గతసంచికలో ఏం జరిగిందంటే .... http://www.gotelugu.com/issue191/552/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/
(గతసంచిక తరువాయి).. “నా పేరు రత్తాలు”
“మేడ మీదకి ఎందుకు వెళ్ళావు?”
“సాధారణంగా చిన్న రాజా వారు నిద్ర లేచి క్రిందకి వచ్చే దాకా లేదా ఆయన కాఫీ కోసమో మరి దేని కోసమో పిలిచే దాకా మేము ఎవ్వరం పైకి వెళ్ళం. కానీ ఆ రోజు ఉదయం ఎంతకీ ఆయన క్రిందకి రాక పోయే సరికి మిగిలిన గదులని శుభ్రం చేద్దామనే ఉద్దేశంతో నేను ధైర్యం చేసి పైకి వెళ్ళాను. వరండాలో నడుస్తూ చిన్న రాజా వారి గది ముందు నుంచి వెడుతున్న నేను ఆయన గది తలుపులు తెరిచి ఉండడం గమనించి, తల దించుకుని వెళ్ళ బోతున్న దాన్నల్లా లోపల ఏదో అసహజంగా ఉన్నట్టుగా అనిపించి తలెత్తి, గాలికి ఎగురుతున్న పరదాల వెనకనుంచి కనిపిస్తున్న దృశ్యాన్ని చూసాను.
లోపల కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తూ నా ప్రయత్నం లేకుండానే లోపలకి నడిచాను. గదిలో మంచమ్మీద పరుపూ దుప్పట్లూ అన్నీ ఎర్రగా రక్తంతో నిండి పోయి ఉన్నాయి. చిన్న రాజా వారు నిర్జీవంగా మంచమ్మీద అడ్డంగా పడి ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూనే నేను భయంతో గట్టిగా అరిచాను. వెంటనే నాకు కళ్ళు తిరిగినట్టనిపించింది. అలాగే క్రింద పడి పోయాను. తరువాత గంటకి మెలకువ వచ్చింది నాకు. క్రింద పడిన నన్ను బంగళాలో పని వాళ్ళు లేపి ఎత్తుకుని తీసుకు రావడం లీలగా గుర్తుంది” చెప్పింది రత్తాలు.
చెబుతున్నప్పుడు ఆమె కంఠం భయంతో ఒణకుతూ ఉండడాన్ని గమనించింది ఇంద్ర నీల. ఒక్క క్షణం ఏమీ మాట్లాడకుండా ఆగి, తరువాత నెమ్మదిగా అంది రత్తాలుని చూస్తూ “భయ పడకుండా నిదానంగా గుర్తు చేసుకుని నువ్వు గది లోకి అడుగు పెట్టే సరికి గదిలో వాతావరణం ఎలా ఉందో చెప్పు?”
రత్తాలు మరింత భయ పడుతున్నట్టుగా చూసింది.
ఇంద్ర నీల ఆమె భుజమ్మీద చెయ్యి వేసి “భయం అక్కర్లేదన్నాను కదా? నిదానంగా ఆలోచించి నీకు గుర్తొచ్చిన విషయాలు, నువ్వు గమనించినది చెప్పు చాలు!”
“రాజా వారి శరీరం మంచానికి అడ్డంగా పడి ఉంది. మంచమంతా రక్తంతో మడుగులు కట్టి ఉంది. మంచమ్మీద ఒక పక్కన పిడి కత్తి పడి ఉంది. ఆ దృశ్యం చూడగానే రాజా వారు ప్రాణాలతో లేరన్న విషయం అర్ధమైంది నాకు”
“చుట్టు పక్కల వాతావరణం ఎలా ఉంది?”
“అంటే?” అర్ధం కానట్టుగా అందామె.
“గదిలో వస్తువులు చిందర వందర చేసినట్టుగా గదిలో ఏమైనా గలాటా జరిగినట్టుగా ఆనవాళ్ళేమైనా కనిపించాయా?”
“లేదు మేడమ్. గదిలో వస్తువులన్నీ ఎక్కడివక్కడా ఉన్నాయి. ఎక్కడా దెబ్బలాట జరిగిన ఆనవాళ్ళేమీ కనిపించలేదు. మంచమ్మీద దుప్పటి మాత్రం నలిగి పోయి ఉంది అంతే”
“రాజా వారి గదికి వెనుక వైపు పెద్ద బాల్కనీ ఉంది కదా? ఆ బాల్కనీ తలుపులు వేసి ఉన్నాయా తీసి ఉన్నాయా?” గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా క్షణ కాలం పాటూ ఆగింది రత్తాలు. తరువాత చెప్పింది “రాజా వారికి ఆ తలుపులు తెరిచుకునే నిద్రించడం అలవాటు. ఎప్పటి లాగే నేను వెళ్ళే సరికి ఆ తలుపులు తెరిచే ఉన్నాయి. పరదాలు మాత్రం మూసి ఉన్నాయి”
“ఇంకా ఏమైనా ప్రత్యేకంగా ఆ గదిలో గమనించావా నువ్వు?”
“ఏమీ లేదమ్మా... అంతా మామూలుగానే ఉంది”
ఇంద్రనీల దూరంగా ఉన్న ఒక కానిస్టేబుల్ని పిలిచి ఏదో చెప్పింది. అతడు వెళ్ళి రెండు నిమిషాల్లో ప్లాస్టిక్ కవర్లో క్లూస్ టీమ్ సీల్ చేసిన రాజేంద్ర సూసైడ్ నోట్‍ని తీసుకుని వచ్చాడు. దాన్ని రత్తలుకి చూపిస్తూ అడిగింది ఇంద్రనీల “ఈ కాగితాన్ని గదిలో చూడలేదా నువ్వు?”
ఒక్క నిమిషం తడబడ్డట్టుగా అయింది రత్తలు “నిజమేనమ్మా... ఆ గదిలో ప్రత్యేకంగా ఏమైనా కనిపించిందా అని ఇందాకా మీరడిగితే ఖంగారులో మర్చి పోయాను. రాజా వారు పడి ఉన్న మంచం పక్కనే ఉన్న టీపాయ్ మీద ఈ కాగితం ప్రస్పుటంగా కనిపించేలా ఉంచి, గాలికి ఎగిరిపోకుండా దాని మీద పేపర్ వెయిట్ పెట్టారు. అది తప్ప ఆ గదిలో మరే తేడా లేకుండా అంతా మామూలుగా ఉంది” అంది.
ఇంద్రనీల తల ఊపి సర్వోత్తమరావుని పిలిచి చెప్పింది “ఈ పని వాళ్ళెవ్వరూ మనకి తెలియకుండా ఊరు విడిచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ సంగతి మీరు చూసుకోండి”
సరేనని తల ఊపాడు అతడు. ఆ తరువాత క్లూస్ టీమ్ దగ్గరకి వెళ్ళి అడిగిందామె “వేలి ముద్రలు సేకరించడం, క్లూస్ సేకరించడం పూర్తయిందా?”
“అంతా పూర్తయింది మేడమ్. పెద్దగా ఏమీ క్లూస్ దొరక లేదు. దొరికిన వాటిని సీల్ చేసి పెడుతున్నాం. ఎందుకైనా మంచిదని పై అంతస్థు మొత్తాన్ని ముందుగానే సీజ్ చేసాం కదా? ఇంకా ఏమైనా కావాల్సి వస్తే మళ్ళీ వెళ్ళి సేకరించచ్చు” అన్నాడు అతడు.
అప్పటి దాకా వాళ్ళు సేకరించిన క్లూస్‍ని పరిశీలించ సాగింది ఇంద్రనీల. గదిలో దుప్పట్ల మీద దొరికిన బ్లడ్ శాంపిల్స్, గది మూలల దొరికిన తల వెంట్రుకలూ, దుస్తుల నుంచి జారి పడిన గుండీలూ, ఆభరణాల నుండి జారి పడిన పూసలూ వగైరాలు... వాటి మీద వేలి ముద్రలు చెరిగి పోకుండా జాగ్రత్తగా సీల్డ్ కవర్లలో పెట్టి ఒక్కో క్లూ నీ సీల్ చేసి నెంబరింగ్ వేస్తున్నారు వాళ్ళు చాలా ప్రొఫెషనల్‍గా. బల్ల మీద ఉంచిన ఒక్కో వస్తువునీ పరిశీలిస్తున్న ఇంద్ర నీల దృష్టి ఒక క్లూ మీద పడింది. దాన్ని చూడగానే ఆమె గుండెలు దడ దడలాడాయి. ‘తన పని ఇంత సులువవుతుందనుకోలేదు’ అప్రయత్నంగా అనుకుంది మనసులో. క్లూస్ టీమ్ వాళ్ళు దాన్ని సీల్ చేసారేమో అన్న అనుమానం వచ్చి పరిశీలనగా చూసింది. అదృష్టవశాత్తూ వాళ్ళు దాన్ని సేకరించారు తప్ప ఇంకా సీల్ చెయ్య లేదు.
ఆమె ఉద్వేగం రెట్టింపయ్యింది. తనని ఎవరేనా గమనిస్తున్నారా అని చుట్టూ చూసింది. ఎస్సై ర్యాంకులో ఉన్న వ్యక్తి తమ పనిని పరిశీలిస్తుండటంతో క్లూస్ టీమ్ మొత్తం అటెంటివ్ గా ఉండి తన వైపే చూస్తున్నారు… చాలా అసహనంగా అనిపించింది ఇంద్ర నీలకి.
మొత్తం ముగ్గురు వ్యక్తులున్నారు. తమ పని మీద ఆమె ఏం కామెట్ చేస్తుందా అని భయ పడుతున్నట్టుగా ఉన్నారు వాళ్ళు. ఒక సారి వాళ్ళ వైపు చూసి, చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు అవసరమైన దాని కన్నా ఎక్కువ ప్లీజింగా ఉండేట్టుగా ముందరే జాగ్రత్త తీసుకుంది. ఆమె మామూలు గానే అందంగా ఉంటుంది. నవ్వితే ఆమె అందం ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు మంత్ర ముగ్ధులై ఆమె ఏం చెబితే అదీ చేసేట్టుగా ఉంటుంది.
వాళ్ళవైపు అలా నావ్వుతూ చూస్తూనే క్యాజువల్‍గా కదిలినట్టుగా పక్కకి కదిలింది ఇంద్రనీల. వాళ్ళ కళ్ళ మీదనుంచి దృష్టి మరల్చకుండానే లాఘవంగా ఆ వస్తువు మీద చెయ్యి వేసింది.
“ఎవరో కొత్త వ్యక్తి లోపలకి వస్తున్నారు, బహుశా రాజేంద్ర వర్మ మేన బావ సురేష్ వర్మ అనుకుంటా” అంది క్లూస్ టీమ్ చీఫ్‍తో. అతడు చేస్తున్న పని ఆపి వీధి గుమ్మం వైపు చూసాడు.
అప్రయత్నంగా మిగిలిన ఇద్దరూ కూడా గుమ్మం వైపు చూసారు.
లిప్తకాలంలో ఇంద్రనీల ఆ వస్తువుని చూపుడు వేలితో తీసుకుని అర చేతి లోకి మార్చుకుని గుప్పిట బిగించింది.
(వచ్చిన ఇంద్రనీల క్లూని మాయం చెయ్యడం వెనుక నున్న అసలు ‘క్లూ’ ఏమిటి? … వచ్చేవారం !) |