Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

 గతసంచికలో ఏం జరిగిందంటే .http://www.gotelugu.com/issue186/535/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

( గతసంచిక తరువాయి) 

చిత్రికతో సహా అచటి కావలి భటులు బంధీలు హాహాకారాలు చేస్తూ దూరంగా పరుగులెత్తారు. భయ భ్రాంతులై చూడ సాగారు. కొండలా పెంచిన తన భారీ శరీరంతో కారాగారపు దృఢమైన రాతి కట్టడాన్ని కాళ్ళతో తన్ని చేతులతో పెకలించి కూల్చేసాడు రుచికుడు. చూస్తుండ గానే కట్టడం మొత్తం రాళ్ళ కుప్పగా మారి తగలబడి పోసాగింది.

రాక్షస కన్య చిత్రిక వూహించని పరిణామం యిది. ఆమె కళ్ళలో కన్నీరు కాదు, నెత్తురు ప్రవహిస్తోంది. ఇంత ఘోరం జరుగుతుందని ఏమాత్రం తెలిసినా నరుడని చులకనగా చూసి ధనుంజయుని పట్ల అలా అనుచితంగా ప్రవర్తించేది కాదేమో.

పని పూర్తి కాగానే తన శరీరాన్ని సాధారణ స్థితికి తగ్గించు కుంటూ ధనుంజయుని ముందుకొచ్చాడు రుచికుడు. ‘మిత్రమా! ఈ పాతాళ వాసులు నీకు నెరపిన అపరాధముకు ఈ శిక్ష చాలనుకొందును. ఇక రమ్ము. తృటిలో భూ లోకమున నీవు కోరిన చోటుకి నిను చేర్చగలను’’ అంటూ ధనుంజయుని ఎత్తి తన భుజాల మీద కూచోబెట్టుకున్నాడు. ధనుంజయుని కళ్ళ ముందు యువ రాణి మణి మేఖల మెదిలింది. ఒక సారి ఆమెను చూడాలనుకున్నా వెంటనే ఆ  ఉద్దేశాన్ని విరమించుకున్నాడు. రుచికుడు ధనుంజయునితో సహా గాల్లోకి ఎగిరాడు. అంతే` అంతా చూస్తూండ గానే  క్షణంలో అదృశ్య మయ్యాడు.

ఈ సంఘటన జరుగుతున్న సమయానికి అక్కడ తన రాజ సభలో బలి చక్రవర్తి కొలువు తీరి వున్నాడు. ధ్వంసమైన కారాగారం నుండి పరుగులెత్తుకొచ్చిన కావలి భటులైన రాక్షసులు సరాసరి సభ లోకి దూసుకొచ్చేసారు. వస్తూనే` ‘‘ప్రభూ... ఘోరం... విపరీతం జరిగి పోయినది’’ అనరిచారు.

వంటినిండా గాయాలతో తన ముందు కొచ్చిన కారాగార కావలి భటుల్ని చూడగానే ఆశ్చర్య పడుతూ చట్టున సింహాసనం నుండి లేచి తన గదాయుధాన్ని భుజాన వేసుకుంటూ ఉగ్రుడై చూసాడు బలి చక్రవర్తి.

‘‘ఏమిరా... ఎవరు మిమ్ము తరుముకొచ్చినది? మీపై దాడికి తెగ బడిన ధూర్తు లెవరు?’’ అంటూ హుంకరించాడు.

‘‘ఎవరూ దాడి చేయ లేదు. తరుమనూ లేదు ప్రభూ.’’ అంటూ ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం గాక తలలు వంచు కున్నారు భటులు.

‘‘ఏమీ జరుగ కుండా మీకీ గాయములు ఎటు ఏర్పడినవి? ఎందుకు పారి వచ్చితిరి?’’ గద్దించాడు.

‘‘క్షమించాలి ప్రభూ. యక్షుడు రుచికుడు వచ్చి ఆ మానవ వీరుడు ధనుంజయుని బంధీని చేసినందుకు అగ్రహోదగ్ధుడై అందర్నీ బయటకు తరిమి మన కారాగార కట్టడ సముదాయం మొత్తం ధ్వంస మొనర్చి రాళ్ళ కుప్పల జేసి తగుల బెట్టినాడు. పిమ్మట బంధనాలు తొలగించి ధనుంజయుని భుజాల మీద కూచో బెట్టుకొని భూలోకం గొని పోయాడు’’ అంటూ తడ బడుతూ వివరించాడు ఒక భటుడు.
ఇది జరుగుతున్న సమయంలో యువ రాణి మణి మేఖల రాణి వాసపు స్త్రీల నడుమ పైన పరదాల వెనకనే వుంది. భటులు తెచ్చిన వర్తమానం వింటూనే ఖిన్నురాలయింది. ధనుంజయుడు భూ లోకం వెళ్ళి పోయాడని తెలీగానే సర్వం పోగొట్టుకున్నట్టు బాధా తప్త హృదయంతో దుఖ్ఖం అతి శయింపగా ‘‘హాఁ.. ప్రియ సఖా! నను వదిలి పోతివా’’ అంటూ ఒక్క సారిగా తెలివి తప్పి ఆ సుకుమారి సొమ్మసిల్లి పోయింది. దాంతో ఏం జరిగిందీ అర్థం గాక రాణి వాసపు  స్త్రీలంతా మణి మేఖలను చుట్టు ముట్టేసారు. అనూహ్యంగా గందర గోళ పరిస్థితి ఏర్పడిందక్కడ. ఈ విషయం సభ లోని బలి చక్రవర్తికి తెలీదు. భటులు తెచ్చిన వర్తమానం విని విభ్రాంతి చెందాడు.

‘‘ఏమిరా! మతి చెడినదా? పొరబడితిరా? రుచికుడేమి వచ్చుటేమి? అతగాడు శాప వశాన అగ్ని సర్పముగా మారి నాగ లోకమున భృత్యుడిగా పడి వున్నటుల వింటిమి!’’ అని గద్దించాడు.

అంత వరకూ మౌనంగా వున్న రాక్షస గురువు శుక్రా చార్యుల వారు అప్పుడు కల్పించు కొంటూ` ‘‘మహా బలి! అదంతయును గతము. ఈ ధనుంజయుని మూలమున శాప విముక్తి పొందిన రుచికుడు ధనుంజయుని మిత్రుడైనాడు’’ అన్నాడు.

‘‘అవును ప్రభూ. మిత్రమా రుచికా అంటూ పిలవ గానే రుచికుడు ధనుంజయుని ఎదుట ప్రత్యక్షమైనాడు. అసలీ అనర్థమునకు కారకురాలు మా అధికారిణి చిత్రిక’’ అన్నాడొక భటుడు.

‘‘చిత్రిక... ఏమి జేసినది?’’ నమ్మ లేనట్టు ప్రశ్నించాడు బలి.

‘‘ఆమె ఆ మానవుని మోహించి అనుచితముగా ప్రవర్తించినది. అతడు తిరస్కరించ గానే అగ్రహించి అతడ్ని జంపి నర మాంస భక్షణ చేయనెంచి కత్తి దూసినది...’’ అంటూ చెరసాలలో చూసింది చూసినట్టు, జరిగింది జరిగినట్టు విశదీకరించాడా భటుడు.
ఆగ్రహోదగ్ధుడవుతున్న బలి చక్రవర్తిని శుక్రాచార్యుడు శాంతింప జేస్తూ` ‘‘ప్రభూ! తమకు తెలీదు. యువ రాణి ఆ నరుని వలచి వలపించు కోగా లేనిది చిత్రిక అతడి పట్ల మోహితురాలయి అనుచితంగా ప్రవర్తించుటలో వింత యేమున్నది? ఈ విషయమును పక్కన బెట్టి ఒక పరి తమ గారాల దత్త పుత్రిక యువ రాణి మణి మేఖల గురించి ఆలోచించండి. ధనుంజయుడు భూ లోకానికి వెళ్ళి పోయాడని తెలీగానే ఆ బాలిక సొమ్మసిల్లినటున్నది. పోయి విచారించిన ఆమెయే చెప్ప గలదు’’ అంటూ సలహా యిచ్చాడు.

ఇది బలికి సరి కొత్త విషయము.

మణి మేఖల ధనుంజయుని వలచినదా!

నమ్మ లేక పోతున్నాడు. వెంటనే` ‘‘గురు దేవా! మీరును నాతో రావలె’’ అని కోరుతూ వెంటనే సభ చాలించి పెద్ద పెద్ద అంగలతో మణి మేఖల వద్దకు బయలు దేరాడు. ఆయన వెంట శుక్రా చార్యులూ బయలు దేరారు.

***************************

శివాలయ మండపం.

నాలుగో రోజు రాత్రి సమయం.

భద్రా దేవి, ఉలూచీశ్వరిలు`

గాఢ నిద్రలో వున్నారు.

రెండు దినాలు కుంభ వృష్టిగా కురిసిన వర్షం నిలిచినా మూడో దినము ఉదయానికి గాని వాగులు వంకలు నీరు తీసి యథా స్థితికి రాలేదు. చిట్టడివిలో నీరు ఇంకి దట్టంగా పచ్చిక మొలవ నారంభించింది. ఈలోపల ధనుంజయుని అశ్వం గరుడ ఉలూచీశ్వరికి బాగా మచ్చిక అయింది.
మూడో రోజు ఉదయం తన మచ్చల గుర్రం ఢాకిని మీద భద్రా దేవి, దనుంజయుని అశ్వం మీద ఉలూచీశ్వరి బయలు దేరి కొండ దిగారు. భద్రా దేవి చెంత ఉండగా గరుడ పక్షులు దాడి చేస్తాయని భయం లేదు. అలాగే బహిరంగంగా పగటి వేళ నాగ దండు వస్తే గరుడ పక్షులు దాడి చేసి వేటాడేస్తాయి గాబట్టి వాళ్ళు రారు. ఆ భయం లేదు.

పడతలిరువురూ అశ్వాలమీద కొండ వాగు వరకు వెళ్ళి కాల కృత్యాలు తీర్చుకున్నారు. స్నానాదికాలు చేసి పొడి దుస్తులు ధరించి తడి దుస్తుల్ని పిండి అవి ఆరే వరకు అక్కడ వున్నారు. తర్వాత తిరిగి ఆలయ మండపానికి వచ్చేసారు. దైవ సన్నిధిలో వారికి ఏ లోటు లేదు. ధనుంజయుని రాక కోసం క్షణమొక యుగంగా ఎదురు చూస్తూ ఆ సదా శివుని, వేణు మాధవుని ప్రార్థిస్తూ నిష్టగా ధ్యానించసాగారు. ఈలోపల`

వాన నిలిచి పోయింది గాబట్టి`

మూడో రోజు రాత్రే వక్ర దంతుడి బృందం ఉలూచీశ్వరిని అపహరించేందుకు అర్ధ రాత్రి దాటాక కొండ గుట్ట ఎక్కింది. కాని మండపంలో అడుగు పెట్ట లేక పోయారు. అదృశ్య రూపం లోని శివ గణాలు వాళ్ళని కొండ గుట్ట దిగువకు తరిమి కొట్టాయి. ఈ విషయం భద్రా దేవికి గాని, ఉలూచీశ్వరికి గాని తెలీదు.

వెనక్కి వచ్చిన వక్ర దంతుడు ఇక ఆ రాత్రికి ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. నాలుగో రోజు రాత్రికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు.
తాము మండపంలో అడుగు పెట్ట లేరు గాబట్టి యువరాణి ఉలూచీశ్వరినే బయటకు రప్పించటం ఒక్కటే మార్గం. అందుకు తగిన ఎత్తుగడతో నాలుగో రోజున అర్ధ రాత్రి దాటాక చిట్టడివి గుండా కొండ గుట్ట దిగువకు చేరుకున్నారు. చీకట్లో చీకటిగా కలిసి పోతూ నల్లటి అశ్వాలు పూన్చిన నల్లటి రధము, నల్లటి అశ్వాల మీద నాగ దండు చీకట్లో చడీ చప్పుడు లేకుండా వచ్చారు. అర్ధ రాత్రి తర్వాత రావటం చేత వాళ్ళ గురించి భద్రా దేవికి గాని, ఉలూచీశ్వరికి గాని తెలీదు. ఇక భూతం ఘృతాచిది మొద్దు నిద్ర. దానికీ తెలీదు. అందరినీ గుట్ట దిగువనే వుంచి వక్రదంతుడు, మాయా శృంగుడు ఇరువురూ సర్ప రూపాలతో కొండ గుట్ట పైకి ప్రాకుతూ వెళ్ళారు.

అప్పటికి తెల్లవారు జాము ఆరంభమైంది.

భద్రా దేవి ఉలూచీశ్వరిలు గాఢ నిద్రలో వున్నారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ధనుంజయుని గొంతు తనను పిలిచే సరికి ఉలికి పడి కళ్ళు తెరిచింది ఉలూచీశ్వరి.

‘‘హాఁ..! ప్రియ సఖీ ఉలూచీశ్వరీ. ఎక్కడున్నావ్‌ దేవీ. త్వరగా రమ్ము. గాయాల బాధతో గుట్ట ఎక్క లేకున్నాను. బిరాన వచ్చి చేయి అందించవా. రా మనోహరీ... త్వరితముగ వచ్చి నను కాపాడుము.’’ అంటూ ధనుంజయుని గొంతు నిద్ర లోకి విన్పించింది, నిద్ర లేచాకా విన వచ్చింది.

మొదట ఉలూచీశ్వరి కేమీ అర్థం కాలేదు. కాని ఆ గొంతు తన మనోహరునిదే. సందేహం లేదు. ఏమైనది? తను పాతాళ లోకం నుండి వచ్చినారా? అతడు వచ్చాడన్న ఆనందంతో ఆమె ఉక్కిరి బిక్కిరవుతూ దుస్తులు సరి చేసుకుంది. నిడుపాటి తన కురులను లాగి ముడి వేసుకుంది. ప్రియుని చూడాలన్న ఆత్రంలో పక్కనే నిద్రిస్తున్న భద్రా దేవిని లేపాలన్న ఆలోచన కూడ రాలేదు. వేగంగా మండపం దిగి ఆ చీకట్ల లోనే గోపుర ద్వారం గుండా కొండ వంచకు పరుగెత్తింది.

నిజానికి అది శత్రువు పన్నాగమని ఆ క్షణంలో గ్రహించ లేక పోయింది ఉలూచీశ్వరి. మాయా శృంగుడు గుట్ట వంచన కూచుని ఉలూచీశ్వరి కర్ణ పుటాలకు మాత్రం చేరేట్టు ధనుంజయుని గొంతును అనుకరించి పిలిచాడు. అతడి తంత్రం ఫలించింది. కావలి వున్న శివ గణాలు బయటి కొస్తున్న ఉలూచీశ్వరిని ఆప లేదు.

‘‘ప్రాణ సఖా ధనుంజయా. ఇదో వచ్చు చుంటిని’’ అనరిచింది.

గుట్ట వంచ కొచ్చి కళ్ళు చికిలించి ధనుంజయుని కోసం గాలిస్తున్న ఉలూచీశ్వరి ముందు మాయా శృంగుడు ప్రత్యక్షమయ్యాడు. చేతిని ఆమె ముఖం మీద ఆడించాడు. అంతే`

ఏం జరుగు తుందో అర్థమయ్యే లోపే`

తృటిలో తెలివి తప్పింది ఉలూచీశ్వరి.

వెనకే వచ్చిన వక్ర దంతుడు ఆమెను లాగి భుజాన వేసుకున్నాడు. తక్షణమే గాల్లో ఎగురుతూ ఉలూచీశ్వరిని గుట్ట దిగువకు తీసుకు పోయారు. నిజానికి ఇది శత్రువు పన్నాగమని ఉలూచీశ్వరి ఏమాత్రం ముందుగా వూహించినా తన నాగ శక్తితో మాయా శృంగుడి ప్రయత్నాన్ని భంగ పరిచి వాళ్ళ భరతం పట్టి వుండేది. వెంటనే భద్రా దేవిని పిలిచి ఉండేది. చాలా వేగంగా జరిగి పోయిన ఆ సంఘటనలో ఆమెకా అవకాశమే లేకుండా పోయింది.

ఇక్కడో మరో విశేషం ఏమంటే` భూతం ఘృతాచికి ఎందుకో మెలకువ వచ్చే సరికి ఉలూచీశ్వరి లేచి బయటకు పోతూండటం కన్పించింది. ఎందుకు వెళుతుందో అర్థం గాక వెనకే తనూ బయట కొచ్చింది. కాని అప్పటికే వాళ్ళు      ఉలూచీశ్వరిని గుట్ట దిగువకు తీసుకు పోతూ కన్పించారు. గాల్లో ఎగురుతూ తనూ గుట్ట దిగిన ఘృతాచికి అక్కడ నల్లటి రథము, అనేక మంది నాగ దండు అశ్వికులు కన్పించారు. ఉలూచీశ్వరిని రథంలో పడుండ జేసి అశ్వాలను అదిలించారు. వాళ్ళంతా వెళ్లి పోతున్నారు. వాళ్ళు చాలా మంది వున్నారు. తను వాళ్ళని ఆపటం సాధ్యం కాదనిపించింది. చూస్తూండ గానే అశ్వాలు చాలా దూరం వెళ్ళి పోయాయి.

నాగ దండును కొంత దూరం వరకు అనుసరించిన ఘృతాచి, యువ రాణిని కాపాడటం తన ఒక్క దాని వలన జరిగే పని కాదని గ్రహించింది. దాంతో వెళ్ళినంత వేగం గానూ మండపానికి తిరిగి వచ్చి భద్రా దేవి ని నిద్ర లేపింది.

భద్రా దేవికి నిద్ర మత్తులో`

మొదట ఏమీ అర్థం కాలేదు.

చూస్తే పక్కన ఉలూచీశ్వరి లేదు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulitabandham