుడు మాట ఇచ్చాక`

అతడిని వదిలి పోలేక పోతూ`

వడి వడిగా అంతఃపురం వైపు వెళ్ళి పోయింది మణి మేఖల. ధనుంజయుడు వెనక్కి వచ్చి కూచున్నాడు. మణి మేఖల నిష్క్రమించటం గమనించాక కావలి రాక్షస భటులు నలుగురూ వచ్చి తిరిగి బయట కాపలా కూచున్నారు.

ధనుంజయుడి మనసు చంచలంగా వుంది. పడుకున్నా నిద్ర పట్టేట్టు లేదు. తిరిగి మరి కొంత మధిర సేవించి పడుకున్నాడు. తనిక్కడ నుండి బయటకు పోవడానికి తనుకున్న ఒకే ఒక మార్గం తన మిత్రుడైన యక్షుడు. కాని ఎంత ఆలోచించినా అతన్ని పిలిచేందుకు అతడి పేరు గుర్తుకు రావటం లేదు. ఎడ తెగని ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్ర పట్టిందో ఆ పైన ధనుంజయునికి గుర్తు లేదు.

************************************

ఆ రాత్రి`

మాధవ స్వామి ఆహ్వానం మేరకు, ఆ సదా శివుని ఆశీస్సులతో భద్రా దేవి, ఉలూచీశ్వరిలు గుట్ట మీది శివాలయ మండపంలో తల దాచుకున్నారు...

ఆ రాత్రి కుంభ వృష్టిగా ఆరంభమైన వాన రెండు రాత్రులు రెండు పగళ్ళు విడవ కుండా కురుస్తూనే వుంది. వాగులు వంకలు  ఏకమపోయాయి. చిట్టటవీ ప్రాంతమంతా జల మయమై పోయింది. అశ్వాలతో సహా భూతం ఘృతాచితో బాటు భద్రా దేవి, ఉలూచీశ్వరి లిరువురూ మండపం లోనే శివ గణాలకు అతిధులుగా ఏ లోటు లేకుండా ఉండిపోయారు. వారు ధనుంజయుని రాక కోసం క్షణ మొక యుగంగా ఎదురు చూస్తున్నారు.

ఇలా ఉండగా`

ఆ రోజు వెదుకుతూ వెళ్ళిన భూతం ఘృతాచికి నల్లటి అశ్వాలు, నల్లటి రధము మాత్రం కన్పించాయి. నిజానికి సర్ప రూపంలో నాగ లోకం నుంచి వచ్చిన వాళ్ళంతా అక్కడే వున్నారు. ఆ విధంగా వక్ర దంతుని బృందం కొండ వాగు అవతల దూరంగా దట్టమైన అటవీ ప్రాంతంలో విడిసి వున్నారు. చీకటి పడిన కొద్ది సేపటికి పాతాళ బిలం నుండి తిరిగి వచ్చిన వక్ర దంతుడు చాలా ఉత్సాహంగా వున్నాడు. భద్రా దేవి, ఉూచీశ్వరిలు శివాలయం వున్న కొండ గుట్ట వద్దే      ఉంటారని తెలుసు. పనిలో పని ఆ రాత్రికే ఉలూచీశ్వరిని కూడ నాగ లోకం ఎత్తుకు పోవాలని తన బృందాన్ని బయలుదేర దీసి కాగడాలతో కాలి నడకన సాగాడు.

వక్ర దంతుడు ధనుంజయుని అదృశ్యం చేయటం లోనే తొందర పడ్డాడని చెప్పాలి. ఆ తొందరలో ఘోరమైన తప్పు చేసాడు. ఒక తప్పు మరిన్ని తప్పిదాలకు దారి తీస్తుంది. నాగ రాజు ఆనతి వేరు వక్ర దంతుడు చేసింది వేరు. ధనుంజయ బృందం ఏదో ఒక చోట రాత్రికి మజిలీ చేసినపుడు అంతా గాఢ నిద్రలో వుండగా ధనుంజయుని పాతాళ లోకాన వదిలి రమ్మన్నాడు. తెల్ల వారి భద్రా దేవి, ఉలూచీశ్వరిలకు ధనుంజయుడు ఏమయ్యాడో అంతు చిక్క కూడదని అప్పుడు నిరాశలో ఉలూచీశ్వరి తమ నాగ లోకానికి తిరిగి వస్తుందని నాగ రాజు ఉద్దేశం.
కాని అత్యుత్సాహం చూపిన వక్ర దంతుడు నాగ రాజు ఆనతిని కాదని, పట్ట పగలే శివ సన్నిధి నుండి ధనుంజయుని అపహరించటంతో ఆ పని చేసింది వక్ర దంతుడని భద్రా దేవి, ఉలూచీశ్వరిలకు తెలిసి పోయింది. ఇక అదే క్రమంలో ఆ రాత్రికే ఉలూచీశ్వరిని కూడ ఎత్తుకు పోతే వచ్చిన పని ముగుస్తుందని, పాతాళం నుండి తిరిగి వస్తూనే తన నాగ దండుతో దివిటీల కాంతిలో ఆలయానికి బయలు దేరాడు. కాని కొండ వాగును చేరక ముందే నందీశ్వరుని రంకులు, శునక రూపం లోని భైరవుని అరుపులు నాగ దండుని కంగారు పెట్టి వారి ప్రయత్నాన్ని భంగ పరిచాయి. ఆ పైన కుండ పోత వర్షం, పెను గాలి ఆరంభం గావటంతో పొంగి పొర్లుతున్న వాగును దాటే సాహసం చేయ లేక పోయారు. తిరిగి సర్ప రూపాలు ధరించి పొదలు, బొరియలు, కొండ రాళ్ళ పగుళ్ళలో తల దాచుకున్నారు.

మూడవ దినము వర్షము తెరిపిచ్చి సూర్యుడు కన్పించినా, వాగులు వంకలు పొంగి పొర్లుతూ అటవీ ప్రాంతం జల మయం గానే వుంది. అవతల శివ నాగ పురం జన జీవనం అస్త వ్యస్థమైంది. ఊరు సగం జల మయం గావటంతో అనేక గృహాలు కూలి పోయాయి.
పగటి వేళ నాగ లోక వాసులు`

బహిరంగంగా తిరగ లేరు.

మానవ రూపంలో సంచరించినా గరుడ పక్షులు వారిని పసి గట్టేస్తాయి. వేటాడి చంపి తినేస్తాయి. తమ మంత్ర శక్తులేవీ ఆ పక్షుల మీద పని చేయవు కాబట్టి ఏం చేసినా రాత్రి వేళే చేయాలి. ఉలూచీశ్వరిని అపహరించేందుకు వాళ్ళంతా అదను కోసం ఎదురు చూడ సాగారు. ఆ అవకాశం నాలుగవ రోజు తెల్ల వారు జామున కలిసి వచ్చింది వాళ్ళకు.

***********************************

బలి చక్రవర్తి ఇచ్చిన ఎనిమిది జాముల గడువు సమయం గడిచి పోయింది. అది పగలు రాత్రికి బేధం లేని చీకటి రాజ్యం గాబట్టి జాముల్ని సూచిస్తూ ప్రతి జాముకి ఒక సారి కోట పైభాగం నుండి నగారా మ్రోగుతుంది. ఆ భేరీ నాదం పాతాళ నగర మంతటా విన్పిస్తుంది.
ధనుంజయుడు నిద్ర లేచినప్పటి నుండి` తీవ్రాతి తీవ్రంగా ఆలోచిస్తూనే వున్నాడు.

తనను ఈ విపత్కర పరిస్థితుల నుండి కాపాడ గల సమర్థుడు ఏకైక మిత్రుడు యక్షుడు. కాని మస్తిష్కం వేడెక్కి పోతోంది గాని ఎంతగా తరచి ఆలోచించినా అతడి పేరు గుర్తుకు రావటం లేదు. లేచి జల ధారలో స్నానం చేసి తిరిగి అవే దుస్తులు ధరించాడు. కాస్త అలసట నెమ్మదించింది.  అంతలో రాక్షస భటులు పది మంది రానే వచ్చారు. ఇనుప సంకెళ్ళతో తిరిగి ధనుంజయుని బంధించారు. ఆమరణాంతం చెర వాసం తప్పదని ధనుంజయుని పరిహాసంగా చూడ సాగారు. విడిది గృహం నుండి బయటకు నడిపించారు.
అంతఃపుర గవాక్షం నుండి తిరిగి బంధితుడైన ధనుంజయుని వీక్షిస్తూ దుఖ్ఖితు రాలై కన్నీరు విడిచింది యువ రాణి మణి మేఖల. భటులు వెంట భారంగా నడుస్తున్న ధనుంజయుని వేదనతో చూస్తుండి పోయింది.

విడిది గృహం అంతఃపురం ఉద్యాన వనాన్ని ఆనుకునే వుంది. కాని చెరసాల అలా కాదు. కోట వెనక తట్టున మరు భూమిలో విడిగా నిర్మించిన సువిశాలమైన రాతి కట్టడం అది. ప్రవేశ ద్వారం నుండి పొడవుగా ఇరు వంకలా రాతి స్తంభాలు వున్నాయి. వాటికి అటు యిటు ఉక్కు వూచతో కూడిన అనేక కటకటాల గదులున్నాయి. గది వెనక దృఢమైన వూచలతో కూడిన కిటికీ వెనక నుండి మరు భూమి మీదుగా ఎప్పుడూ శీతల గాలులు వీస్తూంటాయి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulitabhandham