Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

 

గతసంచికలో ఏం జరిగిందంటే http://www.gotelugu.com/issue187/536/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

( గతసంచిక తరువాయి) ‘‘ఘోరం జరిగి పోయిందమ్మా!’’ అంటూ భూతం ఘృతాచి జరిగింది వివరించ గానే కోపోద్రేకంతో అగ్నిశిఖలా మండి పడింది.

‘‘కుత్సితులు... సిగ్గు ఎగ్గు లేని జడలు, పిరికిపందలు. మోసం చేసి ఎంత దూరము గొని పో గలరు. అసలు ఉలూచీశ్వరి బయటి కెందు కెళ్ళినది?’’

వెంటనే నిద్ర మత్తు వదిలేలా నీటిని పుక్కిలించి ముఖ ప్రక్షాళన గావిస్తూ అడిగింది భద్రా దేవి. ఘృతాచి తను చూసింది వివరించింది` ‘‘ధనుంజయుల వారి గొంతు అనుకరించినట్లున్నారమ్మా! ప్రాణ సఖా... ధనుంజయా... ఇదో వచ్చుచుంటి’’ అని అరవటం వినిపించినది’’ అంది.

ఏమి జరిగి వుంటుందో వూహించింది భద్రా దేవి. ఏమైనప్పటికీ ఇలా జరిగి వుండ కూడదు. తమ మనోహరుడు తిరిగి వస్తే ఏమి బదులు చెప్ప వలె? ‘‘వద... ఆ నీచులను విడిచి పెట్ట’’ అని తర్కించుకొంటూనే ముడి జారకుండా కేశాలను బంధించి పోరుకు అనుకూమైన దుస్తుల్ని ధరించి ఒరతో సహా ఖడ్గాన్ని నడుంకి బిగించింది. తన మచ్చల గుర్రానికి జీను బిగించి పక్కన అడ్డంగా రెండు బరిసెలు, రెండు ఈటెలను కట్టింది.

‘‘ఘృతాచి! మన ధనము, దుస్తులు, ఇతర సామాగ్రి సహా సంచులన్నీ ఇచటనే వున్నవి. జాగ్రత్త! ఇచటనే వుండుము. యువ రాజా వారు వచ్చిన జరిగినది మనవి చేయుము. నేను పోయి ఉలూచీశ్వరిని విడిపించి తెచ్చెదను’’ అంటూ హెచ్చరించి చెంగున ఎగిరి జీను మీద కూచుంది.

‘‘నాగ దండు ఎటు పయనించిందీ గమనించితివా?’’ కళ్ళాలు అందుకుని అశ్వాన్ని అదిలిస్తూ అడిగింది.

‘‘వాళ్ళు శివ నాగ పురం మీదుగా అంగ రాజ్యం వైపు పోతున్నారమ్మా’’ అంది భూతం ఘృతాచి.

క్షణం కూడ ఆలస్యం చేయకుండా అశ్వాన్ని దూకించింది భద్రా దేవి. మండపం దిగి కాలి బాటన గుట్ట దిగిన అశ్వం ఢాకిని చిట్టడవిలో కాలు మోపగానే శర వేగంతో పరుగు ఆరంభించింది. భద్రా దేవి వీరావేశంతో అశ్వాన్ని దౌడు తీయిస్తూ శివ నాగ పురం దాట గానే నాగ దండును అన్వేషిస్తూ సుడి గాలి వేగంతో దూసుకు పోసాగింది.

ఈ లోపల`

సరిగ్గా భద్రా దేవి వెళ్ళిన కొద్ది సేపటికే పాతాళ లోకం నుండి ధనుంజయుని తెచ్చిన యక్షుడు రుచికుడు శివాలయ మండపంలో ప్రత్యక్షమై ధనుంజయుని క్రిందికి దించాడు. ధనుంజయుని చూడ గానే భూతం ఘృతాచికి దుఖ్ఖం ఆగ లేదు. బోరున ఏడ్చేసింది. చూస్తే అక్కడ భద్రా దేవి లేదు, ఉలూచీశ్వరీ లేదు. తన అశ్వం గురుడ మాత్రం వుంది. యజమానిని చూడగానే అది ఆనందంతో పెద్దగా సకిలించి చిందులేసింది.
పరిస్థితి చూడగానే`

ఏదో విపరీతం జరిగిందని`

ధనుంజయునికి అర్థమై పోయింది.

‘‘ఘృతాచి! ఏమి జరిగినది?’’ అడిగాడు.

‘‘ఏమి చెప్పను ప్రభూ! ఆ నాగ లోక వాసులు మోసము జేసినారు.’’ అంటూ దుఖ్ఖం ఆపుకుని జరిగినది చక చకా వివరించినది.

‘‘మిత్రమా! వాళ్ళు ఎంత దూరము పోగలరు. నిన్ను అచటికే గోని పోయేదె రమ్ము!’’ అన్నాడు అంతా వింటున్న రుచికుడు.

‘‘లేదు మిత్రమా! ఇప్పటికే నీకు కడు శ్రమ యిచ్చితి. భద్రా దేవికి సాయముగా నేను వెడుచున్నాను. వాళ్ళు ఉలూచీశ్వరిని నాగ లోకమునకు తీసుకు పోలేరు. ప్రతీకారము తప్పదు. ఆ వక్ర దంతునికి తగిన బుద్ధి చెప్ప వలె’’ అన్నాడు ధనుంజయుడు.

‘‘సరి. నీవు రమ్ము. పోరాటమున నేను కల్పించుకోను గాక. కాని అదృశ్యమున ఆ పోరాటము జూడ నిచ్చగలుగుచున్నది. అనుమతినిమ్ము’’ అడిగాడు రుచికుడు.

‘‘నీ ఇచ్చను కాదందునా మిత్రమా! బయలుదేరుము. వెనకే వచ్చుచున్నాను.’’ అని ధనుంజయుడు చెప్పగానే వెంటనే అదృశ్యమయ్యాడు రుచికుడు.

ధనుంజయుడు క్షణం కూడ ఆస్యం చేయ లేదు. నాలుగు దినములుగా వేసుకున్న దుస్తులే వంటి మీద ఉన్నాయి. అయినా దుస్తులు మార్చుకో లేదు. అక్కడ భద్రా దేవి ఒక్కతే అంత మంది నాగులతో పోరాడుతోంది. పరిస్థితి ఏమిటో తెలీదు. ఉలూచీశ్వరి ఎలా వుందో తెలీదు. ప్రత్యర్థుల మీద పగతో అతడి గుండె భగ్గున మండుతోంది. ముఖ్యంగా వక్ర దంతుడి మీద.

తన ఆయుధాలు అందుకున్నాడు.

కృపాణం ఒరతో సహా నడుంకి బిగించాడు. తన ధనుస్సు అందుకుని అల్లె తాడు బిగించి కట్టాడు. అంబుల పొది వీపున కట్టుకున్నాడు. ఆశ్వం గరుడను బుజ్జగించి, దాని వీపున జీను వేసి బిగించాడు. ఈటె, బరిసెను అటు యిటు అడ్డంగా కట్టాడు. ఓ పక్కన చకచకా సిద్ధమవుతూనే ఘృతాచిని తరచి తరచి అడిగి జరిగిన వివరాలు తెలుసుకున్నాడు. అశ్వాన్ని అధిరోహించే ముందు ఓసారి ఆ సదాశివుని, వేణు గోపాలుని మనసున స్మరించి, ఘృతాచిని అక్కడే వుండమని ఆదేశించి చెంగున అశ్వాన్నధిరోహించి కళ్ళాలు అందుకున్నాడు. కొండ గుట్ట దిగుతూనే అశ్వాన్ని సమరోత్సాహంతో శర వేగంగా పరుగెత్తించాడు. అప్పటికి తెల్లవారడానికి అర్ధ జాము కూడ సమయం లేదు. అప్పుడిప్పుడే తూర్పు గగనం తెల్లబడుతోంది. శివ నాగ పురం దాటగానే గాలితో పోటీ పడుతూ మహా పధంలో దూసుకు పోనారంభించింది అశ్వం గరుడ.

*********************************************

వక్రదంతుడికి ఇప్పుడు చాలా సంతోషంగా వుంది. ఉలూచీశ్వరి చిక్కటం తన అదృష్టంగా భావిస్తున్నాడు. ఆమెను నాగ లోకం చేర్చగానే ప్రభువు నాగరేడు వద్ద తన ప్రతిష్ట ఇనుమడిస్తుంది. వెంటనే ఉలూచీశ్వరితో తన వివాహం జరిగి పోతుంది. పాతాళ లోకము నుండి ధనుంజయుడు తిరిగి వచ్చుట కల్ల. అచటి చట్టములు, శాసనములు తనకు తెలుసు. అక్రమంగా తన పాతాళ లోకంలో అడుగిడిన ఎవరినీ బలి చక్రర్తి క్షమించడు. కాబట్టి ధనుంజయునికి అచట చెర వాసము తప్పదు. అతడు భూలోకము చేరుట అసంభవం.
ఇక భద్రా దేవి`

పాపం ఆ సౌందర్య వతి జంట బాసిన ఒంటరి అయినది. ధనుంజయుడు లేకున్న ఆ పడతికి నాగ లోకముతో పని లేదు. ఒక వేళ ఉలూచీశ్వరి కోసం రావాలనుకున్ననూ ఆమెకు నాగ లోకమునకు మార్గము గాని, ప్రవేశము గాని తెలీదు. ఉలూచీశ్వరి అదృశ్యమైన సంగతి ఉదయము నిద్ర లేచాక గాని ఆమెకు తెలీదు. అప్పటికి తాము చాలా దూరము వెళ్ళి పోతారు. అశ్వికులు పగటి వేళ గరుడ పక్షులు తమ మీద దాటి చేయకుండా బాణము ఎక్కు పెట్టి ఉంటారు గాబట్టి వాటిని తరిమి తాము నిరాటంకంగా ప్రయాణం చేస్తూ అంగరాజ్య సరి హద్దుకు వెళ్ళి పోగలరు. కాబట్టి ఏకాకి అయిన భద్రా దేవి దుఖ్ఖమున కృంగి నిరాశతో స్వస్థమునకు మరలి పోక తప్పదు. ఇక తను నాగ రాజునకు అల్లుడగుటకు మార్గము సుగమమైనట్టే... అందుకే ఆనందంతో అశ్వాన్ని ఉత్సాహంగా దౌడు తీయిస్తున్నాడు వక్రదంతుడు.
నాగ దండుకి అగ్ర భాగంలో వక్ర దంతుడు, మాయా శృంగుడి అశ్వాలు ముందుగా దౌడు తీస్తున్నాయి. ఆ వెనకే రెండు వరుసల్లో పాతిక అశ్వాల మీద నాగ దండు అశ్వికులు, వాటి వెనక వస్తోంది నల్లటి రథము. ఆ రథములో తెలివి తప్పి పడున్నది యువ రాణి ఉలూచీశ్వరి. ఆ రథం వెనక మరో పాతిక అశ్వాల మీద రెండు వరుసల్లో రథమునకు రక్షణగా వస్తోంది నాగ దండు. వాళ్ళంతా మహా పథంలో మహా ఆర్భాటంగా అమిత వేగంగా ప్రయాణం చేస్తున్నారు.

అవి వస్తున్న వేగం చూసి`

తెల్ల వారు జామునే ప్రయాణం సాగిస్తున్న బాట సారులు భయంతో పక్కకు పరుగు తీసి దారి వదులుతున్నారు. బాట మీదకు వస్తున్న అడవి మృగాలు కూడ భయంతో కకా వికలై లోతట్టు అరణ్యం వైపు పారి పో సాగాయి. ఇదే సమయంలో తమ వెనకే భద్రా దేవి ఉగ్ర రూపంతో తన అశ్వం మీద దూసుకొస్తోందని నాగ దండుకు తెలీదు.

శివ నాగ పురం నుండి సుమారు అయిదు యోజనాల దూరం వెళ్ళాక గాని ఎగువన సాగి పోతున్న నాగ దండు భద్రా దేవి కంట బడ లేదు.
అప్పటికి తెలతెలవారుతోంది.

అశ్వాలు పరుగెడుతున్న వేగానికి వాటి గిట్టల చప్పుడుతో అటవీ ప్రాంతం మారుమ్రోగుతోంది. సుడి గాలిలా పైకి లేస్తోంది ధూళి. నాగ దండు కంట పడ గానే మరింత వేగంగా దూసుకు పో సాగింది భద్రా దేవి. అంతలో`

తమ వెనకే వచ్చి పడుతున్న భద్రా దేవిని చిట్ట చివరి అశ్వికుడొకడు గమనించి, అదిరి పడుతూ` ‘‘వచ్చేస్తున్నది! ఆ భద్రా దేవి వచ్చేస్తున్నది.’’ అనరిచాడు. అయితే గుర్రాల గిట్టల శబ్ధం హోరులో వాడి అరుపు సమీపంలో వాళ్ళకే విన్పించాయి. చిన్న పాటి కలకలం రేగింది. అదేమిటో అర్థం గాక తిరిగి చూసిన వక్రదంతుడికి అప్పుడు కన్పించింది భద్రా దేవి. ఖడ్గం దూసి వీరావేశంతో వచ్చేస్తోందామె. ఇప్పుడో కాసేపటికో తమను చేరుకునే అవకాశం వుంది. ఆమెను చూసిన కంగారులో కళవళపడిపోయాడు. తన అంచనా తారుమారైంది. భూతం ఘృతాచి సంగతి తను మర్చి పోయిన సంగతి అప్పటిగ్గాని గుర్తు రాలేదు.

‘‘మాయా శృంగా! ఏమిరా యిటుల జరిగినది? నీవే ఏదో ఒకటి జేసి ఆమెను ఆప వలె. లేకున్న పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరు చందమగును.’’ అన్నాడు.

‘‘ఇంకనూ ఏమి చేయునది? ఆమె మహా మంత్రగత్తె యని మరచితివా? సాధారణ యువతియా ఏదో ఒకటి చేయుటకు. ఆమె చూస్తూండగా మన మాయ లేవీ పని చేయవు. రానిమ్ము! ఆమె ఒంటరిది. మనం ఇంత మంది ఉంటిమి. పోరాడి మూకుమ్మడిగా దాడి నెరపి ఆమెను అంతం చేయటే మార్గము. సాధ్యమైనంత వరకు ముందుకే సాగి పోవుదము.’’ అంటూ సలహా యిచ్చాడు మాయా శృంగుడు. అశ్వాల వేగాన్ని మరింత పెంచింది నాగదండు.

భూకంపం వచ్చినట్టు అశ్వాల వేగానికి నే అదురుతోంది. ఇంత జరుగుతున్నా రథం లోని ఉలూచీశ్వరికి ఏమీ తెలీదు. వాళ్ళు తనను గమనించారని గ్రహించ గానే తన మచ్చల గుర్రాన్ని మరింత అదిలించింది భద్రా దేవి.

ఇంతలో నాగదండుకి ఎగువన`

మహా పథానికి ఇరువంకలా వున్న మహా వృక్షాలు రెంటిలో ఒకటి ఫెళ ఫెళార్భాటాలతో భయంకర శబ్ధం చేస్తూ వ్రేళ్ళతో సహా లేచి బాటకు అడ్డంగా కూలి పోయింది. దాని వెనకే రెండో పక్క వృక్ష రాజం కూడ అదే విధంగా కూలి మహా పథ మార్గాన్ని మూసేసాయి. అది చూసి నాగ దండు అదిరి పడింది. వక్ర దంతుడికి నోట మాట రాలేదు.

ఎక్కడా గాలి విసురు గాని సుడి గాలి జాడ గాని లేదు. ఉన్నట్టుండి ఆ మహా వృక్షాలు ఎలా కూలి పోయాయో అర్థం కాలేదు గాని, వాటిని తప్పించుకుని ముందుకు పోయే అవకాశం తమకు లేదు. ఎందుకంటే అది చాలా దట్టమైన అటవీ ప్రాంతం. ఏం చేయాలో అర్థం గాక అగ్ర భాగాన ఉన్న వక్ర దంతుడు మాయా శృంగుడు కూడ అశ్వాల వేగాన్ని తగ్గించారు. నాగ దండు వేగం ఎప్పుడైతే మందగించిందో భద్రా దేవి వాళ్ళకి మరింత చేరువ కాసాగింది.

నిజానికి ఆ వృక్షాలను కూల్చి నాగ దండును ముందుకు పోకుండా నిరోధించింది యక్షుడు రుచికుడు. అప్పటికే చాలా దూరం నుంచి అదృశ్య రూపంలో గాలిలో తేలుతూ వాళ్ళని అనుసరించి వస్తున్నాడు. పాతాళ లోకం నుంచి వస్తూండగా ధనుంజయుడు భద్రాదేవి, ఉలూచీశ్వరి గురించి క్లుప్తంగా చెప్పగా విన్నాడు. ఇప్పుడు మార్గంలో నాగదండును కసిగా వెంబడిస్తున్న భద్రా దేవిని చూసాడు. చూస్తూంటే సూర్యోదయమైన చాలా సేపటి వరకూ నాగదండు భద్రా దేవికి చిక్కేట్టు లేదు. తను పోరాటంలో పాల్గొననని మాటిచ్చాడు గాని సాయం చేయనని మాటివ్వ లేదుగా. అందుకే మహా వృక్షాలను నేల కూల్చి నాగ దండు పారి పోకుండా నిలువరించేసాడు. అసలు ధనుంజయుడు కోర లేదు గాని కోరితే తనే రథం లోని ఉలూచీశ్వరిని తిరిగి మండపానికి చేర్చి వుండే వాడు. కాని ధనుంజయుడు కోర లేదు. ఆ నిజాయితీయే ధనుంజయునితో స్నేహ బంధాన్ని మరింత పెంచింది. పగ ప్రతీకారాలు తమవి గాబట్టి ఉలూచీశ్వరిని విడిపించే బాధ్యత తమదే అనుకున్నాడు . ధనుంజయుడు. కాని ఇక్కడ వక్ర దంతుడి బృందం తన మంత్ర శక్తితో భద్రా దేవే ఆ వృక్షాలను కూల్చి వుంటుందనుకుంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulitabhandham