Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
naadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

atadu aame oka rahasyam

( గతసంచిక తరువాయి ).. http://www.gotelugu.com/issue201/577/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

అతడు హాల్లోకి రాగానే, ఆమె చుట్టూ నిలబడ్డ ముగ్గురిలో  ఇద్దరు ఆమె వెనుకగా వెళ్ళి ఆమె చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు.  గదుల్లో తిరిగి వచ్చినతను ఆమె చేతిలోని సెల్ ఫోన్ని లాక్కుని స్విచాఫ్ చేసి, నిర్లక్ష్యంగా పక్కనున్న సోఫాలో పడేసాడు.

“ఎవరు మీరు? ఏం కావాలి? ఇంట్లో డబ్బూ బంగారం ఏమీ లేవు. నేను  బ్యాచిలర్ని.  మర్యాదగా మీరు బయటికి వెళ్ళండి. లేకపోతే గట్టిగా అరుస్తాను. చుట్టుపక్కల వాళ్ళు వస్తారు”  ధైర్యాన్ని తెచ్చుకుని  అంది ఆమె.

ఆమె మాటలు పూర్తి కాక ముందే ఆమె ఎదురుగా నిల్చున్న మూడో వ్యక్తి ప్యాంటు జేబులోంచి రివాల్వర్  బయటకి తీసి ఆమె కణతలకి గురి పెట్టాడు.  తుపాకుల గురించి పెద్దగా పరిజ్ఞానం లేని ఆమెకే, అది ఇంపోర్టెడ్ గన్ అని తెలిసేలా నున్నగా  మెరుస్తోంది.

ఆ గన్ చూడగానే వచ్చిన వాళ్ళు  చిల్లర దొంగలు కారని ఆమెకి అర్ధమైంది. “ఎవరు మీరు? ఏం కావలి?”  భయంగా అడిగిందామె ఈ సారి.

“ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయి? చెప్పు?”  అప్పటిదాకా ఏమీ చెయ్యని  నాలుగో వ్యక్తి అన్నాడు.

“ఏ వజ్రాలు?” అమాయకంగా అడిగింది బంగారులక్ష్మి.

“రెడ్ డైమండ్స్”

“రెడ్ డైమండ్సా? అమెరికన్  డైమాండ్స్ తప్ప మరే డైమండ్‍నీ కళ్ళతో కూడా  చూడలేదు నేను జీవితంలో ఇప్పటిదాకా. మా ఇంట్లో రెడ్ డైమండ్స్ ఎందుకు  ఉంటాయి?”   తను వేసుకున్న ఆర్టిఫీషియల్ అమెరికన్ డైమాండ్స్ గొలుసుని చూపిస్తూ అందామె. 

“షటప్” అన్నాడు ఆ వ్యక్తి. ఆ మాటతో పాటే,  కసరత్తులు చేసి కరుగ్గా  తయారైన అతడి అరచెయ్యి పిడికిలి  బిగించి మరీ ఆమె బుగ్గని బలంగా తాకింది!

ఆమెకి కళ్ళు తిరిగినట్టైంది ఒక్క సారి. పాలూ వెన్నా రాసి సౌందర్య పోషణ చేసిన ఆమె బుగ్గ ఎర్రగా కందింది.  “నా దగ్గర ఎలాంటి డైమాండ్సూ లేవు”   అతడి వంక భయంగా చూస్తూ అంది.

“నటించకు.  రెడ్ డైమండ్స్ ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసని మాకు తెలుసు. మర్యాదగా ఎక్కువ నాన్చకుండా అవి ఎక్కడ ఉన్నాయో  చెప్పెయ్”

“ఇలా లాభం లేదు”  గన్ పట్టుకున్నతను చేతులు విరిచి పట్టుకున్న వాళ్ళకి సైగ చేసాడు.  వాళ్ళలో ఒకడు ఆమెని రెండో వాడికి అప్పచెప్పి,  పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్ కుర్చీని హాల్లోకి తీసుకు వచ్చాడు.

ఆమెని పట్టుకున్న వ్యక్తి ఆమెని బలవంతంగా  కుర్చీలో కూలబెట్టాడు. రెండో వ్యక్తి దీవాన్ మీదున్న దుప్పటిని తీసి పర పరా చించి,  సన్నని తాళ్ళలా చేసి, ఆమె చేతుల్ని వెనక్కి పెట్టి, శరీరాన్ని గట్టిగా కుర్చీకేసి కట్టేసాడు.

ఆమె  అరవకుండా నోట్లో గుడ్డల్ని కుక్కేసాడు. “నువ్వు వజ్రాల గురించి చెప్పడానికే ఈ గుడ్డలని బయటికి తీసేది” అన్నాడు.

ఆమె గిల గిలా కొట్టుకుంది. నోట్లో గుడ్డలు  కుక్కెయ్యడంతో ఊపిరి సలపనట్టుగా అనిపించింది. గుడ్డలు తియ్యండి చెప్తాను అన్నట్టుగా  కళ్ళతో సైగలు చేసింది.

ఆమె కుర్చీ పక్కనే నిలబడ్డ వ్యక్తి  ఆమె నోట్లో కుక్కిన గుడ్డలని బయటికి లాగాడు.  ఒక్కసారిగా పొలమారి దగ్గు వచ్చినట్టైంది ఆమెకి. గబ గబా ‘మంచినీళ్ళు’  అని సైగ చేసింది.  

ప్రశ్నలడుగుతున్న  వ్యక్తి  వెళ్ళి ఫ్రిజ్‍లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకు వచ్చి మూత తీసి నీళ్ళని ఆమె నోట్లో పోసాడు. రెండు గుక్కలు తాగిన తరువాత ఆమె చాలు చాలు అన్నట్టుగా సైగ చేసింది.

సీసా పక్కన పెట్టి “చెప్పు” అన్నాడతడు.

“మీ ధోరణి మీదే కానీ నా మాట వినిపించుకోరా?   నా దగ్గర డైమండ్స్ ఎందుకు ఉంటాయి? మీకు ఎవరు కావాలి? మీరు ఎవరనుకుని ఎవరింటికి వచ్చారో? ”  అందామె. మరోసారి బలంగా ఆమె చెంప  మీద కొట్టాడు అతడు.

“మేమంత  పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా?  నీ పేరు బంగారు లక్ష్మి.  సేల్సు టాక్స్ ఆఫీసులో పని చేస్తావు.  నీ స్నేహితురాలు ఇంద్రనీల. పోలీస్ ఇన్స్పెక్టర్. చాలా ఇంకా చెప్పాలా?”

స్థాణువులా  చూస్తూ ఉండిపోయింది  బంగారు లక్ష్మి.మరోసారి ఆమె దవడ మీద గట్టిగా కొట్టి అన్నాడు అతడు “ఇప్పుడు చెప్పు? వజ్రాలు ఎక్కడ ఉన్నాయి?”

“నాకు వజ్రాల గురించి తెలియదు” అంది ఆమె.

మరోసారి ఆమె మీద చెయ్యి చేసుకుని అన్నాడతడు “నీకు  మా గురించి తెలియదు”

వజ్రాలని నీ దగ్గర  ఉంచుకుని నీ స్నేహితురాల్ని పిచ్చిదాన్ని చేసి వాటిని వెదకడానికని కోటకి పంపిస్తావా? ఆమె తిరిగి వచ్చేలోగా వజ్రాలతో ఉడాయిద్దామనుకున్నావా? వాటి గురించి చెబితే తప్ప నిన్ను ప్రాణాలతో వదలం”   క్రిందకి వాలిన ఆమె తలని  చేత్తో పైకి ఎత్తి  అన్నాడు.

అతడు చెయ్యి తియ్యగానే ఆమె తల క్రిందకి వాల్చేసింది.

కోపంగా మరోసారి ఆమెని  కొట్టబోతుంటే  “గురూ... ఆపు గురూ... ఆమె స్పృహ తప్పినట్టుంది”  ఖంగారుగా అన్నాడు  కుర్చీని పట్టుకున్న వ్యక్తి.

ఆమె తలని మరోసారి పైకెత్తి చూస్తే, మళ్ళీ క్రిందకి వాలిపోవడంతో, ఆమెకి స్పృహ తప్పిందన్న విషయం అర్ధమైంది వాళ్ళకి.

“ఛ...” అన్నాడు ప్రశ్నలడుగుతున్న వ్యక్తి కాళ్ళతో నేలని తన్తూ.

“ఇది గానీ చస్తే మనకే చాలా ప్రమాదం. ఆ వజ్రాలు దీని దగ్గర ఉన్నాయి. అవెక్కడున్నాడో తెలుసుకోకుండా దీన్ని చంపితే బాస్ మనల్ని చంపేస్తాడు”  అన్నాడు  నోట్లో గుడ్డలు కుక్కిన వ్యక్తి.

“మరేం చేద్దాం?”

“చేసేదేముందీ? దీనికి స్పృహ వచ్చే వరకూ ఎదురు చూడ్డమే”  ప్రశ్నలడుగుతూ ఆమెని కొట్టిన వ్యక్తి అన్నాడు.

“అంత సేపూ మనం ఇక్కడ ఉంటే ప్రమాదకరం. ఎలాగోలా దీన్ని ఇక్కడ్నించి  తీసుకుపోదాం” అన్నాడు.

“మీరు ఇద్దరూ వెళ్ళి బయట ఎవరూ లేకుండా చూడు. మేము దీన్ని తీసుకు వస్తాం”

ఇద్దరు వ్యక్తులు బయటకి వెళ్ళి సైగ చెయ్యగానే, మిగిలిన ఇద్దరూ ఆమెని బయటకి తీసుకొచ్చేసారు.  వస్తూ వస్తూ ఆమె సెల్ ఫోన్ని కూడా తీసుకొచ్చాడు  ప్రశ్నలడిగిన వ్యక్తి.

“అదెందుకు?”  అన్నాడు అతడి కూడా ఉన్న వ్యక్తి.

“మనకి ఆట్టే సమయం లేదు. దానికి స్పృహ వచ్చి మూడ్ మార్చుకుని మనకి సహకరిస్తే   ఈ సెల్లో ఎవరివైనా  నెంబర్లు దానికి అవసరం అవచ్చు. అప్పుడు ఈ సెల్ కోసం ఇక్కడికి రాలేం కదా”   అంటూ   స్విచాఫ్ చేసిన ఆ సెల్ ఫోన్ని ఆమె దుస్తుల్లో  వేసాడు.

అదే అతడు చేసిన అతి పెద్ద పొరపాటని అతడికా క్షణంలో తెలియదు !!

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్