Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu..aame..oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

సీరియల్

గతసంచికలో నాగలోక యాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. http://www.gotelugu.com/issue200/576/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

 

(గతసంచిక తరువాయి) ..

యుద్ధం ` అది విధ్వంసం.

యుద్ధం ` అది వినాశకరం.

యుద్ధం ` భయానకం.

యుద్ధం ` అభివృద్ధి నిరోధకం.

యుద్ధం ` అది మృత్యు క్రీడ.

శాంతి కాముకుయిన రత్నగిరి ప్రజలు గాని ప్రభువు గాని యుద్ధాన్ని కోరుకో లేదు. రాజ్య కాంక్షతో ప్రత్యర్థులే పోరుకు తెర తీసారు. కాబట్టి ఆత్మ రక్షణ కోసం రత్నగిరి యుద్ధం చేయక తప్పదు. రత్నగిరి ప్రభువులు శాంతి కాముకులే కాదు, శౌర్య ప్రతాపాల్లో తీసి పోరని లోకానికి తెలుసు. అది మరో సారి రుజువు చేయాల్సిన సమయం వచ్చింది.

అధికార కాంక్షతో అంతర్యుద్ధం ఆరంభించిన ఉప సైన్యాధ్యక్షుడు బాహ్లీకునికి, అటు బాహ్లీకుని అడ్డు పెట్టుకుని రత్నగిరి సింహాసనం మీద కన్నేసిన గాంధార రేడు శతానీకునికి రాత్రి బలమైన ఎదురు దెబ్బలే తగిలాయి. కోలుకోడానికి ఈరోజు యుద్ధ విరామం కోరుకో వచ్చు. కాని తమకు ఆ అవసరం లేదు. ఇంట్లో చేరిన విష కీటకాల్ని వెదికి వెదికి చంపినట్టు రాజ్యంలో చొర బడిన శతానీకునికి... ఇంటి దొంగ బాహ్లీకునికి తగిన బుద్ధి చెప్పాలి.

రత్నగిరి సైన్యం సగం, కళింగ సైన్యం సగం కలిసి రథ గజ తురగ పదాతి దళాలతో సహా మహా రాజు ధర్మ సేనుడి వెంట పది యోజనాల దూరంలో తీరం చేరిన శతానీకుని వైపు తరలింది. మాళవ యువ రాజు ఇంద్ర జిత్తు, మహా మాత్యుడు వాసు దేవ నాయకుడు ప్రభువు వెంట వున్నారు.

ఇక మిగిలిన సైన్యంలో అయిదు వేల సైన్యాన్ని తీసుకుని ధనుంజయుడు బాహ్లీకునికి బాసటగా వస్తున్న పాతిక వేల గాంధార అశ్విక దళాలకు ఎదురు వెళ్ళాడు. మిగిలిన రత్నగిరి, మాళవ సేనలు సర్వ సైన్యాధ్యక్షుడు అర్కుని నాయకత్వంలో బాహ్లీకుని కోసం లోయ ప్రాంతాల వైపు కదిలాయి. భద్రా దేవి, మణి మేఖల అర్కుని వెంట వున్నారు.

ఇక ఆరంభమైంది భయంకర యుద్ధం.

ఆ యుద్ధం మూడు చోట్ల ఆరంభంలో కేంద్రీకృతమైంది. ముందుగా ఆరోజు మధ్యాహ్నానికే యువరాజు ధనుంజయుడు తన అశ్విక దళంతో ఎదురు వెళ్ళి బాహ్లీకునికి బాసటగా వస్తున్న పాతిక వేల గాంధార అశ్విక దళం మీద విరుచుకు పడ్డాడు. మూడు దినాలు రేయింబవళ్ళు సాగిన ఆ ఘోర యుద్ధంలో ధనుంజయుడు పాతిక వేల అశ్విక దళాన్ని సమూలంగా తుడిచి పెట్టేసి అక్కడి నుండి వాయువ్యంగా శతానీకుడితో ప్రధాన యుద్ధం జరుగుతున్న సముద్ర తీర ప్రాంతాల వైపు తన అశ్విక దళంతో సాగి పోయాడు.

ఇక అక్కడ చావు తప్పి కన్నలొట్ట పోయిన చందంగా తీరం చేరిన గాంధారాధీశుడు శతానీకుడు అతడి అశేష సేన ఆ రోజంతా అక్కడే విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయం దక్షిణంగా రత్నగిరివైపు కదలింది. అంతలో రత్నగిరి సైన్యం తమ వైపు తరలి వస్తున్న సంగతి తెలిసింది. వేగులు తెచ్చిన సమాచారం అతడ్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే, స్వయంగా రత్నగిరి ప్రభువు తన సేనల్ని నడిపిస్తున్నాడు. వెంట మహా మాత్యుడు వాసు దేవ నాయకుడు, మాళవ యువ రాజు ఇంద్ర జిత్తు వున్నారు. మహా రాజు పుట్ట వ్రణం నుండి సంపూర్ణ ఆరోగ్యవంతుడు గావటం, యువరాజు క్షేమంగా తిరిగి వచ్చిన విషయం ఇవి రెండూ శతానీకునికి శరాఘాతం వంటి వార్తలే. అయినా ఇంత వరకు వచ్చాక వెనక్కు తగ్గే ఆలోచన శతానీకునికి లేదు. ఇక వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఆరంభమయ్యాయి. రత్నగిరి సేన మూడు భాగాలుగా విడి పోయి శతానీకునిపై ముప్పేట దాడి ఆరంభమైంది. సంకుల సమరం బీభత్సంగా సాగింది.

ఇక అటు బాహ్లీకుని కోసం కదిలిన అర్కుని సేన సాయంకాలానికే నేరుగా పోయి లోయ ప్రాంతాలను చుట్టు ముట్టి బాహ్లీకుని అతడి సైన్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. భీకర యుద్ధం ఆరంభమైంది.

అర్కము అంటేనే పిచ్చి కుక్క యని అర్థం.

రెచ్చి పోయిన పిచ్చి కుక్క విచక్షణా రహితంగా దాడి చేసినట్టు అర్కుడు రెచ్చిపోయి ప్రత్యర్థుల్ని వూచ కోత కోసే దృశ్యం చూడ వలసిందేగాని చెప్పనలవి కాదు. అసలు సర్వ సైన్యాధ్యక్షుడైన అర్కుడు తమ వైపు వస్తాడని బాహ్లీకుడు వూహించ లేదు. అదలా వుంటే ఇక పురుష వేషం లోని భద్రా దేవి, మణి మేఖల ఇరువురి శౌర్య పత్రాపాలు వర్ణనాతీతం.

మొత్తం ఏడు రోజులు సాగిందక్కడ పోరు.

బాహ్లీకుడు గొప్ప యోధుడే. అందులో సందేహం లేదు. సైన్య పరంగా కూడ అప్పటికీ అతడిదే పై చేయి. కాని అర్కుని వర్గం పోరాట పటిమ ముందు అతడి సేనలు నిలువ లేక పోయాయి. ఇరు వైపులా ఎందరో వీరులు నేలకొరుగుతున్నారు. అశ్వాలు విగత జీవులవుతున్నాయి. నెత్తురు ఏరులై ప్రవహించింది. ఏడో రోజు భీకర పోరాటంలో బాహ్లీకుడు భద్రా దేవి, మణి మేఖల ఇరువురికీ చిక్కాడు. అతడ్ని తరిమి తరిమి అశ్వం నుండి పడగొట్టింది మణి మేఖల. అతడ్ని నిరాయుధుడ్ని చేసింది భద్రా దేవి. చండిక లా వాడ్ని కాలితో తొక్కి పట్టి ఖడ్గం లేపింది. దేవీ దత్తమైన ఆ ఖడ్గానికి ఎదురు లేదు. ‘‘రేయ్‌ విశ్వాస ఘాతకా. నీకు రత్నగిరి సింహాసనం కావలెనా? నమ్మిన ప్రభువునే వెన్నుపోటు పొడిచిన పిచ్చి కుక్కవి. ఇంత నీచానికి పాల్పిడిన నీకు ఒక ఆడదాని చేతిలో కుక్క చావు చచ్చావను సంగతి జన్మ జన్మకీ గురుతుండవలె. నీకు బతికే అర్హత లేదు’’ అంటూ ఒకే వేటుతో వాడి తల నరికి శూలానికి గుచ్చి పైకి లేపింది.

ఎప్పుడైతే బాహ్లీకుని అంతం చూసారో ఇక ఎవరి కోసం యుద్ధం చేయాలన్న నిరాశతో చావగా మిగిలిన ఇరవై వేల బాహ్లీకుని సేన అర్కునికి లొంగి పోయింది. ఆ విధంగా లోయ ప్రాంతంలో యుద్ధం ముగియటంతో అర్కుని వర్గం ప్రధాన రణ క్షేత్రమైన సముద్ర తీర ప్రాంతం వైపు బయలు దేరింది.

శతానీకుడు తలచింది ఒకటి, జరిగింది ఒకటి అయింది. అతి సులువుగా రత్నగిరి తన వశమవుతుందన్న అతడి అంచనా అంతా తారుమారయింది. ఆరంభంలో తనదే కాస్త పైచేయిగా వున్నా నాలుగో రోజు స్వయంగా ధనుంజయుడు తన సైన్యంతో వచ్చి చేర గానే అతడి రంగ ప్రవేశంతో పరిస్థితి మారింది. బాహ్లీకుని అంతం చేసిన అర్కుని వర్గం ససైన్యంగా పదో రోజుకి వచ్చి చేరటంతో ప్రభువు ధర్మ తేజుని సైన్యం పరి పుష్టమై తెగించి పోరాడ సాగింది. మహా వీరులయిన ధర్మ తేజుడు, ధనుంజయుడు, మాళవ యువరాజు ఇంద్ర జిత్తు, మహా మాత్యుడు వాసు దేవ నాయకుడు, సర్వ సైన్యాధ్యక్షుడు అర్కుడు, భద్రా దేవి, మణి మేఖల ఇంకా అరి వీర భయంకరులు విశ్వాస పాత్రులయిన రత్నగిరి దళపతులు సేనాపతులు పాల్గొన్న మహా యుద్ధమది.

ద్వాపర యుగాంతంలో జరిగిన కురు క్షేత్ర సంగ్రామం తర్వాత కలి యుగం నాలుగో శతాబ్ధంలో సంభవించిన రెండో అతి పెద్ద యుద్ధమది. మొత్తం ఇరు పక్షాలూ కలిపి అయిదు వేల అక్షౌణీ సైన్యం పాల్గొన్న మహా సంగ్రామం. పదకొండు దినాలు రేయింబవళ్ళు సాగిన ఆ ఘోర సంగ్రామంలో ఎందరో వీరులు మరణించారు. ఇరు పక్షాల్లోనూ కలిపి నాలుగు ఆక్షౌణీ సైన్యం తుడిచి పెట్టుకు పోయింది. ఎటు చూసినా పీనుగుల కుప్పలు, వేలాది అశ్వాలు, ఏనుగులు మరణించాయి. మృత్యువు విలయ తాండవం చేసింది. సుమారు మూడు ఆక్షౌణీ సేనలతో తరలి వచ్చిన శతానీకుడికి చివరకు ముప్ఫై వేల సైన్యం కూడా మిగల్లేదు. ఓటమి తప్పదని ఇవాళో-రేపో తను రత్నగిరి సేనకి పట్టు బడక తప్పదని శతానీకుడు గ్రహించాడు.

రత్నగిరికి పట్టుబడితే జరిగేదేమిటో కూడ తెలుసు. రత్నగిరికి నష్ట పరిహారం చెల్లించాలి. చెల్లించినా తనను ప్రాణాలతో వదులుతారో లేదో తెలీదు. చివరకు ఓటమికి భయ పడిన శతానీకుడు పదకొండో రోజు రాత్రి చీకటి మాటున మిగిలిన తన సేనలతో పారిపోయి, తమ నౌకలను చేరుకొని తిరోముఖుడైనాడు. విషయం గ్రహించి రత్నగిరి నౌకలు కొంత దూరం తరుముకెళ్ళాయి గాని శతానీకుడు తప్పించుకున్నాడు.

రత్నగిరి విజయ పతాక ఎగుర వేసింది.

ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసింది ఈ యుద్ధానికి మూల కారణమైన వాడు బాహ్లీకుని అంటి పెట్టుకుని వున్న శతానీకుని మనిషి కరోతి. యుద్ధారంభంలోనే వాడు బాహ్లీకుని ఇంటి నుంచి మోయ గలిగినంత ధనం మూట గట్టుకొని రత్నగిరి వదిలి ఉత్తరంగా సాగి పోయాడు. అలా వెళ్ళిన వాడు తపతీ నదీ తీర ప్రాంతాల్లో బంది పోటు దొంగలకు చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వాడు మోసుకొచ్చిన ధనాన్ని దొంగలు దోచుకు పోయారు.

ఇక భూతం ఘృతాచికి యుద్ధం సాగిన పదకొండు దినాలు విందు భోజనంలా సాగింది. తన రుధిర దాహం తీరేలా మృత వీరుల శరీరాల నుంచి గోరు వెచ్చని నెత్తురు తాగుతూనే వుంది. అలా తన రుధిర దాహం తీరగానే యుద్ధం ముగిసిన మూడో రోజునే దేహ త్యాగం చేసింది. ధనుంజయుడు భూతం ఘృతాచికి ఘనంగా అంత్య సంస్కారాలు జరిపించాడు.

యుద్ధం ముగిసింది.

కాని యుద్ధం సృష్టించిన విధ్వంసం నుండి రత్నగిరి తేరుకుని సాధారణ పరిస్థితులు నెలకొనడానికి రెండు మాసాలు పట్టింది. పది దినాలు రత్నగిరిలో సమర విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఇక యుద్ధంలో ఘోర పరాజయం పాలై తప్పించుకు పారి పోయిన శతానీకుని నౌకలు పక్షం దినాలకు కరూర దేశం ఓడ రేవుకు చేరుకున్నాయి. గాంధార రాజు సైన్యం వెంట కరూర ఓడ రేవులో అడుగు పెట్టడం అంతా చూసారు. కాని తర్వాత అతడి జాడ ఎవరికీ తెలీకుండా పోయింది. వారం రోజులు ఓడ రేవు లోనే వేచి చూసిన సైన్యం నిరాశతో ప్రయాణించి గాంధారం చేరుకుంది. ఆరు మాసాలు గడిచినా శతానీకుని జాడ తెలీక పోవటంతో మంత్రులు అతడి కొడుకునకు పట్టాభిషేకం చేసి గాంధారకు ప్రభువుగా ప్రకటించారు.

నిజానికి రాజు శతానీకుడికి కరూర దేశంలో అడుగు పెట్టే సరికే జీవితం మీద విరక్తి కలిగింది. అత్యాశకు పోయి తన సేనలతో బాటు మిత్ర దేశాల సైన్యాన్ని కూడ రత్నగిరికి తరలించి బలి పెట్టాడు. ఇప్పుడు స్వదేశం లోకి వెళ్ళి వారికి ముఖం ఎలా చూపించాలి, యుద్ధంలో ఓటమి తాలూకు పరాభవాన్ని అవమానాలను ఎలా సహించాలి. అందుకే ఎవరికీ తన ముఖం చూపించ లేక రాత్రికి రాత్రి అశ్వం మీద ఒంటరిగా బయలు దేరి భృగు కచ్ఛ మీదుగా ఎగువన యాదవ రాజ్యం చేరుకుని ఆ పైన కొద్ది దినాలు ప్రయాణించి హిమాలయాలకు చేరుకున్నాడు. శేష జీవితాన్ని అక్కడే ముని వృత్తిలో గడుపుతూ రహస్యంగా ఉండి పోయాడు. అతడేమైనాడో బయటి ప్రపంచానికి తెలీకుండా పోయింది.

*********

యుద్ధం ముగిసిన మూడు మాసాల అనంతరం`

అత్యంత వైభవంగా రత్న గిరి కోటలో యువరాజు ధనుంజయుని వివాహం జరిగింది. వివాహానికి కళింగ రాజ  కుటుంబం కతు మరచి తరలి వచ్చింది. యక్ష మిత్రుడు రుచికుడు హాజరయ్యాడు. నాగ లోకం నుండి నాగ రేడు మహా పద్ముడు, పాతాళం నుండి బలి చక్రవర్తి సకుటుంబ సపరివారంగా తరలి వచ్చారు.

నాగ రేడు దంపతులు తమ కుమార్తె ఉలూచీశ్వరితో బాటు భద్రా దేవిని కన్యా దానం చేయగా బలి చక్రవర్తి దంపతులు తమ దత్త పుత్రిక మణి మేఖలను కన్యా దానం చేసారు. ఎన లేని కానుకలందించారు. ఒకే సుమూహర్తంలో ధనుంజయుడు సఖియలు మూవురికీ తాళి కట్టి తన రాణుల్ని చేసుకున్నాడు. రంగ రంగ వైభవంగా సాగిన వివాహ వేడుకల్ని దేవతలు కూడ సంతోషంగా వీక్షించారు.

తర్వాత కాలంలో ధనుంజయుడు రత్నగిరి రాజ్యానికి ప్రభువై, అరి వీర భయంకరుడిగా, ప్రజలకు ప్రజా రంజకమగు పాలన అందిస్తూ తన మూవురు భార్యలతో సుఖసంతోషాలతో ఎన లేని కీర్తి ప్రతిష్టలను సంపాదించాడు.

 

 

: శుభం :

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్