గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండిhttp://www.gotelugu.com/issue200/575/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/
( గతసంచిక తరువాయి ) .. కాసేపు పాణి ఏమీ మాట్లాడలేదు. “ఇప్పుడు మీరు చూసిన ఈ బ్రవుజింగ్ హిస్టరీ చాలా మంచి క్లూ. రేపు బంగళాలో వ్యక్తులని ఇంటరాగేట్ చేసినప్పుడు నాకు చాలా ఉపయోగపడుతుంది” అంది.
సరిగ్గా అదే సమయంలో పాణి సెల్‍కి మెసేజ్ వచ్చినట్టుగా ‘బీప్’ మన్న శబ్దం అయింది.
మెసేజ్ తెరిచి చూసిన పాణి అన్నాడు ఆమెతో “సుకన్య మెడికల్ షాప్ కి వెళ్ళిన మా స్నేహితుడు ఇచ్చిన మెసేజ్. ఆ నిద్ర మాత్రలని ఆ షాపులో చనిపోయే ముందు రోజు రాజేంద్ర వర్మ పేరుతో కొన్నట్టుగానే బిల్లు ఉందట!”
“ఆశ్చర్యంగా ఉందే? మనం దీన్ని హత్యగా అనుమానిస్తుంటే, దొరికే సాక్ష్యాలన్నీ ఆత్మహత్యగా నిరూపిస్తున్నాయి” అంది ఇంద్రనీల.
“ఇందులో పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు. ఇది నేను ముందుగానే ఊహించాను” అన్నాడు పాణి.
“ఎలా?”
“ఆత్మహత్య చేసుకున్నాడన్న దానికి ప్రూఫ్‍గా నిద్ర మాత్రలని శవం పక్కన వదిలేయాలన్న తెలివి తేటలున్న హంతకుడు పోలీసులు మరింత ముందుకు ఇన్వెస్టిగేట్ చేస్తారని కూడా ఊహించగలడు. అందుకే ఆ నిద్ర మాత్రలని కచ్చితంగా రాజేంద్ర వర్మ పేరు తోనే కొని ఉంటాడని నేను ముందుగానే ఊహించాను”
“అయి ఉండచ్చు. ఇంక మనం ఎక్కువ సేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్ళిపోదామా?” అంది. అతడు కంప్యూటర్ షట్ డౌన్ చేసి లేచాడు.
****
తన గదిలోకి వెళ్ళిన ఇంద్రనీల తలుపులు గడియ పెట్టుకుని సెల్లోంచి ఒక నెంబర్‍కి డయల్ చేసింది. ఆమె ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఒక్క రింగ్‍కే ఫోన్ లిఫ్ట్ అయింది.
“ఎంత వరకూ వచ్చింది?” అంది అవతల కంఠం.
“మధ్యాహ్నం దాకా జరిగింది చెప్పాను కదా? అంతకు మించి ఇంకే కొత్త విషయాలూ తెలియలేదు. ముంబై నుంచి వచ్చిన ఆ పాణి మాత్రం నా పనికి బాగా అడ్డు తగులుతున్నాడు. నిజంగా అతడు రాజేంద్ర స్నేహితుడో కాదో తెలియదు కానీ, నాకు మాత్రం అడ్దు తగులుతున్నాడు. అతడు ఇక్కడుండగా మన పని జరిగే సూచనలు కనిపించడం లేదు”
“డిటెక్టివ్ అంటున్నావు కదా? అతడి సాయం కూడా తీసుకుంటే మన పని సులువవుతుందేమో ఆలోచించు”
“అతడెవరో ఎలాంటి వాడో తెలుసుకోకుండా సహాయం అర్ధిస్తే మొదటికే మోసం రావచ్చు”
“ఒక రోజంతా అతడితో గడిపావు. ‘ఎవరో ఎలాంటి వాడో’ ఇంకా తెలుసుకోలేదా?” చిలిపిగా నవ్వింది అవతలి కంఠం.
“నోరు మూయ్” అంది ఇంద్రనీల కోపంగా.
“నేనేం జోక్ చెయ్యడం లేదు. అన్ని తెలివితేటలున్న నీకు అతడెలాంటి వాడో ఇంకా నీకు తెలియలేదంటే నమ్మను అంటున్నాను”
“మిగిలిన విషయాలు బయట పడడం లేదు కానీ, రసికుడని మాత్రం బాగా తెలుస్తోంది. చూపులు కొంచెం తేడాగా ఉంటున్నాయి” తనని చూసినప్పుడల్లా అల్లరిగా నవ్వే అతడి కళ్ళు గుర్తొచ్చి అంది ఇంద్రనీల కసిగా.
“అతడు అందంగా ఉంటాడా?”
“అవును. ఎందుకలా అడిగావు?”
అవతల నుంచి నవ్వు వినిపించింది. “నీలాంటి వయసులో ఉన్న ఆడ పిల్లలకి అందమైన మగాడు మామూలుగా చూసినా, తేడాగా చూస్తున్నట్టు అనిపించడం సహజం”
“షటప్” అంది ఇంద్రనీల కోపంగా “నేను ఆడపిల్లనే కానీ అందరిలాంటి మామూలు ఆడపిల్లని కాను. అతడిలో ‘ఆ’ బలహీనత ఉందని కచ్చితంగా చెప్పగలను”
అవతల నుంచి మళ్ళీ నవ్వు వినబడింది. “ఓకే, ఒకే కూల్ బేబీ. నువ్వు చెప్పిందాన్ని నమ్ముతున్నాను. బలహీనతలనే ఆయుధాలుగా చేసుకోమంటారుగా పెర్సనాలిటీ డెవలప్ మెంట్ ట్రైనర్లు. అతడి బలహీనతని నీ ఆయుధం చేసుకో” సలహా ఇస్తున్నట్టుగా అంది.
“ఏదో ఏడుస్తాలే, నువ్వు ఫోన్ పెట్టేయ్, గుడ్ నైట్” అంది ఇంద్రనీల ఫోన్ పెట్టేస్తూ.
ఫోన్ పెట్టేసాక, అప్పటిదాకా తను మాట్లాడిన డయల్డ్ నెంబర్లలో కనిపిస్తున్న చివరి పేరుని మురిపెంగా చూసుకుంటూ ‘జోక్ గా అన్నా, నాకు మంచి హింటే ఇచ్చావే బంగారం!’ అనుకుంది.
కొద్ది సేపయ్యాక నిద్రపట్టక మళ్ళీ ఆ నెంబరుకి ఫోన్ చేసింది. ‘మీరు డయల్ చేసిన నెంబరు ప్రస్తుతం స్విచాఫ్ చేయబడి ఉంది, లేదా అవుటాఫ్ కవరేజ్ యేరియాలో ఉంది. దయచేసి కాసేపాగి డయల్ చేయండి’ అన్న సర్వీస్ మెసేజ్ వినిపించింది.
‘ఇప్పుడే కదా మాట్లాడింది? అప్పుడే స్విచాఫ్ ఎలా అయిపోతుంది?’ అనుకుని కట్ చేసి మళ్ళీ డయల్ చేసింది. తిరిగి అదే మెసేజ్ వినిపించింది. ఫోన్ పక్కన పడేసి రెండు నిమిషాలాగి మళ్ళి డయల్ చేసింది. మళ్ళీ అదే మెసేజ్. అలా దాదాపు పది సార్లు చేసింది. ప్రతిసారీ అదే మెసేజ్ వస్తోంది.
‘నీ ఫోన్ కోసం సెల్ మెళ్ళో వేసుకుని తిరుగుతూ ఉంటాను. నీ టైమ్ వేస్ట్ చెయ్యకుండా ఒక్క రింగ్‍కే ఫోన్ ఎత్తుతానన్న మనిషి అలా ఎలా స్విచాఫ్ చేసుకుని కూర్చుంది?’ విసుగ్గా అనుకుంది.
‘బంగారం’ అని ఆమె సెల్లో సేవ్ అయిన ఆ నెంబరు గల వ్యక్తి అసలు పేరు ‘బంగారు లక్ష్మి!’
ఇంద్రనీల ఫోన్ కాల్ ఆమె ఆన్సర్ చెయ్యలేకపోవడానికి కారణం ఆమె ఫోన్ బలవంతంగా స్విచాఫ్ చెయ్యబడటమే. సరిగ్గా ఆ సమయానికి ఆమె తన ఇంట్లో కుర్చీకి కట్టి వెయ్యబడి, నోట్లో గుడ్డలు కుక్కబడి, కణతల మీద తుపాకి గురిపెట్టబడి ఉంది !
****
ఇంద్రనీలతో ఫోన్లో మాట్లాడిన రెండు నిమిషాలకి బంగారు లక్ష్మి ఇంటి కాలింగ్ బెల్ మ్రోగింది. ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కతే ఉంది. ‘ఈ సమయంలో తన ఇంటికి వచ్చేదెవరై ఉంటారన్న’ ఆలోచన ఆమెకి రాలేదు. అంత ‘ఈజీ గోయింగ్’ మనస్థత్వం ఆమెది. తనకి నచ్చిన ఒక సినిమా పాటని కూని రాగం తీస్తూ వెళ్ళి, కనీసం కీ హోల్‍లోంచైనా చూడకుండా తలుపు తీసింది.
ఆమె తలుపు తీయడంతోనే బలిష్టంగా ఉన్న నలుగురు మగాళ్ళు ఆమెని తోసుకుంటూ లోపలకి వచ్చి, వెను వెంటనే తలుపులు గడియ వేసేసారు.
“ఎవరు మీరు?” అంది ఆమె ఆశ్చర్యంగా.
వాళ్ళు ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పె ఉద్దేశం కూడా వాళ్ళకి లేనట్టుగా అసలు ఆమె ప్రశ్ననే వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు. ఒకసారి చుట్టూ పరికించి చూసారు. ముగ్గురు ఆమె చుట్టూ నిలబడితే, ఒకడు గబ గబా లోపల గదుల్లోకి వెళ్ళి లోపలెవ్వరూ లేరన్న విషయాన్ని నిర్ధారించుకుని వచ్చాడు. వస్తూ వస్తూ వెనక వైపు తలుపులు కూడా గడియ వేసి ఉన్నాయో లేదోనని చెక్ చేసి మరీ వచ్చాడు
.. |