Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే.....http://www.gotelugu.com/issue189/543/telugu-serials/atulitabandham/atulita-bandham/

 

( గతసంచిక తరువాయి)  “ఐశూ, అప్పుడే నువ్వు లేవటం, రెడీ అవటం కూడా అయి పోయిందా తల్లీ?” డిష్ నిండా వేడి వేడి ఇడ్లీలు, గిన్నెలలో రెండు రకాల చట్నీలు కారప్పొడి పట్టుకు వచ్చింది అన్నపూర్ణ.

“అవును పిన్నీ, మధూ భర్తకు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా... అతన్ని చూడ టానికి వెళుతున్నాను...” అద్దంలో చూసుకుని బొట్టు పెట్టు కుంటూ చెప్పింది ఐశ్వర్య.

“ఊ... పాపం చాలా బాధా కరంరా అలా జరగటం...  మధూని ధైర్యంగా ఉండమని చెప్పు...రా, త్వరగా... వేడి వేడిగా తినేయమ్మా!” టేబుల్ మీద ప్లేట్ లో పెట్టి పిలిచింది అన్నపూర్ణ.

“అయ్యో పిన్నీ ఎందుకు ఈ హైరానా? నేను ఏ బిస్కట్లో తిని, పాలు తాగి వెళతాను కదా... చూడు ఇప్పటికే మీరు పెట్టిన టిఫిన్లకీ, కూరలకీ, పిండి వంటలకీ ఎంత  లావై పోతున్నానో...” అంది ఐశ్వర్య...

“కావాలంటే బాగా ఎక్సర్ సైజులు చేసుకో కానీ తిండి మాన కూడదు... సరే గానీ, నీతో కొన్ని విషయాలు చెప్పాలి... రామ్మా, టిఫిన్ తింటూ ఉండు... మాట్లాడుకుందాం...”

“సరే పిన్నీ...” బుద్ధిగా వచ్చి కూర్చుంది ఐశ్వర్య.“ఐశూ, మీ అన్నయ్యలు ఇద్దరూ మమ్మల్ని అమెరికా వచ్చేయమని అంటున్నారు...”
“అవునా, హాయిగా వెళ్ళి పొండి...”

“పర్మనెంట్ గానా, ఉహు, ఆ ఉద్దేశ్యం మాకు లేదు తల్లీ...”

“ఎందుకు పిన్నీ, అక్కడ చక్కగా మనవలతో ఆడుకుంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు కదా...”

“లేదురా... మీ బాబాయికి అక్కడి వాతావరణం పడదు... వెళ్ళిన వెంటనే నెమ్ము చేసేస్తుంది... తర్వాత అందరూ బయటికి వెళ్ళి పోతే, గంటలు గంటలు ఇంట్లో జంట  ఖైదీల్లా గడపాలి... అదీ నాకు నచ్చదు...”

తినటం పూర్తి  చేసి చేతులు కడుక్కుని వచ్చి అన్నపూర్ణ పక్కనే కూర్చుంది ఐశ్వర్య.

“పిన్నీ, మీ ఇద్దరినీ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది... ఒకరి కోసం ఒకరు ఎంతో ఆరాట పడి పోతూ ఉంటారు. నిన్న బాబాయ్ కూడా ఇదే విషయం చెప్పారు... అక్కడికి వెళితే మీకు అక్కడి ఫుడ్ పడదని, చాలా ఇబ్బంది పడతారని, ఏమీ తోచదని చెప్పి, అన్నయ్యలకు రాము అని చెప్పేసాము అన్నారు...”

“అవును... వాళ్ళు అక్కడ స్థిర పడి పోయారు... ఇక ఇక్కడికి వచ్చేది చుట్టపు చూపే... మేము అక్కడ ఉండ లేము...బ్రతికి ఉన్నంత కాలం ఒకరికొకరుగా...ఇక్కడే...”

“పిన్నీ, ఎలా? భార్యా భర్తల మధ్య  ఎలా కలుగుతుంది అంతటి అనుబంధం?”

“అదే కదమ్మా విచిత్రం? పెళ్ళికి ముందు ఒకరికి ఒకరు పరిచయం లేదు... అయినా ఆ మూడు ముళ్ళ బంధం ఇలా ముడి వేస్తుంది... అయినా, నీకు మాత్రం కార్తీక్ అంటే ప్రేమ లేదా?”

ఐశ్వర్య ముఖం వాడి పోయింది... “నాది ప్రేమో కాదో తెలియదు పిన్నీ... కానీ జీవితమంతా అతనితోనే బ్రతకాలని అనుకున్నాను... అతను అనుకోలేదు... అందుకే నా జీవితం ఇలా అయింది...”

“వివాహం అంటే బాధాకరమైన బందిఖానా కాదమ్మా... కొన్ని జీవితాలు అలాంటివి నీవు చూసి ఉండవచ్చు... కాదని అనను... కానీ మనువుతో ఒకసారి ఒకటి అయ్యాక, రెండు మనసులూ ఏకమై ఒక దృఢమైన బంధంగా మారి పోతుంది... ఆ బంధమే ఒక కమిట్ మెంట్ ని ఇస్తుంది...ఒక బాధ్యతగా మారుతుంది...  ఒకరికొకరిని అందమైన బందీలుగా మారుస్తుంది... ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకునే సంస్కారం ఉంటే చాలమ్మా... జీవితాంతం ఒక్కటిగా బ్రతికేయవచ్చు...ఇది అందమైన అపురూపమైన బంధం... దీనికి కొలమానం లేదు... ఏ బంధమూ దీనికి సాటిరాదు... నేటి యువతకు నచ్చక పోయినా, నా అనుభవం ప్రకారం, ఇదే చక్కని ప్రేమానుబంధం, భార్యా bhaర్తలే అపురూపమైన ప్రేమికులు...”

“మీరు చెబుతూ ఉంటే అనిపిస్తోంది... కార్తీక్ ని నేను పెళ్ళి చేసుకుని ఉంటే, అతను వెళ్ళి పోయే వాడు కాదేమో కదా పిన్నీ...” ఐశ్వర్య నయనాలు సజలాలు అయ్యాయి...

“అయ్యో, బాధ పడకు... ఇప్పుడు మీ ఇద్దరూ ఒకటే ఆఫీసు కదా... నీతో బాగానే ఉంటున్నాడని అంటున్నావు కదా... ఓ సారి ఇంటికి తీసుకు రామ్మా, బాబాయి మాట్లాడతారు... మాకు కన్యా దాన ఫలం దక్కుతుంది కూడా...” దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది ఐశ్వర్య...“అతనికి పెళ్లి అంటే అసహ్యం పిన్నీ... మళ్ళీ సహ జీవనానికి నేను సిద్ధంగా లేను...”

“ఊ...కానీ ఎంత కాలం ఇలా ఒంటరిగా ఉంటావు తల్లీ?”

“ఏమో పిన్నీ... నాకేమీ తెలియటం లేదు...”

“సరే, మధూ దగ్గరికి వెళతానని అన్నావు కదా... టైము అవుతుందేమో చూడు...”

“ఆ, అవును పిన్నీ, నేను బయలు దేరతాను...” లేచింది ఐశ్వర్య.

***

ఉదయం పదిన్నర  అవుతూ ఉండగా, మధు బాల ఫోన్ లో ఇచ్చిన సూచనల ప్రకారం, వినత ఇల్లు చేరుకుంది ఐశ్వర్య. ఐశ్వర్య వెళ్ళే సరికి ఎదురు వచ్చింది వినత.“నమస్తే, మీరు వదిన ఫ్రెండ్ కదా... రండి... కూర్చోండి... అన్నయ్యకు ఫిజియో థెరపీ జరుగు తోంది లోపల... వదిన అక్కడే ఉంది...”

“అవును... మనం మధు పెళ్ళిలో కలిసాము కదా... బాగున్నారా?” చిరు నవ్వుతో అడుగుతూ కూర్చుంది ఐశ్వర్య. ఆ పెళ్ళిలో తను ప్రవర్తించిన తీరు, చేసిన హఠం గుర్తు వచ్చి మనసులో చిన్న తనంగా అనిపించింది వినతకు. అంతే కాకుండా, ఐశ్వర్య మీదా, ఆమె జీవన విధానం మీద తాను చేసిన విమర్శలు, ఆమె కోసమని మధు కంచి నుంచి తీసుకువచ్చిన పట్టు చీరను తాను పంతంగా తీసేసుకోవటం మదిలో మెదిలాయి...  అపరాధ భావనతో కళ్ళు చెమ్మగిల్లాయి...

“ఒక్క నిమిషం...” అంటూ లోపలికి వెళ్ళి, ట్రే లో మంచి నీళ్ళ గ్లాసులతో వచ్చింది.

అవంతి, పిల్లలు వచ్చి కూర్చుని ఐశ్వర్య తో కబుర్లు చెప్ప సాగారు. వినత కూడా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, ఆమె  మనస్తత్వం గురించి తెలిసిన ఐశ్వర్యకు ఆమెలోని మార్పును గమనించాక చాలా ఆశ్చర్యంగా అనిపించింది... ఈలోగా గునగునా పాకుతూ వచ్చాడు బాబి గాడు...

“హా... వీడు ఒక్క క్షణం కుదురుగా ఓ చోట ఉండడుగా?” మురిపెంగా అంటూ, వాడిని ఎత్తుకుంది వినత. ఐశ్వర్య చేతులు చాప గానే ఆమె మీదికి ఉరికాడు...

“నా దగ్గరికి రాడమ్మా... నీ దగ్గరకు చక్కగా వచ్చాడు...” అంది అవంతి నవ్వుతూ...

“తను వాళ్ళమ్మ ఫ్రెండ్ కదా, వీడికీ ఫ్రెండే మరి!” నవ్వి, “కాఫీ తెస్తాను... వదినా మీరు తాగుతారు కదా?” అంది లోపలికి  వెళుతూ వినత.

“హాయ్ ఐశూ...” వచ్చి, ఐశ్వర్య పక్కనే కూర్చుని ఆమె భుజమ్మీద తల వాల్చింది మధుబాల.

“మధూ... ఎలా ఉంది వేణుకి?” ఆమె జుట్టు నిమురుతూ అన్నది ఐశ్వర్య.

“దేవుడి దయ వలన పెద్ద ప్రమాదమే తప్పింది ఐశూ... కానీ ఇప్పట్లో నడవ లేరు... ఫిజియో థెరపీ చేయిస్తున్నాము. నాకు చాలా భయం వేసిందే... అత్తయ్య కూడా లేరు కదా... కానీ పవన్ అన్నయ్య ఎంతో ధైర్యం చెప్పి తనే అన్నీ చూసుకున్నారు... ఇంట్లో బాబుతో చాలా కష్టం అని చెప్పి, పెద్దమ్మ గారు ఇక్కడికే తీసుకు రమ్మని చెప్పారట... అందుకే ఇక్కడే ఉన్నాము... మూడు నాలుగు రోజుల్లో అత్తయ్య రాగానే మా ఇంటికి వెళతాం...” గబగబా చెప్పింది మధు బాల.

“పోనీ లేవే, దేవుడు నిజంగా దయా మయుడే... మీ పెద్దమ్మ గారిని కూడా ఈరోజు చూడాలి...” నవ్వుతూ అన్నది ఐశ్వర్య...

“తప్పకుండా... ఆవిడతో మాట్లాడితే మనసుకు ఎంత సాంత్వన గా ఉంటుందో తెలుసా?”

“మీ ఇద్దరినీ చూస్తూంటే నాకు అసూయగా ఉంది మధూ...” అన్నది అవంతి.

“ఎందుకు అక్కా?”

“ఎందుకేమిటి? నాకసలు నా మనసుకు నచ్చిన స్నేహితులే లేరు... నేను ఇంట్రావర్ట్ ని... నేనే కాదులే, నా తమ్ముడు కూడా అంతే...” మెల్లగా చెప్పింది అవంతి.

“అందుకు కారణం మా నాన్నగారు... అమ్మను, మమ్మల్ని నిరంకుశంగా పాలించారు... అమ్మ వలన సహజంగానే సౌమ్య స్వభావం అలవడింది మా ఇద్దరికీ... విపరీతమైన క్రమశిక్షణతో మమ్మల్ని ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చే వారు కాదు మా నాన్న... అందుకే పుస్తకాలే మాకు స్నేహితులయ్యాయి... కానీ నాన్నగారి మరణం తరువాత, అమ్మ మాకు మంచి స్నేహితురాలు అయింది... ఆవిడ వలన ఎంతో  ప్రపంచ జ్ఞానం అబ్బింది...మాకు అందరినీ  ప్రేమించే గుణాన్ని నేర్పింది మా అమ్మే... ఐశ్వర్యా... మీరు మా అమ్మను తప్పక కలవాలి...” అవంతి చెబుతూ ఉంటే ఎప్పుడూ అడిగిన దానికి తప్ప జవాబు చెప్పని ఆమె మాటలను ఆశ్చర్యంగా విన్నది వినత. ఫిజియో థెరపిస్ట్ బయటకు వచ్చి, “పవన్ గారు లేరా మేడమ్? ఈరోజు వాకర్ కొని తీసుకు రావాలి వేణు గారికి...” అని చెప్పాడు.

