Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagalokayagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/issue184/527/telugu-serials/atulitabandham/atulita-bhandham/

( గతసంచిక తరువాయి) 


“బావున్నాడమ్మా... ఇందాకే లోపల పడుకోబెట్టాను... లేవగానే తీసుకువస్తాను... మధు కూడా కాసేపట్లోనే వచ్చేస్తుంది... నువ్వు కూర్చో...” అంది సుగుణమ్మ ఆప్యాయంగా.

సరేనంటూ కూర్చుంది ఐశ్వర్య. ఐశ్వర్య కుటుంబ వివరాలు అడిగి తెలుసుకుంది ఆసక్తిగా  సుగుణమ్మ.

“మధు ఎలా ఉంటోంది ఆంటీ? అదే... సారీ ఎలా అడగాలో తెలియటం లేదు... వేణు గారూ, తనూ...”

ఆవిడ దీర్ఘంగా నిట్టూర్చింది...

“అమ్మా, ఐశ్వర్యా... మీరిద్దరూ చాలా కాలం కలిసే ఉన్నారు కనుక నీకన్ని విషయాలు తెలుసు... నా కొడుక్కి కోపమెక్కువ, కోడలికి దూకుడెక్కువ... ఇద్దరూ మంచివాళ్ళే, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అవగాహన ఉన్నవాళ్ళే... కానీ కొన్ని విషయాల్లో వేణూ తొందరపడటం వలన మధు చాలా బాధ పడింది... అదీగాక, నా కూతురు అసూయతో చేసిన ఒక చర్య వలన నా కోడలికి ప్రాణాపాయం తప్పినా ఆమె మనసు విరిగిపోయింది... ఫలితంగా ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయింది...

మీరిద్దరూ ప్రాణ స్నేహితులు కదా... నీకు తెలిసే ఉంటుంది., కోడలు ఇల్లు విడచి వెళ్ళిపోయింది అన్న బాధతో మీ అంకుల్ బెంగతో మానసికంగా బాగా దెబ్బతిన్నారు. ఫలితంగా యాక్సిడెంట్... మాకు శాశ్వతంగా దూరమయ్యారు... చివరివరకూ ఆయన మధు కోసం తల్లడిల్లిపోయారు. మధ్యలో నా కొడుకూ కోడలి మధ్య డబ్బు గొడవలు... రకరకాల సమస్యలు... కొన్నాళ్ళు దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చినా, పూర్ణ హృదయంతో మాత్రం కాదు... వాళ్ళ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడటానికి కొంతా, ఆమె తండ్రి ఆరోగ్య పరిస్థితిని బట్టీ, బాబీని మాకు దూరంగా పెంచటం ఇష్టం లేక...

మా వాడు కూడా ఇప్పుడు చాలా మారాడు అమ్మా... ఇదివరకటి కోపం, అసహనం లేవు... కాకపోతే వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు, ఒక్క గదిలో పడుకోరు... ఇదే నా వేదన... దేనికైనా సమయం రావాలి అంటారు కదా... అసలు వీళ్ళిద్దరి మధ్యా సయోధ్య నేను చూస్తానో, లేదో...” నిర్వేదంగా అన్నది సుగుణమ్మ...

“అయ్యో ఆంటీ... మీరలా అనుకోకండి... వాళ్ళిద్దరూ తప్పక కలుస్తారు... ఆ నమ్మకం నాకుంది... నిజానికి మధూకి వేణూ అంటే చాలా ప్రేమ... అలాగే మీరన్నా, అంకుల్ అన్నా భక్తిగౌరవాలు... ఆడబడుచులంటే అభిమానమే...” అనునయించింది ఐశ్వర్య..

“అవునమ్మా... నిజానికి నా కడుపున పుట్టిన పిల్లల్లోనే  లోపాలున్నాయి... అందుకే ఈ నరకం... ఏది ఏమైనా, నీవు చెప్పినట్టు ఆ తరుణం కోసం ఎదురు చూడక తప్పదు...”

“ఇంతకూ మధు వెళ్ళింది వినతా వాళ్ళింటికేనా ఆంటీ?”

“అవునమ్మా, క్రితం వారం వినత అత్తగారికి  బాగా ఆయాసం వస్తే, హాస్పిటల్లో చేర్పించారు. డిశ్చార్జి అయి ఇంటికి వచ్చేసారిప్పుడు...ఈరోజు మధు చూసి వస్తానని వెళ్ళింది... మా వాడు ఇవాళ వస్తాడని అనుకున్నాను., కానీ ఎందుకో ఆలస్యం అయింది... లేకపోతే ఇద్దరినీ కలిసి వెళ్ళమనే చెప్పాను...”

“ఓహో...”

“టీ చేసుకుని వస్తాను... కూర్చోమ్మా... నువ్వు తాగుతావు కదా?

“అయ్యో, మీరేమీ శ్రమ పడకండి ఆంటీ... ఫర్వాలేదు... మధూ వచ్చాక పెడుతుంది లే...”

“ఇందులో శ్రమ ఏమీ లేదమ్మా, నేను కూడా తాగుతాను కదా...” అంటూనే వంటింట్లోకి వెళ్ళి పది నిమిషాల్లో బిస్కట్లు, టీ కప్పులతో తిరిగి వచ్చింది సుగుణమ్మ.

“థాంక్ యు ఆంటీ... మీ దగ్గర నాకు ఇంత ఆదరణ దొరుకుతుంది అని నేను ఊహించలేదు...” అప్రయత్నంగా అనేసింది ఐశ్వర్య...

సుగుణమ్మకు ఒక ఆడపిల్ల నోట ఆ మాటలు చాలా వేదనను కలిగించాయి...

“ఎందుకమ్మా, నువ్వేం తప్పు చేసావని? నీవు ఎన్నుకున్న మార్గంలో నువ్వు ప్రయాణించావు. అది తప్పు ఎలా అవుతుంది? కాకపోతే యుగయుగాలుగా, తరతరాలుగా మన సమాజంలో కొన్ని గీతలూ, రేఖలూ ఉన్నాయి... వాటిని నీవు అతిక్రమించావు అంతే... ఫర్వాలేదు, నమ్మిన సిద్ధాంతం కోసం అలా చేయవచ్చు... కాకపోతే...అతను నీ చేయి విడచి వెళ్లిపోవటమే బాధను కలిగిస్తోంది...” అన్నది సుగుణమ్మ... ఆ మాటలు అన్న తర్వాత తన ఆలోచనా ధోరణి తనకే విచిత్రంగా అనిపించింది ఆవిడకి... భర్త ఉన్న రోజుల్లో ఆయన ఆలోచనలు ఎలా ఉండేవో అలా మాట్లాడింది ఇప్పుడు తాను. అప్పట్లో ఆయన ఇలా మాట్లాడితే తనకూ, వేణుకీ నచ్చేది కాదు... ముఖ్యంగా ఐశ్వర్య విషయంలో... ఆమెతో, మధూ స్నేహం విషయంలో... ఇంత చక్కని అమ్మాయితో స్నేహం చేయకుండా ఎవరుండగలరు?

సుగుణమ్మ మాటలు ఐశ్వర్య మనసుకు ఎంతో సాంత్వనగా అనిపించాయి... తరాల అంతరం ఉన్నా, అన్నపూర్ణ పిన్ని తర్వాత తనను అర్థం చేసుకున్న  మరో మాతృసమానురాలు కనిపించింది ఆమెకు. రెండు చేతులూ జోడించింది మౌనంగా...

“అయ్యో, వద్దమ్మా, నాకంత అర్హత ఉందనుకోను... నీ పర్శనల్ మేటర్ అనుకోకపోతే ఒకటి అడగనా?”

“అడగండి ఆంటీ...”

“నువ్వు పెళ్ళి చేసుకోకూడదా? నీ ఆలోచనలు సిద్ధాంతపరంగా గొప్పవి అవునో కాదో నాకు తెలియదు... కానీ మన సమాజంలో పెళ్ళి చేసుకోకుండా కాపురం చేసే ఆడదానికి గౌరవం లేదమ్మా... నీకు మంచి వాడు భర్తగా లభిస్తాడు... సంబంధం చూడమని మా వేణుకు చెబుతాను...”

ఐశ్వర్య మనసంతా ఒక అవ్యక్తమైన అనుభూతితో నిండిపోయింది... ఇప్పుడిప్పుడే పెళ్ళి మీద సుముఖత కలుగుతోంది... పెళ్ళి కాని యువతి ఒక మగాడితో కాపురం చేసింది, చేస్తోంది అని తెలిసిన తరువాత ఆడవారు కానీ, మగవారు కానీ ఆమెను గౌరవంతో చూడకపోవటం తాను గమనించింది... కార్తీక్ వెళ్ళిపోయిన తరువాత ఒంటరితనం, మానసికంగా సపోర్ట్ లేకపోవటం... ఎంతో దిగులుతో కాలం గడుపుతోంది ఇప్పుడు... అనుకోకుండా అమల కుటుంబానికి దగ్గర అవటం వలన ప్రతీ ఆదివారం బాగానే వాళ్ళతో కాలం గడుస్తోంది... మిగిలిన రోజుల్లో ఆఫీసు పని...ఇంటికి వచ్చాక పిన్నిగారితో కలిసి సంగీత సాధన, పుస్తక పఠనం తో సమయం తెలియటం లేదు...

ఏదో తాను దగ్గరగా చూసిన జీవితాలనుంచి, కలిగిన అనుభవాల నుంచి వైవాహిక జీవితం పట్ల ఒక విరక్తిని, విరుద్ధ భావాన్ని పెంచుకున్నది. అలాంటి వాడే అయిన  కార్తీక్ తారసపడే సరికి, ఇద్దరి మధ్యా ప్రేమ అంకురించబట్టి అతన్ని తన భాగస్వామిగా అంగీకరించింది... లేకపోతే పెళ్ళి కానీ, సహజీవనం కానీ లేకుండా అలాగే ఒంటరిగా మిగిలిపోయి ఉండేదేమో...

“ఏమ్మా? ఏమంటావు?” మళ్ళీ సుగుణమ్మ అడిగిన ప్రశ్నకు ఉలిక్కి పడి ఈ లోకంలోకి వచ్చింది ఐశ్వర్య.

“ఆ...ఆంటీ, అదీ... కార్తీక్ ని కాకుండా వేరే ఎవరినీ నా జీవితంలోకి ఆహ్వానించ లేను ఆంటీ... ఎందుకంటే నేను అతన్నే ప్రేమించాను...మరి ఈ జన్మకు  నా మనసు, తనువూ రెండూ ఎవరినీ అంగీకరించవు” భారంగా చెప్పింది ఐశ్వర్య.

“నిన్ను వదులుకున్న ఆ కార్తీక్ చాలా దురదృష్టవంతుడు తల్లీ... ఒక సారి నాకు కనిపిస్తే... గట్టిగా చెప్పి ఉండేదాన్ని...”

సుగుణమ్మ మాటలకు గట్టిగా నవ్వేసింది ఐశ్వర్య.

“ఇన్నాళ్ళూ మీ దగ్గరకు రాకుండా తప్పు చేసాను ఆంటీ...” అంది...

***

“వెళ్ళి వస్తాను పెద్దమ్మ గారూ... జాగ్రత్తగా సమయానికి ఆహారం తీసుకుంటూ, మందులు అవీ జాగ్రత్తగా వేసుకోండి...” సుందరమ్మ చేయి నిమురుతూ చెప్పింది మధుబాల.

“అబ్బాయి వచ్చాక ఇద్దరూ కలిసి రండమ్మా...” నీరసంగా చెప్పింది సుందరమ్మ.

“నిన్ను చూడటం మొదటిసారే... అయినా ఎంత బాగా కలిసిపోయావు మధూ? చాలా సంతోషంగా ఉంది...” అంది అవంతి ఆత్మీయంగా.
నవ్వుతూ మధుబాలకి బొట్టుపెట్టి, తాంబూలం, పండ్లతో పాటుగా చీరా జాకెట్ ఉన్న కవర్ ఇచ్చింది వినత. మధుబాలకి ఎంతో సంతోషంగా అనిపించింది. వినతను దగ్గరగా తీసుకొని ఆమె నుదుట ముద్దు పెట్టుకుంది మనస్ఫూర్తిగా...

అసలు ఆరోజు ఉదయం లేస్తూనే చెప్పింది మధు అత్తగారితో...

“అత్తయ్యా, నేను ఈరోజు ఓ సారి పెద్దమ్మ గారి దగ్గరకు వెళ్ళి వస్తాను. బాబును చూసుకుంటారా?” అని.

“ఈ రోజా? నువ్వు ఒక్కదానివీ వెళ్ళటం ఎందుకు?”

“లేదులే అత్తయ్యా, రేపటి నుండి మళ్ళీ బిజీ అవుతాను కదా... మీరు ఇప్పుడునాతో  రావటం కష్టం... కాలు నొప్పి అన్నారు కదా, ఇంటిదగ్గరే ఉండి రెస్ట్ తీసుకోండి... పదకొండుకి వెళ్లి మళ్ళీ లంచ్ టైం కల్లా వచ్చేస్తాను...” చెప్పింది మధుబాల.

“సరేనమ్మా...” అయిష్టంగానే అంగీకరించింది సుగుణమ్మ. ఆవిడ భయమంతా కూతురు మళ్ళీ ఏదైనా అని కోడలిని హర్ట్ చేస్తుందేమో అని...

తన టూ వీలర్ మీదనే వెళ్ళింది మధుబాల. గేటు బయట వెహికల్ పార్క్ చేసి, గేటు తెరుచుకుని లోపలికి  అడుగు పెట్టింది. అలికిడి విని ఇంట్లోంచి బయటకు వచ్చిన వినత లోపలికి నడిచి వస్తున్న వదిన గార్ని చూడగానే ఒక్క క్షణం ఉలిక్కిపడింది. అయినా పెదవులపైకి చిరునవ్వును అరువు తెచ్చుకుంటూ, మధుబాలకు ఎదురేగి ఆమె చేయి పట్టుకుంది.

మధుబాలకూ మనసులో బెదురుగా, బెరుకుగానే ఉన్నా, దాన్ని కనబడనీయకుండా, వినతతో, “బాగున్నావా వినతా?” అన్నది.

“బావున్నాను వదినా... రా, లోపలికి...” సౌమ్యంగా పలికి తనతో తీసుకువెళుతున్న వినతను చూసి ఆశ్చర్యాన్ని అణచుకోలేక పోయింది మధుబాల. తనతో పెడసరంగా కాకుండా, సామరస్యంగా మాట్లాడటం, పేరు పెట్టి పిలవకుండా వదినా అని పిలవటం... విచిత్రంగా అనిపించింది.

మధుబాలను అవంతికి పరిచయం చేస్తూ, “మా వదిన మధుబాల వదినా... తను మా వదిన అవంతి. వీళ్ళిద్దరూ పరిమళ, సౌరభ...” అంటూ పిల్లలను కూడా పరిచయం చేసింది వినత.

“నమస్తే అక్కయ్యా, బాగున్నారా?” రెండు చేతులూ జోడించి అవంతికి నమస్కరించి, పిల్లల ఇద్దరి తలలూ నిమిరింది మధుబాల. వాళ్ళిద్దరూ నోటితో నమస్తే చెబుతూనే, చేత్తో  షేక్ హ్యాండ్ ఇచ్చారు.

“పెద్దమ్మ ఎలా ఉన్నారు?”

“రండి, చూద్దాం...” తల్లి గదిలోకి తీసుకు వెళ్ళింది అవంతి.

అడుగుల సవ్వడికి మెలకువ వచ్చిన సుందరమ్మ కనులు తెరిచి మధుబాలను చూసి, గుర్తు పట్టినట్టుగా చిరునవ్వు నవ్వింది. శక్తిని తెచ్చుకుంటూ, మెల్లగా  అందరి క్షేమ సమాచారాలు అడిగింది.

కొద్దికాలం తాను భర్తతో లేదు... ఆ విషయం తెలిసినా ఏమీ అడగని ఆవిడ సంస్కారానికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంది మధుబాల.

కాసేపు అవీ ఇవీ మాట్లాడి వచ్చేద్దామని అనుకుంది కానీ, భోజనం చేసి వెళ్ళమని సుందరమ్మ చెప్పింది. అవంతీ, పిల్లలూ కూడా బలవంతం చేయటం తో ఉండిపోక తప్పలేదు. వినత చిరునవ్వుతో పలకరించినా, భయం భయంగా మధుబాలకు దూరంగానే ఉంటోంది... ఆమె మానసిక స్థితి అర్థమైన మధుబాలకి ఎంతో జాలిగా అనిపించింది. ఈర్ష్యాసూయలు ఎంత వినాశకరమైనవో ఈమెకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంది మనసులో. వినతలో వచ్చిన ఈ సానుకూల మార్పు ఎంతో సంతోషం కలిగించింది మధుబాలకు.

పవన్ జాడ కనబడక అడిగితే, బంధువులింట్లో ఫంక్షన్ ఏదో ఉంటే వెళ్ళాడని తెలిసింది. భోజనాలు అయ్యాక వెంటనే వచ్చేస్తే బాగుండదని పిల్లలతో కబుర్లు చెబుతూ కూర్చుని, బయలుదేరే ముందు సుందరమ్మ దగ్గరకు వెళ్లి చెప్పింది తను వెళుతున్నట్టుగా...

వినత బొట్టుపెట్టి, చీర పెడితే కాదనలేకపోయింది... మధుబాల మనసులో అప్పటివరకూ ఉన్న దిగులు మేఘాలు తొలగిపోయినట్టు అయింది... తేలిక పడిన మనసుతో ఇంటికి బయలుదేరింది. బయలుదేరే ముందు అందరినీ తమ ఇంటికి ఆహ్వానించటం మరచిపోలేదు, మధుబాల.

***

 

 

 

 

 

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam