Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
telugu people selfish fellows

ఈ సంచికలో >> శీర్షికలు >>

బొట్టుపెట్టుకోవడం - నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు

traditional artical


బొట్టు పెట్టుకోవడం హిందువుల ప్రధాన ఆచారం. హిందువులను ఒక మతస్తులుగా కాక విశ్వతత్వాన్నిజీర్ణం చేసుకుని శాస్త్రీయమైన ఆచార వ్వవహారాలు కలిగిన భరతదేశంలోని వాసులు అని నిర్వచించడం సరియైనది. మన ఆచారాలలో ప్రధానమైన బొట్టును కూడా శాస్త్రీయమైన దృక్పథంతోనే హిందువులు ధరించుట ప్రారంభించారు.

హిందువులందరు అన్ని కులాల వారికి ఏదో ఒక మత చిహ్నమును ఉంచుకొనుట ముందునుంచి వచ్చినది. అన్ని కులాలయందు స్త్రీలుగాని, పురుషులుగాని వారి వారి ఆచారానుసారం మత చిహ్నమును ధరించుట వాడుకలో నున్నది. అందునూ స్త్రీలయందు ఖచ్చితంగా పెట్టుకోవాలని పద్దతి వచ్చింది. ప్రపంచంలో ఏ దేశాల్లోనైనా బొట్టు ధరించిన స్త్రీ భారత స్త్రీగానే సాక్షాత్కారిస్తుంది. శుభకార్యానికి నాందిగా బొట్టుపెట్టి పిలవడం మన హైందవ సాంప్రదాయం. మహిళకు నుదుట బొట్టు తన ఐదవ తనం కల్గివుందని గుర్తించడానికి ఒక మధురమైన చిహ్నం. మన సాంప్రదాయంలో ఏది వున్నా లేకపోయినా బొట్టుపెట్టి సాగనంపుతారు. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ ధరించేది బొట్టు. బొట్టు సౌందర్యం సాక్షాత్ లక్ష్మీ దేవిగా భావించి మన భారతీయులు గడపలకు సైతం బొట్టుతో అలంకరించి అందాన్ని ఆహ్వానిస్తారు. బొట్టు అనేది స్త్రీ సౌందర్యానికి చిహ్నమే కాకుండా ఇతరుల దిష్టి తగలకుండా ఉండునని విశ్వాసం. ఊయల్లో పసిపాప  మొదలు వృద్దాప్య మహిళ వరకు ప్రతి స్త్రీ బొట్టు ధరిస్తుంది.

కొంకుమ ఎరుపు రంగులో నుండును. మన జీవనజ్యోతిని నడిపించే రక్తము కూడా ఎర్రనిరంగు కలిగివుంటుంది. ఈ రంగు సూర్యశక్తిని ప్రతిబింబిస్తుంది. తనలో లీనం చేసుకుని సూర్యుని వేడిమిని తాకనివ్వదు. కుంకుమను నుదుటే ధరించాలి. శాస్త్రయుక్తంగా ఆలోచన చేస్తే మన శరీరంలోని సర్వనాడులను కలుపుతూ మెదడుకి సంకేతస్థానంగా నిలచి ఎల్లప్పుడూ జాగ్రదావస్థలో ఉండే   అత్యంత కీలకమైన "సుషుమ్నా నాడి" అక్కడ ఉంటుంది. దీనినే "జ్ణాననేత్రం" అంటారు. ఈ శక్తివంతమైన జ్ణాననేత్రానికి పగవారి దృష్టి పడకుండా, సూర్యతాపం తగలకుండా రక్తప్రసరణల ద్వారానూ, ఆలోచనాపరంపరల ద్వారానూ వేడిమిజనించి ఆ వేడిమిలో ఆ నేత్రం కరిగిపోకుండా ఎల్లప్పుడూ చల్లగా ఆ ప్రదేశాన్ని ఉంచటానికి కుంకుమ ఎల్లప్పుడూ ధరించాలి,

ప్రస్తుత నాగరికత గురించి పాశ్చాత్య విద్యా పరంగా మత చిహ్నమును ధరించుట అవమానంగా పరిగణించి, చాలామంది దానిని వదిలిపెట్టారు. దీనికి ముఖ్యకారణం వైజ్ణానిక కారణములు తెలియక పోవుటచే అని చెప్పవచ్చును. హిందువయిన ప్రతివ్యక్తి తమ తమ మత సంబంధమైన కుతులను ముఖమున తప్పక ధరించుట ఆచారం. భగవంతుని పూజచేయునపుడు కుంకుమ, పసుపు, గంధము, అక్షతలు వాడుక ముందు నుంచి ఉంది.

"కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం,
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం,
సర్వాంగే హరిచందనంచ కలయంచ కంఠేచ ముక్తావళీం,
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణిః "

అని శ్రీమన్నారాయుణ్ణి పూజిస్తారు. అలాగే పరమేశ్వరుణ్ణి భస్మధారి అని చెప్పినారు.

" చితాభస్మాలేపో గరళ మశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగ పతిహారీ పశుపతి"అని వర్ణించినారు. బ్రాహ్మణులందు విభూతి, గంధము స్మార్తులు, నామములను శ్రీవైష్ణవులు, గోపీచందనము మధ్వులు ధరిస్తారు. కొందరు శనివారము మొదలగు ప్రత్యేక దినములలో నామమును తప్పక ధరిస్తారు. మరికొందరు కేవలము కుంకుమను మాత్రమే పెట్టుకుంటారు.

విభూతి ధారణ ప్రయోజనం;-  రావి, మోదుగ మొదలగు సమిధలచే యజ్ణమును హోమ గుండమునందు హోమము చేయగా కాలిన బూడిదకు విభూతియని పేరు. మరియు గోమయముచే చేసిన పిడకలు కాల్చిన బూడిదకును విభూతి అని పేరు.

శ్లో" శ్రీకరంచ పవిత్రంచ శోక రోగ నివారణం,
లోకేవశీకరం పుంసాం భస్మత్రైలోక్య పావనం."  

తా" పవిత్రమైనది, లక్ష్మినిచ్చేది, శోకాన్ని రోగాన్ని పోగొట్టేది, అందరినీ వశం చేసేదియైన విభూతిని ధరిస్తున్నాను.  ఏ శ్లోకాలు రానివారు పై శ్లోకంతో గాని, " నమశ్శివాయ" మంత్రముతో గాని జపించి భస్మధారణ చేయాలి. స్త్రీలు, సన్యాసులు పొడి భస్మమును మాత్రమే ధరించాలి. అన్ని వస్తువులు కాలిపోతే బూడిద మిగులుతుంది. బూడిదను కాలిస్తే బూడిదే మిగులుతుంది. అంటే నాశనం లేనిదన్న మాట. నాశనం లేని వస్తువుతో నాశనం లేనివాణ్ణి కొలుస్తున్నాం. అన్నీ బూడిదే అయిపోతాయని వైరాగ్య భావం. నామధారణ ప్రయోజనం ;-  దీనికే "ఊర్ధ్వపుండ్రము" అని మరొక పేరు. అనగా నిలువు బొట్టు పెట్టుకొనుట. ఊర్ధ్వపుండ్రము పెట్టుకునేవారు ఉపయోగించే మట్టి పర్వతాగ్రాలపై ఉన్నదిగాని, గంగాదినదులలో ఉన్నదికాని, తులసి మొక్క మొదట్లో నున్న మట్టిగాని వాడాలి. గృహస్థుడు  పన్నెండు చోట్ల ధరించాలి. అవి లలాటము, ఉదరము, హృదయం, కంఠకూపము, ఉదరము యొక్క కుడివైపు, ఉదరము యొక్క ఎడమవైపు, కుడివైపు బాహువు మధ్య, కుడికంఠము, ఎడమ బాహువు  మధ్య, ఎడమ కంఠము, పృష్ఠ ప్రదేశము, మెడమీద. కేశవ నామములతో గానీ " నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్" అను మంత్రముతో గానీ ధరింపవలెను.

గోపీచందన ధారణ ప్రయోజనం;-  ఇది పచ్చని మన్ను. ఈ మన్ను శ్రీకృష్ణుని పవిత్ర పాదములచే పునీతమైనది. ఇది రక్తనివారిణి మరియు రక్తదోషనివారిణిగా పనిచేయును. మొత్తానికి విభూతి , భస్మము, మృత్తికా ఇవన్నీ శరీరము నందుండు హెచ్చు ఉష్ణమును తీసుకుని దేహమునకు ఎంత కావలెనో అంత మాత్రమే ఉండుటకు సహాయపడును.  ఈ సంధర్భములో వ్యాయామశాలయందు , వ్యాయామము చేసిన తర్వాత ఎర్రమట్టిని కంఠం వరకూ వేసుకుని కొంతకాలము కూర్చొనుట అనునది సర్వసాధారణము. ఇది మన సమాజములో పురాతనము నుంచి వస్తున్న పద్ధతి. దీనితో శరీరమునకు మన్ను ఎంత సహాయకారియో అర్థమవుతోంది కదా.

శ్రీగంధము ధారణ ప్రయోజనం ;- ఇది కూడా శరీర ఉష్ణమును కాపాడును. ప్రియమైన సువాసన కలిగి శరీర దుర్గంధమును పోగొట్టును. మిక్కిలి చలువ చేయును. పైత్యమును శమింపచేయును. రక్తదోషములను హరించును. వీర్యవృద్దిని కలిగించును. విష, క్రిమిహరము, దప్పిక కట్టును. అంత స్తాపమును హరించును. నేత్రములకు కాంతిని కూర్చి శరీరమునకు కాంతినిచ్చును. చర్మరోగములకు రామబాణము వంటిది. బలము, తేజస్సు కలిగించును. గాయములు మాన్పును. స్ర్తీలు దవడల క్రింద రెండు వైపులా తడి గంధాన్ని ధరిస్తారు. సాధారణంగా శుభకార్యాలు, పేరంటాల్లోతప్పనిసరిగా స్త్రీ పురుషులను కుంకుమ, గంధములతో సత్కరిస్తారు. ఇలా ధరించిన విభూతి, గంధము మరియు కుంకుమలు శరీరాన్ని మరియు మనస్సును శుభ శక్తితో శక్తితో నింపుతుంది.

నొసటిపై ధరించు బొట్టు జ్ణానానికి చిహ్నం. ఈశ్వర ప్రియమైన విభూతి జ్ణానాలయానికి సంకేతం. విభూతి, గంధం మరియు కుంకుమ జ్ణాన దర్శనానికి అనగా ఆత్మసాక్షాత్కారానికి, భగవత్ సాక్షాత్కారానికి చిహ్నం. ఇలా తిమూర్తులను మరియు విశ్వదేవతా శక్తులను గౌరవించునట్లుగా బొట్టును ధరించడం జరుగుతుంది.

సర్వే జనాః స్సుఖినో భవంతు.

మరిన్ని శీర్షికలు
chmatkaram