“అలాగే నండి, నేను చెబుతాను... ఇప్పుడే బయటకు వెళ్ళారు...” చెప్పింది వినత.

“వేణు గారికి కాసేపాగి, జ్యూస్ ఇవ్వండి... అలసి పోయారు... మళ్ళీ సాయంత్రం వస్తాను...” అతను వెళ్ళి పోయాడు. అందరికీ కాఫీలు తీసుకు వచ్చి ఇచ్చింది వినత. సావిత్రిని పిలిచి బత్తాయి రసం తీసి ఇవ్వ మని చెప్పింది.

వినతలో వచ్చిన ఆ మార్పును, చూస్తూ ఉంటే అందరికీ ఆశ్చర్యం గానూ, ఆనందం గానూ ఉంది... ఆమె లోని ఈ మార్పు  ఎప్పటికీ ఇలాగే ఉండి పోవాలి అనుకున్నారు మనసులో...

***

“ప్చ్... బాగా చిక్కి పోయారు...” బాధగా అంది ఐశ్వర్య, వేణూ ముఖం చూస్తూనే. పేలవంగా నవ్వాడు వేణు... “మీ ఫ్రెండుని బాధ పెట్టినందుకు భగవంతుడు నాకు  వేసిన శిక్ష ఇది...” మధు వైపు చూస్తూ, ఐశ్వర్యతో అన్నాడు...

“అయ్యో, ఎంత మాట! కలతలు, బాధలు, కోపాలు, అపార్థాలు  వస్తాయి... అయిన వాళ్ళ మధ్య అవన్నీ క్షణికాలే... తేలి పోయే మబ్బుల్లాంటివి... మీకు త్వరగానే తగ్గి పోతుంది... పెద్ద గండం తప్పినందుకు సంతోష పడాలి...” చెప్పింది ఐశ్వర్య.

“మీరు చాలా పెద్ద వాళ్ళు అయి పోయారు... బాగా మెచ్యూరిటీ వచ్చింది మీ మాటల్లో...” అభిమాన పూర్వకంగా ఆమె వైపు చూసాడు వేణు.
“అనుభవాలు నేర్పే పాఠాలు ఎన్నెన్నో...” నవ్వింది ఐశ్వర్య...

“కార్తీక్, మీరూ ఒకే చోట పనిచేస్తున్నారని తెలిసింది!”

“అవునండి...”

“మరి...” ఏదో అడగ బోయి, పవన్ లోపలికి రావటంతో ఆగి పోయాడు వేణు.

“బావా, ఆయన ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం వాకర్ తీసుకు వచ్చాను... సాయంత్రం నుంచి నడిపిస్తానని అంటున్నాడు...” చేతిలో ఉన్న వాకర్ ని ఫోల్డ్ చేసి, గోడకి ఆనించాడు పవన్.తలూపి, “ఈమె మధు ఫ్రెండ్ ఐశ్వర్య...” పరిచయం చేసాడు. జ్యూస్ గ్లాసుతో లోపలికి వచ్చింది మధు బాల.

“అబ్బా, నాకు వద్దు మధూ... నోరంతా చాలా చేదుగా ఉంది...” ముఖం వికారంగా పెట్టాడు వేణు.

“అన్నయ్యా, ప్లీజ్... అలా అంటే నీరసం ఎలా తగ్గుతుందిరా? ఇటివ్వు వదినా...” కోప్పడుతూ, వినత వేణుతో జ్యూస్ తాగించేసింది.

“మీరు లంచ్ చేసి వెళ్ళాలి...” ఐశ్వర్యతో చెప్పాడు పవన్...

“అబ్బే, వద్దండీ... కాసేపు కూర్చుని వెళ్ళి పోతాను...”

“అదేమీ కుదరదు... ఈరోజు అందరం కలిసి భోజనం చేస్తున్నాం అంతే... మీకిష్టమైన స్వీట్ ఏమిటో చెప్పండి, సావిత్రి చేస్తుంది...” నవ్వుతూ అన్నది వినత. మొహ మాటంగా నవ్వింది ఐశ్వర్య.

“కాలు చాలా నొప్పిగా ఉంది...” బాధగా ముఖం పెట్టాడు వేణు...

“ఉదయమే టాబ్లెట్స్ వేసుకున్నారు కదా, తగ్గి పోతుంది... కాసేపు పడుకోండి...” మృదువుగా చెప్పింది మధు బాల...కాసేపు సుందరమ్మ దగ్గర కూడా కూర్చుని కబుర్లు చెప్పింది ఐశ్వర్య.

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam