Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 13th january to 19th january

ఈ సంచికలో >> శీర్షికలు >>

సంక్రాంతి నవ్వులు - అన్నమయ్య

 

1) ''వదినా! అన్నయ్యేమిటీ, టామీని పక్కింటి కుక్క మీదకు ఉసిగొల్పుతున్నారు?''

''ఏం చెప్పనొదినా! ఆయనదంతా వితండవాదం. పండక్కి కోడిపందాలే ఆడాలా? అంటున్నారు!''

*********

2) ''సుబ్బారావుగారూ! మీవాడు ఏంచేస్తున్నాడు?''

''నిన్నటివరకూ గాలి తిరుగుళ్లు తిరిగేవాడు. ఈరోజు గాలిపటాలు ఎగరేస్తున్నాడు!''

*********

3) ''బుజ్జీ! ఇక్కడ నా ఆఫీసు ఫైలు పెట్టాను. నువ్వేమైనా చూశావా?''

''నాన్నా! భోగిమంటల్లో పనికిరానివి వేస్తారు కదా?''

''ఒరేయ్.....''

''పనికిమాలినవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటావని అమ్మ నిన్ను తిడుతూంటేనూ... ఆ ఫైలు తీసుకెళ్లి....''

*********

4) ''సార్! మా మావగారు మొట్టమొదటిసారి సంక్రాంతి పండక్కి పిలిచారు. సెలవివ్వండి సార్ ప్లీజ్!''

''ఇందాక ఆయనే నీకోసం ఆఫీసుకు ఫోన్ చేశారు. తనకే సెలవు దొరకలేదంట! నువ్వేమీ వెళ్లక్కర్లేదులో!''

*********

5) ''ఏవండీ... ఓ పదివేలివ్వండి... నేను ముగ్గులేసుకోవాలి!''

''ముగ్గులకు పదివేలెందుకే?''

''ఏ(? కోడిపందాలకు మీరు లక్షలకు లక్షలు ఖర్చు చేయొచ్చు గానీ, నాకు ముగ్గులకు కనీసం పదివేలు కూడా ఇవ్వరా?''

*********

6) ''ఏమేవ్! హరిదాసు వాట్సప్ లోకి వచ్చాడు...''

''ఏంటట?''

''ఈసారి పండక్కి రావడం తనకు కుదరడం లేదంట! బియ్యం కొరియర్లో పంపించమంటున్నాడు!''

*********

7) ''మా మావయ్య స్కూలు టీచర్ కావడం నా చావుకొచ్చిందిరా!''

''ఎందుకురా, ఏమైంది?''

''ఏమవడమేంటి నా బొంద! పండక్కి పిలిచి రోజంతా 'సంక్రాంతి పండగ విశిష్ఠత ' పాఠం చెప్పి తర్వాత ప్రశ్నలడిగాడు...''

*********

8) 'భవతీ భిక్షాందేహీ' అన్న కేక విని సీత బయటకొచ్చింది.

''నువ్వు... నువ్వు... రావణాసురుడివి కదూ!'' అంది.

''ఛీ... అర్జెంటుగా హెయిర్ డ్రెస్సర్ నీ, కాస్ట్యూమర్ నీ, మేకప్ వాడినీ మార్చాలి...'' అని గొణుక్కుంటూ వెనుదిరిగాడు రావణాసురుడు.

*********

9. ప్రొడ్యూసర్ - సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నంత మాత్రాన సినిమా అంతా సంక్రాంతి గురించి వుండక్క్ర్లేదయ్యా అని నెత్తీ నోరూ బాదుకుని మరీ చెప్తే వినలేదు కదయ్యా...

డైరెక్టర్ - ఇప్పుడేమైంది సర్?

ప్రొడ్యూసర్ - ఏమావడమేంటీ, ఈమాత్రం కోడిపందాలు, భోగిమంటలు, పిండివండలు, రంగవల్లులు, గాలిపటాలు మనవూరిలో చూసుకోలేమా అంటూ అందరూ థియేటర్ల నుండి బయటకొస్తున్నారంట!

*********

10.''మీ పెళ్లై ఇన్నేళ్లైనా ఇంకా మీ మావగారు ప్రతి సంక్రాంతికీ పిలుస్తున్నారంటే... నిజంగా మీరు అదృష్టవంతులండీ!''

''నా బొంద. ఆయన మిలట్రీలో పనిచేశారు. పండగ మూడురోజులూ శత్రువులెవరూ ఊళ్లోకి రాకుండా చూడమని తుప్పుపట్టిన గన్నొకటి చేతికిచ్చి పొలిమేరల్లో నిలబెడతారు!''

మరిన్ని శీర్షికలు
story review