Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ముక్కు పచ్చలారని కాశ్మీరం - కర్రా నాగలక్ష్మి

                 ( శ్రీనగర్ ---2 )

చిరుచిరు చలిలో కశ్మీరీ చాయ్ తాగితే ఆ మజావే వేరు . దాల్ లేక్ వొడ్డున ' ఖేవా ' ( కశ్మీరీ టీ ) తాగి ' షాలీమార్ ఉద్యానవనం చూడ్డానికి వెళ్లేం . 

షాలీమార్ వుద్యానవనం ---

దాల్  సరస్సు ఒడ్డున వున్న మొఘల్ గార్డెన్లు ఒకదాని పక్కన ఒకటి వున్నాయి . వీటిలో శాలిమార్ ఉద్యానవనం పెద్దది కాగా నిశాంత్ బాగ్ , చశ్మ్ షాహి రెండు మూడు స్థానాలలో వున్నాయి . 

వీటిని మొఘల్ గార్డెన్స్ అని పిలవడానికి వీటినిర్మాణం మొఘల్ కాలం లో జరగడం లేదా పునః నిర్మాణం జరగడం కారణాలు కావొచ్చు .   చుట్టూరా వున్న నిలువెత్తు ప్రహారీగోడ ఉద్యానవనం అందాలను దాచేస్తూ వుంటుంది . ముఖ్య ద్వారానికి వున్న తలుపులు నగిషీలు చెక్కి వున్నాయి , వీటిని ప్రముఖ మందిరాలనుంచి తెచ్చి వుద్యానవనానికి పెట్టి నట్టుగా చెప్తారు . 

సుమారు 410 పౌంటెన్స్ తో దివానీ ఆమ్ , దివానీఖాస్ , పాలరాతి యురోపియన్ శిల్ప కళ తో నిర్మింపబడ్డ గదులతో మూడంతస్తులలో నిర్మింప బడింది . తీర్చి దిద్ది నట్లుగా వున్న చినార్ , సైప్రస్ వృక్షాలు , వరుసగా పెద్దపెద్ద పూలతో విరగబూసిన గులాబీ మొక్కలు ఓ వైపు , లిల్లీ లు మరో వైపు పెద్ద పెద్ద పళ్లేలంత పూసిన డలియా పూలు కళ్లు తిప్పుకోనివ్వవు  . క్రమ బద్దంగా పెంచుతున్న లాను , దూరంగా మొఘల్ , యూరోపియన్ కళతో కట్టిన కట్టడాలు వాటి వెనుక శివాలిక్ , మంచుతో కప్పబడ్డ పీర్ పంజాల్ పర్వత శ్రేణులు చూస్తూ వుంటే భూతల స్వర్గం యిదే అని అని పించక మానదు . 

దీనిని కూడా మొఘల్ గార్డెన్ అని అంటారు ,  ఐతే యీ వుద్యానవనం వనానికి అంతకన్నా పాత చరిత్ర వుంది , పాత అంటే క్రీస్తుశకం ప్రారంభ కాలం నాటి చరిత్ర . కల్హనుడు రచించిన ' రాజతరంగిణి '  ప్రకారం సుమారు 79 - 139 లలో పరిపాలించిన ప్రవరశేనుడు అతని గురువైన ' సుకర్మ స్వామి ' దర్శనార్థం ' హర్వాన్ ' వెళుతూ దాల్ సరస్సు వొడ్డున వున్న కుటీరం లో కొంత సమయం సేద తీరేవాడట . అక్కడి ప్రకృతి నచ్చి యీ ప్రదేశానికి ' షాలీమార్ ' గా నామకరణం చేసి చిన్న కుటీరం నిర్మించు కున్నాడు . ' షాలీమార్ ' కి సంస్కృతంలో ' ప్రేమ నివాసం ' అనే అర్దం వుంది . తరచు రాజుగారు వస్తూ వుండం తో యీ ప్రదేశాన్ని తీర్చిదిద్దేందుకు , రాజుగారి పరివారానికి సపర్యలు చేసేందుకు కాపలసిన దాసదాసీలకోసం గ్రామ నిర్మాణం జరిగింది . దానిని కూడా షాలీమార్ గా వ్యవహరించసాగేరు . 

ప్రవరశేనుడు తరువాత వచ్చిన రాజులు కూడా యీ ప్రదేశానికి వచ్చి సేదతీరేవారట , అలా యీ ప్రదేశానికి మెరుగులు దిద్ద సాగేరు . మొఘల్ చక్రవర్తు లలో విలాస పురుషుడిగా కీర్తింప బడ్డ జహంగీరు 1619 లో అతని ప్రియ పత్ని నూర్జహాను కి కానుకగా యించేందుకు అత్యంత శ్రద్ధ తో తీర్చిదిద్దించి ' ఫరా బక్ష ' నామకరణం చేసిన ఉద్యానవనం .  యేనుగుల పై పీర్ పంజాల్ పర్వత శ్రేణులను దాటుకొని రాజపరివారంతో యిక్కడ ప్రతీ సంవత్సరం వచ్చి గడిపేవారని చరిత్రకారులు చెప్తారు .

అతని తదనంతరం 1630 లో అధికారం లోకి వచ్చిన షాజహాను యొక్క జమ్మూ ప్రాంతపు అధికారి ఝఫర్ ఖాన్ నేతృత్వం లో విస్తీర్ణం పెంచి వుద్యానవనానికి  ' ఫియాజ్ బక్ష ' గా నామకరణం చేసేడు . ఆ తరువాత వచ్చిన పఠానులు , సిక్కు రాజులు  కూడా ప్రత్యేక శ్రద్ధ తో మరిన్ని ఆకర్షణలు కల్పించేరు . మహారాజా రంజిత్ సింగ్ కాలంలో యురేపియన్లు విశ్రాంతి తీసుకునేందుకు అనువుగా యురోపియన్  శిల్పకళ తో పాలరాతి గదుల నిర్మాణం జరిగింది . మహారాజా హరి సింగ్ పాలనలో విద్యుత్ దీపాల అలంకరణ జరిగింది . స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ద కారణంగా యివాళటి కి కూడా యీ ఉద్యానవనం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది . ఈ వుద్యానవనానికి కావలసిన నీటిని దాల్ సరస్సు నుంచి కాలువల ద్వారా మళ్లించేరు . 

       ప్రస్తుతం దీని విస్తీర్ణం 31 యెకరాలు . ఈ ఉద్యానవనం లో వున్న గూళ్లల్లో రాత్రి నూనె దీపాలు వెలిగించి వుంచుతారు , ఆ దీపకాంతుల వెలుగులో ఈ తోట అందం నాలుగింతలు పెరుగుతుందట , ఆ దీపకాంతుల వెలుగులో వుద్యానవనం స్వర్గాన్ని తలపిస్తుందట .
          మొత్తం వుద్యానవనాన్ని చుట్టి రావడానికి సుమారు నాలుగు గంటలు పడుతుంది .
చశ్మ షాహి -----
 
      '  చశ్మ ' అంటే ప్రాకృతికంగా యేర్పడ్డ నీటిజల , ' షాహి ' రాజరికపు అని అర్దం .  నీటి జల చుట్టూ నిర్మింపబడ్డ ఉద్యానవనం . ఉద్యానవన నిర్మాణం జరగక ముందు యీ నీటి జలను ' చశ్మ సాహెబ్ ' అని పిలువబడేది . కశ్మీరీ బ్రాహ్మణ సాధ్వి రూపభవాని సాహెబ్ యీ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఓ నాడు తన తపశ్సక్తి తో భూగర్భ జలాన్ని బయటకు తెచ్చిందట , అప్పటి నుంచి ఆ జలను చశ్మ సాహెబ్ గా పిలువ సాగేరు . షాజహాను ప్రకృతిలో అహ్లాదకరంగా వున్న యీ జల చుట్టూ   1632 లో వుద్యానవన నిర్మాణం చేసేడు , మొఘల్ గార్డెన్స్ లో చిన్నది , అత్యంత సుందరమైనది అయిన యీ ఉద్యానవనాన్ని షాజహాను పెద్ద కుమారుడైన ' దారా ' కు బహుమతిగా యిచ్చేడు . నీటి జల చుట్టూ సుమారు ఒక కిలోమీటరు విస్తీర్ణం గల యీ ఉద్యానవనం లో ముఖ్య ఆకర్షణ ' పరి మహల్ ' .  దారా ఔరంగజేబు చేతిలో హతమయ్యేంత వరకు ' పరి మహల్ ' లో జ్యోతిశ్శాస్త్రం అధ్యనం చేస్తూ  గడిపేవాడట . కొండ ప్రాంతాలలో సహజంగా వుండే యెత్తు పల్లాలను బాగా వాడుకొని అందంగా తీర్చిదిద్దిన వుద్యానవనం యిది . వుద్యానవన నిర్మాణం లో ఇరాన్ , పర్షియన్ ప్రభావం కనిపిస్తుంది . 
 
         '  చశ్మ షాహి ' నీటికి ఔషధగుణాలు వున్నట్లుగా చెప్తారు , అందుకే మొదటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారికి డిల్లీ లో నిత్య అవుసరాలకి కావలసిన నీరు యిక్కడ నుంచే వచ్చేదట .
         మూడు ఉద్యానవనాలు దాల్ సరస్సు ఒడ్డున ఒకదాని పక్కన ఒకటి వుంటాయి ,  1960 లలో ఒకపాటైనా యీ ఉద్యానవనాలలో నిర్మించేవారు . ఈ వుద్యానవనాలు చూసిన తరవాత మళ్లా ఆ సినిమాలు చూస్తే యేయే ప్రాంతాలలో ఆ సినిమాలను చిత్రీకరించారో మనకి గుర్తొస్తుంది . 
        ఇక్కడి వారు మనకి ఆయా సినిమాలను , పాటలను చిత్రీకరించిన ప్రదేశాలను చూపించి సంతోషపడుతూ వుంటారు .
   శంకాచార్య మందిరం , షికారా లో షికారు గురించి పై వారం చదువుదాం అంతవరకు శలవు .
మరిన్ని శీర్షికలు
weekly horoscope 30th december to 5th january