Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasa darahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సంక్రాంతి విశిష్టత - నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు

sankranti

భోగి, మకర సంక్రాంతి, కనుమ వైశిష్ట్యత చాంద్రమానం పాటించే తెలుగు వారు సౌరమానం ప్రకారం జరిపే పర్వాలలో ఇది ఒకటి. తెలుగు వారి ఇతర పండుగలవలె ఇది తిధి ప్రధానమైన పండుగ కాదు. ఈ పండుగ దక్షిణాయనానికి  చివరి రోజు. ధనుర్మాసానికి కూడ. రైతులకు పంట పర్యాయాలు ముగిసి ఈ భోగి పండుగ రోజుకు ఇంటికి వస్తాయి. వారికి వ్యవసాయం పనుల రద్దీ తగ్గి సుఖంగా కాలక్షేపం చేయడానికి కావాల్సినంత సమయం చిక్కుతుంది. చేతికి వచ్చిన పంటను తెచ్చుకుని భోగ భాగ్యాలు అనుభవించడానికి వ్యవసాయ దారులకు వీలు కలిగించే రోజు   కాబట్టి దీనికి భోగి పండుగ అనే పేరు వచ్చింది. దీనిని  బట్టి మనకు అర్ధం అయింది ఏమంటే "భోగి పండుగ " సుఖానుభవమైన పండుగ అని. భోగి నాడు తెల్లవారు జామునే లేచి , తలంటు స్నానం చేయడం తో భోగి పీడ వదులుతుంది.
భోగి  రోజు తెల్లవార గట్ల మంటలు వేస్తారు. వీనికి భోగి మంటలు అని పేరు. ఈ భోగి మంటలలో ఆడ పిల్లలు తయారు చేసిన గొబ్బిపిడకలు వేస్తారు. ఈ మంటలు వీధుల మధ్యలో వేస్తారు. భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు.

భోగిపండ్లు చిన్నపిల్లలకు ఎందుకు పోస్తారో తెలుసుకుందాము?  

పూర్వ కాలంలో బదరికావనం అనే దాంట్లో నరనారాయణులు తపస్సు చేసుకుంటుంటే వారికి బాగా ఆకలి వేసింది. సమీపంలో రేగు చెట్టు కనపడింది. అక్కడకు వెళ్ళి ఆ రేగు పండ్లను కోసుకుని తిన్నారు. అందుకే దానికి బదరీ ఫలం అనే పేరు. ఈ రేగు పళ్ళు సూర్యభగవానునికి ఇష్టమైన రోజు. సూర్యుడి రంగూ, రూపూ వున్న ఈ పండ్లను పిల్లల భోగి పండుగ నాడు తలపైన పోస్తే, ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి ఆశీస్సులు వారికి లభిస్తాయని నమ్మకం, ఆయుర్వేదంలో రేగుపళ్ళకి చాలా ప్రాధాన్యత కలదు. ఎందుకంటే ఇవి నేత్ర సంబంధమైన సమస్యలను, జీర్ణ సంబంధ సమస్యలను అరికడుతాయి. భోగి నాడు అయిదు సంవత్సరాల లోపు  పిల్లల తలపైన రేగిపండ్లు, చిల్లర నాణేలు, పూలు పోయాలి. దీని వలన వారు దీర్ఘాయుషులు అవుతారు.

సంక్రాంతి:

మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. కర్కాటక రాశిలో ప్రవేశించిన సూర్యుడు ధనుస్సు రాశి దాటే వరకూ అంటే ఆరు నెలలు దక్షిణాయనం ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. ఉత్తరాయణ పుణ్యకాలమని , దక్షిణాయనం అంత మంచిది కాదని అంటారు. వివాహాలు, ఉపనయనాలు సాధారణంగా ఉత్తరాయణం లోనే చేస్తారు. ఉత్తరాయణంలో చనిపోయిన వారు స్వర్గలోక ప్రాప్తి చెందుతారు. దక్షిణాయనం లో మరణించిన వారు ఉత్తరాయణం వచ్చే వరకూ స్వర్గ ద్వారాల వెంటే నిరీక్షిస్తారట. అందుకే ఉత్తరాయణ పుణ్య కాలం లో మరణం పుణ్యాత్ములకే కానీ లభించదు.     ఈ రోజు బ్రహ్మణులని ఆహ్వానించి  ఇంటిలో ఆసనం వేసి కూర్చుండబెట్టి వారికి నువ్వులతో నిండిన కంచుపాత్రలను దానం చేస్తారు. ఈ పాత్రలకు తిలా పాత్రలు అని పేరు. తగిన దక్షిణ కూడా ఇవ్వాలి. వీలైతే రాగి పాత్రలు, ఇత్తడి కుందులు, గొడుగులు ఇవ్వవచ్చు. ఈ మకర సంక్రాంతి రోజు మట్టి కుండలలో పెరుగును నింపి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి, దీని వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం వున్నవారు దానం చేస్తే ఆ సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. నందుని భార్య యశోద  బ్రాహ్మడికి పెరుగు దానం చేసినందువలనే శ్రీ కృష్ణుడు కొడుకుగా లభించాడు. ద్రోణాచార్యుని  భార్య కృపి దుర్వాసమహామునికి ఈ విధంగా కుండలో నింపిన పెరుగును దానం చేసినందువల్ల ఆమెకు ఒక చక్కని కొడుకు జన్మించాడు. అతడే అశ్వద్ధామ.  కావున మకర సంక్రాంతి పండుగకు దానానికి అంత విశిష్టత వుంది.

కనుమ:

పంటలు పండి ధాన్యము ఇంటి వద్దకు తెచ్చిన పిమ్మట వ్యవసాయకులు చేయు కర్మముగా చెప్పబడును. మకరసంక్రమణం వెళ్ళిన మరునాడు గొల్లలలను , వ్యవసాయకులు చేయు పశువుల పండుగ కనుమ నాడు గో పూజ చేయుదురు. ఆవుల్ని, దూడలని, ఎద్దులని శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. పశువుల శాలలు  పరిశుభ్రం చేస్తారు. మామిడాకు తోరణాలు కడుతారు. వ్యవసాయదారునికి పశువుకే ధనం. వాటి శ్రమ మూలంగా ఆ యేటి పంట చేతికి వచ్చిన సంక్రాంతి తరుణం లో కృతజ్ఞతా సూచకంగా వాటికి కొత్త బియ్యం తో పొంగలి వండి పెట్టే ఆచారం కలదు. తరువాత పూజ జరుగుతుంది. వీధుల వెంట మేలతాళాలతో ఊరేగిస్తారు. ఊళ్ళ చెరువులన్నీ అలంకృతమై ఒక మైదానం మీదకు చేరుతాయి. అక్కడ వాటి మీద పవిత్రోదకం చల్లుతారు. అవి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు లక్ష్మీ రాకకు సంతోషించినట్టుగా ఆహ్వానించి సంతోషిస్తారు. తెలుగు వారిలో ఒక నానుడి కలదు. అదేమంటే కనుము నాటి నుండి కాకి రూపు మనిషికి, మనిషి రూపు కాకికి వస్తుందట.  పూజాబాజనమైన గోవు యొక్క పూజకు ఉద్ధిష్టమైన  గొప్ప పర్వము  కనుమ పండుగ.
ఇది ఒక విధముగా కృతజ్ఞతను తెలిపే పర్వం. పంటలు పండజేసే భగవంతునికి పొలాల్ని దున్నే ఎద్దులకి అందరికీ కృతజ్ఞత తెలిపే పర్వం భోగి, మకరసంక్రాంతి, కనుమ.

సర్వేజనాసుఖినోభవంతు.   

మరిన్ని శీర్షికలు
cartoon competetion