Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu..aame..oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue189/542/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

( గతసంచిక తరువాయి)
తను రథం ఎక్కి, స్పృహ లేకుండా పడున్న ఉలూచీశ్వరి పక్కన కూచుని ఆమె తను ఒడిలో పెట్టుకుని తెలివి రప్పించే ప్రయత్నం చేసాడు.

భద్రా దేవి కూడా రథంలో కొచ్చింది.

ఉలూచీశ్వరి పక్కన కూచుని ముఖాన నీరు చిలకరించింది. బుగ్గలు తట్టి పిలిచింది. కొంత సేపటికి స్పృహలో కొచ్చిన ఉలూచీశ్వరి ఉలికి పడి లేచి కూచుంది, పిచ్చి చూపులు చూసింది. ఏం జరిగిందీ ఆమెకు అర్థం కాలేదు.

అప్పటికి బాగా తెల్ల వారి పోయింది.

తూర్పు ఆకాశంలో బాల భానుడు తొంగి చూస్తున్నాడు. తన ఎదురుగా వున్న భద్రా దేవిని చూసింది ఉలూచీశ్వరి తన వెనక వున్న ధనుంజయుని గమనించ లేదు. రక్త సిక్తమైన దుస్తులతో బీభత్సంగా వున్న భద్రా దేవిని చూడ గానే కొద్ది కొద్దిగా జరిగింది గుర్తు రాసాగింది.

‘‘అక్కా! నా కొరకు పోరాడితివా... ఆ నీచులు ఏమైనారు?’’ అనడిగింది, గొంతు పెకల్చి రుద్ద కంఠంతో.

‘‘వక్ర దంతుడు, మాయా శృంగుడు తప్పించుకు పోయినారు. నాగ దండును నాశనమొనర్చినాము. వెను తిరిగి చూడుము ఎవరు వచ్చినారో!’’ అంది నవ్వుతో భద్రా దేవి.

తన వెనకే కూచునున్న ధనుంజయుని చూడగానే చంద్రుని గాంచిన తామరలా ఆమె ముఖారవిందం వికసించింది. ఇది కలో నిజమో అర్థం కాలేదు. ఒక్క సారిగా ఎద పొంగిన సంతోషం, విరహం దుఖ్ఖం ముప్పిరి గొని ఉక్కిరి బిక్కిరి చేయగా` ‘‘హాఁ... ప్రాణ సఖా. వచ్చినారా...’’ అంటూ ఎగసి ధనుంజయుని మెడను కావిలించుకొని ఏడ్చేసింది. ఆమెను ముదమార గుండెకు హత్తుకొని జుత్త నిమిరి ప్రేమగా ముద్దాడి ఓదార్చాడు.

ముగ్గురూ రథం దిగే సరికి`

ఎదురుగా యక్షుడు రుచికుడు చిరు నవ్వుతో ప్రత్యక్షమయ్యాడు. పదిహేనడుగుల ఎత్తున పోత పోసిన విగ్రహంలా వున్న యక్షుని రూపాన్ని చూసి విభ్రాంతులయ్యారు భద్రా దేవి, ఉలూచీశ్వరిలు. ధనుంజయుడు పరిచయం చేయగానే తనకు సాయ పడిన అదృశ్య శక్తి ఎవరో భద్రా దేవికి అర్థమైంది. కృతజ్ఞతగా భామలిరువురూ రుచికుడికి నమస్కరించారు.

‘‘సుఖీభవ... అభీష్ట సిద్ధిరస్తు...’’ అంటూ అశీర్వదించాడు రుచికుడు. అలాగే భద్రా దేవి వీరోచిత పోరాటాన్ని ఘనంగా అభినందించాడు. ధనుంజయుని జూచి`

‘‘మిత్రమా! ఇక నేను పోయి వత్తునా..? మార్గమునకు అడ్డంకి లేకుండా ఆ పెను వృక్షాలను తొలగించి వెడలెదను గాక. ఇకనయినా నా పేరు రుచికుడని మరువకు సుమా! పిలిచినంతనే ఎన్ని పనులున్ననూ విడిచి తృటిలో నీ చెంగట వాలెద. వలసిన సాయము జేసెద.’’ అంటూ మాటిచ్చాడు.

‘‘అటులనే మిత్రమా! ఇప్పుడు నీవు జేసిన సాయము గూడ మరువ లేనిది. కృతజ్ఞుడను.’’ అన్నాడు ధనుంజయుడు.

‘‘మనలో మనకు కృతజ్ఞత లేమి గాని ఇప్పుడు మీ పయన మెటు?’’

‘‘శివ నాగ పురము పోవలె. తప్పదు గదా. మా సంచులు, భూతం ఘృతాచి అచట మండపమందే వున్నవి. ఆపైన వక్రదంతుని కారణంగా నాడు శివ దర్శనం చేయనే లేదు. ఆ పనులు ముగించుకొని తిరిగి ఇదే మార్గమున అంగ రాజ్యము వైపు పయనించెదము.’’ అన్నాడు ధనుంజయుడు.

భద్రా దేవి ధనుంజయుని చెవిలో ఏదో చెప్పింది.

‘‘ఏమి సంశయము? నేను చేయ వలసిన పనులేమైనా వున్నవా?’’ అడిగాడు రుచికుడు.

‘‘ఏమీ పని గాదు గాని, నీవు పోవు మార్గమున భూతం ఘృతాచితో ఓ మాట చెప్పి పోవలె. అక్కడ మా సంచులు తీసుకుని కొండ వాగు వద్దకొచ్చి శాలి వృక్షం క్రింద మా కొరకు ఎదురు చూడమని చెప్పిన చాలును. కొండ వాగులో స్నానాదికాలు ముగించు కుని పొడి దుస్తులు మార్చుకొని దైవ దర్శనానికి పోవలె.’’

‘‘అవశ్యము మిత్రమా! ఘృతాచితో ఓ మాట చెప్పి వెడలెద గాక. నీ వంటి మహా వీరుడు మిత్రుడు గావటం నాకు గర్వ కారణం ధనుంజయా. మన స్నేహ బంధము చిర కాలముండాలె. త్వరిత గతిని మూవురు రాణులతో నీవు రత్నగిరి సింహాసనమున ప్రకాశింప వలె. అది వీక్షించి నేను ఆనందించ వలె. ఇక పోయి వత్తునా సఖుడా! శలవు గైకొనెద.’’ అంటూ అదృశ్య మయ్యాడు రుచికుడు.

చివరిగా రుచికుని మాటలు`

ధనుంజయుని ఉలికి పడేలా చేసాయి.

పాతాళ లోక యువ రాణి మణిమేఖల గురించి ఇప్పుడే భద్రా దేవి, ఉలూచీశ్వరిలకు తెలియ కూడదనుకున్నాడు. కాని తను పొరబాటున చెప్పినాడో కావాలనే చెప్పినాడో గాని రుచికుడు నోరు జారి కొంప ముంచాడు. ‘‘ఇదేమి పని మిత్రమా! పోతూ పోతూ పొగ బెట్టి పోతివే. వీళ్ళకి ఏంచెప్పాలి?’’ అంటూ మనసు లోనే కళ వళ పడి పోయాడు. చివరకు ధనుంజయుడు భయ పడి నట్టే జరిగింది. భద్రా దేవి, ఉలూచీశ్వరిలు అచ్చెరు వొంది ముఖ ముఖాలు చూసుకున్నారు.

‘‘అక్కా! మనం ఇరువురమే గదా. మరి ఆ యక్ష మిత్రుడేమి అటుల జెప్పినాడు. మూవురు రాణలతో సింహాస మధిష్టింప మని. ఆ మూడవ రాణి ఎవరు?’’ అనడిగింది అమాయకంగా.

‘‘ఏమో... నాకేమి తెలియు? ఆ గుట్టు విప్ప వలసినది మన స్వామియే గదా.’’ అంటూ దీర్ఘం తీసింది భద్రా దేవి.

ఇక ధనుంజయుడు కల్పించు కొనక తప్ప లేదు.

‘‘వేరెవరున్నారు దేవీ! మీ ఇరువురే గదా. రుచికుడు మూవురు రాణులని పొరబాటున నుడివినాడు’’ అంటూ నవ్వాడు.

‘‘ఊహుఁ... ఆర్య పుత్రులు అనృతములాడుట శోభించదు.’’ అంది ఉూచీశ్వరి.

అదే సమయంలో`

ఎవరో పట్టి లాగినట్టు ఎగువన బాటకు అడ్డంగా పడున్న మహా వృక్షాు రెండూ ఒక దాని తర్వాత ఒకటిగా పక్కకు తొలగి మార్గం సుగమమైంది. యక్షుడు వాటిని తొలగించి వెళ్ళి పోతున్నాడని అర్థమైంది. అవతల కొందరు అశ్వికు బాటసారులు నిలిచి పోయి వున్నారు. అడ్డంకి తొలగ గానే వాళ్ళంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ముందుకు బయలు దేరారు. ఇక ఎక్కువ సేపు తాము అక్కడ వుండటం మంచిది కాదని గ్రహించాడు ధనుంజయుడు.

‘‘ప్రియ సఖియు! మీరు నన్ను క్షమించాలి. ఆమె పేరు మణి మేఖల. బలి చక్రవర్తుల వారి దత్త పుత్రిక. తప్పని పరిస్థితిలో యువరానణి మణి మేఖలతో వలపు బంధాన చిక్కితి. వివరములు పిమ్మట తెలిపెద గాక. మనము బయలు దేర వలె’’ అంటూ ధనుస్సు భుజాన వేసుకొని తన శ్వేతాశ్వాన్ని అధిరోహించాడు.

భద్రా దేవి ఉలూచీశ్వరిలు`

ముసి ముసిగా నవ్వుకున్నారు.

భద్రా దేవి వెళ్ళి నేలకు గుచ్చిన తన ఖడ్గాన్ని, బరిసెను అందుకుని యథా స్థానాల్లో వుంచి మచ్చల గుర్రాన్ని అధిరోహించింది. ధనుంజయుని ముందు శ్వేతాశ్వం మీద కూచుంది ఉలూచీశ్వరి. అంతే` అశ్వాలు రెండూ పోటీ పడుతూ శివ నాగ పురం వైపు దౌడు తీసాయి.

******************************

‘‘ఏమిరా వక్ర దంతా! ఇటుల తగల బడిన దేమిరా నీ జాతకము. నీకన్నీ అపజయములే గాని జయములు లేవా? పరాభవములే గాని గౌరవము లేవా? తొలి ప్రయత్నమున విఫలమైతివి. సరి... కాబోయే అల్లుడవని రెండో అవకాశమునూ నీకే ఒసంగినారు ప్రభువు. నేను వెంట వచ్చి సాయ పడితి. యాభై మంది మన నాగ దండు పటాలము ఆర్భాటముగ మనతో వున్నది.

ధనుంజయుని పాతాళ లోకంలో పడవేసినావు. ఏమైనది! నాలుగవ దినమునకే నిక్షేపముగా తిరిగి వచ్చె. యువరాణి ఉలూచీశ్వరిని మోసగించి అపహరించినాము. ఏమాయె! ఆ భద్రా దేవి రుద్రుని సోదరి వలె మన వెనకే వచ్చి మన నాగ దండును ఛిన్నాభిన్నము గావించె. ఇంతటి సాహస నారిని నేనెచటనూ గాంచ లేదు. ధనుంజయుడు శర పరంపరతో కొందరిని కూల్చినాడు.

ఆఖరికి రథము నుండి ఉలూచీశ్వరిని అశ్వం మీద దోడ్కొని పొమ్మంటి. ఆ ప్రయత్నమును బెడిసి కొట్టినది. అశ్వాలు జచ్చె, సైనికులు జచ్చె. కనీసం అయిదారుగురు సైనికులయినా నాగ దండులో మిగిలారో లేదో తెలీదు. ఏమీ సాధించ లేదు. సర్వం పోగొట్టుకొంటిమి.
ఇంతటి పరాభవమును, ఇంతటి అపజయమును మూట గట్టుకొని రిక్త హస్తముతో ఏ ముఖం బెట్టుకుని మనము నాగ లోకము పోవలె... ప్రభువు నాగ రేడును ఎటుల దర్శింప వలె’’ అంటూ అంగలార్చాడు మాయా శృంగుడు.

అప్పటికి బాగా తెల్లవారి పోయినది.

దిన కరుడు బారెడు ఎత్తున గగనతం నుండి కారడవి లోకి తొంగి చూస్తున్నాడు. అశ్వాలు రెండూ దారి తెన్ను లేని కీకార్యణం గుండా ఈశాన్య దిక్కుగా అంగ రాజ్యం సరిహద్దు వైపు పరుగు తీస్తున్నాయి. వక్ర దంతుడు దీర్ఘాలోచనలో వున్నాడు.

‘‘ఏమిరా... నా ఆవేదన విన బడుట లేదా? నీ కర్ణములు వినికిడి శక్తిని కోల్పోయినవా... ఇప్పుడేమి చేయ వలె?’’ అరిచాడు మాయా శృంగుడు.

అప్పుడు పెదవి విప్పాడు వక్ర దంతుడు.

‘‘నేను నాగ లోకము వచ్చుట లేదు.’’ అన్నాడు స్థిరంగా.

‘‘ఏమంటివి? మన లోకమునకు వచ్చుట లేదా?’’ ఒకింత అచ్చెరు వొందుతూ అడిగాడు మాయా శృంగుడు.
‘‘అవును. వచ్చుట లేదు.’’

‘‘రాక ఎచటికి పోయెదవు?’’

‘‘ఫ్రాగ్‌ జ్యోతిష పురము పోవలె. వచ్చిన నీవును నాతో రావచ్చును. లేదా నీవు నాగ లోకమున కేగి జరిగినది నాగ రేడుకు తెలియ పర్చుము.’’ వక్ర దంతుడి నిర్ణయం మాయా శృంగుని విస్మయ పరిచినది.

‘‘ఏమిరా! మతి తప్పినదా నీ గతి మారినది. ఏమంటివి. ఫ్రాగ్‌ జ్యోతిష పురమునకా? ఆ అసోము రాజధానిలో పిశాచమును మించిన మంత్ర గాళ్ళు ఉందురని వింటి. అచటి ప్రజలు వెదకి వెదకి మరీ మన నాగ జాతిని జంపి భక్షింతురట. ప్రమాద కరమగు ఆ నగరమునకు నీవు పోనేల? ఏమున్నదచట?’’ అనడిగాడు.

‘‘అచట జడల మాంత్రికుని కలవ వలె...’’ బదులిచ్చాడు వక్ర దంతుడు.

ఆ నిర్ణయం విని తెరిచిన నోరు`

మూయటం మర్చి పోయాడు మాయా శృంగుడు.

అతి భయంకరుడిగా పేరు పొందిన మహా మాంత్రికుడు ఆ జడల మాంత్రికుడు. కారణం తెలీదు గాని వాడు కొద్ది రోజులు మర్మ భూమి అటవీ ప్రాంతాల్లో సంచరించాడని విన్నాడు. అలాంటి వాడితో వక్ర దంతుడి కేమి పని? ఆలోచిస్తున్న మాయా శృంగుడికి వక్ర దంతుడి మదిలో ఏదో సరి కొత్త దుష్ట పన్నాగం రూపు దిద్దుకుంటోందని సందేహం ఏర్పడిరది.

‘‘అసలు నీ మనసున ఏమున్నదో చెప్పుము. అది విని నేను నీతో వచ్చుటయో, నా దారిన పోవుటయో తెలిపెద.’’ అన్నాడు.
అశ్వాలు కీకారణ్యంలో కొమ్మలు, డొంకలు తప్పించుకొంటూ నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. కొన్ని లిప్తల కాలం తర్వాత వక్ర దంతుడు తన మనసు విప్పాడు.

‘‘అపజయముకు భయ పడి కూచున్న` కామితములు సిద్ధించవు. అవునా?’’ అడిగాడు.

‘‘అయితే?’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్