Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue191/551/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

( గతసంచిక తరువాయి) పది శిరస్సుల సర్పరేడు. ఒక్కో శిరస్సు పైన దివ్య కాంతులు వెదజల్లుతూ నాగ మణులు ప్రకాశిస్తున్నాయి. మంత్ర బద్ధుడై నిస్సహాయ స్థితిలో ఆ సర్ప రేడు కనులు కన్నీరు వర్షిస్తున్నాయి.

ఆయనకు ఎదురు గానే పదడుగుల దూరంలో హోమ గుండం ఒకటి కణకణా రగులుతూ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. దాన్ని చుట్టి ఏవో చిత్ర విచిత్రమైన రంగ వల్లికలు... వాటి మీద పసుపు కుంకుము దట్టంగా చల్ల బడి ఎర్రటి పూలతో బీభత్సంగా ఉన్న ఆ హోమ గుండం ముందు నిలబడున్నాడు జడల మాంత్రికుడు. మనిషే విచిత్రంగా భయానకంగా వున్నాడు. సుమారు పదడుగుల పొడవున సన్నగా వున్నాడు. మసి బొగ్గు రంగు దేహ ఛాయ. పొట్ట వెన్నుకు అతుక్కుందాన్నట్టు లోపలికుంది. నెత్తురు వర్ణం లోని ఎర్రటి పంచె అంగీలా చుట్టుకున్నాడు. అది మోకాళ్ళ కింది వరకే వుంది. నడుంకి తెల్లటి వెండి బిళ్ళతో కూడిన పట్టీ బిగించాడు. వంటి మీద మరే ఆచ్ఛాదనా లేదు. మెడలో ఎరుపు నలుపు కలగలిసిన పూసల దండలున్నాయి. కాలికి వెండి తోడా, ఒక చేతికి వెండి కడియం, మెడలోను భుజాలకు వెండి ఆభరణాలున్నాయి. అవి చూడ్డానికి ఆభరణాల్లా వున్నప్పటికీ అవి మంత్ర యంత్ర సమన్వితమై మహిమ కలిగినవి. ముఖాన రక్త వర్ణంలో పెద్ద బొట్టు వుంది.

వాడి జుత్తు ఒత్తుగా అనేక జడలు కట్టి భుజాల మీదకు వేలాడుతోంది. గుబురు మీసం... బవిరి గడ్డం... జుత్తు రాగి రంగులో ఉండి అతడి వయసు ఎంతో అంచనా వేయటం కష్టం. తల విదిలించినప్పుడంతా జడ నుండి సన్నటి నిప్పు రవ్వలు రాలుతున్నాయి. సాధారణ మాంత్రికులకు జడల మాంత్రికులకు ఇదే తేడా. మాంత్రికులకే మాంత్రికుడన తగ్గ శక్తిమంతుడు ఈ జడల మాంత్రికుడు.
హోమ గుండాన్ని చేర్చి పొడవాటి ఖడ్గం. ఒకటి పసుపు కుంకుమలు పూసి నిల బెట్ట బడి వుంది. అది బలి ఖడ్గం. నాగ రేడును బలి ఇచ్చేందుకు సిద్ధంగా వుంచ బడింది. జడల మాంత్రికుని పక్కన మూడు కోణాలకు మూడు నిమ్మకాయలు గుచ్చ బడిన త్రిశూలం ఒకటి భూమిలో గుచ్చి నిల బెట్టి వుంది. జడల మాంత్రికుడు గుగ్గిలం పసుపు కుంకుమలు హోమ గుండం లోకి గుప్పిళ్ళతో విసురుతూ మంత్రోచ్ఛాటన చేస్తూ ఆకాశం వంక చూసి తను ఉపాసించే గంధర్వ లోకాధి దేవత మోహినీ శక్తిని ఆవాహన చేస్తున్నాడు.
వక్ర దంతుడు, పొట్టి మాయా శృంగుడు ఇద్దరూ అగ్ని వలయంలో మాంత్రికుడి సమీపం లోనే వున్నారు. అప్పుడే తను నాగ లోకాధి పతి అయినట్టు బోర విరిచి నిలబడి సగర్వంగా అవతల నిస్సహాయంగా చూస్తున్న నాగ లోక వాసుల్ని వీక్షిస్తున్నాడు. ఇక తనకు తిరుగు లేదన్న ధీమా వాడి నిశిత చూపుల్లో స్పష్టంగా కన్పిస్తోంది.

అయితే మాయా శృంగుడు మాత్రం ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో బితుకు బితుకు మంటూ చూస్తున్నాడు. ఈ బలి వ్యవహారం ఏదో వేగిరం ముగిస్తే బాగుండునని వుంది వాడికి. ఎందుకంటే` వక్ర దంతుడు ఏది తల పెట్టినా అపజయమే గాని విజయమన్నది ఇంత వరకు లేదు. ఇప్పుడు కూడ అనుకున్నది అనుకున్నట్టు త్వరితము గా జరగాలి. లేదంటే ఎప్పుడే అవాంతరం వచ్చి పడుతుందో తెలీదు. ఆ పైన ఆ ధనుంజయుడు, భద్రా దేవి, ఉలూచీశ్వరి అంతా నేరుగా నాగ లోకం చేరటానికి వచ్చేస్తూంటారు. వాళ్ళు వస్తే కథ అడ్డం తిరిగినట్టే. ఏదో ఒకటి చేసి నాగ రాజును విడిపించగల సమర్ధులు. అందుకే భయ పడుతున్నాడు మాయా శృంగుడు.

ఇక్కడ యిలా వుండగా`

అక్కడ పొదల వెనక నుండి జరుగుతున్నదంతా చూస్తున్న ధనుంజయ బృందానికి ఏం చేయాలో, ఎలా నాగ రేడును కాపాడాలో అర్థం గావటం లేదు. తన తల్లిదండ్రుకు పట్టిన దుర్గతిని జూచి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది యువరాణి ఉలూచీశ్వరి. భూతం ఘృతాచి తో బాటు శంకు పుత్రి చెరో పక్కన వుండి ఆప బట్టి గాని లేకుంటే  ఉలూచీశ్వరి తండ్రి వద్దకు పరుగెత్తి తను కూడ ప్రమాదం బారిన పడి వుండేది.
ధనుంజయుడు భద్రా దేవి వంక చూసాడు.

అప్పటికే ఆమె దీర్ఘాలోచనలో కనులు మూసుకొని వుంది. ఇలాంటి విషయాల్లో ఆమె సలహా సంప్రదింపులు లేకుండా తను తొందర పడి ఏమీ చేయ లేడు. చూస్తే వాడు మహా మాంత్రికుడిలా వున్నాడు. మహా మహుల నాగ లోక వాసుల్నే నియంత్రించి నాగ రేడునే బంధించాడంటే తను వేసే బాణాల వలన ప్రయోజనం లేక పోగా తమ ఉనికి మాంత్రికుడికి తెలిసి పోయి తాము కూడ ఆ దుష్టుడికి బంధీలుగా చిక్కే ప్రమాదం వుంది. అందుకే తొందర పడ్డం లేదు ధనుంజయుడు. ఈలోపల`

భద్రా దేవి తన మనసును కర్ణేంద్రియాలను లగ్నం చేసి గతం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. వాడు జడల మాంత్రికుడు. సందేహం లేదు, తన తండ్రి అరుణ భట్టారకుని దయ, కృషి మూలంగా చిన్న వయసు నుండే అనేక మంత్ర సిద్ధులు పొందడమే గాక మాంత్రికులకు సంబంధించి గ్రంథాలనూ చదివింది. వాటిలో జడల మాంత్రికుల గురించి చదివిన వివరాలు గుర్తుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆ విషయంగా తన తండ్రి చెప్పిన మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.‘‘చూడు పుత్రీ! నీవు ఎప్పుడు గాని, ఎక్కడ గాని భవిష్యత్తులో పొరబాటున కూడ ఈ జడల మాంత్రికుల జోలికి పోవలదు. వాళ్ళు అతి కౄరులు. మహా ప్రమాద కారులు. ఘటనా ఘటన సమర్థులు. ఒక జడల మాంత్రికుని ఎదిరింప మరో జడల మాంత్రికుడే సమర్థుడు. సాధారణముగా వీళ్ళు తమ ప్రాణ పక్షిని గొంతులో నిక్షిప్తం జేసుకుందురు. కావున వీళ్ళ శరీర భాగాలను ఖండించినా తిరిగి యథా ప్రకారము అతుక్కొని తృటిలో పునర్జీవితులు కాగలరు.

అలాగని వీళ్ళకి చావే లేదా అంటే వున్నది. ఎవరైనా సాహసికుడైన వీరుడు వాడు గమనించక ముందే శిరస్సును ఖండించాలి. ఖండిత శిరస్సు నేల బడ కూడదు. నేలను తాకిన మరు క్షణమునే అది చెండులా చివ్వున లేచి మొండమునకు అతుక్కుని పునర్జీవితుడవుతాడు. కావున ఖండిత శిరస్సు గాలిలో వుండగానే అది నేరుగా పోయి అగ్గిలో బడి కాలి పోయేలా చూడాలి. ఈ లోపలే మరో ప్రక్క వాడి మొండెమునకు అగ్గి ముట్టించి అది కూడ కాలి పోయేలా చూడాలి. ఆ విధంగా చేసినచో ఈ జడల మాంత్రికులు జత్తురు. వాడి జడలు అగ్గిన బడి కాలి పోతున్నప్పుడు చిట పట లాడి పోతూ వాడి మంత్ర శక్తులు సర్వం తొలగి పోతాయి. ఎంతో సాహసము, ధైర్యముగ వీరులు తప్ప ఈ కార్యమును అన్యులు చేయ జాలరు.’’

ఆ విధంగా`

ఒకప్పుడు తన జనకుడు చేసిన హిత బోధ గుర్తుకు రాగానే చప్పున కనులు తెరిచింది భద్రా దేవి. అది గమనించిన ధనుంజయుడు వెంటనే` ‘‘భద్రా! ఒక్క బాణంతో ఆ దుష్ట మాంత్రికుని తల తృంచ గలను. ఏమి చేయ వలె? చెప్పుము.’’ అనడిగాడు.

‘‘త్వరితముగ మీరే ఏదో ఒకటి జేసి ఆ దుర్మార్గుని అంతమొందింప వలె. లేకున్న వాడు మా నాగ రేడును అన్యాయముగ బలి ఇచ్చు లాగున వున్నాడు.’’ అంది ఆత్ర పడుతూ శంఖు పుత్రి.

‘‘ఆత్ర పడిన పనులు కావు శంఖు పుత్రి. వేచి వుండ వలె... లేకున్న వాడు మన విడువడు.’’ అంటూ హెచ్చరించి, ధనుంజయుని వంక చూసింది.

భద్రా దేవి తెలిపిన సమాచారం విని ధనుంజయుడే కాదు, శంకు పుత్రి, ఉలూచీశ్వరిలు కూడ అచ్చెరు వొందారు. ధనుంజయుడు తన విల్లు అందుకుంటూ` ‘‘దీనికింత చింతయేల భద్రా! ఏక కాలమున రెండు శరములు ప్రయోగించెద. అర్ధ చంద్రాకార బాణము వాడి శిరస్సును ఖండించగా, అగ్ని సెగలతో కూడిన రెండో బాణము వాడి శరీరమున నాటుకొని నిప్పు పెట్టగలదు. వరుస బాణాతో వాడి శిరస్సు నేల బడకుండా నేరుగా హోమ గుండంలో పడునట్టు జేసెద’’ అన్నాడు.

‘‘వూహుఁ... సఖుడా.... భగ భగ మండుతూ దూసుకు వెళ్ళు బాణము అధిక శబ్ధము సృష్టించి జడల మాంత్రికుని దృష్టి నిటు మళ్ళించును. ఒక పరి వాడు తప్పించుకున్న ఇక ఏమీ చేయ లేము. ఇది ఒకరి వల్ల అగు కార్యము గాదు’’ అంది భద్రా దేవి.

‘‘అనగా నీవునూ....’’

‘‘అవును. నేను ఈటె మొనకు వస్త్ర భాగము చుట్టి మండించుటకు సిద్ధ పరిచెద. పిమ్మట వాడి శిరము సంగతి మీరు చూచు కోవలె. ఒకే బాణమునకు వాడి శిరము తెగి గాలి లోకి లేవాలి. ఆదే సమయమున నేను ఈటెతో బయలు దేరద. బాణ ప్రయోగము జేసిన వెంటనే మనము బయలు దేర వలె. వాడు పూజ ముగించి నాగ రేడును బలి ఇచ్చుటకు బలి ఖడ్గమును అందుకొను తరుణము మనకు అనుకూలము. వాడి దృష్టి పూర్తిగా ఖడ్గ మందు లగ్నమై యుండును’’ అంటూ వివరించింది.

అంత వరకు ఆ దుష్ట మాంత్రికుని నిర్జించుట ఎలాగని చింతిస్తున్న ధనుంజయునికి భద్రా దేవి మాటలు ఒక వరంలా తోచాయి. తనకో మార్గము చూపిన్చినట్టుంది. ఆ విధంగా`

ధనుంజయ భద్రాదేవి లిరువురూ జడల మాంత్రికుని అంతం జేసి నాగ రేడును రక్షించేందుకు సంసిద్ధులవుతూ తక్క సమయం కోసం జాగ్రత్తగా ఎదురు చూడ సాగారు.

ఈ లోపల`

అక్కడ అగ్ని వలయంలో`

హోమ గుండం ముందు`

జడల మాంత్రికుడు గంధర్వ లోకాధి దేవత యగు మోహినీ శక్తికి నిర్వహిస్తున్న పూజా కార్యక్రమం ముగింపు కొచ్చింది. అంత వరకు తన వికృతమైన గొంతుతో జరుపుతున్న మంత్రోచ్ఛారణ ముగించాడు. అయితే బలి ఖడ్గాన్ని వెంటనే తీసుకో లేదు. వెను తిరిగి అగ్ని వలయం వెలుపల నాగ లోకం వెళ్ళే గుహ మార్గం పరిసరాలు మొత్తం నిలుచుని  దిక్కు తోచక ఆశ్రు నయనాలతో చూస్తున్న నాగ లోక వాసుల వంక చూసాడు.

ఒక చేత్తో వక్ర దంతుని దగ్గరకు తీసుకుని భుజం తట్టాడు. ఎలుగెత్తి నిశితంగా చూస్తూ` ‘‘ఓ సర్ప జాతి ప్రజలారా! నాగ లోక వారసులారా. మీరంతా శ్రద్ధగా ఆలకించవలె. మీ ప్రభువు నాగ రేడును చివరి సారిగా దర్శించుకోండి. ఎందుకంటే కొద్ది సమయం లోనే నేను ఆయనను మోహినీ శక్తికి బలి యివ్వనుంటి. ఇక నుండి మీ నాగ లోకమునకు ప్రభువు, కొత్త నాగ రేడు ఈ వక్ర దంతుడు.’’ అంటూ ప్రకటించాడు.
ఆ ప్రకటన వినగానే నాగ జనంలో వక్ర దంతుడికి అనుకూలురైన కొంత మంది ఉత్సాహంతో చప్పట్లు చరిచి అభినందించారు. వక్ర దంతుని వదిలి జడల మాంత్రికుడు తీవ్రంగా చూస్తూ ఇంకా ఇలా హెచ్చరించాడు.

‘‘నేను ఆ బలి కార్యక్రమము ముగించు కొని గంధర్వ లోకము పోవుటకు ముందు, నా శక్తులు కొన్ని ఈ వక్ర దంతుని వశం జేసి పోయెద. ఇతడి ఆధిపత్యమును మీలో కొందరు ఆమోదించిన చాలదు. మీరంతా ఆమోదించి విధేయులయి వుండ వలె. కాదని ఎదిరించు వారిని అజేయుడగు వక్ర దంతుడు నిర్దయగా హతమార్చ గలడు. ఇది నా శాసనము. ఆన. ఇక నుండి, ఈ క్షణము నుండి మీ నాగ లోకాధిపతి వక్ర దంతుడు.’’ అంటూ పెద్ద స్వరంతో ప్రకటించాడు.

ఆ ప్రకటన వినగానే`

మహా రాణి కీర్తి మతి గొల్లున విలపిస్తూ`

ఒక్క సారిగా మూర్ఛిల్లి నేల కూలినది.

నాగ రేడు మహా పద్ముడు కళ్ళ ముందు జరుగుతున్నదంతా చూస్తూ కన్నీరు విడుస్తున్నాడు. ఇక తన చావు నిక్కమని తెలిసి తను ఆరాధించు దేవతలను తలచుకో సాగాడు.

ఇక జడల మాంత్రికుడు బలి నిర్వహించేందుకు సంసిద్ధుడయ్యాడు. రెండు చేతులతో పొడవాటి ఖడ్గాన్ని అందుకున్నాడు.
రెండు చేతులతో బలి ఖడ్గాన్ని లేపి ముందుగా హోమ గుండానికి నమస్కరించాడు. భగ భగ మండుతూ అగ్ని కీలలు మరింత పైకి లేచాయి. తదుపరి ఆకాశం వంక చూసి తను సమర్పిస్తున్న బలిని స్వీకరించి తనకు గంధర్వ లోకాధి పత్యం వరంగా యిమ్మంటూ కనులు మూసుకుని మోహినీ శక్తిని అర్థిస్తూ నమస్సులర్పిస్తున్నాడు. అప్పుడు... సరిగ్గా అప్పుడు జరిగిందా సంఘటన. ఎవరూ వూహించని ఒక మహాద్భుతం జరిగింది.

దక్షిణం వైపు పొదల మాటు నుండి తళ తళా మెరుస్తూన్న అర్ధ చంద్రాకారపు బాణం ఒకటి మెరుపు వేగంలో దూసుకొచ్చింది. గాలి శబ్ధానికి ఉలికి పడి జడల మాంత్రికుడు తల తిప్పే లోన ఆ బాణం వాడి మెడ భాగాన్ని నరికి తలను గాల్లోకి ఎగుర వేసింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulitabhandham